Posted in స్త్రీలు

పాలీ సిస్టిక్ ఓవరి సిండ్రోమ్ (PCOS)

పాలీ సిస్టిక్ ఓవరి సిండ్రోమ్ (PCOS), అనేది హార్మోన్ ల అసమతుల్యం వల్ల స్త్రీ ల లో కలిగే సర్వ సాధారణమైన సమస్య. 15 నుండి 44 సంవత్సరాల వయస్సులో ఎప్పుడైనా రావచ్చు.

ఆరోగ్యకరమైన రుతుచక్రంలో, అండాశయం, ప్రతి నెలా అండాల్ని తయారు చేసి విడుదల చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యం వల్ల, అండాశయం లో మార్పులు సంభవిస్తాయి.అండం పరిపక్వత చెందక పోవడం, లేదా అండం విడుదల లో జాప్యం కలుగుతుంది. ఫలితంగా, రుతుక్రమం తప్పడం లేదా ఆలస్యంగా రావడం జరుగుతుంది. నిర్లక్ష్యం వహిస్తే, అండాశయం లో నీటి తిత్తులు (Cysts), సంతాన లేమి (infertility) వంటి సమస్యలు కలుగుతాయి.

PCOS లక్షణాలు:

 1. నెలసరి తప్పడం, ఆలస్యం అవడం లేదా మరీ ఎక్కువగా రావడం
 2. అవాంఛిత రోమాలు (Hirsutism)
 3. మొటిమలు ( Harmonal acne)
 4. జుట్టు పలచబడటం
 5. బరువు పెరగడం లేదా తగ్గడం
 6. మానసిక సమస్యలు (Mood Swings)

PCOS కారణాలు:

PCOS కి ఖచ్చితమైన కారణం అంటూ లేదు. కొన్ని పరిశోధన ల ప్రకారం క్రింది కారణాలు ఉండవచ్చు.

 1. అధిక మోతాదు లో ఆండ్రోజెన్స్ విడుదల అవడం: ఆండ్రోజెన్స్ ని పురుష హార్మోన్ లు గా కూడా సంభోదిస్తారు. ప్రతి స్త్రీ లోను, కొంత మోతాదు లో, పురుష హార్మోన్ లు విడుదల అవ్వడం సర్వ సాధారణం. కానీ PCOS ఉన్న వారి లో, సాధారణం కన్నా ఎక్కువగా ఆండ్రోజెన్స్ విడుదల అవుతాయి. ఫలితం గా, అండం పరిపక్వత చెందక పోవడం, అండం విడుదల లో జాప్యం, అవాంఛిత రోమాలు, మొటిమలు వంటి సమస్యలు కలుగుతాయ.
 2. ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance): ఇన్సులిన్ అనే హార్మోన్ రక్తం లో చక్కెర నిల్వల్ని క్రమబద్దీకరిస్తుంది. PCOS ఉన్న చాలా మంది స్త్రీ ల లో, ముఖ్యం గా, అధిక బరువు, అనారోగ్యపు ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, లేదా వంశ పారంపర్యపు మధుమేహం వల్ల, ఇన్సులిన్ నిరోధకత కలుగుతుంది. తద్వారా, రక్తం లో ఇన్సులిన్ మోతాదు పెరిగి పోతుంది. క్రమేణా అది టైపు-2 మధుమేహం గా మారుతుంది.

PCOS నిర్దారణ మరియు చికిత్స:

ఖచ్చితమైన నిర్దారణ విధానం అంటూ లేదు. స్త్రీ వ్యాధుల నిపుణుల్ని (Gynecologist) ని సంప్రదిస్తే, లక్షణాలు, పెల్విక్ ఎక్షామినేషన్, ఆల్ట్రాసౌండ్ లేదా రక్త పరీక్షల ద్వారా PCOS ని నిర్దారిస్తారు.

చికిత్స లో నెలసరి క్రమం గా రావడానికి, గర్భనిరోధక మాత్రల్ని (Harmonal contraceptives), పురుష హార్మోన్ ల ప్రభావం తగ్గించడానికి, యాంటి ఆండ్రోజెన్స్ ని, ఇన్సులిన్ నిరోధకత కి, ఇంకా ఇతరత్రా PCOS లక్షణాలని తగ్గించడానికి మెట్ఫార్మిన్ (Metformin) లాంటి మాత్రల్ని సూచిస్తారు.

మన ఆరోగ్యం-మన చేతుల్లోనే:

చికిత్స తీసుకోవడం తప్పు కాదు. కానీ, మన జీవన శైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోనంత వరకు, ఫలితం మాత్రం తాత్కాలికం లేదా శూన్యం. ఆరోగ్యకరమైన జీవన విధానం మరియు ఆహరపు అలవాట్ల వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యల్ని అధిగమించవచ్చు.

PCOS నుండి విముక్తి పొందడానికి సహజ సిద్దమైన పద్దతులు:

ఆహారం: PCOS కి సంబందించినంత వరకు, ఆహారానిది ప్రముఖ పాత్ర. సరైన ఆహారం తినడం ఎంత ముఖ్యమో, సరైన వేళలో తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.

అల్పాహారం గా, నాన బెట్టిన బాదం, ఎండు ద్రాక్ష, వాల్నట్స్, మొలకెత్తిన గింజలు, అవిసెలు, తాజా పండ్లు, కూరగాయలు, పులిసిన ఆహారం(ఇడ్లీ లాంటివి) తీసుకోవచ్చు.

మధ్యాహ్నపు భోజనం గా, ఆరోగ్యకరమైన కంచెం పద్దతి (Healthy Plate Method) ని అనుసరించాలి. అంటే, సగం కంచెం లో తాజా కూరగాయలు, మిగతా సగం లో కార్బోహైడ్రేట్ లు, మాంసకృత్తులు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి.

రక్తం లో చక్కెర నిల్వల్ని అదుపు లో ఉంచుకోవడానికి, Low Glycemic Index కలిగిన ఆహారం ని తీసుకోవాలి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు లాంటి చిరు ధాన్యాన్ని ప్రయత్నించవచ్చు.

వేపుడు పదార్థాలు, పచ్చళ్లు, తీపి పదార్థాలు, టీ, కాఫీలు, మైదా, చక్కెర తో చేసినవి, మాంసం వీలైనంత తగ్గిస్తే మంచిది. బదులుగా జీవ క్రియల్ని (Metobolism) మెరుగు పరిచే, గ్రీన్ టీ లాంటివి తీసుకోవచ్చు.

జీర్ణ క్రియ కి సూర్యుడికి సంబంధం ఉందంటారు. అంటే, జఠరాఙి కూడా సూర్యుడితో పాటు పెరుగుతూ, సూర్యాస్తమయానికి తగ్గుతుందని అంటారు. ఆహారం కూడా ఇలా ప్రకృతి నియమాలకు అనుగుణం గానే తీసుకోవాలి. పగలు క్లిష్టమైనవి, రాత్రి వేళ తేలిక గా జీర్ణం అయ్యే ఆహారం తీసుకుంటే మంచిది. రాత్రి భోజనం కూడా వీలైనంత త్వరగా ముగించటం వల్ల, బరువు చాలా వరకు నియంత్రణ లోకి వస్తుంది.

శారీరక శ్రమ: దీనికి నడక, వ్యాయామం లేదా యోగా వీటిలో ఎదో ఒకటి ఎంచుకోవచ్చు. హార్మోన్ల వ్యవస్థ ని, క్రమబద్దీకరించడానికి, కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు ఉంటాయి. అవి ఎంచుకోవచ్చు. ఎదేమైనా ఖచ్చితంగా రోజుకి ఒక గంట శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి.

మరికొంత:

 1. సరైన నిద్ర వేళలు (ఒకే సమయానికి నిద్రించటం మరియు మేల్కొవడం) పాటించటం చాలా ముఖ్యం. ఎందుకంటే స్త్రీ హర్మోన్ల పై, జీవ గడియారం ప్రభావం చాలా ఉంటుంది.
 2. సాధ్యమైనంత వరకు, సేంద్రియ పద్దతి లో పండించిన ఆహారాన్ని తీసుకోవాలి.
 3. వీలైనంత ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. ఎందుకంటే, మనం వాడే ప్లాస్టిక్ వస్తువుల నుండి, రోజుకి కొన్ని లక్షల సూక్ష్మ రేణువులు విడుదలవుతాయి. వాటిలో ఉండే రసాయనం BPA (Bisphonol) హార్మోన్ల సమతౌల్యాన్ని దెబ్బ తీస్తుంది.
 4. ఒత్తిడి మరియు PCOS ది అవినాభావ సంభందం. మానసిక సమస్యలు అదనం (Mood Swings). ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. యోగా, ధ్యానం లాంటివి ఉపకరిస్తాయి.
 5. ఇక ఎక్కువ గా బాధించే మరిన్ని సమస్యలు అవాంఛిత రోమాలు మరియు మొటిమలు( Harmonal Acne). ఇవి హార్మోన్ ల అసమతుల్యం వల్ల కలిగేవీ కాబట్టి, పై పూతల వల్ల ప్రయోజనం తక్కువ. సమస్య మూలాలపై దృష్టి సారిస్తే , స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అవాంఛిత రోమాలు తగ్గించుకోవడానికి, తాత్కాలిక మరియు శాశ్వత పద్దతులు ఉంటాయి. ముఖ చర్మం సున్నితం గా ఉంటుంది కాబట్టి నిపుణుల్ని సంప్రదిస్తే మంచిది. వారు సమస్య తగ్గడానికీ మందులు లేదా శాశ్వతంగా తొలగించడానికి లేజర్ లేదా ఎలెక్ట్రోలైసిస్ పద్దతుల్ని సూచిస్తారు.

PCOS తప్పకుండా అదుపు లో కి వస్తుంది.కానీ, సహనం కొల్పో కుండా, క్రమ శిక్షణ తో ప్రయత్నించాలి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s