ఏపీ ఇంటర్‌ పరీక్షల 2020-21 షెడ్యూల్‌ విడుదల

AP Inter Exams Schedule release - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు మే 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేస్తూ ఇంటర్మీడియట్‌ బోర్డు సోమవారం ఓ ప్రకటన వెలువరించింది. మే 23వ తేదీ వరకు మొదటి, రెండో సంవత్సర పరీక్షలు జరగనున్నాయి. కరోనా ప్రభావంతో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉండడంతో ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్‌ విధానంలో తరగతులు కొనసాగుతున్నాయి.

మే 5 నుంచి 23 వరకు ఇంటర్మీడియల్‌ పరీక్షలు జరుగుతాయి. వాటిలో 5 నుంచి 22 వరకు ఫస్టియర్‌ విద్యార్థులు, మే 6 నుంచి 23 వరకు సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అయితే అంతకుముందే మార్చి 31 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు షెడ్యూల్‌ ప్రకటించింది. అయితే పరీక్షల నిర్వహణ ఎలా చేస్తారనేది ఆసక్తిగా మారింది. కరోనా వ్యాప్తి కాకుండా ఇంటర్మీడియట్‌ బోర్డు చర్యలు తీసుకోనుంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది కోవిడ్ కారణంగా ఇంటర్ సిలబస్‌ను 30 శాతం తగ్గించడమే కాకుండా ఇంటర్ మొదటి ఏడాది పనిదినాలు 108కి కుదించారు. ఇంటర్ మొదటి ఏడాదికి సంబంధించి తరగతులు గతనెల 18వ తేదీన ప్రారంభమైన తరగతులు మే 4 వరకు కొనసాగుతాయి.