సూర్యుడి వల్ల భూమి వేడెక్కుతున్నప్పుడు, అంతరిక్షం ఎందుకు చల్లగా ఉంటుంది?

మన భూమి ఉపరితలం మీద సగటు ఉష్ణోగ్రత సుమారు 20 డిగ్రీలు. ఒక వేళ మనం విమానం ఎక్కి 10KM ఎత్తున ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు బయట ఉండే ఉష్ణోగ్రత సగటు -57 డిగ్రీలు (బయటకు వెళ్తే చలికి చచ్చిపోతాం). అంతరిక్షంలో ఉష్ణోగ్రత సుమారు –273 డిగ్రీల (బ్రతికే ప్రసక్తి ఉండదు). ఇక్కడ మీరు గమనించినట్టు అయితే మన భూమి ఉపరితలం నుండి పైకి (అంతరిక్షంలోకి) వెళ్తుంటే ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. మరి సూర్యుడి కిరణాల వలన వేడి ఎక్కితే భూమి నుండి అంతరిక్షంలోకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు పెరగాలి కదా?

అసలు వాస్తవం ఏమిటంటే, మన వాతావరణంలో ఉన్న ముఖ్యమయిన అణువులు అంటే, కార్బన్ డైఆక్సైడ్ (CO2), ఆక్సిజన్(O2), నైట్రోజన్ (N2) మొదలగు వాయువులు సూర్యుని కిరణాలలో ఉన్న శక్తిని నేరుగా గ్రహించలేవు. సూర్యుని కిరణాల వేవ్ లెంగ్త్ (short wave length) తక్కువుగా ఉండడం వలన కార్బన్ డైఆక్సైడ్ (CO2) లాంటి వాయువులు ఆ కిరణాల్లో ఉండే శక్తిని గ్రహించలేవు.

కానీ సూర్యుడి కిరణాలు మన నేలను తాకి వేడి చేస్తాయి. మన నేల వేడెక్కడం వలన లాంగ్ వేవ్ లెంగ్త్ (long wave length) కిరణాలను, అంటే ఇన్ఫ్రారెడ్ (infrared) కిరణాలను మన నేల విడుదల చేస్తుంది. ఈ కిరణాలలో శక్తిని కార్బన్ డైఆక్సైడ్ (CO2) లాంటి వాయువులు సులువుగా గ్రహించి, మన వాతావరణాన్ని వేడిగా ఉంచుతాయి. దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ (green house effect) అంటాం. అందుకనే మన భూమి ఉపరితలం మీద గాలి కింద వేడిగా, పైకి వెళ్ళేటప్పుడు చల్లగా ఉంటుంది. ఇంక అంతరిక్షంలో ఈ కిరణాల శక్తిని గ్రహించడానికి వాయువులు ఉండవు గనుక వేడి అసలు ఉండదు. ఇందుకొరకే , భూమి వేడిగా అంతరిక్షం చల్లగా ఉంటుంది.