డిజిటల్ కెమెరాలు

DSLR కొనడానికి ముందు పరిగణించవలసిన విషయాలు

ముందుగా ఫుల్-ఫ్రేమ్(35mm), APS-Cల మధ్య తేడా తెలుసుకోవాలి. కెమెరాకు సెన్సర్ మెదడు వంటిది. లెన్స్ ద్వారా వచ్చే కాంతిని దృశ్యరూపంలో డిగిటల్‌గా ముద్రించే పని చేస్తుంది సెన్సర్. కళ్ళ ద్వారా చేరే కాంతిని దృశ్యంగా చూపించే మానవ మెదడులా.

సెన్సర్ పరిమాణాలు:

వీటిలో ముఖ్యమైనవి, ఎక్కువ వాడుకలోనివి రెండు:

ఫుల్-ఫ్రేమ్: ప్రకృతి దృశ్యాలు, నైట్ ఫోటోగ్రఫీకి ఇది ఎంతో ఉపయుక్తం. ఎందుకంటే సెన్సర్ పరిమాణం పెద్దదవటంవల్ల ఎక్కువ దృశ్య కాంతి ప్రవేశించి ఎక్కువ వివరాలు, వెలుతురు తక్కువ ఉన్న దృశ్యాలు బాగా వస్తాయి.

రాత్రి సమయాల్లో నక్షత్రాల చిత్రాలు మంచి ఉదాహరణ:

చిత్రమూలం: లింకన్ హారిసన్

దాదాపు అందరు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు ఫుల్-ఫ్రేమ్ కెమెరాలు వాడతారు. వీటిలో ఫీచర్లు ఎక్కువ, ఖరీదు ఎక్కువే.

APS-C:

ఇందులో సెన్సర్ చిన్నది కనుక దృశ్యాన్ని జూమ్ చేసి చూసినట్టుంటుంది. అందుకే దూరం నుంచి తీసే ఫోటోలకు ఇవి బాగా ఉపకరిస్తాయి. ఉదాహరణకు వైల్డ్‌లైఫ్, పక్షులు, స్పోర్ట్స్, వగైరా.

ఒకే లెన్స్‌తో ఈ రెండు కెమెరాల్లో తీసిన ఫోటోల్లో తేడా ఇలా ఉంటుంది:

కెనాన్ కెమెరాల్లో ఈ రెండు సెన్సర్లు ఇలా ఉంటాయి:

ఎడమపక్కది APS-C, కుడిపక్కది ఫుల్-ఫ్రేమ్


కెమెరా ఎందుకు కొనాలనుకుంటున్నారు?

  • హాబీగా ఫోటోగ్రఫీ నేర్చుకోటానికి
  • కుటుంబం ఫోటోలు తీసుకోటానికి
  • సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెట్టటానికి
  • ఫోటోగ్రఫీని వృత్తిగా మార్చుకోటానికి

హాబీగా ఫోటోగ్రఫీ నేర్చుకోటానికి

APS-C సెన్సర్ కెమెరా కొంటే సరిపోతుంది. ఇందులో ముఖ్యంగా లెన్స్ లభ్యత, వాటి ధర వంటి విషయాలు చూసి తీసుకోవాలి. ఈ రకంగా నికాన్ బాగుంటుంది. కెనాన్‌తో పోలిస్తే బిగినర్స్‌కి తక్కువ బడ్జెట్‌లో లెన్స్ ఉంటాయి. ముఖ్యంగా 24-55 లేదా 24-105mm లెన్స్ తీసుకుంటే సరిపోతుంది. తరువాత అభిరుచిని బట్టి మ్యాక్రో, పోర్ట్రెయిట్ లెన్స్ తీసుకోవచ్చు.

మరో విషయం, నికాన్ అయినా కెనాన్ అయినా, వాటికి తగిన లెన్స్ ఇంకా తక్కువలో తయారు చేసే టామ్రాన్, సిగ్మా వంటి సంస్థలున్నాయి. నేర్చుకునేందుకు ఆ లెన్స్ కొన్నా సరిపోతుంది.

కుటుంబం ఫోటోలు తీసుకోటానికి

పర్యటనల్లోనో, ఇంట్లో వేడుకల్లోనో ఫోటోలకు DSLR కంటే కాంపాక్ట్ కెమెరాలే మంచివి. పెద్ద వేడుకలకు ఎలాగూ ఫోటోగ్రాఫర్‌ను పెట్టుకుంటారు కదా. చాలా మంది కేవలం కొనాలన్న ఆత్రంతో కొని, పుట్టినరోజు వేడుకల వంటివి జరిగేప్పుడు DSLRతో తంటాలు పడటం జరుగుతుంది. ఆ తలనొప్పి లేకుండా నిశ్చింతగా కాంపాక్ట్ కెమెరా తీసుకోవటం భేషు.

సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెట్టటానికి

ఇందుకు సోనీ మంచిదని విన్నాను. నా అనుభవంలో కెనాన్ బాగుంటాయ్. ముఖ్యంగా తేలిగ్గా ఉండే కెమెరా తీసుకోవటం ఉత్తమం. ఇక్కడ కెమెరాతో పాటు ట్రైపాడ్, మైకు వంటి ఉపకరణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

ఫోటోగ్రఫీని వృత్తిగా మార్చుకోటానికి

ఖరీదైనా ఒకేసారి ఫుల్-ఫ్రేమ్ కెమెరా తీసుకోవటం మంచిది. మీకు ఉత్సాహం ఉన్న అంశాన్ని బట్టి ఫీచర్లు చూసుకోవాలి.

ఉదాహరణకు పెళ్ళిళ్ళు, క్యాండిడ్ ఫోటోగ్రఫీ వంటి వాటికి ఫోకస్ పాయింట్లు, ఫోకసింగ్ వేగం మరియు విధానం, ISO వంటివి ముఖ్యం. అలాగే కొనవలసిన ఉపకరణాలూ ఎక్కువే ఉంటాయి – ఫ్ల్యాష్, బ్యాగు, ట్రైపాడ్, కెమెరాను సరిగా శుభ్రపరిచే పరికరాలు వంటివి.

మెగాపిక్సెల్స్(MP) విషయం ఎక్కడా ప్రస్తావించలేదనుకుంటున్నారా? అది కేవలం మార్కెటింగ్ చమక్కే. పెద్ద పెద్ద బిల్‌బోర్డులపై ముద్రించే యాడ్ల ఫోటోలకు తప్ప మిగతా అవసరాలన్నిటికీ 10MP అయినా సరిపోతుంది.

పై అంశాలన్నిటినీ శాసించే ముఖ్యమైన విషయం బడ్జెట్. కెమెరాల ప్రపంచం అందమైన రంగుల లోకం. చాలా మంది ఇందులో పడితే ఇంకా ఇంకా ఖర్చు పెట్టాలని తహతహలాడతారు. అందుకే మొట్టమొదట బడ్జెట్ అనుకుని దానికి లోబడి కొనుగోలు చెయ్యటం మంచిది.

%d bloggers like this:
Available for Amazon Prime