నాగ పంచమి

Special Story About Nagpanchami By DVR In Family - Sakshi

శ్రావణ శుద్ధ పంచమిని ‘నాగ పంచమి’గా కొందరు, ‘గరుడ పంచమి’ గా మరికొందరూ జరుపుకుంటారు. మనం పూజించే నారాయణుడి శయ్య అయిన శేషుడి పేరు మీదుగా జరుపుకునే పర్వమే ‘నాగ పంచమి’. కార్తీకమాసంలో వచ్చే ‘నాగులచవితి’ మాదిరిగానే ‘నాగ పంచమి’ నాడు కూడా నాగదేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు.

ఎలా జరుపుకోవాలంటే…
నాగపంచమి రోజున ముందుగా ఇల్లూ వాకిలీ శుభ్రం చేసుకుని తలంటుకుని, నిత్యపూజ పూర్తి చేయాలి. ఆపైన దగ్గర్లో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి నీళ్ళు జల్లి ముగ్గు వేసి, పసుపు, కుంకుమ, గంధ, పుష్ప, అక్షతలతో పూజించి, దీపం, అగరొత్తులు వెలిగించి, అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పింగళ ఈ అయిదు నాగ దేవతలనూ మనసులో స్మరించుకుని, భక్తిగా నమస్కరించాలి. పాలు, పండ్లు, పంచామృతం, నువ్వులు, కొర్రలు, పంచామృతం మొదలైన వాటిని నాగ దేవతకు నైవేద్యంగా సమర్పించాలి. నాగపంచమి పూజ చేసేవారు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు. అంతకంటే ముందు ఐదుగురు అతిథులను ఇంటికి ఆహ్వానించి, ప్రసాదం ఇచ్చి, విందు భోజనం పెడతారు. శక్తి లేనివారు కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టి, ఆ తర్వాతే వారు తింటారు. నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది.

కాలసర్ప దోష నివారణ
కాలసర్ప దోషం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగదేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. కాలసర్ప దోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురౌతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురౌతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది. అలాంటప్పుడు, నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి, కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి. దాంతో దోష నివారణ జరిగి, సుఖసంతోషాలు అనుభూతికి వస్తాయి.

గరుడ పంచమి
నాగపంచమిలాగే గరుడ పంచమి వ్రతాన్ని కూడా కొందరు చేస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనంద దాయకంగా ఉండాలని, స్త్రీలు తమకు పుట్టిన పిల్లలు గరుత్మంతునిలా బలంగా చురుగ్గా ఉండాలని కోరుతూ గరుడ పంచమి పూజ చేస్తారు. తిరుమలలో స్వామివారు గరుడ పంచమినాడు మాడవీధులలో గరుడ వాహనంపై ఊరేగుతారు, ఈ వ్రతాన్ని తమకు పెద్దల నుంచి అనూచానంగా వస్తున్న విధానం ప్రకారం చేయడం సంప్రదాయం. ఆనవాయితీగా వస్తున్న వారు మాత్రమే చేయాలి. లేనివారు స్నానం చేసి శుచిగా ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్‌ అనే గరుడ గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే మంచిది. 

%d bloggers like this: