రెక్టమ్‌ క్యాన్సర్

Anal Cancer Symptoms Or Rectum Cancer - Sakshi

మల విసర్జన సమయంలో రక్తం పడగానే అది క్యాన్సరేనేమో అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అలా రక్తం పడడం అన్నది మూడు ప్రధాన సమస్యల కారణంగా జరగవచ్చు. మొదటిది యానల్‌ ఫిషర్‌ అనే సమస్య. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు కూడా రక్తం పడటంతో పాటు నొప్పి కూడా ఉంటుంది. రెండోది హెమరాయిడ్స్‌ అనే సమస్య. దీన్నే పైల్స్‌ అని కూడా అంటారు. తెలుగులో ఈ సమస్యనే తెలుగులో మొలలు లేదా మూలశంక అని వ్యవహరిస్తుంటారు. ఈ సమస్యలో కూడా రక్తస్రావం కనిపిస్తుంది. మొలలు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.

ఇక మూడో సమస్య క్యాన్సర్‌ కూడా కావచ్చు. ఎవరిలోనైనా మలద్వారం నుంచి రక్తం పడుతున్నప్పుడు ఆ సమస్యకు ఈ మూడింటి లో ఏది కారణమన్నది తెలుసుకోవడం కోసం కొన్ని నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదాహరణకు పెద్దపేగు, మలద్వారం వంటి భాగాలను పరీక్షించేందుకు చేసే కొలనోస్కోపీ వంటివి పరీక్షలు చేస్తారు. ఒకవేళ ముందు చెప్పిన సమస్యల్లో యానల్‌ ఫిషర్‌ లేదా పైల్స్‌ అనే రెండు సమస్యల్లో దేనినైనా సాధారణ శస్త్రచికిత్సలు లేదా ఇతరత్రా మరింత అడ్వాన్స్‌డ్‌ ప్రక్రియలతో పరిష్కరించవచ్చు.

పైగా ఆ రెండూ ప్రాణాంతకాలు ఎంతమాత్రమూ కావు. అయితే ఒకవేళ క్యాన్సర్‌ ఉన్నట్లుగా ప్రాథమిక రిపోర్టులు వస్తే…  అక్కడి గడ్డ నుంచి కొంత ముక్క సేకరించి, వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఆ వచ్చిన రిపోర్టుల ఆధారంగా ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఒకవేళ అది క్యాన్సరే అయినప్పటికీ… ఇప్పుడు పెద్దపేగు క్యాన్సర్లకూ, మలద్వార క్యాన్సర్లకూ మంచి చికిత్స ప్రక్రియలే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పై మూడు సమస్యల్లో ఏదైనప్పటికీ ఎవరూ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

మలద్వారం (రెక్టమ్‌) క్యాన్సర్‌ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న అనుభూతి ఉంటుంది. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం పేరుకుని ఉన్నట్లుగా మెదడుకు సమాచారమిస్తాయి. దాంతో దాన్ని విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. కానీ విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్‌ ఓ గడ్డలా ఉండటంతో ఏదో గడ్డ మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు మళ్లీ మళ్లీ చేరవేస్తుంటాయి. దాంతో ఇంకా అక్కడేదో ఉందన్న భావన కలుగుతూ ఉంటుంది. ఈ లక్షణంతో పాటు కొందరిలో బంక విరేచనాలు, రక్తంతో పాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. 

%d bloggers like this: