సద్గురు జగ్గీ వాసుదేవ్

సద్గురు జగ్గీ వాసుదేవ్ – ఆయన ‘సద్గురు’ గా అందరికీ సుపరిచితులు. ‘సద్గురు’ అనేది ఒక బిరుదు కాదు. ఎవరైనా తమ పాండిత్యం వల్ల ఏదైనా చెప్పగలిగినప్పుడు, మనం వారిని ఎన్నో విధాలా సంబోధిస్తాం. కానీ, ఎవరైతే తమ అంతర్ముఖ అనుభవం వల్ల చెప్పగలుగుతారో వారిని మనం సద్గురు అని అంటాం. సద్గురు ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగి ఇంకా మార్మికుడు. భౌతిక మరియు ఆధ్యాత్మిక పరంగా మానవాళి శ్రేయస్సు కొరకు ఆయన చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా నిర్విరామ కృషి జరుపుతున్నారు.

పురాతన యోగ శాస్త్రాలను సమకాలీన మనస్తత్వాలకు అనుగుణంగా చేయగల ప్రత్యేక సామర్థ్యం సద్గురుకు ఉంది. ప్రాచీన యోగ ప్రక్రియలను ఆధునిక మానవుడికి ఆచరణ యోగ్యంగా, సరళమైన విధానంలో అందుబాటులోకి తీసుకువచ్చి, ప్రపంచ వ్యాప్తంగా ఆయన కోట్లాది మంది జీవితాలను తాకారు.

అందరికీ ఆధ్యాత్మికను అందించే సంకల్పంతో… ప్రతి మనిషీ, తనకు ప్రగాఢమైన ఆత్మ పరిణామాన్ని తద్వారా ఆరోగ్యం ఇంకా శ్రేయస్సును కలిగించగల సాధనాల ద్వారా సాధికారతను పొందాలనేది సద్గురు యొక్క ఆకాంక్ష ఇంకా సంకల్పం.

ఆధ్యాత్మిక పరివర్తన తీసుకురావాలన్న ఒక నిబద్దతతో సద్గురు 1992లో ఈశా ఫౌండషన్ ను స్థాపించారు. ఇది లాభాపేక్ష లేకుండా వాలంటీర్లచే నిర్వహించబడే సంస్థ. మానవ సామర్థ్యాన్ని పెంపొందిచేందుకు ఇది అంకితమైంది.

ఈశా పౌండేషన్ ప్రధాన కేంద్రం కోయంబత్తూరు దగ్గర వెల్లంగిరి పర్వత పాదాల వద్ద నెలకొల్పబడింది, మరొక ప్రధాన కార్యాలయం ఈశా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్, అమెరికా దేశంలోని టెన్నిసీ రాష్ట్రంలో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 300 సెంటర్లలో 90 లక్షల మంది వాలంటీర్లచే ఈశా ఫౌండేషన్ నిర్వహించబడుతోంది.

సద్గురు రూపొందించిన ప్రాథమిక స్థాయి కార్యక్రమం ఇన్నర్ ఇంజినీరింగ్ (Inner Engineering), లోతైన పరివర్తన కోసం, ఒక తేలికైన ఇంకా శక్తివంతమైన క్రియ (అంతర్గత శక్తి ప్రక్రియ) శాంభవీ మహా ముద్రను పరిచయం చేస్తుంది. మానవ శ్రేయస్సు కోసం, ప్రధానంగా రూపొందించిన ఇన్నర్ ఇంజినీరింగ్ కార్యక్రమం, ఈ సంస్థ కార్యకలాపాలకు పునాది. ఈ కార్యక్రమంలో యోగ విజ్ఞానం ద్వారా మన శరీరం, మనస్సు, శక్తుల యొక్క సామర్థ్యాన్ని పరమోన్నత స్థాయికి చేర్చే సాధనాలు అందించబడతాయి.

సద్గురు చేపట్టిన పరివర్తన కార్యక్రమాలు, ప్రంపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలను ప్రగాఢంగా స్పృశించాయి.

ధ్యానలింగ ప్రతిష్ఠాపన

1999 జూన్ 24 వ తేదీన సద్గురు ధ్యానలింగ ప్రాణ ప్రతిష్ఠ చేసారు. పదిహేను వేల సంవత్సరాల పూర్వం పురుడు పోసుకున్న ఈ మహోన్నత కార్యం, ఎంతోమంది యోగులకు, జ్ఞాన సిద్ధులకు ఒక కలలాగే మిగిలిపోయింది. ధ్యానలింగ ఇతిహాస గాధను సద్గురు మాటల్లోనే వినండి.

ఈ ఆశ్రమానికి కేంద్ర బిందువు ధ్యానలింగం. ఏ మతానికీ నమ్మకానికీ చెందని ఒక ధ్యాన మందిరం ఈ ప్రదేశం.

ఈ ధ్యానలింగాన్ని ప్రాణప్రతిష్ఠాపన చెయ్యడం వెనకాల ఉన్న ఆలోచన అంతరార్థం ఏమిటంటే, మేము ఇలా ధ్యానం బోధిస్తూ వెళితే, మీరు ఎంత మందికి భోధించగలరు? దానికి ఒక పరిమితి ఉంటుంది. కాని ధ్యానలింగం కోట్లమందికి ఒక మాటైనా మాట్లాడకుండానే యోగాన్ని భోధించగలదు. ఇక్కడ కూర్చున్న అందరూ ధ్యానంలోకి వెళతారు. అదే దాని విశిష్టత. – సద్గురు

ఈ ధ్యానలింగ ప్రదేశంలో ఊరికే నిశ్శబ్దంగా కూర్చుంటే చాలు. ధ్యానం అంటే తెలియని వారికి కూడా, ఆ లింగం నుండి ఉద్భవించే ఆధ్యాత్మిక శక్తివల్ల, అద్భుతమైన, లోతైన ధ్యాన అనుభూతి కలుగుతుంది.

సద్గురు మాటల్లో చెప్పాలంటే, ధ్యానలింగం పరిసరాల్లోకి వచ్చినవారెవరైనా సరే, వారిలో ఆధ్యాత్మిక బీజం నాటుకుంటుంది. అదే వారిని ముక్తి మార్గంపై నడిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఇతర ప్రతిష్ఠించడిన స్థలాలు కూడా, అంతఃశోధనకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి.

ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా, సద్గురు సృజించిన ఈశా యోగా కేంద్రం అన్నీ యోగా పద్ధతులకు నిలయం. హఠ యోగా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం లాంటి విశేష కార్యక్రమాలు, మన జీవితాల్లోకి, ప్రాచీన యోగా సాంప్రదాయాన్ని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు.

“యోగా విధానంలోని సాంస్కృతిక హంగులను తొలగించి, మానవ శ్రేయస్సుకు శుద్ధమైన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంగా దానిని అందించడమే నా పని.” ~ సద్గురు

అంతరంగ పరివర్తన మరియు సామాజిక స్పృహతో చేపట్టిన స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాల కోసం శక్తివంతమైన యోగా కార్యక్రమాల ద్వారా, ఈశా ఫౌండేషన్ మానవ శ్రేయస్సు యొక్క అన్ని అంశాలను పరిష్కరించడం కోసం అంకితమైన భారీ ఉద్యమాన్ని సృష్టించింది.

సామాజిక పునరుజ్జీవనం, విద్య మరియు పర్యావరణంపై దృష్టి సారించిన అనేక ప్రాజెక్టులను సద్గురు ప్రారంభించారు, దీని ద్వారా లక్షలాది మందికి పేదరికాన్ని అధిగమించడానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మరియు సమాజ-ఆధారిత, స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి మార్గం చూపబడింది.

వాటిగురించి క్లుప్తంగా…

గ్రామీణ పురోభివృద్ధి (Action for Rural Rejuvenation) అనేది కొన్ని వేల గ్రామాల్లో పునరుత్తేజం నింపి, ఆరోగ్య సహాయం, సామాజిక పునరావాసం, మానవ అభ్యున్నతులను అందించే కార్యక్రమం.

గ్రామాల్లో, వివిధ గ్రామాల మధ్య క్రీడా పోటీలు నిర్వహిస్తూ( ఈశా గ్రామోత్సవం), ప్రజలలో ఆనందం నింపి, వ్యసనాలను తగ్గించి, జాతి, కుల, మత భేదాలు లేని, సామాజిక బంధాలు పెంచుతోంది. ఇప్పటివరకూ పేదరికాన్ని అనుభవిస్తున్న దక్షిణ భారతదేశపు 4600 గ్రామాలలోని 70 లక్షల మంది ఈ కార్యక్రమం ద్వారా లబ్దిపొందారు.

ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్ (Project Green Hands) అడవుల నిర్మూలనను ఎదుర్కోవడానికి, 114 మిలియన్ మొక్కలను నాటి, తమిళనాడులోని పచ్చదనాన్ని, 33 శాతానికి పెంచే ఒక బృహత్తర కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎన్నో పురస్కారాలను అందుకుంది.

పచ్చదనాన్ని పెంచేందుకు చేస్తున్న కృషిలో భాగంగా ఏర్పాటుచేసిన 35 నర్సరీల ద్వారా, ఒక ఏడాదికి 35 లక్షల సంఖ్యలో, 60 విభిన్న జాతుల మొక్కలను పెంచి, నాటడం జరుగుతుంది. ఒక్కరోజులో అత్యధిక మొక్కలు (8,52,587) నాటినందుకు గానూ ఇది గిన్నిస్ రికార్డ్ నెలకొల్పింది.

ఈశా విద్య (Isha Vidhya) తక్కువ ఖర్చులో నాణ్యమైన విద్యను అందించడం ద్వారా నిరుపేద గ్రామీణ బాలలకు సాధికారతను కల్పించి, వారి జీవితాలలో పరివర్తన తీసుకురావడం కోసం ఆదర్శంగా నిలిచే ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. పది పాఠశాలలు స్థాపింపబడగా, ఈ రోజు వాటి ద్వారా 8500 మంది విద్యార్ధులు ప్రయోజనం పొందుతున్నారు. వారిలో స్కాలర్షిప్ సహకారం పొందేవారు 60% ఉండగా, వీరిలో ఎక్కువ మంది విద్యాభ్యాసం చేస్తున్న మొదటితరం వారు.

నదుల రక్షణ (Rally For Rivers)

నదుల రక్షణ అనేది భారత జీవనాడులైన నదులను సంరక్షించేందుకు 2017లో సద్గురు ప్రారంభించిన ఉద్యమం.

నదుల దయనీయ స్థితిపై అవగాహన పెంపొందించేందుకు స్వయంగా 16 రాష్ట్రాల గుండా 9300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. 16 కోట్ల 20 లక్షల మంది ప్రజల మద్దతు దీనికి లభించగా, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ ఉద్యమంగా నిలిచింది.

కావేరీ కాలింగ్ –(Cauvery Calling)

కావేరీ కాలింగ్ అనేది ఒక ఉద్యమం. భారతదేశ నదులను పునరుజ్జీవింపజేయడానికి సహాయపడే ప్రమాణాలను ఇది సూచిస్తుంది. ఇది కావేరీ నది పునరుజ్జీవన ప్రక్రియని ప్రారంభించి, తద్వారా 8.4 కోట్లమంది ప్రజల జీవితాలను మార్చనుంది.

కావేరి కాలింగ్ అనేది, నాకూ, నాతో ఉన్నవారికీ పన్నెండు సంవత్సరాల సంకల్పం. ఈ ఒక్కటి మీరు నెరవేర్చితే, ఈ ప్రపంచానికి మీరు చేయవలసింది చేసినట్లే – సద్గురు

ఈ ప్రాజెక్టులతో పాటు దేశ యువతలో చైతన్యం కలిగించేందుకు 2018 లో ‘యువతా సత్యం తెలుసుకో’ (Youth And Truth) పేరుతో అవగాహనా కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలు, కళాశాలను సందర్శించి, వివిధ అంశాలకు సంబంధించి యువతీయువకుల సందేహాలు, వారు ఎదుర్కొంటున్న సవాళ్లపై వారిలో స్పష్టత, సమతుల్యతను తీసుకువచ్చి, తమలో ఉన్న శక్తిని పూర్తిగా వినియోగించుకునేందుకు ప్రేరణ కల్పించే ప్రయత్నం చేశారు

యువతలో అపారమైన శక్తి ఉందని చెబుతూ, వారు తమ శక్తిని నిర్మాణాత్మకంగా వినియోగించుకోగలిగితే సాధ్యమయ్యే అద్భుతాల గురించి తెలియజెప్పారు.

నిర్విరామంగా సాగుతున్న ప్రస్థానం

క్రియాశీలకమైన , అంకితమైన వాలంటీర్ల సహకారంతో ఫౌండేషన్ కార్యకలాపాలు, ప్రపంచ వ్యాపంగా మానవ సాధికారతకు ఇంకా సామాజిక పునరుద్ధరణకు, అభివృద్ధి చెందుతున్న నమూనాగా ఉపయోగపడుతున్నాయి.

ప్రతీ మనిషికీ కనీసం “ఒక చుక్క ఆధ్యాతికత(One drop of spirituality)” ను అందించాలనే సంకల్పంతో చేస్తున్న ఈ కృషి, 38 సంవత్సరాలుగా ప్రజ్జ్వలిస్తూనే ఉంది.

ఆయన వాక్చాతుర్యం ఇంకా పదునైన తర్కం మన ఆలోచనలను, జీవితం పట్ల మన దృక్పథాన్ని విస్తరించేలా చేస్తాయి.

దేశంలో బాగా పలుకుబడి కలిగిన ప్రముఖ 50 మందిలో ఒకరుగా ఆయన గుర్తించబడ్డారు.

సద్గురు సామాజిక ఆర్థిక అభివృద్ధి, నాయకత్వం మరియు ఆధ్యాత్మికత వంటి విభిన్న సమస్యలను ఉద్దేశించి, ఐక్యరాజ్యసమితి మరియు ప్రపంచ ఆర్థిక వేదిక(World Economic Forum)తో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రధాన వేదికలలో ప్రభావవంతమైన వాణిని వినిపించారు.

హార్వర్డ్, యేల్, ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్, వార్టన్ మరియు MIT లతో సహా ప్రముఖ విద్యాసంస్థలలో మాట్లాడేందుకు ఆయనను తరచూ ఆహ్వానిస్తారు.

మానవాళి యొక్క భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సుకోసం అంకితమైన సద్గురు, జీవితం మరియు జీవనం పై ఆయనకు ఉన్న దృక్పథం, తనకు తారసపడే వాళ్ళని సమ్మోహితుల్ని చేసి, సవాలు విసిరి వాళ్ళని ఆశ్చర్యచకితుల్ని చేయడంలో ఎన్నడూ విఫలం కాలేదు.

అవార్డులు – పురస్కారాలు :

  • పద్మవిభూషణ్ అవార్డు – ఆధ్యాత్మిక రంగంలో ఆయన చేసిన అసాధారణమైన మరియు విశిష్ట సేవ చేసినందుకుగానూ ఫిబ్రవరి 2017లో ఇవ్వబడిన అత్యుత్తమ వార్షిక పౌర పురస్కారాలలో ఒకటి.
  • న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ జాబితాలో ఇన్నర్ ఇంజనీరింగ్: ఏ యోగి’స్ గైడ్ టు జాయ్, సెప్టెంబర్ 2016
  • ఐక్యరాజసమితి తాలూకు ఆర్ధిక మరియు సామాజిక కౌన్సిల్ లో స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్
  • ఇండియా టుడే మ్యాగజైన్ చేత సద్గురు దేశంలో బాగా పలుకుబడి కలిగిన ప్రముఖ 50 మందిలో ఒకరుగా గుర్తించబడ్డారు.
  • ఇందిరాగాంధీ పర్యావరణ పురస్కారం – భారతదేశపు అత్యుత్తమ పర్యావరణ పురస్కారం
  • గిన్నిస్ ప్రపంచ రికార్డు – ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్ లో భాగంగా మూడురోజుల వ్యవధిలో 8,00,000 చెట్లను నాటినందుకు
  • ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ కు – ఇండియాటుడే అందించిన సఫైగిరీ అవార్డు.

ప్రముఖ రచనలు

1. Inner Engineering: A Yogi’s Guide to Joy, Telugu Edition (ఇన్నర్ ఇంజినీరింగ్: యోగం ఆనంద మార్గం)

2. Death; An Inside Story: A book for all those who shall die

3. Mystic’s Musings(మర్మజ్ఞ విలాసం)

4. Life and Death in One Breath

5. Adiyogi: The Source of Yoga

6. Don’t Polish Your Ignorance …It May Shine

7. Emotion and relationships ( భావాలు అనుబంధాలు)

8. Joy 24 x 7 (ఆనందం 24X7)

“ప్రేమ, వెలుగు, ఆనందంతో నిండిన ప్రపంచం, దానికి ఇదే సమయం. రండి, మనం దీన్ని సాకారం చేద్దాం” ~ సద్గురు.