గుడి

గుడి చుట్టూ ప్రదక్షణ కుడి చేతి వైపు నుండే చేస్తారు ఎందుకు?

గుడిలో ప్రదక్షిణం సాధారణంగా “మూలవిరాట్టు ప్రదక్షిణం చేసే వ్యక్తికి కుడివైపుగా ఉండేటట్టు” చేస్తారు అని చెప్తే స్పష్టంగా ఉంటుంది. దీన్నే క్లాక్-వైస్ లేదా గడియారం తిరిగే దిశ అంటారు కదా. ఈ పద్ధతిలో నడిస్తే ప్రదక్షిణంగా నడవడమనీ, మూలవిరాట్టు వ్యక్తి ఎడమవైపుకు వచ్చేలా నడిస్తే అప్రదక్షిణంగా నడవడం అనీ అంటారు.

ఇలా ఎందుకు నడుస్తారంటే – నడిచేప్పుడు భక్తులకు కుడిచేతివైపు భగవంతుడు ఉంటాడు. ఇలా ఉండడమే విధాయకం. భార్యాభర్తలు పూజా కార్యక్రమాల్లోనూ, వివాహ క్రతువులోనూ నిలబడినప్పుడు భార్య భర్తకు ఎడమవేపున నిలబడాలి అంటారు. ఈ రెంటికి ఒకటే సూత్రం. (భర్త దేవుడిలాంటివాడు అన్నది కాదండీ, బాబోయ్) చిన్నవారికి కుడిపక్కన పెద్దవారు నిలబడాలి.


పైన చెప్పిన ప్రదక్షిణ పద్ధతి అన్ని ఆలయాలకు వర్తిస్తుంది కానీ శివాలయానికి వర్తించదు. శివాలయాల్లో మాత్రం వచ్చినవారు ఏ ఆశ్రమంలో ఉన్నారు (బ్రహ్మచర్యం, గృహస్థు, సన్యాసి) అన్నదాన్ని బట్టి వారు ప్రదక్షిణం చేసే పద్ధతి మారిపోతుదంది.

  • గృహస్థు: శివాలయంలో శివుని లింగానికి చేసిన అభిషేక జలం బయటకు వెళ్ళడానికి ఉండే మార్గాన్ని సోమసూత్రం అంటారు. గుడిలోంచి ఓ ఏనుగు బొమ్మ వంటి రూపం బయటకు పెట్టి అందులోంచి అభిషేక జలం వదులుతారు చూశారా, అది సోమసూత్రం. గృహస్థు దాన్ని దాటకూడదట. ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణంగా (శివుడు కుడిన ఉండేలా) ప్రారంభించి తిరిగి సోమసూత్రం వరకూ వచ్చి, ఆగిపోయి వెనుదిరిగి అప్రదక్షిణంగా సోమసూత్రం వరకూ వెళ్లి, ఆగి వెనక్కి తిరిగి ప్రదక్షిణంగా సోమసూత్రం దాకా నడచి – ఇలా చేయాలట. ఎందుకంటే గృహస్థు శివుని సోమసూత్రాన్ని దాటకూడదట. ఐతే, ఇలా చేసేప్పుడు అప్రదక్షిణంగా వెళ్ళడం, తద్వారా శివుడు భక్తుని ఎడమపక్కన ఉండే అవకాశం ఉంటుంది కదా, ఇలా ఎలా అంటే నాకు తెలియదు మరి.

బ్రహ్మచారి: బ్రహ్మచారికి సోమసూత్రం దాటకూడదన్న నియమం లేదు. (ఎందుకన్నది తెలియదు నాకు) కాబట్టి ప్రదక్షిణం మిగిలిన ఆలయాల్లో ఎలా చేస్తామో అలా పూర్తిగా చేసేయవచ్చు.

సన్యాసి: సన్యాసులు ప్రదక్షిణంగా కాక అప్రదక్షిణంగా (అంటే మూలవిరాట్టు ఎడమపక్క ఉండేలా) తిరగాలి ఆలయం చుట్టూ.

Related posts

%d bloggers like this: