
వర్షాకాలంలో హఠాత్తుగా కుంభవృష్టితో వరదలు ముంచెత్తిన సందర్భం కాదు. మండు వేసవిలో హిమఖండం కరిగి ఊరిపై విరుచుకుపడిన ఉదంతమూ కాదు. ఎలాంటి కీడూ శంకించని వణికించే చలికాలంలో ఉన్నట్టుండి ఆదివారం ( 07-02-2021 )ఉదయం ఉత్తరాఖండ్‌ను జల విలయం ముంచెత్తింది. దేవభూ మిగా పిలుచుకునే ఆ రాష్ట్రానికి తీరని విషాదం మిగిల్చింది. ఇంతవరకూ 26 మంది మృతులను లెక్కేయగా, దాదాపు 171 మంది జాడ తెలియలేదంటున్నారు. హఠాత్తుగా వచ్చిన వరదల్లో జాతీయ థర్మల్ విద్యుత్ సంస్థ(ఎన్‌టీపీసీ) ఆధ్వర్యంలోని తపోవన్ హైడ్రో పవర్ ప్రాజెక్టు, రిషిగంగ హైడ్రో పవర్ ప్రాజెక్టు ధ్వంసం కాగా, మరికొన్ని డ్యామ్‌లు, రోడ్లు, బ్రిడ్జిలు, సొరంగం, ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని చెబుతున్నారు. ఆచూకీ తెలియకుండాపోయినవారిలో అత్యధి కులు తపోవన్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులేనని సమాచారం అందుతోంది. ఆ ప్రాజెక్టుకు చెందిన టన్నెల్ నుంచి 20మందిని కాపాడగలిగారు.
సాధారణ పరిస్థితుల్లో అయితే హిమఖండాలు నెమ్మదిగా కరుగుతూ హిమానీ నదాల్లోకి ఎప్పటి కప్పుడు నీరు చేరుతుంటుంది. అందునా శీతగాలులు బలంగా వీస్తున్న ప్రస్తుత సమయంలో అవి అంత త్వరగా కరగవు. పర్యావరణం దెబ్బతింటున్న వర్తమానంలో అటువంటి సహజసిద్ధమైన ప్రక్రియను ఊహించలేం. వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతుంటే, అడవులు తగలబడి దాన్ని మరింత పెంచుతుంటే ఆ హిమఖండాలు మోతాదుకు మించి కరగటం సర్వసాధారణం. అలాగే కుంభవృష్టి సైతం సరస్సు మట్టాలను పెంచి నదుల్లోకి భారీ వరద నీరు చేరుతుంది. ఇవి చాలవన్నట్టు జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం డైనమైట్లతో కొండలను పిండి చేస్తుంటే, ఆ ప్రకంపనల ధాటికి హిమఖండాలు ఒక్కసారిగా విరిగిపడే ప్రమాదం వుంటుంది.
2013 విషాదం తర్వాత ఈ ప్రాంతంలో పరిశోధనలు చేసిన స్విస్ శాస్త్రవేత్తల బృందం హిమాలయ సానువుల్లో మొత్తం 251 హిమానీ నదాల సరస్సులున్నాయని తేల్చింది. వీటిల్లో 104 అత్యంత ప్రమాద కారులని, అలక్‌నంద సమీపంలో ఇవి 20 వరకూ వున్నాయని చెప్పారు. వీటివల్ల ముప్పు ఉన్నదని హెచ్చరించారు. ఇప్పుడు ఏ కారణం వల్ల ఈ దుర్ఘటన జరిగిందన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఉన్నట్టుండి ఒక పెద్ద పలక హిమఖండం నుంచి వేరుపడటంతో ఒక్కసారిగా సరస్సులోని జల మట్టం పెరిగి వరదలు పోటెత్తి వుండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే విషాద ఘటన జరిగిన ఆదివారంగానీ, అంతకుముందు రోజుగానీ ఆ ప్రాంతంలో వర్షాలు లేవు.

You must log in to post a comment.