తుఫాన్లకు పేర్లు

1990 సంవత్సరం బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను మచిలీపట్నంను తాకి అల్లకల్లోలం చేసింది. ఆ తుఫాను పేరు TC 02B.

కాకినాడ తీరమును 1996 సంవత్సరంలో మరో తుఫాను తాకింది. దాని పేరు 07B.

ఈ రెండు తుఫాన్లు మనకు గుర్తులేవు. కాని హుద్ హుద్ (HudHud) తుఫాను లేదా ఫైలిన్ (Phailin) తుఫాను అంటే గుర్తొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంకెలు కన్నా మనకు పేర్లు బాగా గుర్తుంటాయి కనుక.

1990 సంవత్సరం నుండి ప్రపంచ వాతావరణ శాఖ (WMO) తుఫాన్లకు పేర్లు పెట్టాలని నిర్ణయించుకుంది. వేర్వేరు ప్రాంతాలలో ఉన్న వాతావరణ శాఖలు, ఆయా ప్రాంతాలకు సంబంధించిన పేర్లను ఎంపిక చేసి తుఫాన్లకు పెట్టవలసి ఉన్నది.

ఉదాహరణకు బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రంలో ఉద్భవించిన తుఫాన్లకు ఢిల్లీ తుఫాను వాతావరణ శాఖ (RMSC NEW DELHI) నిర్ణయించాల్సివస్తుంది .

2000 సంవత్సరంలో ఒమాన్ లోని మస్కాట్ లో జరిగిన చర్చలో భాగంగా , బాంగ్లాదేశ్, భారత్ , మాల్దీవ్స్, మయన్మార్ , ఒమాన్ , పాకిస్తాన్, శ్రీలంక , థాయిలాండ్ నుండి వచ్చిన వాతావరణ నిపుణులు కొన్ని పేర్లను ప్రతిపాదించడం జరిగింది. ఆ పేర్ల జాబితా నుండే ఢిల్లీ వాతావరణ శాఖ తుఫాన్ల పేర్లను నిర్ణయిస్తుంది.

కొన్ని ఉదాహరణలు:

భారతదేశం నుండి ఇదివరకు ప్రతిపాదించిన పేర్లు:

అగ్ని , ఆకాష్, బిజిలి , లెహర్, సాగర్, వాయు.

పాకిస్తాన్ నుండి:

నర్గిస్ , లైలా , నీలం , టిట్లి .

థాయిలాండ్ నుండి :

ఫైలిన్ (Phailin)

ఒమాన్ నుండి:

హుద్ హుద్ (Hud Hud)

2018 లో మరో కొత్త జాబితాను తయ్యారుచేసారు. ఇరాన్ , సౌదీ , యెమెన్ , అరబ్ దేశాలు కూడా జాబితా తయారీలో పాలుపంచుకున్నాయి.

ఇకముందు రాబోయే తుఫాన్ల పేర్లు (2020 నుండి):-

భారతదేశం నుండి :

గతి, ఆగ్ , నీర్ , తెజ .

తుఫాన్లకు పేర్లు పెట్టడానికి ముఖ్యమయిన కారణాలు:

  • ఒక వాతావరణ శాఖనుండి మరో వాతావరణశాఖకు తుఫాన్ల పేర్లతో వివరాలు చేరవేయడానికి సులువు కనుక.
  • ఒకవేళ రెండు తుఫాన్లు ఒకసారివస్తే వాటిని గుర్తుంచడానికి వీలుగా పేరులు ఉపయోగపడతాయి.
  • ప్రజలకు సులువుగా తుఫాన్ల పేర్లు గుర్తుఉంటాయి కనుక వారిని అప్రమత్తం చేయడం సులభం.

తుఫాన్ల పేర్లు ఎనిమిది అక్షరాలకు మించకుండా తేలికగా ఎంపికచేయవలిసి ఉంటుంది. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పేర్లను నిర్ణయిస్తారు. మతం, రాజకీయంకు దూరంగా ఈ పేర్లు ఉండాలని నియమాలు కూడా ఉన్నవి.