చీరమేను

చీరమేను/సీరమేను/చీరమీను అనేది చిన్న చేప, చాకురొయ్యల కన్నా చాలా చిన్నగా, చూడగానే ఏదో సేమ్యాల్లా కనబడతాయి. ఇవి గోదావరిలో వరదల తర్వాత దసరా నుంచి దీపావళి మధ్యలో మాత్రమే దొరుకుతాయి. ఈ చేపలు వేళ్ళ సందుల్లో నుంచీ వలల్లోనుంచీ కూడా జారిపోయేంత చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని చీరలతో పట్టుకుంటారు. అందుకే ఈ చేపకి చీరమీను అని పేరు.

ముఖ్యంగా యానాం, ఎదురులంక, కోటిపల్లి గ్రామాల్లో ఇవి బాగా దొరుకుతాయి. సముద్రపు నీరు, నదిలోని నీరు సంగమం వద్ద ఏర్పడిన ఉప్పునీటిలో ఈ చేప జాతులను గమనించవచ్చు. లార్వా దశలో ఉన్నప్పుడు ఈ చేపలు ఎక్కువ ఆక్సిజన్‌ను పొందడానికి సముద్ర సంగమం వద్ద ఉప్పునీటి నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. ఈ ప్రక్రియలో, అవి మత్స్యకారులకు చిక్కుతాయి. సముద్రం అంతటా చల్లని తూర్పు గాలులు వీచినప్పుడు, చీరమీను గోదావరిలోకి వస్తుంది. ఇవి కేవలం ఒక నెల మాత్రమే ఇక్కడ దొరుకుతాయి. ఈ దశలో ఉన్నప్పుడు చాలా రుచిగా ఉంటాయని పులస చేప రుచికి సైతం గట్టి పోటీని ఇవ్వగలదని అంటారు గోదావరి వాసులు.

దీనిని మిగతా చేపల్లాగ పులుసు, కూర చేయరు. చింతకాయల తొక్కుతో పాటు వేయించి, ఆ తర్వాత వీటితో కూర కానీ వేపుడు కానీ వండుతారు. అలాగే మినప్పిండితో పాటు వీటిని కలిపి చీరమీను గారెలు కూడా వేసుకుంటారు. వీటి సీౙన్ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో ఉన్న చూట్టాలు కూడా ఎగురుకుంటూ వచ్చేస్తారు ఈ కూరని వండించు తినటానికి. అలాగే అమెరికా, ఫ్రాన్స్ దేశాలకు కూడా వీటిని అప్పుడప్పుడు ఎగుమతి చేస్తుంటారు.

వీటిని యానాం, ముమ్మిడివరం చేపల మార్కెట్లలో బక్కెట్లలో, బిందెల్లో పోసి అమ్ముతారు. ఇంతకీ వీటి ధర ఎంతుంటుందో ఊహించగలరా? అరకిలో దాదాపు వెయ్యి రూపాయలు వరకూ ఉంటుంది. అంటే కిలో చేపల ధర రెండు వేలు. ఒకవేళ ఆ సంవత్సరం చేపల పట్టుబడి తక్కువుంటే కనుక వీటి ధర కిలో నాలుగు వేల వరకూ కూడా ఉంటుంది. బిందెడు చీరమీను పన్నెండు వేల వరకూ ఉంటుంది. 

Related posts

%d bloggers like this: