వివాహ జీవితాన్ని దెబ్బతీసే అత్యంత చిన్న చిన్న విషయాలు ఏమిటి? ఈ విషయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

వివాహ జీవితం చాలా అందమైనది మరియు ముఖ్యమైనది. మానవ మనుగడ కోసం మరియు మన సుఖం కోసం వివాహం అనే ఒక బలమైన వ్యవస్థను మనం (అనగా మన మానవ జాతి) ఏర్పాటుచేసుకున్నాము. మానవుడు మనిషిగా పరిణామం చెందుతూ, మనలో ఉన్న యానిమల్ ఇన్స్టిక్స్ తో వచ్చే ఇబ్బందులను హేతుబద్దంగా అధ్యయనం చేసి వివాహం యొక్క నియమాలను, వివాహ చట్టాలు మన సుఖం కోసం లేదా మనుగడ కోసం మనం ఎర్పరుచుకున్నాం. వివాహ జీవితం ఎంత అందమైనదో, అంతే కఠినమైనది. ఇద్దరు ఆలోచనలు, వ్యక్తిత్వాలు, బాధ్యతలు, కలసికట్టుగా జీవితాంతం ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ప్రేమ ఆప్యాయతల మధ్య ప్రయాణం సాగించాలి అంటే ఎంతో ఓర్పు, సహనం అవసరం. ఈ ప్రయాణం మధ్యలో అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ఎన్నో చిన్ని చిన్న కారణాలు పెద్దవిగా మారి దంపతులు విడిపోవడానికి కారణాలవుతున్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం,

వివాహ జీవితంలో తొందరగా అడుగు పెట్టే మహిళలకు, అంటే లేత(18–24) వయసులోనే వివాహం జరగడం, అది కూడా తమకంటే మరీ ఎక్కువ వయసు ఉన్న భర్తను చేసుకోవడం ద్వారా వివాహ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు రావడం తరుచుగా జరుగుతుంది. దీని ముఖ్య కారణం ఇద్దరి ఆలోచనల మధ్య చాలా ఎక్కువ వ్యత్యాసం ఉండడంతో వచ్చే మనస్పర్థాలు. ఆడపిల్లలకు సొంత నిర్ణయాలు మరియు ఒక బంధాన్ని నిలబెట్టుకునే పరిపక్వత కొన్ని సార్లు రాకముందే వారికి పెళ్లి చేయడంతో కొంత వివాహ జీవితంలో సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం భార్య భర్తల మధ్య కమ్యూనికేషన్. వారి ఆలోచనావిధానం గురించి ఒకరికొకరు మనసువిప్పి మాట్లాడుకోవటం, తమ అభిప్రాయాలను మరియు కొరికలను నిర్భయంగా పంచుకోవటం చాలా ముఖ్యం. అదేవిదంగా ఆడపిల్లలకు మరియు మగవారికి పూర్తి పరిపక్వత వచ్చిన తరువాత వారికి మనసుకు నచ్చిన వారితో పెళ్లి జరిపించడం ఒక మార్గంగా కనిపిస్తుంది.

గత మూడు దశాబ్దకాలం నుండి మన దేశం లో వేగంగా మారుతున్న పరిస్థితులు, ఉదాహరణకు మార్కెట్ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు, ఆధునిక పట్టణ జీవనా విధానం, తీరికలేని జీవనం మన వివాహ జీవితం లో చాలా మార్పులను తీసుకొచ్చింది. భార్య భర్తల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వలన, ఇద్దరు కలిసి విలువైన సమయమును గడపకపోవడం వలన కూడా వివాహ జీవితం లో చాలా సమస్యలకు దారి తీస్తున్నాయి. దీనికి పరిష్కార మార్గం, భార్య భర్తలు తమ వివాహ జీవితం ఎప్పటికపుడు విశ్లేషకుంటూ ముందుకు సాగడం మరియు కమ్యూనికేట్ చేసుకోవడం.

ఇక భార్య భర్తలు వృత్తి పరంగా మంచి స్థాయిలో ఉన్నాకూడా, సమాన గౌరవం ఇచ్చిపుచ్చు కోకపోవడం ద్వారా కొంత ఈగో సమస్యలు ఎక్కువయ్యి దాంపత్య జీవితంలో ఆటుపోట్లు ఎదురుకుంటున్నారు . దీనికి ముఖ్యంగా ఇరువురి దంపతులు వారు వృత్తిపరంగా ఎంత స్థాయిలో ఉన్నా కూడా, ఇంట్లో ఇద్దరు సమానమే అని గుర్తించకపోవడం. ఎల్లపుడు ఒకరినిఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగడం వివాహ జీవితంలో చాలా ముఖ్యం.

భర్త మరియు భర్త తరుపున కుటుంబంలో (కొన్ని తక్కువ సంఖ్యలో భార్య తరుపున కుటుంబంతో) వారి జోక్యం ఎక్కువగా ఉండడం వలన దంపతుల మధ్య ఎక్కువగా సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. వర కట్నం, అర్ధాంగి మీద ఎక్కువ అంచనాలు, కుటుంబంలో మనస్పర్థాలు వంటి సమస్యలు చిలికి చిలికి గాలివాన లా మారి వివాహ జీవితం మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. ముందుగా భార్య భర్తలు వివాహ జీవితంలోకి అడుగు పెట్టాక వారిరువురు తమ దాంపత్యజీవితం లోకి మూడో వ్యక్తిని రానివ్వకుండా చూసుకోవడం వారి బాధ్యత. పెద్దల దగ్గర సలహాలు తీసుకోవచ్చు కానీ ఒకరు దాంపత్య జీవితం మీద మూడో వ్యక్తి పెత్తనం ఉండకుండా చూసుకోవడం కూడా దంపతుల బాధ్యతే!

పితృస్వామ్య భావజాలం ఇంకా మన సమాజంలో ఉండడం, దాని పర్యవసానాలుగా భర్త భార్యను బానిసగా చూడడం, సమాన హక్కు ఉందని గుర్తుంచకపోవడం చాలా సమస్యలకు దారితీస్తుంది అలాగే భార్య భర్తనుండి ఎక్కువ అంచనాలతో అనేకమైనటువంటివి ఆశించడం వివాహ జీవితంలో సమస్యలుగా కనపడుతున్నవి. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు తమ ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు హేతుబదంగా విశ్లేషించుకుని, అవసరమైతే ఫ్యామిలీ కౌన్సిలర్స్ ని సంప్రదించి తమ ఆలోచన విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది!

ఆర్థిక సమస్యలు, వివాహేతర సంబంధాలు, ఆరోగ్య సమస్యలు, సెక్స్ జీవితంలో ఇబ్బందులు, అధికంగా ఉండే వ్యసనాల వలన చాలా దంపతుల మధ్య చిన్ని చిన్న సమస్యలు పెద్దవిగా మారి దాపత్య జీవితం మీద తీవ్రమయిన ప్రభావం చూపుతాయి. ఆర్థికంగా మన స్థాయిని బట్టి మన జీవన విధానాన్ని సాగించడం, వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం (ఇది మన యానిమల్ ఇంస్టింక్ట్ ద్వారా కొన్ని సార్లు జరిగే అవకాశం ఉన్నా, మనం వివాహ బంధానికి కట్టుబడి, మన దాoపత్య జీవితం లో ఉన్నా ప్రేమ ఆప్యాయతతో అధిగమించవచ్చు), ఆరోగ్య సమస్యలు రాకుండా రోజు కొంత వ్యాయామం, మన ఆరోగ్యం పట్ల శ్రద్ద, సెక్స్ జీవితం గురించి కమ్యూనికేషన్, ఇబ్బందులు ఉంటె డాక్టర్ల సహాయంతో అధిగమించ వచ్చు.

ఒక సమస్యను చిన్నగా ఉన్నపుడే గ్రహించి, దాన్ని ఓపికతో, హేతుబదంగా పరిష్కరించుకుంటే వివాహజీవితం సాఫీగా సాగుతుంది.

%d bloggers like this:
Available for Amazon Prime