Makara Sankranti…మకర సంక్రాంతి

తెలుగు రాష్ట్రాలలో జరుపుకునే ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ముఖ్యంగా పల్లెలలో ఉత్సాహంగా జరుపుకుంటారు. దీనికి కారణం ఈ సమయానికి పంటలు పండటం పూర్తయి ఇంటికి తెచ్చుకుంటారు. దీనిని పెద్దల పండుగ అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ.

మార్గశిర, పుష్య మాసాలలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినపుడు ఉత్తరాయణం (జనవరి నెల మధ్యలో) ప్రారంభంతో వస్తుంది.ఈ పండుగను మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజున భోగి పండుగ జరుపుకుంటారు. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలమీద నువ్వుల నూనెతో మర్ధన చేసుకుని, కుంకుడుకాయలతో స్నానం చేయటం సంప్రదాయం. ఇదే రోజున భోగిమంటల పేరుతో భోగిమంటను వేస్తారు. ఇందులో ఇళ్లలోని పాత చెక్కసామానుతో పాటు కట్టెలు వేస్తారు.
స్త్రీలు ఇంటిముందు పేడతో కళ్లాపి చల్లి ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. భోగిరోజున పిల్లలకు భోగిపళ్లు (రేగిపండ్లు) తలమీద పోసి పేరంటం జరుపుకుంటారు.

రెండవనాడు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా పల్లెలలో అరిసెలు చేయని ఇల్లుండదు.
తరువాత రోజు కనుమ పండుగ జరుపుకుంటారు. ఇది పూర్తిగా రైతుల పండుగ. ఈ రోజున పశువులను శుభ్రంగా కడిగి అలంకరించి వాటి కొమ్ములకు రంగుపూసి, వాటికిష్టమైన ఆహారం పెడతారు. పశువుల కొట్టంలో పొంగలి వండి అది పొగుతున్నపుడు పాలపొంగలి, పనుల పొంగలి అని కేకలు వేసి పొంగలిని దేవతలకు నైవేద్యంగా సమర్పించి తరువాత పొలాలకు వెళ్లి ఈ పొంగలిలో పసుపు, కుంకుమలకు కలిపి పొలంలో చల్లుతారు.

సాయంకాలం పశువులను పూలదండలు, గజ్జెలు, పట్టెడలతో అలంకరించి ఊరేగిస్తారు. వీటికి చక్కెర పొంగలి తినిపిస్తారు. వ్యవసాయంలో ఆరుగాలం కష్టపడి పంటలు ఇంటికి తెచ్చుకునే వరకూ పశువుల పాత్ర చాలా ఉంటుంది. దీనికి కృతజ్ఞతగా రైతులు ఇలా చేస్తారు.

తెలుగు రాష్ట్రలలోనే కాకుండా తమిళనాడులోసంక్రాంతిని పొంగల అనే పేరుతోనూ, ఇంకా అనేక ప్రాంతాలలో ఈ పండుగను జరుపుకుంటారు. మాంసాహారులు కనుమ పండుగ రోజున తప్పకుండా మాంసాహారం తింటారు.

వైష్ణవులు ఆండాళ్ చేత రచించిబడిన తిరుప్పావై పాశురాలు రోజుకొకటిగా పాడతారు. సంక్రాంతికి ముందు నెలరోజుల పాటు ధనుర్మాసం ఉంటుంది. ఈ నెల రోజుల పాటు పల్లెలలో హరిదాసులు భగవత్ కీర్తనలు చేస్తూ పల్లెలలో ఇంటింటికి తిరుగుతారు. గృహస్తులు వీరికి బియ్యంగానీ తమకు తోచినవి కాని ఇస్తారు. గంగిరెద్దుల మేళం కూడా సంక్రాంతి పండుగ రోజులలో కనబడుతుంది. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, ఎడ్ల పందాలు జరుగుతాయి.

%d bloggers like this:
Available for Amazon Prime