వి.వి.గిరి(1894–1980)
వి.వి.గిరి గా పేరొందిన వరహగిరి వెంకటగిరి గారు ఒరిస్సాలో ఉన్న బరంపూర్ లో జన్మించారు. తల్లిదండ్రులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ఐర్లాండ్ దేశంలో న్యాయ విద్యను పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వచ్చి కొంతకాలం న్యాయ వాదిగా పనిచేసారు. ఐర్లాండ్ లో చదువుతున్న సమయంలో గాంధీజీ ప్రేరణతో దేశ స్వాతంత్ర్య పోరాటం కోసం సంఘీభావం గా అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. న్యాయవాదిగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘాల తరుపున అనేక కార్మిక ఉద్యమాల్లో పాల్గొన్నారు, కార్మిక సంఘాల నాయకుడిగా మంచి గుర్తింపు తెచుకున్నారు.
కార్మికుల తరుపున 1934లో కేంద్ర శాసనసభ కు పోటీ చేసి విజయం సాధించారు, 1937లో జస్టిస్ పార్టీ వ్యవస్థాపకుడు బొబ్బిలి రాజు మీద మద్రాస్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.1946లో రెండో సారి మద్రాస్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు, 1951లో మొదటి లోక్ సభకు పార్వతి పురం నుంచి ఎన్నికయ్యారు. 1957లో అక్కడి నుండే ఓటమి పాలయ్యారు. 1937 నుంచి 1939 వరకు రాజగోపాలచారి మంత్రి వర్గంలో కార్మిక శాఖ మంత్రిగా , 1946 నుంచి 1947 వరకు మరోసారి ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారి మంత్రి వర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.1952 నుంచి 1954 వరకు నెహ్రూ గారి మంత్రివర్గంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర, కేంద్ర లలో కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారు, అలాగే అనేక చట్టాలు రూపకల్పనలో భాగమయ్యారు.
1957 నుంచి 1967 వరకు ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు. 1967 నుంచి 1969 వరకు దేశానికి ఉపరాష్ట్రపతి గా పనిచేశారు. 1969లో అప్పటి రాష్ట్రపతి జకీర్ హుస్సేన్ అకాల మరణం వల్ల జరిగిన మధ్యంతర రాష్ట్రపతి ఎన్నికల్లో మరో తెలుగు నేత నీలం సంజీవ రెడ్డి గారిని ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మద్దతు తో ఓడించారు.1969 నుంచి 1974 వరకు దేశానికి రాష్ట్రపతి గా పనిచేశారు.
గిరి గారు కేవలం రాజకీయలలో నే కాకుండా మంచి రచయిత కూడా ముఖ్యంగా తెలుగు భాషా మీద మంచి పట్టు కలిగి ఉండేవారు. గిరి గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం కార్మికుల సమస్యలు మీద పోరాటానికే వేచించారు. అలాగే ఆయన దేశానికి చేసిన సేవలకు గాను 1975లో అప్పటి ప్రభుత్వం “భారత రత్న” బిరుదు తో సత్కరించటం జరిగింది.
You must log in to post a comment.