సుమతీ శతకం

శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరాయనగాఁ
ధారాళమైన నీతులు
నోరూరగఁ జవులుబుట్ట నుడివెద సుమతీ!
సుమతీశతక కారుడు “సుమతీ” అని సంబోధన చేసి బుద్ధిమంతులకు మాత్రమే నీతులను చెప్తానని తెలిపాడు. లోకంలో నీతి మార్గాన్ని ఆచరించి బోధించిన శ్రీరాముని అనుగ్రహం పొందినవాడనై, లోకులు మెచ్చుకొనేలా మరలా మరలా చదువాలని ఆశ కలిగేలా వచిస్తున్నాను.
……………………………………………………………………………………….
అక్కరకు రాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమునఁదా
నెక్కిన బాఱని గుఱ్ఱము,
గ్రక్కున విడువంగవలయుఁ గదరా! సుమతీ!
సమయానికి సహాయం చేయని చుట్టాన్ని, నమస్కరించినా వరాలీయని దైవాన్ని, యుద్ధంలో తానెక్కగా పరిగెత్తని గుర్రాన్ని వెంటనే విడవాలి.
……………………………………………………………………………………….
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరనుఁ గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దులఁ గట్టుక
మడిదున్నక బ్రతకవచ్చు మహిలో సుమతీ!
అడిగినా జీతమీయని ప్రభువును సేవించి కష్టపడటం కంటే, వడిగల యెద్దులను కట్టుకొని పొలం దున్నుకొని జీవించటమే మేలు.
……………………………………………………………………………………….
అడియాస కొలువుఁ గొలువకు,
గుడిమణియముఁ సేయఁబోకు, కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు
మడవినిఁ దో డరయ కొంటి నరుగకు సుమతీ!
వ్యర్ధమైన ఆశగల కొలువు, దేవాలయంలో అధికారం, విడువకుండా చెడ్డవారితో స్నేహాం, అడవిలో తోడు లేకుండా ఓంటరిగా పోవటం తగినవికావు (కనుక, వాటిని మానివేయాలి).
……………………………………………………………………………………….


అధరము కదలియుఁగదలక
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ,
నధికార రోగపూరిత
బధిరాంధక శవముఁజూడ బాపము సుమతీ!
పెదవి కదిలిందో లేదో తెలియని విధంగా, మంచి మాటలను మాని, అధికారమనే రోగంతో పలుకకపోవటమే నియమం కల్గినట్టి అధికారి – కన్నులతో చూడక, చెవులతో వినక, పెదవి కదల్చక ఉండే పీనుగుకు సమానమే అగుట చేత, అట్టి అధికారిని చూసినంతనే పాపం కలుగుతుంది.
……………………………………………………………………………………….
అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్,
దప్పరయని నృపురాజ్యము
దెప్పరమై మీఁద గీఁడు దెచ్చుర సుమతీ!
అప్పులు చేసి ఆడంబరాలు చేయడం, ముసలితనంలో వయసులోనున్న భార్య ఉండటం, మూర్ఖుని తపస్సు, తప్పొప్పులను గుర్తించని రాజ్య పరిపాలన ముందు ముందు భయంకరమైన కష్టాన్ని కలిగిస్తాయి.
……………………………………………………………………………………….
అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుఁడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ!
అప్పులిచ్చేవాడు, వైద్యుడు, యెడతెగకుండా నీరు పారుతుండే నది, బ్రాహ్మణుడూ ఇవి ఉన్న వూరిలో నివశించు. ఇవి లేని వూరిలో ప్రవేశించకు.
……………………………………………………………………………………….
అల్లుని మంచితనంబును,
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్,
బొల్లున దంచిన బియ్యముఁ,
దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ!
అల్లుడు మంచిగానుండుట, గొల్ల విద్వాంసుడౌట, ఆడది నిజం చెప్పుట, పొల్లున దంచిన బియ్యం, తెల్లనికాకులు లోకంలో లేవని తెలియాలి.
……………………………………………………………………………………….
ఆఁకొన్న కూడె యమృతము
తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్
సోఁకోర్చువాఁడె మనుజుఁడు
తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!
ఆకలిగా నున్నప్పుడు తిన్న అన్నమే అమృతం వంటిది. వెనుక ముందులాడక ఇచ్చేవాడే దాత. కష్టాలు సహించేవాడే మనిషి. ధైర్యం గలవాడే కులంలో శ్రేష్ఠుడు.
……………………………………………………………………………………….
ఆఁకలి యుడుగని కడుపును
వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్,
బ్రాఁ కొన్న నూతి యుదకము
మేకల పాడియును రోఁత మేదిని సుమతీ!
కడుపునిండని తిండి, గర్భం దాల్చికూడా లంజరికం మానని భోగం దాని జీవితం, పాచిపట్టి పాడయిన బావి నీరు, మేకల పాడి రోత కలిగిస్తాయి
……………………………………………………………………………………….
. ఇచ్చునదె విద్య, రణమునఁ
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్‌
మెచ్చునదె నేర్పు, వాదుకు
వచ్చునదే కీడుసుమ్ము! వసుధను సుమతీ!
ధనం ఇచ్చేదే విద్య, యుద్ధభూమిలో చొరబడేదే పౌరుషం, గొప్ప కవులు కూడా మెచ్చేదే నేర్పరితనం, తగువుకు వచ్చేదే చెరవు.
……………………………………………………………………………………….
ఇమ్ముగఁజదువని నోరును
‘అమ్మా’ యని పిలిచియన్న మడుగని నోరున్,
దమ్ములఁమబ్బని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
ఇంపుగా చదవని నోరు, అమ్మాయని పిలిచి అన్నమడగని నోరు, ఎన్నడూ తాంబూలం వేసుకోని నోరు, కుమ్మరి మన్నుకై త్రవ్విన గుంటతో సమానం.
……………………………………………………………………………………….
ఉడుముండదె నూఱేండ్లునుఁ
బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్
మడువునఁ గొక్కెర యుండదె
కడునిలఁ బురుషార్థపరుఁడు గావలె సుమతీ!
ఉడుము నూరేళ్ళుండును, పాము వెయ్యేండ్లుడును, కొంగ మడుగులో చాలాకాలం జీవించును. కానీ, వాటి వలన ప్రయోజనమేమి? మంచి పనులలో ఆశక్తిగలవాడుండిన ప్రయోజనం కాని.
……………………………………………………………………………………….
ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱఁగున గలుగనేర్చు నెయ్యడలన్ దా
నెత్తిచ్చి కఱఁగబోసిన
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ!
బంగారంతో సమానంగా తూచి కరగించి కడ్డీలుగా పోసినప్పటికీ ఇత్తడి బంగారంతో సమానం కాదు. అదేవిధంగా, నీచుడెంత ప్రయత్నించినా ఉత్తమ గుణాలను పొందలేడు.
……………………………………………………………………………………….
ఉదకముఁ ద్రావెడు హయమును,
మదమున నుప్పంగుచుండు మత్తేభబున్,
మొదవుకడ నున్న వృషభముఁ
జదువని యా నీచకడకుఁ జనకుర సుమతీ.
నీరు త్రాగుతున్న గుర్రం దగ్గరకు, మదం చేత ఉప్పొంగుతున్న మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గరనున్న ఎద్దు దగ్గరకు, చదువు రాని హీనుని వద్దకు వెళ్ళకు.
……………………………………………………………………………………….
ఉపకారికి నుపకారము
విపరీతము గాదుసేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక జేయువాడె నేర్పరి సుమతీ!
ఉపకారం చేసిన వానికి తిరిగి ఉపకారం చేయడం గొప్పవిషయం కాదు. కీడు చేసిన వాని తప్పులు లెక్కపెట్టకుండా ఉపకారం చేయటం తెలివైన పని.
……………………………………………………………………………………….
ఉపమింప మొదలు తియ్యన
కపటంబెడ నెడను, జెఱకు కై వడినే పో
నెపములు వెదకునుఁ గడపటఁ
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ!
పోల్చుకొని చూడగా, చెఱకు గడ మొదలు తియ్యగా ఉండి, మధ్యలో తీపి తగ్గి, చివరకు చప్పబడేట్లు, చెడు స్నేహం మొదట యింపుగా, మధ్యలో వికటంగా చివరకు చెరుపు కలిగించేదిగా ఉంటుంది.
……………………………………………………………………………………….
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుక తిరుఁగువాఁడె ధన్యుఁడు సుమతీ!
ఏ సమయానికి ఏది తగినదో, అప్పటికి ఆ మాటలాడి, ఇతరుల మనస్సులు నొప్పించక, తాను బాధపడక, తప్పించుకొని నడచుకొనేవాడే కృతార్ధుడు.
……………………………………………………………………………………….
ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషునిఁ గొల్వఁగూడ దది యెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్పవసించు విధంబు గదరా సుమతీ!
ఎప్పుడు కూడా, తన తప్పులను వెతికే అధికారిని కొలువరాదు. తనను చంపటానికి ప్రయత్నించే పాము పడగ నీడన కప్ప నిలబడటానికి ప్రయత్నించకూడదు. ఈ రెండు కార్యాలు కష్టాన్ని కలిగిస్తాయి.
……………………………………………………………………………………….
ఎప్పుడు సంపద గలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్
దెప్పులుగఁ జెఱువు నిండినఁ
గప్పలు పదివేలు చేరుఁగదరా సుమతీ!
చెరువులో తెప్పలాడునట్లు నీరు నిండుగా ఉంటే, కప్పలు అనేకం చేరుతాయి. అలాగే భాగ్యం కలిగినప్పుడే చుట్టాలు వస్తారు.
లేతకాయలను కోయరాదు. చుట్టాలను నిందించరాదు. యుద్ధంలో పారిపోరాదు. గురువుల ఆజ్ఞను అతిక్రమించరాదు.
ఒక గ్రామానికి ఒక కరణం, ఒక న్యాయాధికారి కాకుండా, క్రమంగా ఎక్కువ మంది ఉంటే, అన్ని పనులు చెడిపోయి చెల్లాచెదురు కాకుంటాయా? (ఉండవు.)
……………………………………………………………………………………….
ఒల్లని సతి నొల్లని పతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
గొల్లండుఁ గాక ధరలో
గొల్లండుఁను గొల్లడౌనె గుణమున సుమతీ!
ఇష్టపడని భార్యని, విశ్వాసంలేని యజమానిని, ఇష్టపడని స్నేహితుని, విడవటానికి ఇష్టపడనివాడే గొల్ల కాని, ఆ కులంలో పుట్టిన మాత్రాన గొల్లకాడు.
……………………………………………………………………………………….
ఓడలఁ బండ్లును వచ్చును
ఓడలు నా బండ్లమీఁద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడగబడుఁ గలిమిలేమి వసుధను సుమతీ!
ఓడల మీద బండ్లు, బండ్లమీద ఓడలు వస్తాయి. అలాగే ఐశ్వర్యం వెంట దారిద్ర్యం, దారిద్ర్యం వెంట ఐశ్వర్యం వస్తాయి
……………………………………………………………………………………….
కడు బలవంతుండైననుఁ
బుడమినిఁ బ్రాయంపుటాలిఁ పుట్టిన యింటన్
దడ వుండనిచ్చె నేనియుఁ
బడుపుగఁ నంగడికిఁదానె బంపుట సుమతీ!
ఎంత బలవంతుడైనా, పడుచు పెళ్ళాన్ని ఆమె పుట్టింటి దగ్గర ఎక్కువ కాలం ఉండనిస్తే, తానే ఆమెను వ్యభిచారిణిగా దుకాణానికి పంపినట్లవుతుంది.
బంగారపు గద్దెమీద కుక్కను కూర్చోబెట్టి, మంచి ముహూర్తాన పట్టాభిషేకం చేసినా దానికి సహజమైన అల్పగుణం మానదు. అలాగే నీచుడైన వానిని ఎంత గౌరవించినా వాని నీచగుణం వదలడు.
……………………………………………………………………………………….
కప్పకు నొరగాలైనను,
సప్పమునకు రోగమైన, సతి తులువైనన్,
ముప్పున దరిద్రుడైనను
తప్పదు మఱి దుఃఖమగుట తధ్యము సుమతీ!
కప్పకు కుంటికాలైనా, పాముకు రోగమైనా, భార్య చెడ్డదైనా, ముసలితనంలో దరిద్రం వచ్చినా, తప్పకుండా దుఃఖం కలుగుతుంది
……………………………………………………………………………………….
కమలములు నీరు బాసినఁ
గమలాప్తు రశ్మిసోకి కమలిన భంగిన్
దమతమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులే శత్రులౌట తథ్యము సుమతీ!
కమలాలు తమ స్థానమయిన నీటిని వదిలితే, తమకు మిత్రుడగు సూర్యుని వేడి చేతనే వాడిపోతాయి. అలాగే, ఎవరైనా తమ తమ ఉనికిని విడిచినచో, తమ స్నేహితులే విరోధులవక తప్పదు.
……………………………………………………………………………………….
కరణముఁ గరణము నమ్మిన
మరణామ్తక మౌనుగాని మనలేడు సుమీ
కరణము దనసరి కరణము
మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!
కరణం మరొక కరణాన్ని నమ్మితే ప్రాణాపాయమైన ఆపద కల్గును గానీ బ్రతుకలేడు. కావునా కరణం, తనతో సాటియైన కరణాన్ని నమ్మక మరియు రహస్యాన్ని తెలుపక జీవించాలి.
……………………………………………………………………………………….
కరణముల ననుసరింపక విరిసంబునఁ
దిన్నతిండి వికటించుఁజుమీ,
యిరుసునఁ గందెన బెట్టక
పరమేశ్వరు బండియైనఁ బాఱదు సుమతీ!
కందెన లేకపోతే, ఏ విధంగా దేవుని బండైనా కదలదో, అదే విధంగా కరణానికి ధనమిచ్చి అతనికి నచ్చినట్లు నడవకపోతే తన స్వంత ఆస్తికే మోసమొస్తుంది.

కరణము సాధై యున్నను
గరి మద ముడిగినను బాము కరవకయున్నన్
ధరదేలు మీటకున్నను
గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ!
తాత్పర్యం కరణం మెత్తనితనం కలిగిఉన్నా, ఏనుగు మదం విడిచినా, పాము కరవకున్నా, తేలు కుట్టకున్నా జనులు లెక్కచేయరు.
…………………………………………………………………………………………..
కసుగాయఁ గరచి చూచిన
మసలక తన యోగరుగాక మధురంబగునా?
పసగలుగు యువతులుండఁగఁ
బసిబాలలఁ బొందువాఁడు పశువుర సుమతీ!
తాత్పర్యం పండిన పండు తినకుండా, పచ్చికాయ కొరికితే వెంటనే వగరు రుచి కలుగుతుంది గానీ, మధురంగా ఎలా ఉంటుంది; అలాగే యౌవనం గల స్త్రీలుండగా పసి బాలికలతో కూడినచో వికటంగా ఉంటుంది. చిన్న బాలికల పొందు గూడినవాడు పశువుతో సమానుడు. .
…………………………………………………………………………………………..
కవి గానివాని వ్రాతయు.
నవరసభావములు లేని నాతులవలపున్.
దవిలి చని పంది నేయని.
విధధాయుధకౌశలంబు వృధరా సుమతీ! .
తాత్పర్యం కవిత్వ శక్తిలేనివాడు వ్రాసిన వ్రాత, నవరసాల అనుభవంలేని స్త్రీలయొక్క మోహం, వెంబడించి పరుగెత్తి పందిని కొట్టలేనటువంటివాని నానా విధాయుధాల నేర్పరితనం వ్యర్థాలు. .
…………………………………………………………………………………………..
కాదుసుమీ దుస్సంగతి.
పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్, .
వాదుసుమీ యప్పిచ్చుట.
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ! .
తాత్పర్యం దుర్జన స్నేహం మంచిది కాదు. కీర్తి సంపాదించిన తరువాత తొలగిపోదు. అప్పునిచ్చుట కలహానికి మూలం. స్త్రీలకు కొంచెమైనా ప్రేమ ఉండదు. .
…………………………………………………………………………………………..
కాముకుడు దనిసి విడిచినఁ.
కోమలిఁ బరవిటుఁడు గవయఁ .
గోరుటయెల్లన్.
బ్రేమమునఁ జెఱుకు పిప్పికిఁ.
జీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ! .
తాత్పర్యం కాముకుడు తాను తృప్తిపడే వరకూ అనుభవించి విడిచిన స్త్రీని మరొక విటగాడనుభవించగోరుట, చెరుకురసం పీల్చుకొనగా మిగిలిన పిప్పిని చీమలు ఆశతో ముసురుకొన్నట్లు ఉపయోగంలేనిదిగా ఉంటుంది.
…………………………………………………………………………………………..
కారణము లేని నగవునుఁ.
బేరణములేని లేమ పృథివీ స్థలిలోఁ.
బూరణములేని బూరెయు.
వీరణములులేని పెండ్లి, వృధరా సుమతీ! .
తాత్పర్యం కారణంలేని నవ్వుకి, రవిక లేక స్త్రీకి, పూరణంలేని బూరెకి, వాయిద్యాలు లేని పెళ్ళికి గౌరవం ఉండదు. ..
…………………………………………………………………………………………..
కులకాంతతోఁడ నెప్పుడుఁ..
గలహింపకుఁ వట్టితప్పు ఘటియింపకుమీ..
కలకంఠ కంటి కన్నీ..
రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ! ..
తాత్పర్యం భార్యతో ఎప్పుడూ జగడమాడరాదు, లేని తప్పులు మోపరాదు. పతివ్రతైన స్త్రీ కంటినీరు ఇంట పడితే, ఆ ఇంటిలో సంపద వుండదు. …………………………………………………………………………………………..


కూరిమిగల దినములలో
నేరము లెన్నఁడును గలుఁగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ!
తాత్పర్యం స్నేహం గల దినాలలో ఎన్నడూ తప్పులు కనపడవు. ఆ స్నేహం విరోధమైతే ఒప్పులే తప్పులుగా కనిపిస్తాయి. ..
…………………………………………………………………………………………..
కొంచెపు నరుసంగతిచే ..
నంచితముఁగ గీడువచ్చు నది యెట్లన్నన్..
గించిత్తు నల్లి కఱచిన..
మంచమునకుఁ బెట్లు వచ్చు మహిలో సుమతీ! ..
తాత్పర్యం చిన్న నల్లి కరిస్తే మంచానికే విధంగా దెబ్బలు కలుగుతాయో, అలాగే నీచునితో స్నేహం చేస్తే కీడు కలుగుతుంది. ..
…………………………………………………………………………………………..
కొక్కోక మెల్ల జదివిన
చక్కనివాఁసైన రాజ చంద్రుండైనన్ ..
మిక్కిలి రొక్కము నీయక..
చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ! ..
తాత్పర్యం రతిశాస్త్రమంతా చదివినవాడైనా, అందం గలవాడైనా, రాజులలో శ్రేష్టుడైనా, మిక్కిలి ధనమీయకుండా వేశ్య లభించదు. ..
…………………………………………………………………………………………..
కొఱగాని కొడుకు పుట్టినఁ..
గొఱగామియెగాదు తండ్రి ..
గుణములఁజెఱచున్..
జెఱకుతుద వెన్ను పుట్టినఁ..
జెఱ్కునఁ తీపెల్ల జెరచు సిద్ధము సుమతీ! ..
తాత్పర్యం చెరకుకొనకు వెన్నుపుట్టి ఆ చెరకులోని తియ్యదనమంతా ఎలా పాడుచేస్తుందో, అలాగే నిష్ప్రయోజకుడైన కొడుకు పుడితే వాడు నిష్ప్రయోజకుడవటమేగాక తండ్రి యొక్క మంచి గుణాలు కూడా పాడుచేస్తాడు. ..
…………………………………………………………………………………………..
కోమలి విశ్వాసం బునూ ..
బాములతో జెలిమిఁ యన్య భామల వలపున్, ..
వేముల తియ్యదనంబును, ..
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ! ..
తాత్పర్యం స్త్రీలయొక్క నమ్మకం, పాములతో స్నేహం, పరస్త్రీల యొక్క మోహం, వేపచెట్టు తియ్యదనం, రాజుల విశ్వాసానికి కల్లలు …………………………………………………………………………………………..
గడనగల మగనిఁ జూచిన..
నడుగడుగున మడుగులిడుదు రతివలు ధరలోఁ..
గడనుడుగు మగనిఁజూచిన..
నడపీనుగు వచ్చెననుచు నగుదురు సుమతీ! ..
తాత్పర్యం స్త్రీలు సంపాదన గల పతిని చూసి, అడుగులకు క్రింద వస్త్రపు మడతలు వేసినట్లు తమలో భావిస్తూ గౌరవిస్తారు. సంపాదన లేని పతిని చూస్తే, నడిచే పీనుగుగా తమలో భావిస్తూ పరిహాసం చేస్తారు. ..
…………………………………………………………………………………………..
చింతింపకు కడచిన పని..
కింతులు వలతురని నమ్మ కెంతయు మదిలో ..
నంతఃపుర కాంతలతో ..
మంతనముల మానుమిదియె మతముర సుమతీ! ..
తాత్పర్యం జరిగిపోయిన పనికి విచారించకు. స్త్రీలు ప్రేమిస్తారని నమ్మకు. రాణివాస స్త్రీలతో రహస్య ఆలోచనలు చేయకు. ఇదే మంచి నడవడి సుమా! ..
…………………………………………………………………………………………..
చీమలు పెట్టిన పుట్టలు..
పాముల కిరువైన యట్లు పామరుఁడుదగన్..
హేమంబుఁ గూడఁ బెట్టిన..
భూమీశుల పాలఁజేరు భువిలో సుమతీ! ..
తాత్పర్యం చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైన విధంగానే, లోభి దాచిన ధనం రాజుల పాలవుతుంది..
…………………………………………………………………………………………..
చుట్టములు గానివారలు..
చుట్టములముఁ నీకటంచు సొంపుదలిర్పన్ నెట్టుకొని యాశ్రయింతురు..
గట్టిగ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ! ..
తాత్పర్యం బంధువులుకాని వారు సహితం ధనం కలిగినపుడు, నీకు మేము చుట్టాలమని ఉల్లాసంతో బలవంతంగా వచ్చి మిగుల దృఢంగా ఆశ్రయిస్తారు. ..
…………………………………………………………………………………………..
చేతులకు తొడవు దానము..
భూతలనాథులకుఁ దొడవు బొంకమి, ధరలో, ..
నీతియె తోడ వెవ్వారికి..
నాతికి మానంబు తొడవు, నయముగ సుమతీ! ..
తాత్పర్యం చేతులకు దానం, రాజులకు అబద్ధమాడకుండటం, ధరణిలో ఎవ్వరికైనా న్యాయం, స్త్రీకి పాతివ్రత్యం అలంకారం. ..
…………………………………………………………………………………………..
తడవోర్వక యొడలోర్వక..
కడువేగం బడచిపడిన గార్యంబుగానే..
తడవోర్చిన నొడ లోర్చినఁ..
జెడిపోయిన కార్యమెల్లఁ జేకురు సుమతీ! ..
తాత్పర్యం ఆలస్యాన్ని, శ్రమను సహించక వెంటనే త్వరపడితే ఏ కార్యం జరగదు? ఆలస్యం, శ్రమ సహించి ఓపిక పడితే చెడిపోయిన కార్యమంతా సమకూరుతుంది. ..
…………………………………………………………………………………………..
తన కోపమె తన శత్రువు..
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌఁ..
తన సంతోషమె స్వర్గము..
తనదుఖఃమె నరక మండ్రు, తథ్యము సుమతీ!
తాత్పర్యం తన కోపం శత్రువులాగా భాధను, నెమ్మదితనం రక్షకునిలాగా రక్షను, కరుణ చుట్టంలాగా ఆదరమును, సంతోషం స్వర్గంలాగా సుఖాన్ని, దుఃఖం నరకంలాగా వేదనను కల్గిస్తాయని చెప్తారు. ..
…………………………………………………………………………………………..
తనయూరి తపసి తనమును
దనబుత్రుని విద్యపెంపుఁ దన సతి రూపున్
దన పెరటిచెట్టు మందును
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతి
తాత్పర్యం
తన గ్రామంలో చేసే తపోనిష్ఠను, తన కుమారుని విద్యావైభోగంను, తన భార్య యొక్క సౌందర్యంను, తన పెరటిలోని చెట్టు మందును, ఎటువంటి మనిషైనా పొగడడు. ..
…………………………………………………………………………………………..
తన కలిమి యింద్రభోగము, ..
తన లేమియె సర్వలోక దారిద్ర్యంబున్, ..
తన చావు జగత్ప్రళయము..
తను వలచిన యదియెరంభ తథ్యము సుమతీ! ..
తాత్పర్యం తన భాగ్యం ఇంద్రవైభవం వంటిదిగానూ, తన పేదరికమే ప్రపంచాన గొప్ప దారిద్ర్యం వంటిదిగానూ, తన చావే యుగాంత ప్రళయం వంటిదిగానూ, తాను వలచిన స్త్రీయే చక్కదనం కలిగినటువంటిదిగానూ మనుషులెంచుతారు. ..
…………………………………………………………………………………………..
తనవారు లేని చోటను, ..
జన వించుక లేనిచోట జగడము చోటన్, ..
అనుమానమైన చోటను, ..
మనుజునట నిలువఁదగదు మహిలో సుమతీ! ..
తాత్పర్యం తన బంధువులులేని చోటులో, తనకు మచ్చికలేని చోటులో, తనపై అనుమాన మైన చోటులో మనుష్యుడు నిలువకూడదు. ..
…………………………………………………………………………………………..
తలపొడుగు ధనముఁబోసిన..
వెలయాలికి నిజములేదు వివరింపంగాఁ..
దల దడివి బాస జేఁసిన..
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ! ..
తాత్పర్యం తల పొడుగు ధనం పోసినప్పటికీ, వేశ్యా స్త్రీకి నిజం చెప్పటమనేది లేదు. తల మీద చేయి వేసుకొని ప్రమాణం చేసినా అటువంటి కాంతను నమ్మరాదు. ..
…………………………………………………………………………………………..
తలమాసిన, వొలుమాసినఁ, ..
వలువలు మాసిననుఁ బ్రాణ వల్లభునైనన్..
కులకాంతలైన రోఁతురు, ..
తిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ! ..
తాత్పర్యం ఆలోచించగా, భూమిమీద తల, శరీరం, బట్టలు మాస్తే భర్తనైనా (మంచి స్త్రీలైనప్పటికీ) అసహ్యపడటం నిజం ..
. …………………………………………………………………………………………..
దగ్గర కొండెము చెప్పెడు ..
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మఱి తా..
నెగ్గుఁ బ్రజ కాచరించుట..
బొగ్గులకై కల్పతరువుఁ బొడచుట సుమతీ! ..
తాత్పర్యం మంత్రి చెప్పే చాడీ మాటలకు లోబడి మంచిచెడ్డలు తెలుసుకొనక రాజు ప్రజలను హింసించడం బొగ్గుల కోసం కోరిన కోరికలిచ్చే కల్పవృక్షాన్ని నరికేసుకోవడం వంటిది.
…………………………………………………………………………………………..
తాననుభవింప నర్ధము ..
మానవపతి జేరు గొంత మఱి భూగతమౌ ..
గానల నీగలు గూర్చిన..
తేనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ! ..
తాత్పర్యం నిజంగా తేనెటీగలు అడవులలో చేర్చి ఉంచిన తేనె ఇతరులకు ఎలా చేరుతుందో, అలాగే తాము అనుభవించక దాచి ఉంచిన ధనం కొంత రాజులకు చేరుతుంది, మరికొంత భూమి పాలవుతుంది. ..
…………………………………………………………………………………………..
ధనపతి సఖుఁడై యుండియు
నెనయంగా శివుఁడు భిక్షమెత్తగవలసెన్
దనవారి కెంతకల గిన
దనభాగ్యమె తనఁకుగాక తథ్యము సుమతీ!
తాత్పర్యం ధన వంతుడైన కుబేరుడు స్నేహితుడైనప్పటికీ, ఈశ్వరుడు బిచ్చమెత్తటం సంభవించెను. కాబట్టి, తన వారికెంత సంపద ఉన్నా, తనకుపయోగపడదు. తన భాగ్యమే తనకు ఉపయోగపడును. ..
…………………………………………………………………………………………..
ధీరులకుఁ జేయు మేలది..
సారంబగు నారికేళ సలిలము భంగిన్..
గౌరవమును మఱి మీఁదట..
భూరిసుఖావహము నగును భువిలో సుమతీ! ..
తాత్పర్యం కొబ్బరిచెట్టుకు నీరు పోసినచో శ్రేష్టమైన నీరుగల కాయలను యిచ్చును. అలాగే బుద్ధిమంతులకు చేసిన ఉపకారం మర్యాదను, తరువాత మిక్కిలి సుఖాలను కల్గిస్తుంది. ..

నడువకుమీ తెరువొక్కటఁ
గుడువకుమీ శత్రునింట గూరిమితోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!
తాత్పర్యము మార్గంలో ఒంటరిగా నడవకు. పగవాని ఇంటిలో స్నేహంతో భుజించకు. ఇతరుల ధనాన్ని మూట కట్టకు. ఇతరుల మనస్సు నొచ్చునట్లు మాట్లాడకు.
………………………………………………………………………………………….
నమ్మకు సుంకరి, జూదరి
నమ్మకు మగసాలివాని, నటు వెలయాలిన్
నమ్మకు నంగడి వానిని
నమ్మకుమీ వామహస్త నవనిని సుమతి
తాత్పర్యము పన్నులు వసూలు చేయువానిని, జూదమాడు వానిని, కంసాలిని, భోగం స్త్రీని, సరుకులమ్మేవానిని, ఎడమచేతితో పనిచేయువానిని నమ్మకు.
………………………………………………………………………………………….
నవమున బాలుంద్రావరు
భయమునను విషమ్మునైన భక్షింతురుగా
నయమెంత దోసకారియె
భయమే చూపంగవలయు బాగుగ సుమతీ!
తాత్పర్యము మంచితనం వల్ల పాలను సహితం త్రాగరు. భయపెట్టటం చేత విషమైనా తింటారు. కావునా, భయాన్ని చక్కగా చూపించాలి. ………………………………………………………………………………………….
నరపతులు మేరఁదప్పిన,
దిర మొప్పగ విధవ యింటఁ దీర్పరియైనన్,
గరణము వైదికుఁడయినను,
మరణాంతక మౌనుగాని మానదు సుమతీ!
తాత్పర్యము రాజులు ధర్మం యొక్క హద్దు తప్పినా, విధవాస్త్రీ ఇంటిని ఎల్లకాలం పెత్తనం చేసినా, గ్రామకరణం వైదికవృత్తి గలవాడైనా ప్రాణం పోవునంతటి కష్టం తప్పకుండా సంభవిస్తుంది.
………………………………………………………………………………………….
నవరస భావాలంకృత
కవితా గోష్టియును, మధుర గానంబును, దా
నవివేకి కెంత జెప్పిన
జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ!
తాత్పర్యము శృంగారాది నవరసాలతో, భావాలతో అలంకరించబడిన కవిత్వ ప్రసంగాన్ని, మనోహరమైన పాటను, తెలివిలేనివారికెంత తెలియజేసినా చెవిటివాడికి శంఖమూదినట్లే నిరర్థకమవుతాయి.
………………………………………………………………………………………….
నవ్వకుమీ సభలోపల
సవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్,
నవ్వకుమీ పరసతులతో,
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!
తాత్పర్యము సభలోపల, తల్లిదండ్రులతో, అధికారులతో, పరస్త్రీతో, బ్రాహ్మణ శ్రేష్టులతో పరిహాసాలాడకు.
………………………………………………………………………………………….


నీరే ప్రాణాధారము,
నోరే రసభరితమైన నుడువుల కెల్లన్,
నారే నరులకు రత్నము,
చీరే శృంగార మండ్రు, సిద్ధము సుమతీ!
తాత్పర్యము నీరే అన్ని జీవులకు బ్రతకటానికి ఆధారం. నోరే రసవంతమైన సమస్తమైన మాటలు పల్కటానికి స్థానం. స్త్రీయే సర్వజనులకు రత్నం. వస్త్రమే సింగారానికి ముఖ్యం.
………………………………………………………………………………………….
పగవల దెవ్వరితోడను,
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్,
దెగనాడవలదు సభలను,
మగువకు మన సియ్యవలదు మహిలో సుమతీ!
తాత్పర్యము ఎటువంటి వారితోనూ పగపెట్టుకోరాదు. బీదతనం సంభవించిన తరువాత విచారించరాదు. సభలలో మోమాటం లేకుండా మాట్లాడరాదు. స్త్రీకి, మనసులోని వలపు తెలుపరాదు.
………………………………………………………………………………………….
పతికడకుఁ, తనుఁ గూర్చిన
సతికడకును, వేల్పుఁకడకు, సద్గురు కడకున్,
సుతుకడకును రిత్తచేతుల
మతిమంతులు చనరు, నీతి మార్గము సుమతీ!
తాత్పర్యము నీతి ప్రవర్తన గలవారు, రాజు దగ్గరకు, తనను ప్రేమించే భార్య దగ్గరకు, దేవుని సముఖానికి, గురువు దగ్గరకు, కుమారుని దగ్గరకు వట్టి చేతులతో వెళ్ళరు
………………………………………………………………………………………….


. పనిచేయు నెడల దాసియు,
ననుభవమున రంభ, మంత్రి యాలోచనలన్,
దనుభక్తి యెడలఁ దల్లియు,
యనదగు కులకాంత యుండనగురా సుమతీ!
తాత్పర్యము
భార్య ఇంటిపనులు చేసేటపుడు సేవకురాలవుతుంది, భోగించునపుడు రంభలాగా, సలహాలు చెప్పునపుడు మంత్రిలాగా, భుజించునపుడు తల్లిలాగా ఉండాలి.
………………………………………………………………………………………….
పరనారీ సోదరుఁడై
పరధనముల కాసపడక పరులకు హితుడైఁ
పరుల దనుఁబొగడ నెగడక
పరుఁలలిగిన నలుగనతఁడు పరముడు సుమతీ!
తాత్పర్యము పరస్త్రీలకు సోదరునిలాగా ఉండి, పరుల భాగ్యాలకు ఆశపడక, పరులకు స్నేహితుడై, పరులు తన్ను కొనియాడితే వుబ్బక, పరులు కోపించినా తాను కోపించని మనుష్యుడే ఉత్తముడు.
………………………………………………………………………………………….
పరసతి కూటమిఁ గోరకు,
పరధనముల కాసపడకు, పరునెంచకుమీ,
సరిగాని గోష్టి చేయకు,
సిరిచెడి చుట్టంబుకడకు జేరకు సుమతీ!
తాత్పర్యము పరసతుల పొందు కోరకు. ఇతరుల భాగ్యానికి ఆశపడకు. పరుల తప్పులెంచకు. తగనటువంటి ప్రసంగం చేయకు. ఐశ్వర్యం కోల్పోయిన కారణంగా బంధువుల వద్దకు వెళ్ళకు.
………………………………………………………………………………………….
పరసతుల గోష్ఠినుండిన
పురుషుఁఢు గాంగేయుఁడైన భువినిందవడున్,
బరసతి సుశీలయైనను,
బరుసంగతినున్న నింద పాలగు సుమతీ!
తాత్పర్యము బ్రహ్మచర్య వ్రతం గల భీష్ముడైనప్పటికీ, పరకాంతల ప్రసంగంలో ఉంటే అపకీర్తి పాలవుతాడు. అలాగే, మంచిగుణం గల స్త్రీయైనా పరపురుషుని సహవాసం కల్గిఉంటే అపకీర్తి పాలవుతుంది.
………………………………………………………………………………………….
తాత్పర్యము మనసులో పరపురుషుని కోరే భార్యను విడవాలి. ఎదురుమాట్లాడే కుమారుని క్షమించకూడదు. భయపడని సేవకుని ఉంచరాదు. పలుమార్లు భార్యతో పొందు మానాలి.
………………………………………………………………………………………….
పరుల కనిష్టము సెప్పకు,
పొరుగిండ్లకుఁ బనులు లేక పోవకు మెపుడున్
బరుఁ గలిసిన సతి గవయకు
మెరిఁగియు బిరుసైన హయము నెక్కకు సుమతీ!
తాత్పర్యము ఇతరులకు యిష్టంగాని దానిని మాట్లాడకు. పనిలేక ఇతరుల ఇండ్లకెన్నడూ వెళ్ళకు. ఇతరులు పొందిన స్త్రీని పొందకు. పెంకితనం కలిగిన గుర్రం ఎక్కకు.
………………………………………………………………………………………….
పర్వముల సతుల గవయకు,
ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో
గర్వింపఁ నాలి బెంపకు
నిర్వాహము లేనిచోట నిలువకు, సుమతీ!
తాత్పర్యము పుణ్యదినాలలో స్త్రీలను పొందకు. రాజు యొక్క దయను నమ్మి పొంగకు. గర్వించేలా భార్యను పోషించకు. బాగుపడలేనిచోట ఉండకు.
పలుదోమి సేయు విడియము
………………………………………………………………………………………….
తలగడిగిన నాఁటి నిద్ర, తరుణులతోడన్
పొలయలుక నాఁటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినరా సుమతీ!
తాత్పర్యము దంతాలు తోముకొనిన వెంటనే వేసుకొను తాంబూలం, తలంటుకొని స్నానం చేసిననాటి నిద్ర, స్త్రీలతో ప్రణయకలహంనాడు కూడిన పొందు వీటి విలువ ఇంతని చెప్పలేం సుమా!
………………………………………………………………………………………….
పాటెరుగని పతి కొలువును,
గూటంబున కెఱుకపడని గోమలి రతియున్,
జేటెత్త జేయు జెలిమియు
నేటికి నెదురీదినట్టు లెన్నగ సుమతీ!
తాత్పర్యము పనియొక్క కష్టసుఖాలు తెలుసుకోని అధికారి సేవ, కూటమి తెలియనటువంటి స్త్రీయొక్క సంభోగం, కీడును కలిగించే స్నేహం, విచారించి చూడగా – నదికి ఎదురు యీదు నంతటి కష్టంలాగా ఉంటుంది.
………………………………………………………………………………………….
పాలను గలిసిన జలమును
బాలవిధంబుననే యుండుఁ బరికింపగ
బాల చవిఁజెరచు గావున
బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ!
తాత్పర్యము పాలతో కలిపిన నీరు పాల విధంగానే ఉంటుంది. కానీ, శోధించి చూడగా పాలయొక్క రుచిని పోగొడుతుంది. అలాగే, చెడ్డవారితో స్నేహం చేస్తే మంచి గుణాలు పోతాయి. కావునా, చెడ్డవారితో స్నేహం వద్దు.
………………………………………………………………………………………….
పాలసునకైన యాపద
జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుఁ
దే లగ్నిబడగఁ బట్టిన
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!
తాత్పర్యము తేలు నిప్పులో పడినప్పుడు దానిని జాలితో బయటకు తీసి పట్టుకొంటే కుడుతుంది. కానీ మనం చేసే మేలును తెలుసుకోలేదు. అలాగే జాలిపడి మూర్ఖునికి ఆపదలో సహాయం చేయజూస్తే తిరిగి మనకే ఆపకారం చేస్తాడు. కనుక అట్లు చేయరాదు.
………………………………………………………………………………………….
పిలువని పనులకు బోవుట
కలయని సతి రతియు రాజు గానని కొలువు
బిలువని పేరంటంబును
వలవని చెలిమియును జేయవలదుర సుమతీ
తాత్పర్యము పిలువని పనులకు పోవటం, ఇష్టపడని స్త్రీతో భోగించటం, రాజు చూడని ఉద్యోగం, పిలువని పేరంటం, ప్రేమించని స్నేహం చేయరాదు.
………………………………………………………………………………………….
పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం
గరికిని బ్రాణము తొండము
సిరికిని బ్రాణమ్ము మగువ సిద్ధము సుమతీ!
తాత్పర్యము పట్టణానికి కోమటి, వరిపైరుకి నీరు, ఏనుగుకు తొండం, సిరి సంపదలకు స్త్రీ ప్రాణం వంటివి.
………………………………………………………………………………………….
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని గనుకొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొదుర సుమతీ!
తాత్పర్యము తండ్రికి కుమారుడు పుట్టగానే పుత్రుడు కలగటం వలన వచ్చే సంతోషం కలగదు. ప్రజలు ఆ కుమారుని చూసి మెచ్చిన రోజునే ఆ సంతోషం కలుగుతుంది.
………………………………………………………………………………………….
పులిపాలు దెచ్చియిచ్చిన
నలవడఁగా గుండెగోసి యరచే నిడినన్
దలపొడుగు ధనముఁబోసిన
వెలయాలికిఁగూర్మిలేదు వినరా సుమతీ!
తాత్పర్యము పులి పాలు తెచ్చినా, గుండెకాయను కోసి అరచేతిలో పెట్టినా, తలెత్తు ధనం పోసినా, వేశ్యా స్త్రీకి ప్రేమ ఉండదు.
………………………………………………………………………………………….
పెట్టిన దినముల లోపల
నట్టడవులకైన వచ్చు నానార్ధములున్
బెట్టని దినములఁ గనకఁపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ!
తాత్పర్యము పూర్వజన్మలో తాను దానమిచ్చిన ఫలం వలన, అడవి మధ్యలో ఉన్నా సకల పదార్ధాలు కలుగుతాయి. పూర్వ జన్మలో దానమియ్యకపోతే తాను బంగారుకొండ ఎక్కినా ఏమీ లభించదు
………………………………………………………………………………………….
పొరుగునఁపగవాఁడుండిన
నిర వొందఁగ వ్రాతగాఁడు ఏలికయైనన్
ధరఁగాఁపు కొండెమాడినఁ
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!
తాత్పర్యము ఇంటి పొరుగున విరోధి కాపురమున్నా, వ్రాతలో నేర్పరియైనవాడు పాలకుడైనా, రైతు చాడీలు చెప్పేవాడైనా కరణాలకు బ్రతుకుతెరువుండదు.
………………………………………………………………………………………….
బంగారు కుదువఁబెట్టకు
సంగరమునఁ బాఱిపోకు, సరసుడవై తే
నంగడి వెచ్చము లాడకు,
వెంగలితోఁ జెలిమివలదు వినురా సుమతీ!
తాత్పర్యము బంగారం తాకట్టుపెట్టకు. యుద్ధంలో పారిపోకు. దుకాణంలో వెచ్చాలు అప్పు తీసుకోకు. అవివేకితో స్నేహం చేయకు.
………………………………………………………………………………………….
బలవంతుఁడ నాకేమని
బలువురతో నిగ్రహించి పలుకుటమేలా?
బలవంతమైన సర్పము
చలిచీమల చేతఁజిక్కి చావదె సుమతీ!
తాత్పర్యము బలం కలిగిన పాము ఐనా చలి చీమల చేత పట్టుబడి చస్తుంది. అలాగే తాను బలవంతుడనే గదా అని అనేకులతో విరోధ పడితే, తనకే కీడు వస్తుంది.
………………………………………………………………………………………….
మండలపతి సముఖంబున
మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్‌
గొండంత మదపుటేనుగు
తొండము లేకుండినట్లు తోచుర సుమతీ!
తాత్పర్యము కొండంత ఏనుగుకు తొండంలేకపోతే ఎలా నిరర్ధకమో, అలాగే రాజు యొక్క సముఖాన సమర్ధత గల మంత్రిలేకపోతే రాజ్యం నిరర్ధకం.
మంత్రి ఉన్న రాజు యొక్క రాజ్యం, కట్టుబాటు చెడిపోకుండా జరుగుతుంది. మంత్రి లేని రాజు యొక్క రాజ్యం కీలూడిన యంత్రంలాగా నడవదు.
…………………………………………………………………………………………..

మాటకుఁ బ్రాణము సత్యము
కోటకుఁ బ్రాణంబు సుభట కోటి, ధరిత్రిన్
బోటికిఁ బ్రాణము మానము
చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ
తాత్పర్యం : మాటకు సత్యం, కోటకు మంచి భటుల సమూహం, స్త్రీకి సిగ్గు, ఉత్తరానికి చేవ్రాలు (సంతకం) జీవనాలు(ప్రాణంలాగా ముఖ్యమైనవి).
…………………………………………………………………………………………..
మానఘనుఁ డాత్మధృతిఁ జెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెడు జలములలోపల
నేనుఁగు మెయి దాఁచినట్టు లెరగుము సుమతీ!
తాత్పర్యం : అభిమానవంతుడు ధైర్యం తొలగి నీచుని సేవించటం, కొంచెం నీళ్ళలో ఏనుగు శరీరాన్ని దాచుకొను విధంగా ఉంటుంది.
…………………………………………………………………………………………..
నాది నొకని వలచియుండగ
మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగున్‌
బొది జిలుక పిల్లి పట్టిన
జదువునె యా పంజరమున జగతిని సుమతీ!
తాత్పర్యం : పిల్లిని పంజరంలో పెట్టినా, పంజరం మధ్యనున్న చిలుక మాట్లాడునా? అలాగే మనసునందొకని ప్రేమించిన స్త్రీ, మరొక విటుడెంత బ్రతిమాలినా ప్రేమించదు.
…………………………………………………………………………………………..
మేలెంచని మాలిన్యుని
మాలను నగసాలివాని మంగలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేలఁగలసిపోవుగాని నెగడదు సుమతీ!
తాత్పర్యం : ఉపకారం తలపోయని పాపాత్ముని, మాలను, కంసాలిని, మంగలిని వీళ్ళను స్నేహితులుగా చేసుకున్న రాజుయొక్క రాజ్యం నశించునే గానీ వృద్ధి చెందదు.
…………………………………………………………………………………………..
రా పొమ్మని పిలువని యా
భూపాలునిఁ గొల్వ ముక్తి ముక్తులు గలవే
దీపంబు లేని ఇంటను
చెవుణికీళ్లాడినట్లు సిద్ధము సుమతీ!
తాత్పర్యం : దీపంలేని ఇంటిలో చేతిపట్టులాడిన పట్టుదొరకనట్లే, ‘రమ్ము పొమ్ము’ అని ఆదరించని రాజును సేవించటం వలన భుక్తి ముక్తులు కల్గవు.
…………………………………………………………………………………………..
రూపించి పలికి బొంకకు,
ప్రాపగు చుట్టంబు కెగ్గు పలుకకు, మదిలో
గోపించు రాజుఁ గొల్వకు
పాపపు దేశంబు సొరకు, పదిలము సుమతీ!
తాత్పర్యం : రూఢి చేసి మాట్లాడిన తరువాత అబద్ధమాడకు. సహాయంగా ఉండు బంధువులకు కీడు చేయకు. కోపించే రాజును సేవించకు. పాపాత్ములుండే దేశానికి వెళ్ళకు
…………………………………………………………………………………………..


. లావుగలవానికంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!
తాత్పర్యం : కొండంతటి ఏనుగును మావటి వాడెక్కి లోబరచుకొనేట్లు లావుగలిగిన వాడికంటే, నీతి గల్గినవాడు బలవంతుడగును.
…………………………………………………………………………………………..
వరదైన చేను దున్నకు
కరవైనను బంధుజనుల కడకేగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ!
తాత్పర్యం : వరద వచ్చే పొలంలో వ్యవసాయం చేయకు, కరువు వస్తే చుట్టాల కడ కరుగకు. ఇతరులకు రహస్యం చెప్పకు. భయం గలవాడికి సేవా నాయకత్వం ఇవ్వకు.
…………………………………………………………………………………………..
వరి పంటలేని యూరును
దొరయుండని యూరు తోడు దొరకని తెరువున్
ధరను బతిలేని గృహమును
అరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!
తాత్పర్యం : వరిపంట లేని ఊరు, అధికారి ఉండని గ్రామం, తోడు దొరకని మార్గం, యజమాని లేని ఇల్లు వల్లకాడుతో సమానం.
…………………………………………………………………………………………..
తాత్పర్యం : ఎవ్వరు చెప్పినా వినవచ్చు. వినగానే తొందరపడక నిజమో అబద్ధమో వివరించి తెలుసుకొనినవాడే న్యాయం తెలిసినవాడు.
…………………………………………………………………………………………..
వీడెము సేయని నోరును
జేడెల యధరామృతంబుఁ జేయని నోరును
బాడంగరాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!
తాత్పర్యం : తాంబూలం వేసుకోని నోరు, చెప్పిన మాట మరలా లేదని పలికే నోరు, పాటపాడటం తెలియని నోరు, బూడిద మన్ను పోసే గుంటతో సమానం
…………………………………………………………………………………………..
వెలయాలివలనఁ గూరిమి
గలుగదు మరి గలిగెనేని కడతేరదుగా
పలువురు నడిచెడి తెరుపునఁ
బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ!
తాత్పర్యం : పదుగురు నడిచే మార్గంలో గడ్డి మొలవనే మొలవదు. ఒకవేళ కలిగినా, కడవరకు స్థిరంగా ఉండదు. అలాగే వేశ్య ప్రేమించదు, ప్రేమించినా తుదివరకూ నిలువదు.
…………………………………………………………………………………………..
వెలయాలు సేయు బాసలు
వెలయఁగ నగపాలి పొందు, వెలమల చెలిమిన్
గలలోఁన గన్న కలిమియు,
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!
తాత్పర్యం : వేశ్యా ప్రమాణాలను, విశ్వ బ్రాహ్మణుని స్నేహాన్ని, వెలమ దొరల జతను, కలలో చూసిన సంపదను, స్పష్టంగా నమ్మరాదు.
…………………………………………………………………………………………..
వేసరవు జాతి కానీ
వీసముఁ దాజేయనట్టి వ్యర్థుడు గానీ
దాసి కొడుకైన గాని
కాసులు గలవాఁడే రాజు గదరా సుమతీ!
తాత్పర్యం : నీచజాతివాడైనా, కొంచెమైనా చేయలేమనే నిష్ప్రయోజకుడైనా, దాసీపుత్రుడైనా – ధనంగలవాడే అధిపతి.
…………………………………………………………………………………………..
శుభముల నొందని చదువును
అభినయమున రాగరసము నందని పాటల్
గుభగుభలు లేని కూటమి
సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!
తాత్పర్యం : మంగళాలు పొందని విద్య, అభినయం రాగరసాలులేని పాట, సందడులులేని రతి, సభలో మెచ్చని మాటలు ఇవన్నీ సారంలేనివి.
…………………………………………………………………………………………..
సరసము విరసము కొరకే
పరిపూర్ణ సుఖంబు అధిక బాధల కొరకే
పెరుగుట విరుగుట కొరకే
ధర తగ్గుట హెచ్చుకొరకే తధ్యము సుమతీ!
తాత్పర్యం : హాస్యాలాడటం విరోధం కల్గటానికే, ఎక్కువ సౌఖ్యాలననుభవించటం బాగా కష్టాలను పొందటానికే అధికంగా పెరగటం విరుగుట కొరకే, ధర తగ్గటం అధికమవటానికే – నిజమైన కారణాలు.
…………………………………………………………………………………………..
సిరి దా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి దాఁ బోయిన బోవును
కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!
తాత్పర్యం : సంపద కలుగునప్పుడు కొబ్బరి కాయలోకి నీరువచ్చే విధంగానే రమ్యంగా కలుగును. సంపద పోవునప్పుడు ఏనుగు మ్రింగిన వెలగపండులోని గుజ్జు మాయమగు విధంగానే మాయమైపోవును.
…………………………………………………………………………………………..
స్త్రీలయెడల వాదులాడకు
బాలురతోఁ జెలిమి చేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!
తాత్పర్యం : ఎన్నడూ స్త్రీలతో వివాదాలాడకు, బాలురతో స్నేహం చేసి మాట్లాడకు, మంచి గుణాలు వదలకు, పాలించు యజమానిని దూషించకు.
…………………………………………………………………………………………..

%d bloggers like this: