
కర్ణాటకలో కనుమ పండుగ రోజు శుక్రవారం ( 16-01-2021) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. హుబ్లీ–ధార్వాడ బైపాస్ రోడ్డులో ధార్వాడ నగర సమీపంలోని ఇటగట్టి వద్ద టెంపో ట్రావెలర్, ఇసుక టిప్పర్ ఢీకొనడంతో ఈ దారుణం జరిగింది. దావణగెరెకు ఐఎంఏకు చెందిన 15 మంది లేడీ డాక్టర్లు గోవాలో సరదాగా గడుపుదామని శుక్రవారం తెల్లవారుజామున టెంపో ట్రావెలర్‌లో బయలుదేరారు. ధార్వాడలో స్నేహితురాలి ఇంట్లో అల్పాహారం తీసుకోవాలనుకున్నారు. ఉదయం ఏడుగంటల సమయానికి వీరి వాహనం ఇటగట్టి వద్ద వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఇసుక టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో టెంపో ట్రావెలర్ నుజ్జునుజ్జయింది.
అందులోని తొమ్మిదిమంది మహిళలు, డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా సంపన్న, రాజకీయ కుటుంబాలకు చెందిన వారని తెలుస్తోంది. ఇక మరణించిన వారిలో ఎక్కువ మంది గైనకాలజిస్టులే ఉన్నారు. వీరి మరణం సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మాతాశిశు మరణాల రేటుపై ప్రభావం చూపగలదని అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రమాద స్థలంలో కొన్ని మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎటు చూసినా రక్తపు మరకలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. టెంపో ట్రావెలర్‌లో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టం మీద మధ్యాహ్నానికి బయటకు తీశారు. మృతదేహాలను హుబ్లీ కిమ్స్ ఆస్పత్రికి, గాయపడినవారిని హుబ్లీ, ధార్వాడల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ధార్వాడ ఎస్పీ కృష్ణకాంత్, ధార్వాడ రూరల్ పోలీసులు, అధికారులు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. పొగమంచు వల్ల ఎదుటి వాహనం కనిపించకపోవడమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.

You must log in to post a comment.