జీవితం – ముగిసే పరిభ్రమణ చక్రం

స్త్రీ పురుష సమాగమం దగ్గరనుండీ మొదలయ్యే ప్రాణి ఆవిర్భావం నుంచీ జీవి యొక్క అంత్యేష్టి వరకూ సాగే ప్రతీ దశా చాలా చిత్రంగా అనిపిస్తుంది . స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణను సూత్రంగా కట్టి ” వాంఛ ను ” తీవ్రంగా వారిలో కలగచేసి సుఖాన్ని ఎరగా ఉంచి తర్వాత తరానికి సృష్టిని కొనసాగేలా చేయడం ప్రకృతి యొక్క గొప్ప ఎత్తుగడ.

కొన్ని కోట్ల పురుష కణాలలో ఒకటే స్త్రీ అండంతో జతకట్టి ఓ నూతన జీవిని ఏర్పరచడం , లోలోపలే ఆ శిశు ఎదుగుదలా క్రమమమంతా ఓ అద్భుతమైతే అంతవరకూ ఆ జీవిని పోషించడానికి తగిన ఏర్పాట్లు లోపలే తదనుగుణంగా జరగడం , ఆ జీవి ఎదుగుదల పూర్తయ్యాక తల్లి భగరంద్రము నుండే వెలుపలకి రావాలని యత్నించి సఫలీకృతమవ్వడం – అంతలా తనని శారీరకముగా శ్రమ పెట్టిన ఆ నూతనప్రాణిపై తల్లికి కోపమూ ద్వేషమూ కాక తను ఇప్పటివరకూ పడ్డ బాధను సైతం మరిచి సాకేంత అనురాగం వెంటనే జనించడం , ఆ వాత్సల్యం వృద్ధి చెంది ప్రేమగా పరిణమించడం ఒక ఎత్తైతే నూతనంగా పిల్లో పిల్లవాడో పుట్టినవెంటనే దాని పోషణ నిమిత్తమై తల్లి రొమ్ములలో పాలు పుట్టడం , అది కుడుచుకుంటూ ఆ శిశువు ఆకలితీర్చుకోవడం , ఏమాత్రమూ , ఏ పనీ చేసుకోలేని ఆ పిల్లవానికి అన్నీ తామై తల్లితండ్రులు సేవలు చేయడం ఇవన్నీ సృష్టిలో గొప్ప అద్భుతాలు

లోకంలో పడ్డ ఆ శిశువుకి ఇంద్రియ జ్ఞానం ఎలా కలుగుతుందో అసలు ? ప్రతీదీ ప్రశ్నించుకొని సమాధానపరుచుకొని దానిని జ్ఞానంగా నిక్షిప్తం చేసుకొని దానిని తదనుగుణంగా తన జీవితంలో వాడుకుంటూ ఆ జీవి వ్యక్తిత్వాన్నీ , ఓ ఆలోచనాధోరణినీ ఏర్పర్చుకోవడం , ఆ తర్వాత బంధాలూ , బంధుత్వాలూ, అహంకార మమకార తత్సంబంధిత విషయాలన్నీ మనసుకు కల్పించుకొని ” ఏదైనా చేయగలను , ఏదైనా సాధించగలను ” అనే ధోరణి ప్రదర్శించడం చివరికి వృద్ధాప్యమొచ్చి ఏదో కారణం చేత శరీరం శుష్కించి మరణించడం.

” నేను ” అనే భావం ఏర్పడకముందు – ఏమీ తెలియని , ఏమీ తనకు తానుగా పనులు చేసుకోవడం రాని స్థితిలో శిశువుగా మొదలైన జీవి ప్రయాణం ” నేను ఏమైనా చేయగలను – మరోకరి సాయం లేకపోయినా ఏదైనా సాధించగలను ” అనేంత ధీమాతో కొనసాగి చివరికి మరలా శిశువులా , ఏ పని చేయడానికైనా శరీరం సహకరించక మరోకరిపై ఆధారపడుతూ మలమూత్రాదుల మధ్యలో శరీరం ఉంటున్నా ఏమీ చేయలేని స్థితికి చేరుకొని ఈ ” నేను ” అనే భావన ఎంత అల్పమైనదో తెలుసుకొని తన అస్థిత్వాన్ని గురించి చింతన చేస్తూ ముగియడం – ఇదంతా ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడే ముగిసే పరిభ్రమణ చక్రంలా అనిపిస్తుంది నాకు

యండమూరి గారు వ్రాసినట్లు ” అధ్యయనం చేయాలే కానీ మనిషి జీవితాన్ని మించిన గొప్ప వేదం మరోకటి లేదు “

%d bloggers like this: