32 ఏళ్ల జైత్రయాత్రకు టీమిండియా చెక్‌

Team India Rewrites History By Massive Victory Breaking 32 Years Record - Sakshi

గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో (15-01-2021 to 19-01-2021) టీమిండియా విజయం సాధించడం ద్వారా 32 ఏళ్ల రికార్డును తిరగరాసింది. సాధారణంగానే గబ్బా మైదానం అంటేనే ఆసీస్‌కు బాగా కలిసొచ్చిన వేదిక.. 32 ఏళ్లుగా అక్కడ ఆడిన ఒక్క టెస్టులోనూ ఆసీస్‌ ఓడిపోలేదు. తాజాగా టీమిండియా గబ్బాలో విజయం సాధించడం ద్వారా ఆసీస్‌ 32 ఏళ్ల జైత్రయాత్రకు తెరదించింది. గబ్బాలో ఆసీస్‌ ఇప్పటివరకు 55 టెస్టులు ఆడగా.. 33 మ్యాచుల్లో విజయం సాధించింది. 13 టెస్టులను డ్రా చేసుకుంది. 8 మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. ఇక 1988లో వివ్‌ రిచర్డ్స్‌ నేతృత్వంలోని వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం తర్వాత ఇప్పటివరకు ఒక్క టెస్టులో కూడా ఆసీస్‌ ఓడిపోలేదు.

అంతేగాక టీమిండియా టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో మూడు వంద‌ల‌కుపైగా స్కోర్లు చేజ్ చేసి గెల‌వ‌డం ఇది కేవ‌లం మూడోసారి మాత్ర‌మే. ఇంతకముందు 1975-76లో విండీస్‌పై 406 పరుగులు చేధించగా.. 2008-09 సీజన్‌లో ఇంగ్లండ్‌పై 387 పరుగులు.. తాజాగా గబ్బాలో ఆసీస్‌పై 329 పరుగుల లక్ష్యం చేధించి కొత్త రికార్డు సృష్టించింది. అందులోనూ ఆసీస్‌కు బాగా కలిసొచ్చిన గబ్బా వేదికలో ఇంత భారీ స్కోరు ఛేదించ‌డం అనేది టీమిండియాకు ప్రత్యేకంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. 2018-19 సీజన్‌లో ఆసీస్‌పై 2-1 తేడాతో సిరీస్‌ గెలిచిన టీమిండియా.. 2020-21లోనూ మరోసారి 2-1 తేడాతో ఆసీస్‌ గడ్డపై వరుసగా రెండోసారి సిరీస్‌ను సాధించి బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోపీని అట్టిపెట్టుకోవడం మరో రికార్డుగా చెప్పవచ్చు. 

ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో టాప్‌ 5 టీమిండియా ఆటగాళ్లను ఒకసారి పరిశీలిస్తే..
బౌలింగ్‌ :
మహ్మద్‌ సిరాజ్‌ : 13 వికెట్లు( 3 టెస్టులు)
ఆర్‌ అశ్విన్‌ : 12 వికెట్లు( 3 టెస్టులు)
జస్‌ప్రీత్‌ బుమ్రా : 11 వికెట్లు(3 టెస్టులు)
రవీంద్ర జడేజా : 7 వికెట్లు(2 టెస్టులు)
శార్థూల్‌ ఠాకూర్‌ : 7 వికెట్లు(1 టెస్టు)

బ్యాటింగ్‌: 
రిషబ్‌ పంత్‌ : 274 పరుగులు(5 ఇన్నింగ్స్‌లు)
శుబ్‌మన్‌ గిల్‌ : 259 పరుగులు(6 ఇన్నింగ్స్‌లు)
పుజారా : 271 పరుగులు(8 ఇన్నింగ్స్‌లు)
అజింక్యా రహానే : 268 పరుగులు(8 ఇన్నింగ్స్‌లు) 
రోహిత్‌ శర్మ : 129 పరుగులు(4 ఇన్నింగ్స్‌లు)

%d bloggers like this:
Available for Amazon Prime