1. తలుపు దాటి నడిచే దారి, సందులు (నడవలు):
తలుపు తీసేక ఇద్దరు మనుషులు సామానులతో నడవడానికి వీలుగా కనీసం 3 అడుగుల వెడల్పు ఉండాలి. ఆ పాసేజ్ వే (Passage Way) లోకి మరే గోడలూ, స్థంభాలూ, సామాన్లూ, అలమారులూ తెరుచుకుని, పొడుచుకు రాకూడదు. చాలా ఇళ్లల్లో అనుభవం లేని యజమానులు/ మేస్త్రీలు ఇలా కట్టి పడేస్తారు. సామాను లోపలికి చేరవెయ్యలేకా, వేసినవి బయటికి తియ్యలేకా ఇంటివాళ్లు నానా పాట్లూ పడతారు.
- 2. పూర్తిగా తెరుచుకోలేని అడ్డాలున్న తలుపులు:
అన్ని తలుపులు ఎల్లవేళలా పూర్తిగా కనీసం 90 డిగ్రీలైనా తెరుచుకోవాలి. తలుపుకి ఎదురుగా ఏ అడ్డూ వుండకూడదు. లేకపోతే ఫైర్ సేఫ్టీ నిబంధనలకిది పూర్తి విరుద్ధం. మరోతలుపు ఈ తలుపులోంచి వెళ్లే మార్గంలోకి అసలే తెరుచుకోకూడదు. దీన్ని ఆంగ్లంలో డోర్ కాన్‌ఫ్లిక్ట్ (Door Conflict) అంటారు. (బొమ్మ చూడండి). ఇలా ఉంటే ఒకతలుపు మూసితే గానీ ఇంకోతలుపు తియ్యలేం. ఇలాంటి డిజైన్ అస్సలు మంచిది కాదు.
ఎర్ర బాణంగుర్తులు చూపుతున్నట్లుగా ఒక తలుపు-మార్గం మీదకి ఇంకో తలుపు-మార్గం అడ్డంగా పరుచుకోకూడదు.
- 3. మెట్లు కట్టడంలో పొరపాట్లు:
మెట్లు కట్టడంలో జరిగే పొరపాట్లు లెక్కలేనన్ని. మెట్లు ఆర్కిటెక్ట్ ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారం అన్ని మెట్లూ సమానంగా వచ్చేలాగా గోడమీద ముందుగా జామెట్రీ జ్ఞానం ఉపయోగించి, ఓపికగా గీతలు గీసి ఆతర్వాత నెమ్మదిగా చెక్కలు, రాటలు కట్టుకోవాలి. దానికి కావలసిన అనుభవం, ఓపిక, తీరిక చాలామంది పనివారికి లేదు.
- అందుకనే పెద్ద పెద్ద భవనాల్లో కూడా మెట్లు సరీగా అన్నీ సమానంగా వుండవు. ఆఖరిమెట్టు ఎత్తు/వెడల్పు తక్కువగానో ఎక్కువగానో పెట్టేస్తారు. ఇది గబగబా మెట్లు దిగేటప్పుడు/ ఎక్కేటప్పుడు చాలా ప్రమాదం. నడక వేగంలో (Rhythm) తేడావచ్చి తట్టుకుని పడిపోతారు.
4. ప్రమాదకరమైన ముక్కోణం మెట్లు (Winders)
- చాలాచోట్ల ముక్కోణం మెట్లు జాగా మిగులుతుందని యజమానులు కట్టేస్తారు కానీ, ఇవి చాలా ప్రమాదకరం. కోసుగావున్న మూలదగ్గర పాదం మోపే చోటులేక ఒక్కసారిగా 3-4 మెట్లు కిందకి కాలుజారి పడిపోవచ్చు.
- కోసుభాగంలో పట్టుకోవడానికి హ్యాండు రైలు కూడా అందదు. ఎంత జాగా లేకపోయినా, 2 కంటే ఎక్కువ ముక్కోణం మెట్లు ఎప్పుడూ ఒకే చోట పెట్టకూడదు. ఇల్లు కట్టేటప్పుడు ఓ గది చిన్నదిగా కట్టినా, మెట్లు కట్టడంలో మాత్రం పిసినారితనం చూపకూడదు.
ఈ ముక్కోణం మెట్లు దోహా (Qatar)లో పాపాజోన్స్ తిండిదుకాణంలోనివి. ఒకవేళ పొరపాటున ‘క’ మెట్టు మీద నుంచి “గ” మీదకి జారితే, ధభీమని 4-5 అడుగులు కిందకి ఒక్కసారిగా పడిపోతారు. వీటివల్ల జరిగే ప్రమాదం ఇంతా అంతా కాదు. మునిసిపాలిటీ తనికీదారుల కళ్లుగప్పితేగానీ ఇలాంటి మెట్లకి అనుమతులు సాధ్యం కావు.
5. బాత్రూములో అమరికలు:
- బాత్రూంలోతూము (gulley trap), నీటివాలు లెట్రిను వేపుగా ఉండడం ఇండియాలో సర్వసాధారణం. దీనివల్ల స్నానపునీరు లెట్రిను కిందకీ పారి బాత్రూమ్ ఎప్పుడూ తడిగానే ఉంటుంది.
- దీనివల్ల జారిపడడం, ఒక్కోసారి కింద వాటర్ ప్రూఫింగ్ (waterproofing) సరీగా లేనట్లయితే స్లాబులో లీకేజీలు అవుతాయి.
- తలుపు తెరుచుకున్నవెంటనే కనీసం రెండు అడుగుల చోటు లేకుండా లెట్రిన్ పెట్టడం వల్ల కూడా బాత్రూములోకి తేలికగా వెళ్లలేము, అనువుగా వాడుకోలేము.
6. వంటగట్టు నిర్మాణం:
వంటగట్టు నిర్మాణానికి చాలా అనుభవం, ఆలోచన అవసరం. ఫ్రిజ్ కొలతలు, తలుపు ఎటువైపు తెరుచుకుంటుందో చూసుకోకుండా గోడపక్క మూలగా ఫ్రిడ్జ్ కోసం చోటు వదిలితే అందులో ఫ్రిడ్జ్ పట్టినా, మనం నిలబడి సామాన్లు తీసుకోడానికి చోటు/ సావకాశం ఉండదు. ఇక్కడ మా అద్దె ఇంట్లో ఇలాగే ఉంటే నేను ఫ్రిడ్జ్ వేరే చోటుకు మార్చడంవల్ల అసలే చిన్నదైన మా వంటిల్లు ఇంకా ఇరుకైపోయింది.
7. వంటింట్లో సింకు అమరిక:
వంటింట్లో సింకు బిగించడానికి, మనుషుల శరీరపు కొలతల గురించి, చేతివాటం గురించి, ఇతర సౌలభ్యాలగురించి అవగాహన (Sense of Anthropometry) చాలా అవసరం. కొన్నిసార్లు ఏదో మొక్కుబడిగా ఇలా బొమ్మలో చూపినట్లు వంటగట్టు చివర ఐమూలకీ సింకు బిగిస్తారు. దీనివల్ల సింకు అందదు.
- ఇంకొన్ని చోట్ల సింకు లోతు ఎక్కువ పెట్టేస్తారు. అందువల్ల సామాన్లు కడిగేవారికి విపరీతమైన నడుంనొప్పి వస్తుంది. కారణం ఇదని తెలియక రకరకాల వైద్యాలు చేసుకుంటూ బాధపడతారు.
ఇలాటి పనికిరాని సింకు బిగింపు నేను మద్రాసులో మా స్నేహితులింట్లో చూసేను. పాపం వాళ్ల అమ్మాయి వంటగట్టు ఎక్కి కూర్చుంటేగానీ గిన్నెలు కడగలేకపోయేది.
8. వంట పొయ్యి మీద హుడ్: (Stovetop Hood):
చాలా సార్లు పొయ్యి కోసం చోటు నిర్ధారణ చేస్తున్నప్పుడు దానిమీద బిగించే నూనెపొగలు బయటికి పంపే hood, దానికి కావలసిన పొగగొట్టం బిగింపు గురించి చాలామంది ఆలోచించరు. అందుకని జాగ్రత్తగా కిటికీలూ అలమార్లూ పెట్టడానికి ముందే హుడ్‌కి కావలసిన చోటు నియోగించి పెట్టుకోవాలి. కిటికీ మీద తరవాత హుడ్ బిగిస్తే అస్సలు బావుండదు, కిటికీ తెరవలేం కాబట్టి అది, మంచిది కాదు.
9. గడపలూ, గుమ్మాల ఎత్తులు:
చివరగా, ఇంట్లో గడపలూ, సాధ్యమైనంతవరకూ ఎత్తుపల్లాలు వుండకూడదు. ఉంటే రాంపులు కట్టుకోవాలి.
You must log in to post a comment.