డిష్వాషర్
డిష్వాషర్ గురించి చాలా మందికి ఉండే అపోహ: డిష్వాషర్ విద్యుత్తునూ, నీళ్ళనూ వృథా చేస్తుందని. అది నిజం కాదు. ఒకసారి డిష్వాషర్ పూర్తిగా నింపి వాడితే, సగటున 15-20 లీటర్ల నీళ్ళు, 0.87-1.5 kwH (kwH = యూనిట్) విద్యుత్తూ ఖర్చవుతుంది. ఒక మామూలు సైజు డిష్వాషర్లో, దాదాపు 10 పెద్ద పళ్ళాలు, 10 సాసర్లు, 10 టీ కప్పులు, పది గరిటెలు, 30 చెంచాలు, 10 చిన్న బేసిన్లు (cereal bowls) 10-12 గ్లాసులు, మరికొన్ని చిన్న గిన్నెలు పడతాయి. ఇవన్నీ చేతితో సింకులో కడగడానికి — కడిగే విధానాన్ని బట్టి– ఇరవై లీటర్ల కన్నా ఎక్కువ నీళ్ళు ఖర్చవుతాయి. ఇంకా 1-2 గంటల సమయం, తుడిచి పెట్టుకొనే సమయం కలుపుకోవాలి.
డిష్వాషర్ అంతగా ఉపయోగపడని సందర్భాలు:
- కుటుంబంలో పిల్లలు లేనివారికీ, రోజులో ఎక్కువ భాగం ఆఫీసులో గడిపేవారికి ఇంట్లో ఎక్కువ పాత్ర సామాను “అంటు” అవదు. డిష్వాషర్ పాత్రలతో నింపకుండా వాడడం వల్ల విద్యుత్తూ, నీళ్ళు వృథా అవుతాయి. అందుకు, చిన్న కుటుంబాల వారికీ, పాత్రసామాను ఎక్కువగా లేనివారికీ డిష్వాషర్ ఎక్కువ ఉపయోగపడదు.
- ప్లాస్టిక్ వస్తువులు (ఉదా: మెలమైన్ పళ్ళాలు, చెంచాలు, గిన్నెల వంటివి) డిష్వాషర్లో కడగకూడదు. వాటిలో ఆవిర్లు కక్కుతున్న పదార్థాలు ఉంచడం మంచిది కాదు కూడా.
- అడుగంటిన పాల గిన్నెలు, అన్నం గిన్నెలు, మాడిన కూర బాణలి/మూకుడు, దోసెల పెనం — ఇటువంటి వాటిని డిష్వాషర్లు సరిగ్గా కడగలేవు. ఇటువంటివి చేతితో కడగక తప్పదు. మీకు ఇటువంటి అంటగిన్నెలు ఎక్కువగా ఉంటే డిష్వాషర్ ఉపయోగం ఉండదు.
- నాన్‌స్టిక్ గిన్నెలు చాలా మటుకు డిష్వాషర్లో కడగకూడదు.
- భారతీయ వంటకు ఉపయోగించే సుమీత్ మిక్సీ, జార్లు, వెట్ గ్రైండర్ గిన్నెలు వంటివి డిష్వాషర్లో కడగడం కుదరదు.
డిష్వాషర్ బాగా ఉపయోగపడే సందర్భాలు:
- డిష్వాషర్లు వంటవండిన గిన్నెల కన్నా, పళ్ళాలు, గ్లాసులు, చెంచాలు, గరిటలు, టీ కప్పులు వంటివి బాగా కడగగలవు.
- సీసాతో పాలు తాగే చంటిపిల్లలు ఉన్నవాళ్ళకి సీసాలను కడిగి, పొడిగా ఉంచడానికి డిష్వాషర్ చాలా ఉపయోగం.
- కొన్ని డిష్వాషర్లలో ఉండే స్టెరిలైజ్ సౌకర్యం వల్ల పాలసీసాలు అందులో కడిగితే విడిగా స్టెరిలైజ్ చెయ్యనవసరం లేదు.
- వంట వండిన గిన్నెలకన్నా, తినడానికి ఉపయోగించే పాత్రలవాడకం ఎక్కువ అయినప్పుడు డిష్వాషర్ చాలా ఉపయోగపడుతుంది.
- ఇప్పుడు కరోనా వల్ల కుటుంబం అంతా ఇంట్లోనే గడపడంతో, పిల్లలు చిరుతిండి తిని, వాడి పడేసిన పళ్ళాలు, చెంచాలు, కాఫీ, టీ కప్పులతో డిష్వాషర్ తొందరగా నిండిపోతుంది.
- స్టెయిన్లెస్ స్టీలు వస్తువులు డిష్వాషర్లో కడిగితే తళతళలాడుతూ ఉంటాయి.
- స్టెయిన్లెస్ స్టీలు ఇడ్లీ రేకులు నూనె/నెయ్యి రాసి, ఇడ్లీలు వేసిన తరవాత ఒకసారి తొలిచి డిష్వాషర్లో పెడితే శుభ్రంగా అవుతాయి.
- స్టెయిన్లెస్ స్టీలు ప్రెషర్ కుక్కరును కూడా డిష్వాషర్లో కడగవచ్చు. గాస్కెట్ మాత్రం విడిగా చేతితో కడగాలి.
- డిష్వాషర్లో పాత్రలు అమర్చడానికి కొంత అలవాటు పడాలి, ప్రతి గిన్నెనూ, కప్పూనూ బోర్లించి పెట్టకపోతే వాటిలో నీళ్ళు నిలిచిపోతాయి. పాస్టిక్ వస్తువులు, డిష్వాషర్లో కడగవచ్చని సూచించినవి కూడా, అందులో కడగడం మంచిది కాదు. అవి పై అరలో అమర్చాలి. అవి సరిగ్గా అమర్చకపోతే కింద హీటింగ్ ఎలిమెంట్‌పై పడి కరిగే అవకాశం ఉంది.
You must log in to post a comment.