కారు కొనేప్పుడు పరిగణించవలసిన అంశాలు

ఇంజను

పెట్రోల్, డీజల్, CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ ఏది కావాలో ఎంచుకోవాలి.

చాలా మంది డీజల్ ధర పెట్రోల్ కంటే తక్కువ, మైలేజ్ ఎక్కువ అని డీజల్ కారు కొంటారు. అయితే డీజల్ కార్లకు సర్వీస్ ఖర్చులు, స్పేర్ భాగాల ధరలు ఎక్కువ. అందున వాటి Cost Of Ownership ఎక్కువ. డీజల్ ఇంజన్లు అన్నింటికీ టర్బో ఉంటుంది. దీని నిర్వాహణ వ్యయం టర్బో లేని ఇంజన్ల కంటే బాగా ఎక్కువ.

నెలకు అయిదు వేల కిలోమీటర్లు తిరిగేవారికి మాత్రమే డీజల్ కార్లు ఉపకరించేది. పైగా ఇప్పుడు పెట్రోల్ కార్ల మైలేజ్ కూడా తక్కువేమీ లేదు. కాబట్టి అనవసరంగా డీజల్ ఉచ్చులో పడవద్దు. వాటి వల్ల కాలుష్యం కూడా ఎక్కువే. ఎన్నో దేశాలు త్వరలో డీజల్ కార్ల అమ్మకాలను నిషేధించబోతున్నట్టు ప్రకటించాయి.

గేర్లు – మ్యానువల్ vs ఆటోమేటిక్

కొన్నేళ్ళ క్రితం వరకు ఆటోమేటిక్ కార్లకు మైలేజ్ తక్కువ, నాణ్యమైన ఆటోమేటిక్ గేర్ బాక్సుల లేమి వంటి కారణాలు ఉండేవి. ఇప్పుడు ఈ భయాలేవీ అవసరం లేదు. హైవేలపై తిరగటానికి సైతం మంచి ఆటోమేటిక్ కార్లు ఉన్నాయి.

ఆటోమేటిక్‌లోనూ పలు రకాల గేర్‌బాక్సులు ఉన్నాయి – AT, AMT, TC, DCT, CVT, DSG. అన్నిట్లో చవకైనది, బేసిక్ పనితీరు గలవి AT, AMT – గేర్లు మారేప్పుడు కుదుపులు తెలుస్తాయి.

AMT కంటే మంచి పనితీరు TC (Torque Converter), TC కంటే మంచి పనితీరు DCT, DCT కంటే మంచి పనితీరు CVT, DSG (DSG ఫోక్స్‌వాగెన్ వారి ప్రొప్రైటరీ CVT సాంకేతికత). వీటి ఖరీదు కూడా ఈ క్రమంలోనే ఉంటుంది. మెయింటెనన్స్ ఖర్చులు కూడా ఆ క్రమంలో పెరుగుతూ ఉంటాయి.

బడ్జెట్

సాధారణంగా పదిలో ఏడుగురు మూడు నాలుగేళ్ళకు కారు మార్చేస్తారు. కావున జీవితంలో కొనబోయే కారు ఇదొక్కటే అన్న భ్రమతో ముందుగా అనుకున్న బడ్జెట్‌ను దాటకూడదు.

అనుకున్న బడ్జెట్‌లో మీకు, మీ కుటుంబానికి తగిన భద్రతా ఫీచర్లు రాని పక్షంలో బడ్జెట్ పెంచుకోవటమే మంచిది. ఉదాహరణకు మీరు నివసించే ప్రదేశంలో తరచూ వర్షాలు పడే అవకాశం ఉంటే తప్పకుండా ABS ఉన్న కారునే కొనాలి. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే, ఎందుకంటే ఇటీవలే మన దేశంలో ప్రతి కారుకూ ఒక ఎయిర్‌బ్యాగ్, ABS తప్పనిసరి చేశారు.

వర్గం

హ్యాచ్‌బ్యాక్, సెడాన్, SUV, MUV – వీటిలో అవసరమయింది ఎంచుకోవాలి.

హ్యాచ్‌బ్యాక్ ఉదాహరణలు:

సెడాన్ ఉదాహరణలు:

SUV ఉదాహరణలు:

కాంపాక్ట్ SUV కూడా ఉన్నాయి:

MUV ఉదాహరణలు:

తరచూ కుటుంబంతో హైవేపై ప్రయాణాలు చేసేవారు SUV (కుటుంబం పెద్దదైతే MUV) ఎంచుకోవటం మంచిది. దూరప్రయాణాలు సౌకర్యవంతంగా చెయ్యవచ్చు. కారు వాడకం ప్రధానంగా ఉన్న ఊరిలోనే అయితే హ్యాచ్‌బ్యాక్ సరిపోతుంది.

SUVలకు గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉన్నందున గతుకుల రోడ్లపై కూడా నిర్భయంగా నడపవచ్చు. హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లకు ఈ రోడ్లపై కింద బాడీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

బ్రాండ్

ఇక్కడ ముఖ్యంగా చూడవలసినవి “కొత్త కారు కొనాలని షోరూంకు వచ్చిన కస్టమర్”‌కు చేసే సర్వీస్ మరియు అమ్మకం తరువాత సర్వీస్ (A.S.S – After Sales Service).

కారు కొనేప్పుడు కస్టమర్‌ను దేవుడిలా చూసుకునే కంపెనీలు ఉంటాయి. దాదాపు అన్ని సంస్థలూ ఈ కోవకు చెందేవే – కానీ నా అనుభవంలో ఇలా చెయ్యని షోరూంలు (షోరూం ఖాళీగా ఉన్నా వచ్చిన కస్టమర్‌ను పట్టించుకోనివీ ఉన్నాయి) ఎక్కువ శాతం టాటా మోటర్స్, ష్కోడా, ఫోక్స్‌వాగెన్‌కు చెందినవి. ఈ మూడు సంస్థల A.S.S గురించి లెక్కలేనన్ని ఫిర్యాదులు కని, విని, చదివినవే.

కొనేప్పుడు కస్టమరే దేవుడని, కారు సర్వీస్‌కు తెచ్చినప్పుడు ముప్పై చెరువుల నీరు తాగించే సంస్థలు ఉంటాయి. సంస్థలు అనటం కంటే షోరూంలు అనాలిక్కడ. ఈ మధ్య నేను విని, చదివిన ఇటువంటి అనుభవాల్లో ఎక్కువ కియా షోరూంలవి.

అయితే కారు ఎంపిక చేసేప్పుడే సమీపంలో ఆ బ్రాండ్ సర్వీస్ సెంటర్ గురించి వాకబు చెయ్యటం ఉత్తమం. టొయోటా వారి షోరూంలు, సర్వీస్ సెంటర్లు అన్ని బ్రాండ్లలో అత్యుత్తమ పనితీరు కలిగి ఉంటాయని ప్రతీతి.

యాజమాన్య ఖర్చు (Cost of Ownership)

కారు కొన్నాక యజమానిని అతి ఎక్కువ సతాయించే అంశం ఇదే.

సర్వీస్ మరియు స్పేర్ భాగాల వ్యయం: పెట్రోల్ కార్ల కంటే డీజల్ కార్లకు సర్వీస్ ఖర్చులు ఎక్కువ. పెట్రోల్, డీజల్ సంబంధం లేకుండా ష్కోడా, ఫోక్స్‌వాగెన్ సంస్థల కార్ల సర్వీస్, స్పేర్ భాగాల ఖర్చులు బాగా ఎక్కువ, విడి భాగాలు దొరకటమూ కష్టమే. నా స్నేహితుడి పోలో TSI కారుకు DSG క్లచ్‌ప్లేట్ తెప్పించేందుకు సర్వీస్ సెంటర్ నెల రోజులు తీసుకుంది.

కొన్ని కార్లకు సులువుగా దొరకని సైజు టైర్లు ఉంటాయి. 2-3 ఏళ్ళకు టైర్లు మార్చేప్పుడు ఆ సైజుకు సరిపోయేవి దొరక్క ఇబ్బంది ఎదురౌతుంది. ఉన్నవి కూడా ఖరీదెక్కువ ఉంటాయి. 17, 18 అంగుళాల టైర్లలో ఈ ఇబ్బంది ఎదురవ్వవచ్చు.

బుకింగ్

కారు బుక్ చేసేప్పుడు నిరభ్యంతరంగా బేరమాడాలి కానీ ఎంచుకున్న మోడల్ బాగా అమ్ముడుపోయేదయితే బేరమాడే అవకాశం తక్కువగా ఉంటుంది.

సాధారణంగా షోరూంలకు వాహన బీమా, ఉపకరణాల (Accessories)పై ఎక్కువ శాతం (దాదాపు 30%) లాభం ఉంటుంది. వాహన బీమా షోరూంలో కాకుండా బయట కొనటం ఉత్తమం. ఇలా ఒప్పుకోమని, వారి వద్దే తీసుకోవాలని షోరూం వారు ఒత్తిడి చేస్తారు కానీ వారికి ఆ హక్కు లేదు. వీలయితే బీమాపై షోరూం వారితోనే బేరమాడవచ్చు. వారు తగ్గకపోతే నిరభ్యంతరంగా బయట తీసుకోవచ్చు.

ఉపకరణాలు కూడా అవసరం లేనివి అంటగట్టే ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా అవసరం అయినవి కావాలని పట్టుబట్టి తీసుకునే హక్కు కొనుగోలుదారుకు ఉంది. గత కొన్నేళ్ళుగా సంస్థలు AMC (వార్షిక నిర్వహణ ప్యాకేజీలు), Extended Warranty అమ్ముతున్నారు. ష్కోడా వంటి సంస్థల కార్లకు ఇవి తీసుకోవటమే మంచిది.

బుకింగ్ తరువాత షోరూం వారితో మాట్లాడుతూ వీలైనంత త్వరగా మీ కారు VIN (Vehicle Identification Number) తెలుసుకోండి. కారు తయారీ తేదీ ఖచ్చితంగా తెలిపే సంఖ్యే ఈ VIN.[2]

Delivery

కారు తీసుకునేందుకు వెళ్ళినప్పుడు 2-3 గంటల సమయం ఉండేలా చూసుకుని వెళ్ళాలి, ఉదయం సమయం అత్యుత్తమం. హడావుడిగా వెళ్ళవద్దు. సాయంత్రాలు వెళితే కారు పెయింట్ నాణ్యత, ఏవయినా చిన్న నొక్కులు ఉంటే తగినంత వెలుతురు లేనందున కనపడవు – పదికి రెండు కొత్త కార్లలో ఇలాంటి సమస్యలు ఉంటాయి, ఇవి ఆరుబయట వెలుతురులో చూడటమే ఉత్తమం.

కారు డెలివరీ తీసుకునేప్పుడు చెయ్యవలసిన తనిఖీలు ఉంటాయి. ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ మరువకూడదు

%d bloggers like this: