మేనరికం

భారతీయ వివాహ సంబంధాల ఆచారాల్లో మేనమామ కూతురు, అక్క కూతురిని చేసుకోవడం ‘మేనరికం ‘ అంటారు. ఇవి ఆచార సమ్మతమైన వివాహ సంబంధాలు. మేనత్త కూతుర్ని చేసుకోవడం ‘ ఎదురు మేనరికం ‘ అంటారు. మేనమామ కూతుర్ని చేసుకోవచ్చు. అక్క కూతుర్ని చేసుకోవచ్చు. మన సంప్రదాయం ప్రకారం మేనత్త కూతుర్ని చేసుకోరాదు.

ఈ మూడు వరసల్లో ఏది చేసుకున్నా, ఆ దంపతులకు పుట్టే సంతానం అవకరాలతో జన్మిస్తారని వైద్య శాస్త్రం చెబుతోంది. అవకరాలు లేకుండా పుట్టిన సందర్భాలు బాగానే వున్నాయి. ఒక తరం వరకూ కొంత పరవాలేదు. కానీ రెండు మూడు తరాలవారు మేనరికాలు చేసుకుంటే, ఖచ్చితంగా అవకరాలతో పిల్లలు పుడతారనడానికి చాలా దృష్టాంతరాలున్నాయి. బయటి సంబంధాలు చేసుకుంటే, ఆస్తులు బయటకు వెళ్లిపోతాయని చాలా మంది మేనరికాల వైపు మొగ్గు చూపుతున్నారు. బయటి అమ్మాయి, అబ్బాయి అలవాట్లు, ప్రవర్తన, సంప్రదాయం ఎలా ఉంటాయోనని భయపడి దగ్గర సంబంధాలు చేసుకోవడం పరిపాటి అవుతోంది.

రెండు మూడు తరాల్లో మేనరికాలు చేసుకుని, అవకరాలతో బిడ్డలు పుట్టడం, వారిలో చాలా మంది చనిపోవడం, వంశమే నిర్వీర్యం అయిన కుటుంబాలు ఎన్నో నేడు తప్పు చేశామని కుమిలిపోతున్నాయి. కాబట్టి, మేనత్త కూతురే కాదు, మేనమామ కూతురు, అక్కకూతురు సంబంధాలు కలుపుకోక పోవడమే శ్రేయస్కరం.

మేనత్త కూతురిని చేసుకోరాదనే నియమం వెనుక పెద్దల దూరదృష్టి ఉందనిపిస్తోంది. ఈ మేనత్త తన తల్లికి ఆడపడుచు కదా! ‘ ఆడ పడుచు అర్ధ మొగుడు ‘ అనే సామెత ఉందిగా. ఆమె తన వదిన గారిని కష్టాలు పెట్టడమో, అధికారం చెలాయించడమో చేసి వుండొచ్చు. ఇపుడు ఆమె కూతుర్ని తన కొడుకుకు చేసుకుంటే, పాతకక్షతో వచ్చిన అమ్మాయిని కష్టాలు పెడుతుందని… ఇలాంటి ఆచారం సృష్టించి వుంటారు.