వెలగ పండ్లు – రుచులు

Variet recipes with Wood Apple - Sakshi

వెలగ పండు భేల్‌
కావలసినవి
వెలగ పండ్లు – 4; పచ్చిమిర్చి – 10 (మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); ఉప్పు – తగినంత ; పంచదార – 4 టీ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; చాట్‌ మసాలా – ఒక టీ స్పూను; స్వీట్‌ చట్నీ- అర టీ స్పూను; గ్రీన్‌ చట్నీ- ఒక టీ స్పూను

తయారీ: వెలగపండ్లను పగలగొట్టి, గుజ్జును ఒక పాత్రలోకి తీసుకుని, గరిటెతో బాగా మెదపాలి. పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, పంచదార, కొత్తిమీర తరుగు, చాట్‌ మసాలా, గ్రీన్‌ చట్నీ, స్వీట్‌ చట్నీ జత చేసి పప్పు గుత్తితో బాగా మెదపాలి. పగుల గొట్టిన వెలగ పండు చెక్కలలోనే అమర్చి అందిస్తే చూడటానికి అందంగా ఉంటుంది.

వెలగ పండు స్మూతీ
కావలసినవి: వెలగపండు -1; తేనె- 2 టేబుల్‌ స్పూన్లు; ఓట్స్‌ – ఒక టేబుల్‌ స్పూను; పెరుగు- అర కప్పు; తాజా కొబ్బరి తురుము – ఒక టేబుల్‌ స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; బెల్లం పొడి – టేబుల్‌ స్పూను

గార్నిషింగ్‌ కోసం: దానిమ్మ గింజలు- ఒక టీ స్పూను; మామిడికాయ ముక్కలు – ఒక టీ స్పూను; జీడిపప్పు ముక్కలు – ఒక టీ స్పూను.

తయారీ: ఓట్సును తియ్యటి నీళ్లలో లేదా ఏదైనా పళ్లరసంలో పది నిమిషాలు నానబెట్టాలి. వెలగపండును పగులగొట్టి గుజ్జు బయటకు తీసి, రెండు కప్పుల నీళ్లలో సుమారు అరగంట సేపు నానబెట్టాలి. మెత్తగా పిసికి, పీచును, గింజలను వేరు చేయాలి. మిక్సీలో వెలగ పండు గుజ్జు, తేనె, ఐస్‌ క్యూబ్స్, బెల్లం పొడి, కొబ్బరి తురుము, నానబెట్టిన ఓట్స్, ఏలకుల పొడి, పెరుగు, మిరియాల పొడి వేసి మెత్తగా చేయాలి. గ్లాసులలో పోసి, కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి, చల్లగా అయ్యాక బయటకు తీసి, జీడిపప్పు ముక్కలు, దానిమ్మ గింజలు, మామిడికాయ ముక్కలతో అలంకరించి అందించాలి.

వెలగ పండు షర్బత్‌
కావలసినవి
వెలగ పండు -1; నీళ్లు – తగినన్ని; పంచదార – తగినంత

తయారీ:
ముందుగా వెలగపండు గుజ్జును ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙చేతితో మెత్తగా మెదిపి, తగిన న్ని నీళ్లు జత చేసి, చేతితో బాగా కలపాలి. ఒక పాత్రలోకి వడ పోయాలి. తగినంత పంచదార జత చేసి బాగా కలియబెట్టాలి. ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచి, బయటకు తీసి చల్లగా తాగాలి . ఎండ బాధ నుంచి కాపాడుతుంది.

వెలగ పండు జామ్‌
కావలసినవి: వెలగ పండ్లు – 4; వేడి నీళ్లు – పావు లీటరు; పంచదార – 200 గ్రా.
తయారీ : వెలగ పండ్ల గుజ్జును ఒక పాత్రలో వేసి మెత్తగా మెదపాలి. వేడి నీళ్లు జత చేస్తూ బాగా కలియబెట్టాక, వడబోసి, గింజలను వేరు చేయాలి. స్టౌ మీద బాణలి వేడయ్యాక గుజ్జును  అందులో వేసి బాగా కలపాలి. పంచదార జత చేసి బాగా కలియగొట్టి, పొంగులు  వచ్చేవరకు ఉడికించాలి. పావు గంట తరవాత మిశ్రమం కొద్దిగా చిక్కబడుతుంది. ఒక ప్లేటులోకి తీసుకుని, కొద్దిగా చల్లారాక గాలి చొరని  సీసాలో నిల్వ చేసుకోవాలి.


వెలగ పండు పచ్చడి
కావలసినవి: వెలగపండు- 1; బెల్లం పొడి – ఒక కప్పు; కారం- ఒక టేబుల్‌ స్పూను; ధనియాల పొడి – ఒక టేబుల్‌ స్పూను; వేయించిన జీలకర్ర పొడి – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత;  కొత్తిమీర – 2 టేబుల్‌ స్పూన్లు.

తయారీ: ∙ముందుగా వెలగపండును పగులగొట్టి గుజ్జును ఒక పాత్రలోకి తీసుకోవాలి. మిక్సీలో అన్ని పదార్థాలు వేసి మెత్తగా చేయాలి. ఈ పచ్చడిని ఫ్రిజ్‌లో ఉంచితే పదిరోజుల వరకు బాగుంటుంది.

వెలగ పండు ఐస్‌క్రీం
కావలసినవి: పంచదార- 1 టేబుల్‌ స్పూన్‌; కొబ్బరి పాలు- అరకప్పు; వెలగ కాయ – 1
తయారీ: ఒక పాత్రలో వెలగ పండు గుజ్జు వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదపాలి. కొబ్బరి పాలు జత చేస్తూ మరోసారి మెత్తగా చేయాలి. పంచదార జత చేసి బాగా కలిపి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. అంగుళం మందం ఉన్న ప్లేటులో ఈ మిశ్రమాన్ని పోసి, డీప్‌ ఫ్రీజ్‌లో ఐదు గంటల పాటు ఉంచి బయటకు తీయాలి. స్టౌ మీద పాన్‌ వేడయ్యాక, ఫ్రిజ్‌లో ఉంచిన ప్లేటును బయటకు తీసి, అందులోని వెలగపండు మిశ్రమాన్ని పాన్‌లో వేసి, కొద్దిసేపు ఉంచి, మళ్లీ ప్లేటులో పోసి, డీప్‌ ఫ్రీజర్‌లో మూడు గంటల పాటు ఉంచి, బయటకు తీసి, ఐస్‌ క్రీమ్‌ కప్పుల్లో అందించాలి.

ఇలా తింటే ఎలా ఉంటుంది..

  • ఉదయాన్నే బియ్యంతో చేసిన ఇడ్లీ, దోసెలకు దూరంగా ఉండి, వాటి బదులు జొన్నలు, మినుములతో చేసిన ఇడ్లీ, దోసెలను తినటం మంచిది. మామూలుగా చేసుకునే ఇడ్లీ, దోసెలను వారానికి ఒకసారి మాత్రమే తినాలి.
  • దోసెలను నేతిలో కాల్చుకుని తినటం మంచిది.
  • ఉడకబెట్టిన సెనగలు, వేరు సెనగలు, అలసందలు ఆరోగ్యానికి మంచిది.
  • మొలకెత్తిన గింజలు తినటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
  • పూరీ, మైసూర్‌ బోండా వంటివి నెలకు ఒకసారి తింటే పరవాలేదు. వీలైతే వాటికి దూరంగా ఉండటం మంచిది.
  • వారానికి ఒకటి లేదా రెండు సార్లు చపాతీలు తింటే పరవాలేదు. అవి కూడా నేతితో కాల్చుకుని తినటం మంచిది.
%d bloggers like this: