చింతకాయలతో కూరలు

Tamarind Special Variety Recipes - Sakshi

చింత కాయ దప్పళం
కావలసినవి: చింత కాయలు – పావు కేజీ (పండనివి); కూరగాయ ముక్కలు – పావు కప్పు (బెండకాయ, సొరకాయ వంటివి); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 4 (సన్నగా పొడవుగా తరగాలి); పసుపు – అర టీ స్పూను; ధనియాలు – ఒక టీ స్పూను; మెంతులు + జీలకర్ర – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; కరివేపాకు – 2 రెమ్మలు; బియ్యప్పిండి – 2 టేబుల్‌ స్పూన్లు

పోపు కోసం : ఆవాలు – ఒక టీ స్పూ ను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5; కరివేపాకు – 2 రెమ్మలు

తయారీ:

చింత కాయలను శుభ్రం గా కడిగి, స్టౌ మీద ఒక పాత్ర లో చింత కాయలు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించి, దింపాలి. కొద్దిగా చల్లారాక చేతితో మెత్తగా అయ్యేలా మెదిపి వడపోశాక, తగినన్ని నీళ్లు జత చేసి, ఉల్లి తరుగు, కూర ముక్కలు, పచ్చి మిర్చి, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతి పొడి వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచాలి. పచ్చి మిర్చి + జీలకర్ర ముద్ద జత చేయాలి. కరివేపాకు, కొత్తిమీర జత చేసి బాగా కలియబెట్టాలి. అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి దప్పళాన్ని మరిగించాలి. చిన్న పాత్రలో బియ్యప్పిండి, కొద్దిగా నీళ్లు పోసి దోసెల పిండి మాదిరిగా ఉండలు లేకుండా కలిపి, ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న పులుసులో వేసి మరోమారు కలియబెట్టాలి. కొత్తిమీర జత చేయాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాక, కరివేపాకు వేసి మరోమారు వేయించి ఈ పోపు ను మరుగుతున్న చింతకాయ దప్పళంలో వేసి కలియబెట్టాలి. బాగా పొంగుతుండగా దింపేయాలి. బాగా పొంగుతుండగా దింపేయాలి.

చింత కాయ పప్పు
కావలసినవి: వామన  చింతకాయలు –  ఒక కప్పు; కంది పప్పు – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 2 (సన్నగా పొడవుగా తరగాలి); ఎండు మిర్చి – 1; ఆవాలు – అర టీ స్పూను; మినప్పప్పు – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – అర టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను;  కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; నూనె – ఒక టేబుల్‌ స్పూను; మిరప కారం – తగినంత; ఉప్పు – తగినంత

తయారీ:

కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు, పసుపు జత చేసి కుకర్‌లో ఉంచి మూడు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. చింత కాయలను శుభ్రంగా కడిగి, ఒక పాత్రలో చింత కాయలకు తగినన్ని నీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి, మెత్తగా అయ్యేవరకు ఉడికించి, దింపి చల్లారాక, నీళ్లు ఒంపేయాలి. చల్లారాక చింతకాయల మీద తొక్కు తీసేసి, తగినన్ని నీళ్లు జత చేసి, మెత్తగా పిసికి, నీళ్లు వడకట్టి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి వేయించాలి. పచ్చి మిర్చి తరుగు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి మరోమారు వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఉడికించిన కంది పప్పు, చింతకాయల రసం, ఉప్పు, మిరప కారం వేసి బాగా కలిపి, సుమారు ఐదు నిమిషాలు సేపు ఉడికించి, దింపేయాలి.

చింత కాయ–కొబ్బరి పచ్చడి
కావలసినవి: చింత కాయలు – 100 గ్రా; కొబ్బరి ముక్కలు – అర కప్పు; పచ్చి మిర్చి – పది

పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 6; కరివేపాకు – 2 రెమ్మలు; వెల్లుల్లి రేకలు – 4; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; నూనె – తగినంత; కరివేపాకు – ఒక రెమ్మ

తయారీ:  

చింత కాయలను శుభ్రంగా కడిగి, ఈనెలు తీసి, చిన్న  చిన్న ముక్కలుగా  చేసుకోవాలి. కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించి చల్లార్చాలి. మిక్సీలో పోపు వేసి మెత్తగా చేయాలి. చింత కాయ ముక్కలు వేసి మెత్తగా అయ్యేలా మిక్సీ తిప్పాలి. కొబ్బరి ముక్కలు, పచ్చి మిర్చి, పసుపు, ఉప్పు, వెల్లుల్లి రేకలు జత చేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ తిప్పాలి. ఒక గిన్నెలోకి తీసుకుని కరివేపాకుతో అలంకరించాలి.

పాత చింత కాయ తొక్కు

కావలసినవి: పాత చింతకాయ తొక్కు – 1 కప్పు; బెల్లం – అర కప్పు; ఎండు మిర్చి – 10; పచ్చి మిర్చి – 5 (పెద్దవి); ఇంగువ – తగినంత; నువ్వుల నూనె – పావు కప్పు

పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5; నూనె – 2 టీ స్పూన్లు; ఇంగువ – తగినంత; కరివేపాకు – 2 రెమ్మలు; వెల్లుల్లి రెబ్బలు – 8
తయారీ:

స్టౌ మీద పాన్‌లో నూనె వేడయ్యాక, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. పచ్చి మిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, ఎండు మిర్చి, ఇంగువ వేసి దోరగా వేయించి చల్లారానివ్వాలి. చింతపండు తొక్కును మిక్సీలో వేసి మెత్తగా చేసి, పసుపు, బెల్లం జత చేసి మరోమారు మెత్తగా నూరి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేయించి ఉంచిన పోపును జత చేసి బాగా కలపాలి ఈ పచ్చడి. ఈ పచ్చడి పథ్యానికి చాలా మంచిది.

చింత కాయ నువ్వుల పచ్చడి
కావలసినవి: చింతకాయలు – 10; వేయించిన నువ్వులు – 100 గ్రా; పచ్చి మిర్చి – 10; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్‌ స్పూను ; మినప్పప్పు – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను

తయారీ:

చింత కాయలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. పప్పు గుత్తితో మెత్తగా అయ్యేలా మెదిపి, గుజ్జును వడకట్టాలి  ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, పచ్చి మిర్చి వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి వేసి వేయించి దింపేయాలి. చల్లారాక మిక్సీలో వేసి, పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు జత చేసి మెత్తగా చేయాలి . వేయించిన నువ్వులు జత చేసి మరోమారు మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి. చింత కాయ గుజ్జు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి. 


%d bloggers like this: