ఈనాడు దిన పత్రిక విజయవంతం కావడానికి కారణాలు
ఈనాడు దిన పత్రిక విజయవంతం కావడానికి కాలానుగుణంగా మార్పులు, పటిష్టమైన ప్రణాళికలు, పాఠకాభిరుచికి అనుగుణంగా అంశాలు రాయడం.
స్థానిక వార్తలకు ప్రాధాన్యం
ఈనాడు1974 ఆగస్టు10 న ప్రారంభించేనాటికి పరిమాణంలో చిన్నది అప్పటికి ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతి వంటి దినపత్రికలు ముందంజలో ఉన్నాయి. అయితే వీటి వార్తలకు భిన్నంగా ఈనాడు రాయడం ప్రారంభించింది. ముఖ్యంగా స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఇచ్చింది. పాఠకులకు సమీప ప్రాంతాల విశేషాలు అందించింది. మొదట జిల్లాకు ఓ పేజీ కేటాయించింది.క్రమంగా 16, 20 పేజీలకు పెంచింది. అందులోనే డివిజన్ కు ప్రత్యేక పేజీ, అనంతరం నియోజకవర్గ పేజీ ఏర్పాటు చేసి స్థానిక వార్తలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఇది భారతీయ భాషా పత్రికల చరిత్రలో కొత్త అధ్యాయంగా చెప్పవచ్చు. అనంతరం ఈ విధానాన్ని ఇతర పత్రికలూ అనుసరించాయి.
సూర్యోదయానికి పత్రిక
ఈనాడు విజయానికి ఇదో కారణం. సూర్యోదయానికిముందే చందాదారుని చేతిలో పత్రిక ఉండాలనేది ఈనాడు విధానపరమైన నిర్ణయం. దీనికి అనుగుణంగానే పత్రికలు పంచే ఏజెంట్లతో ఒప్పందం చేసుకుంటుంటుంది. ఇందుకు భిన్నంగా ఆలశ్యంగా పత్రిక చేరితే, ఆ ఏజంటును, సంబంధించిన ఉద్యోగులను తొలగించడానికి వెనుకాడదు. వరదలు, ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ఎన్ని కష్టాలు పడినా, మరెంత ఖర్చు అయినా యాజమాన్యం లెక్కచేయదు. ఈ సమయపాలన చందాదారుల అభిమానాన్ని చూరగొంది. కష్టసమయాల్లో తెగువ చూపిన సిబ్బంది, ఏజంట్లు, విలేకరులను ప్రోత్సాహకాలు, సన్మానాలతో అభినందించడం ద్వారా పటిష్టమైన యంత్రాంగాన్ని సమకూర్చుకుంది. ఈ చర్యల వల్ల సర్కులేషన్ పెంచుకుంది.
నిరంతర శిక్షణ
తెలుగు పత్రికా రంగంలో ఈనాడు అగ్రగామిగా ఉండటానికి ఇదో కారణం. నైపుణ్యం లేని విద్యావంతులను విలేకరులుగా తీసుకుని వారికి ప్రతినెలా శిక్షణ ఇస్తుంది. డివిజన్, జిల్లా స్థాయిల్లో ఇన్మాఈవేశాలు నిర్వహిస్తుంది. అందులో, ప్రత్యేక కథనాలకు లక్ష్యాలను నిర్దేశిస్తుంది. గతంలో విజయాలు, వైఫల్యాలను సమీక్షిస్తారు. వార్తల్లో తప్పొప్పులు విశదీకరిస్తారు. వర్తమాన రాజకీయాలు, సమస్యలపై చర్చిస్తారు. దీనివల్ల నాణ్యమైన వార్తలు అందించగలుగుతోంది. ఇలా సమావేశాలు నిర్వహించినపుడు వ్యవస్థాపకులు చెరుకూరి రామోజీరావు గారితో సహా ఉన్నత స్థానాల్లో ఉన్నవారు హాజరు కావడం, ప్రజ్ఞావంతులను సన్మానించడం పరిపాటి. ఇలాంటి ఓ సమావేశంలో రామోజీ రావు గారు మాట్లాడుతూ ” మనం ఎంతో సాధించామని ఆదమరిస్తే మనమీంచి మరొకరు నడిచి వెళ్ళిపోతారు. కాబట్టి గర్వించక, నిరంతర జాగురూకతతో మెలగాలి.”అని చెప్పారు. అలాగే ఎన్నికలు, వరదలు వంటివి వచ్చినపుడు పాత్రికేయులకు నిరంతరం దిశానిర్దేశం చేయడం ఈనాడు ప్రారంభించి, కొనసాగిస్తోంది. ఉత్తమ సంపాదక వర్గాన్ని, పాత్రికేయులను తయారు చేసి ఉద్దేశ్యంతో ఈనాడుకు అనుబంధంగా జర్నలిజం స్కూల్ ప్రారంభించింది. ఇందుకోసం సివిల్స్ స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తోంది. బయటి అభ్యర్థులతోపాటు, సంస్థలోని కంట్రిబ్యూటర్లకు అవకాశం కల్పిస్తోంది. ఇదే పద్ధతిని మరికొన్ని పత్రికలు అనుసరించి, జర్నలిజం స్కూళ్ళు ప్రారంభించాయి.
సమాజసేవ
ఉప్పెన, భూకంపాలు, తుఫానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సమయంలో ఈనాడు తనవంతు సేవ చేస్తోంది. ముందుగా కొంత విరాళం తాను ప్రకటించి, దాతలను ప్రోత్సహించి కోట్లాది రూపాయల నిధిని పొగుచేస్తోంది. ఆ విధంగా మహారాష్ట్ర భూకంపం, ఒడిశా, బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల్లో గృహ సముదాయాలు నిర్మించింది. ఇటీవలే కేరళ వరద బాధితులకు రెండుగదుల మోడల్ గృహాలు అందజేసింది. మూడురోజుల క్రితం భాగ్యనగరం వరద బాధితులకోసం రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెక్కు ఇచ్చింది. అలాగే పదోతరగతి విద్యార్థులకు అవగాహనా సదస్సులు, విద్యార్థులకు, మహిళలకు వివిధ పోటీలు, వైద్య శిబిరాలు నిర్వహించింది. ఈ సేవలు పరోక్షంగా పత్రిక అభివృద్ధికి బాటలు వేశాయి.
విభిన్న అంశాలు
క్రీడలు, సినిమా, వసుంధర, పిల్లలు, బిజినెస్, పోటీ పరీక్షలు తోపాటు వారంలో ప్రతిరోజూ ఓ అంశంపై ప్రత్యేక పేజీలు నిర్వహిస్తుంది.ఆదివారం బీమా, సోమవారం చదువు, మంగళవారం సుఖీభవ..అలాగే మకరందం, ఈ(e)నాడు,పర్యాటకం తదితరఅంశాలపై ఆసక్తికరమైన విషయాలు ప్రచురిస్తుంటుంది. విభిన్న అభిరుచులున్నవారు ఈ అంశాలపై తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ, పత్రికను అభిమాణిస్తున్నారు. ఒక వార్త నిజమా, కాదా అనే విషయంలో పాఠకులు చివరిగా ఈనాడును అనుసరిస్తుంటారు. ఎన్నో బహిరంగ చర్చల్లో ఈ విషయం వెల్లడైనది. ఇన్ని సానుకూల అంశాల వల్ల ఈనాడు తెలుగు రాష్ట్రాల్లో అద్వితీయ స్థానంలో నిలిచింది. ప్రాంతీయ భాషా పత్రికలలో గతంలో సర్కులేషన్ పరంగా మలయాళ మనోరమ ప్రథమ స్థానంలో వుండేది. ఆ స్థానాన్ని సాధించాలని ఈనాడు మొదట్నించీ కృషి చేస్తోంది.
శీర్షికలపై పరిశోధన
ఈనాడు ప్రారంభం నుంచీ వార్తా, వ్యాసాల శీర్షికలు పెట్టే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు, మంచి శీర్షికలు పెట్టిన సంపాదక సిబ్బందికి, విలేకరులకు ప్రోత్సాహకాలు ఇచ్చింది. ఈనాడులో వచ్చిన శీర్షికలపై ఓ విద్యార్థిని పరిశోధన చేయగా, డాక్టరేట్ లభించింది.
You must log in to post a comment.