బూడిద గుమ్మడికాయ తో చేయదగ్గ వంటకాలు

ఏమి చేసినా ,దానికి న్యాయం చేసే గుణం వుండడం గొప్ప అదృష్టం. వంకాయ కి కిరీటం పెట్టినా, మామిడి పండు ను కింగు నీ చేసినా, తిన డానికి మాత్రమే. గొప్ప వాసనా, రుచి, ఔషధ గుణాలు కలిగి, చాలా నమ్మకాలకు నెలవైన కాయ బూడిద గుమ్మడి కాయ. కూర గాను, పులుసు, పచ్చడి, ఇంకా దోశ ల గానూ, వడియాలు గాను, హల్వా గాను ,క్యాండీ గాను, రైతా గాను, పెరుగు పచ్చడి గానే కాకుండా, ఇంటి ముందు ఇంటికి వచ్చే వాళ్ళకి స్వాగతం చెప్పడానికి, దిష్టి తీసి పగలగొట్టడానికి కూడా ఉపయోగిస్తారు.గుమ్మడి రసం, ఆకులు, కాండం అన్నీ ఔషధాలు గా ఉపయోగ పడతాయి.

గుమ్మడి వడియాలు:

చాలా మంది వడియాలు పెట్టాలంటే గుమ్మడి ముక్కలు లో ఉప్పు వేసి , మూట కట్టి దాని పై బరువు పెట్టీ, రసం మొత్తం తీసి, పిప్పి నీ వడియాలు పెడతారు .

బూడిద గుమ్మడి లోని మొత్తం రుచినీ, ఔషధ గుణాలు పొందాలి అంటే…

గుమ్మడి కాయను చిన్న చిన్న ముక్కలు గా చేసి, మంచి ఎండ లో పెట్టీ , బాగా ఎండనివ్వాలి. గుమ్మడి లోని గుణాలు కోల్పోకుండా, ఇలా చేసిన ముక్కల్ని వడియాలు పెడితే చాలా రుచి గా వుంటాయి.

ఈ ముక్కలు సన్నటి సెగ మీద ,నూనె లో వేయించుకుని, ఉప్పూ,కారం జల్లుకొని తినొచ్చు.

మినప్పప్పు 1/4 కేజీ, పచ్చి మిర్చి ముక్కలు,50 గ్రాములు జీలకర్ర కొద్దిగా ఉప్పు.తగినంత, ఉల్లి ముక్కలు 1/4 కేజీ.

నాన పెట్టుకున్న మినప్పప్పు కొద్ది గా నీళ్ళు పోసి, మెత్త గా రుబ్బాలి . ఎండిన గుమ్మడి ముక్కలు లో మినప్పిండి , పచ్చిమిర్చి, జీలకఱ్ఱ, ఉప్పు, వేసి కలిపి, ముద్దలు గా చేసి, కాటన్ క్లాత్ మీద మంచి ఎండలో ఎండబెట్టాలి. ఈ పిండిలో ఉల్లి ముక్కలు వేసి కొన్ని విడి గా వడియాలు పెడితే, వేపించి స్నాక్స్ లా తిన డానికి పకోడీలు లా బాగుంటాయి.

బాగా ఎండాకా , జాగ్రత్త గా తీసి, గాలి తగలని సీసా లో పెట్టుకుంటే, పాడవ్వకుందా వుంటాయి.

సాంబారు,పప్పు మామిడి కాయ కూర వంటివి వండుకున్నప్పుడు నూనె లో వేపించుకుంటే బాగుంటాయి.

సాంబారు తాలింపు లో ఈ వడియం ముక్కలు వేసుకుంటే అద్భుతంగా వుంటుంది సాంబారు.

గుమ్మడి,కొబ్బరి కూర:

లేత గుమ్మడి ముక్క లూ, కొబ్బరి కోరు ,పచ్చిమిర్చి, మిరియాల పొడి వేసుకుని రుచి కరమైన కూర చేసుకోవచ్చు.

కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు.

గుమ్మడి ఆవ పెట్టిన కూర:

లేత గుమ్మడి ముక్కలు, మగ్గబెట్టీ, పచ్చి మిర్చి, అల్లం, చింతపండు గుజ్జు కొద్దిగా వేసి, శెనగపప్పు, మినప్పప్పు, జీల కఱ్ఱ, పోపు వేసి, ఆవాలు నూరి కలిపి, ఆవపెట్టాలి. అన్నం లోకి చాలా రుచి గా వుంటుంది.

గుమ్మడి కందిపప్పు కూట్టు:

లేతవి కూరకి బాగుంటాయి . గింజలు కూడా మెత్తగా వుంటాయి కాబట్టి ,బూడిద లా వున్నది శుభ్రంగా కడగాలి. కందిపప్పు లో వేసి వుడకబెట్టి ,కొద్దిగా చింతపండు రసం వేసి, బాగా మగ్గాకా , ఎండు మిర్చి,కరివేపాకు, ఆవాలు ,జీలకర్ర, తో పోపు పెట్టుకోవాలి.

గుమ్మడి పెరుగు పచ్చడి:

గుమ్మడి కోరు పెరుగు లో కలిపి, క్రోత్తి మెర , ఉప్పు కలిపి పెరుగు పచ్చడి చేసుకోవచ్చు.

చపాతీ, వుప్మా, అన్నం లోకి చాలా బాగుంటుంది.

గుమ్మడి మినప దోశ:

గుమ్మడి ముక్కలు మెత్తగా మిక్సి లో పేస్ట్ కింద చేసుకుని, దోశ పిండి లో కలిపి దోశలు వేసుకుంటే, ఇల్లంతా ఘుమ ఘుమలు తో నిండి పోతుంది.

చిన్న మంట మీద కొంచెం మగ్గ నిస్తూ వేసుకోవాలి.

పేఠా/ మొరబ్బా/క్యాండీ:

తొక్క,గింజలు తీసేయాలి.ముక్కలు గా కోసు కోవాలి. గుమ్మడి ముక్కలు నీ నిమ్మ ఉప్పు నీళ్లలో వేసి ,నాన బెట్టాలి.కొంత సేపు నాన బెట్టాకా తీసి , ఉడక బెట్టాలి. ఒక గిన్నెలో పంచదార పాకం పట్టి, చిక్కగా అయ్యేవరకు తిప్పాలి. పాకం ముదిరాకా వుడికిన గుమ్మడి ముక్కలు పాకంలో వేసి ,ఇంకా బాగా పాకం పట్టేలా చెయ్యాలి. వేడిగానూ, చల్లారాక కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఉత్తర భారత దేశం లో చాలా మంది ఇష్టం గా తింటారు. ఆగ్రా స్వీట్ అని ప్రసిధ్ధి. రోడ్ల మీద బండి లో అమ్ముతుంటారు.

గుమ్మడి హల్వా:

గుమ్మడి తురుము ను దళసరి మూకుడు లో సన్నటి సెగ లో మగ్గ బెట్టాలి. తగినంత పంచదార వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. జిగురు పాకం వచ్చే వరకు, తిప్పుతూ వుండాలి. పాకం బాగా వచ్చాకా,నెయ్యి,వేయించిన జీడిపప్పు, ఎండు కిస్మిస్ పండ్లు, యలక్కాయ పొడి వేసి కలపాలి. ఒక పళ్ళెంలో నెయ్యి రాసి, దానిలో చక్కగా పరచి, కొంచెం బిగిశాక, ముక్కలు గా కోసుకుంటే నోరూరించే గుమ్మడి హల్వా సిద్ధం.

బూడిద గుమ్మడి రుచికరమైన గుమ్మడి.

%d bloggers like this: