పెళ్ళి అనేది కేవలం ఒక తంతు కాదు. వైవాహిక జీవితం సవ్యంగా సాగాలి అంటే ఆర్ధిక, మానసిక, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అందరికీ చిన్న వయస్సులోనే ఆర్ధికబలం చేకూరదు. అలానే మానసిక సంసిద్ధత ఉండదు. భయాలు, అపోహలు ఉంటాయి. కొందరి కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి.
జీవితంలో పెళ్ళంటూ చేసుకోవాలి కాబట్టి కానిచ్చేద్దాం అని చేసుకోకూడదు. అది ఎవరికీ మంచిది కాదు. అన్ని రకాలుగా ఆలోచించుకుని, ఒక బాధ్యతాయుతమైన వైవాహిక జీవితానికి సిద్ధంగా ఉన్నాం అనుకున్నప్పుడే చేసుకోవాలి.
అలానే 24-28 ఏళ్ళ వయస్సులో చేసుకోవటంలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని నా అభిప్రాయం.
- అన్నింటికంటే ముఖ్యమైనది దంపతులకు జీవితాన్ని కాస్త ఆస్వాదించే సమయం, వెసులుబాటు ఉంటుంది. వయస్సు మీద పడ్డాక పెళ్ళి చేసుకుంటే సంతానమే మొదటి ప్రియారిటీగా ఉంటుంది.
- ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు కనుక వీలైనన్ని విహారయాత్రలకు, ప్రయాణాలకు వెళ్ళొచ్చు.
- కెరీర్‌లో కూడా ప్రాధమిక స్థాయిలో ఉంటే ఒత్తిడి తక్కువగా ఉండి ఒకరికొకరు సమయం ఇవ్వగలుగుతారు. దాని వల్ల ఒకరినొకరు బాగా అర్ధం చేసుకునే వీలుంటుంది.
- 24-28 వయస్సులో ఉంటే ఇంకా పూర్తిగా తల్లిదండ్రుల నీడ నుండి బయటకి రాకపోవటం వల్ల, పూర్తిగా ఇండిపెండెంట్ లైఫ్‌కి అలవాటు పడి ఉండరు. నా జీవితానికి నేనే రాజు/రాణి, నా మాట వినాల్సిందే అనే పట్టుదల ఉండే అవకాశాలు తక్కువ. ఆ స్థితిలో కొత్త వ్యక్తులను త్వరగా జీవితంలోకి ఆహ్వానించగలుగుతారు.
30లోకి వచ్చినవాళ్ళు కెరీర్‌లో ఒక స్థాయికి వచ్చేసి, ఆర్ధికంగా స్థిరపడి, వీలైతే సొంత ఇల్లు కొనేసుకుని ఉంటారు. అప్పటికి ఒక నిర్ధిష్టమైన జీవితానికి అలవాటు పడిపోయి ఉంటారు. ఎంతలా అంటే ఎన్నింటికి తినాలి, ఎన్నింటికి పడుకోవాలి, ఇంటిలో ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, తాగేసిన టీ కప్ ఎక్కడ పెట్టాలి, ఇంటిలో కుక్కలు, మొక్కలు ఉండాలా? వద్దా?
ఇలా ప్రతి విషయంలోనూ నిశ్చితమైన అభిప్రాయాలు ఏర్పడి ఒక ఇండిపెండెంట్ జీవితానికి అలవాటు పడిపోయుంటారు. అలాంటి స్థితిలో తమ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తిని ఆహ్వానించటం అంత తేలిక కాదు. మన అభిప్రాయాలతో ఎదుటి వారిని బేరీజు వేస్తూ ఉండటం వల్ల ఎప్పటికీ వారికి దగ్గరకాలేము. అలానే కొత్తగా మన జీవితంలో అడుగుపెట్టాలనుకునే వాళ్ళకి మన ఇష్టాలు, పద్దతులు ఆంక్షలుగా కనిపించి భయపెడతాయి.
ఏది ఏమైనా పెళ్ళికి మానసిక సంసిద్ధతే అవసరమైనది. అలా ఇరువురు సిద్ధపడి చేసుకుంటే వయస్సు పెద్ద సమస్య కాదు.
You must log in to post a comment.