వేమన శతకం

అల్పుడెపుడుఁబల్కు నాడంబురముగాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడూ గొప్పలు చెప్పుచుండును. మంచి బుద్ధి గలవాడు తగినంత మాత్రమునే మాటలాడును. కంచు మ్రోగినంత పెద్దగా బంగారం మ్రోగదు కదా! అని భావం.
……………………………………………………………………….
ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడచూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఉప్పు, కర్పూరం చూడటానికి ఒకే విధంగా కనిపించును. కానీ పరిశీలించి చూసినచో వాటి రుచులు, గుణములు వేరు వేరుగా ఉండును. ఆ విధంగానే మానవులందరూ ఒకే విధంగా అవయవ లక్షణములు, ఆకారములు కలియున్ననూ మామూలు మనుషుల కంటే గొప్పవారి లక్షణములను పరిశీలించి తెలుసుకొనగలిగినచో అవి విలక్షణముగా ఉండునని భావం.
………………………………………………………………………..
గంగిగోవు పాలు గరిటెడైనా చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమా! మంచి ఆవు పాలు కొంచమైనా ఉపయోగంగా ఉండును. కానివి కడవ నిండా ఉన్న గాడిద పాలు పని ఏమి? భక్తితో పెట్టిన భోజనం కొద్దిగా అయినా చాలును కదా! అని భావం.
………………………………………………………………………..
అనువుగానిచోట నధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువ గాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మనకు తగని ప్రదేశంలో గొప్పవారమని, ఎక్కువ అని అనుట మంచిది కాదు. మనకు గల గొప్పతనమును, ఆధిక్యతను ప్రదర్శించకపోయినంత మాత్రాన మన ఔన్నత్యమునకు భంగం కలగదు. కొండ ఎంత పెద్దదైననూ అద్దములో చూచినపుడు చిన్నదిగానే కనిపించును గదా! అని అర్థం.
………………………………………………………………………..
తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమనా! తల్లిదండ్రులపై ప్రేమలేని కుమారుడు పుట్టిననూ, చచ్చిననూ ఒక్కటే. పుట్టలలో పుట్టి ఎవరికీ ఉపయోగం లేక ఆ పుట్టలోనే చచ్చెడు చెదపురుగుల వలె తల్లిదండ్రులపై ప్రేమ లేని కుమారుని జన్మము వ్యర్థం కదా! అని భావం.
………………………………………………………………………..
వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును
చీడపురుగు చేరి చెట్టు చెఱచు
కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమనా! ఓ మహా వృక్షమును అడుగు భాగమున చేరిన వేఱు పురుగు ఆ వృక్షమును చంపివేయును. ఒక చీడ పురుగు ఆ చెట్టును నాశనం చేయును. అలాగే దుర్మార్గుడు మంచివారిని చెదగొట్టును కదా! అని భావం.
………………………………………………………………………..


నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్ళు తట్టడేలా?
చాటు పద్యమిలను చాలదా యొక్క
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమనా! నిజమైన మంచి నీలమణి ఒక్కటైనా చాలును. అంతేగానీ ఊరక మెరిసే గాజురాళ్ళు తట్టెడు ఉన్ననూ వ్యర్థమే. చాటు పద్యము ఒక్క దానిని విన్ననూ చాలును గదా! అనేక రసహీన పద్యములను విన్ననూ నిరుపయోగమే కదా! అని భావం.
………………………………………………………………………..
మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్ట విచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమనా! పైకి మేడిపండు ఎర్రగా పండి చక్కగా కన్పించుచుండును. దానిని చీల్చి చూడగా పొట్టలో పురుగులుండును. పిరికివాడు పైకి గాంభీర్యముగా ప్రదర్శించినప్పటికీ పిరికి తనము కలిగియుండును.
………………………………………………………………………..
ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు
పరగ మూలికలకు పనికివచ్చు.
నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: విశ్వవృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి. దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగపడడు, అంతేకాదు హాని కూడా చేస్తాడు.
………………………………………………………………………..
నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు
బైట కుక్క చేత భంగ పడును
స్థానబల్మిగాని తన బల్మిగాదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమనా! నీళ్ళలో ఉన్న మొసలి చిన్నదైననూ ఏనుగును కూడా నీటిలోకి లాగి చంపగలదు. కానీ ఆ మొసలి తన స్థానమైన నీటి నుంచి బయటకి వచ్చినపుడు కుక్క చేత కూడా ఓడింపబడును. మొసలికి ఆ బలము స్థానము వలన వచ్చినదే కాని తన స్వంత బలము కాదు.
………………………………………………………………………..
వంపుకర్రగాచి వంపు తీర్చగవచ్చు
కొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపగా రాదు.
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: వంకర కర్రను మంటలో వేడి చేసి తిన్నగా చేయవచ్చు, కొండలను పిండి చేయవచ్చు. కఠిన చిత్తుని దయావంతునిగా మార్చలేం. ………………………………………………………………………..
ప్రియములేని విందు పిండివంటల చేటు
భక్తిలేని పూజ పత్రి చేటు
పాత్రమెఱుగనీవిబంగారు చేటురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ప్రేమ లేని అన్న సంతర్పణము నందు పిండివంటకము వ్యర్థము. బంగారము అపాత్రతగల దానిచ్చి సొమ్ములు చేయమంటే బంగారము వన్నె తగ్గును. ఆ రీతిగానే దేవునిపై గురిలేని పూజ పత్రి పరమ వ్యర్థమని అర్థము.
………………………………………………………………………..
పని తొడవులు వేరు బంగారమొక్కటి
పరగ ఘటలు వేరు ప్రాణమొక్కటి
అరయ తిండ్లు వేరు ఆకలి యొక్కటి
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: వృత్తి కళాకారుని పనితనంలో రూపొందే ఆభరణాలు ఎన్నో రకాలు, కానీ దానికి వాడే మూల వస్తువు బంగారం ఒక్కటే. శరీరాలు వేరు వేరు కాని వాటిలో కదలాడే ప్రాణం ఒక్కటే. ఆహారాలు అనేకమైనా వాటిని కోరే ఆకలి మాత్రం ఒక్కటే అని అర్థం.
………………………………………………………………………..
నీచగుణములెల్ల నిర్మూలమైపోవు
కొదవలేదు సుజన గోష్ఠి వలన
గంధ మలద మేనికంపడగినయట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: సుగంధ భరితమైన చందనాన్ని శరీరానికి పూసుకుంటే దేహానికుండే దుర్గంధం ఎలా పోతుందో అలాగే సుజన గోష్ఠి వలన మనలోని చెడు గుణాలన్నీ దూరమైపోతాయి. అందుచేత సదా సజ్జన సాంగత్యాన్నే కోరుకోవాలి అని అర్థం.
………………………………………………………………………..
ఉదధిలోన నీళ్ళు ఉప్పలుగా జేసె
పసిడి గలుగు వాని పిపిన జేసె
బ్రహ్మదేవు సేత పదడైన సేతరా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు. కానీ దానిలోని నీరు తాగటానికి వీలులేకుండా ఉప్పుగా ఉంచాడు. అలాగే ఒక సంపన్నుడిని పుట్టించి పిసినిగొట్టు వానిగా మార్చాడు. బ్రహ్మదేవుడు చేసిన పని బూడిదతో సమానం అని అర్థం.
………………………………………………………………………..
కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు
యుప్పు లవణ మండ్రు యొకటి గాదె?
భాషలింతె వేఱు పరతత్వమొకటే
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: సంస్కృతంలో కుండను కుంభం అంటారు. ఉప్పును లవణం అంటారు. కొండను పర్వతం అంటారు. ఇక్కడ భాష మాత్రమే వేరు కాని అసలు పదార్ధం ఒక్కటే. అలాగే మీరు రామ అనండి, ఏసు అనండి, అల్లా అనండి, నానక్ అనండి. కేవలం పేర్లు మార్పే కాని పరమాత్ముడు ఒక్కడే. భాష వేరైనా భావమొక్కటే. మతాలు వేరైనా మనుష్యులు ఒక్కటే అని అర్థం.
………………………………………………………………………..
పసుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటి
పుష్పజాతి వేరు పూజ ఒకటి
దర్శనంబులారు దైవంబు ఒక్కటె
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మనుష్యులంతా ఒక్కటే. పశువులు వేరువేరు రంగులలో ఉన్నప్పటికీ అవి ఇచ్చే పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి. అలాగే మనుషులు వివిధ వర్ణాల వారైనా మనసులు ఒకటిగా మసలుకోవాలంటాడు వేమన. పూవులు వేరువేరు రంగులతో ఉన్నా పూజకు వినియోగపడటంలో అవన్నీ ఒక్కటే గదా! అని అర్థం.
………………………………………………………………………..
జీవిజంపుటెల్ల శివభక్తి తప్పుటే
జీవునరసి కనుడు శివుడె యగును
జీవుడు శివుడను సిద్ధంబు తెలియరా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ివుడికి, జీవుడికి మధ్య బేధం లేదు. తరచి చూస్తే జీవుడే శివుడు, శివుడే జీవుడు. ఏ జీవినీ హీనంగా చూడరాదు. జీవిని చంపడమంటే శివభక్తి తప్పడమే. జీవహింస మహాపాపం అన్నారు పెద్దలు.
………………………………………………………………………..
ఎరుగ వాని దెలుప నెవ్వడైనను జాలు
నొరుల వశముగాదు ఓగుదెల్ప
యేటివంక దీర్ప నెవ్వరి తరమయా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తెలుసుకోవాలనే జిజ్ఞాసగలవారికి తెలియజెప్పడం అందరికీ సులభమే. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని వాదించటం మూర్ఖుని సహజ లక్షణం. అలాంటి వాడికి తెలియజెప్పటం ఎవరి తరం కాదు. ఏటికుండే ప్రకృతి సిద్ధమైన వంపును సరిచేయటం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే మూర్ఖుడిని కూడా సరిచేయలేము.
………………………………………………………………………..
అసువినాశమైన నానంద సుఖకేళి
సత్యనిష్ఠపరుని సంతరించు
సత్యనిష్ఠజూడ సజ్జన భావంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: సత్యనిష్టాగాపరుడు తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఆనందంగా సిద్ధపడతాడుగానీ, అసత్యమాడటానికి మాత్రం అంగీకరించాడు. అటువంటి సత్యవంతుడే సజ్జనుడు. పూజ్యుడు, చిరస్మరణీయుడు. దీనికి హరిశ్చంద్రుడే తార్కాణం.
………………………………………………………………………..
పగలుడుగ నాసలుడుగును
పగవుడుగం గోర్కెలుడుగు వడిజన్మంబుల్
తగులుడుగు భోగముడిగిన
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: విరోధాలు లేనప్పుడు ఆశలు ఉండవు. విచారం లేకపోతే కోరికలుండవు. సుఖం నశించినపుడు అనురాగం ఉండదు. త్రిగుణాలు నశిస్తేనే ముక్తి కలుగుతుంది.
………………………………………………………………………..
చంపదగినయట్టి శత్రువు తన చేత
చిక్కెనేని కీడు చేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమనా! చంపదగినవాడైననూ శత్రువు తన చేతిలో చిక్కినప్పుడు అతనిని చంపక, హాని చేయక మేలు చేసి పొమ్మనుటే మేలు, అదే అతనికి శిక్ష అగును అని భావం.
………………………………………………………………………..
లోభమోహములను ప్రాభవములు తప్పు
తలచిన పనులెల్ల తప్పి చనును
తానొకటి దలచిన దైవమొండగుచుండు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: లోభం, మొహం ఉండేవారికి గొప్పతనం ఉండదు. అటువంటివారు తలచిన పనులు జరగవు. తానొకటి తలిస్తే దైవమొకటి తలుచుట సామాన్యం అని అర్థం.
………………………………………………………………………..
పనస తొనలకన్న పంచదారలకన్న
జుంటుతేనే కన్న జున్ను కన్న
చెరుకు రసముకన్న చెలుల మాటలె తీపి
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: పనస తొనలు, పంచదార, తేనె, జున్ను వీటన్నింటికంటే యువతుల మాటలే మిక్కిలి మధురంగా ఉంటాయి.
మిరెము గింజ చూడ మీఁద నల్లగనుండు
………………………………………………………………………..
కొఱికి చూడ లోనంజుఱు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మిరియము గింజ పైకి చూచినచో నల్లగా యున్ననూ, కొరికి చూచినచో కారంగా మంటగా ఉండును. ఆ విధంగానే మంచివాడు పైకి చూచుటకు అలంకారములు లేకపోయిననూ, లోపల హృదయమునందు మేధాసంపత్తి నిండియుండును అని భావం

కనగ సొమ్ము లెన్నొ కనకంబదొక్కటి
పసుల వన్నె లెన్నొ పాలొకటియె
పుష్పజాతులెన్నొ పూజయొక్కటె సుమీ
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఆభరణములు వేరైనా బంగారం ఒక్కటే. పశువుల రంగుల వేరైనా పాలు ఒక్కటే. సుగంధభరిత పుష్ప జాతులు వేరైనా చేసే పూజ మాత్రం ఒక్కటే. అలాగే శాస్త్ర పరిజ్ఞానం గల పండితులు వేరైనా జ్ఞానం మాత్రం ఒక్కటే.
………………………………………………………………………………………….
హీనగుణమువాని నిలు సేరనిచ్చిన
ఎంతవానికైన నిడుము గలుగు!
ఈఁగ కడుపు జొచ్చి యిట్టట్టు చేయదా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: చెడ్డవానికి ఆశ్రయమిచ్చి ఇల్లు చేర్చినచో, ఎంతటి వానికైననూ కడుపులో ఈగ, పురుగులు ప్రవేశించి బాధపెట్టు విధంగా ఆపదలు కలుగజేయును అని భావం.
………………………………………………………………………………………….
నిండు నదులు పాఱు నిల్చి గంభీరమై
వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి
అల్పుఁడాఁడు రీతి నధికుండు నాఁడునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమనా! గొప్ప నదులు నిదానంగానూ, గంభీరంగానూ ప్రవహించును. కానీ చిన్న వాగు, అతి వేగంగా గట్లుదాటి పొర్లి ప్రవహించును. అట్లే యోగ్యుడు నిదానంగా, గంభీరంగా మాట్లాడును. నీచుడు వాగుచూ ఉండును.
………………………………………………………………………………………….
విద్యలేనివాడు విధ్వాంసుచేరువ
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం.
………………………………………………………………………………………….


మర్మమెఱుగ లేక మతములు కల్పించి

యుర్విజనులు దుఃఖ మొందుచుంద్రు
గాజుటింటి కుక్క కళవళపడురీతి
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: అద్దాల గదిలో ఉన్న కుక్క దర్పణంలో తన ప్రతిబింబాన్ని చూచి కలతపడి ఏ విధంగా బాధపడుతుందో, అలాగే మూఢ జనులు ఆత్మతత్వం తెలుసుకోలేక, విభిన్న మతాలను కల్పించి, మతమౌడ్యంలో చిక్కుకుని, ఒకరినొకరు ద్వేషించుకొనుచూ, దుఃఖంతో కాలం గడుపుతున్నారు. నిజానికి పరబ్రహ్మం ఒక్కటే అని గుర్తించలేని అజ్ఞాన స్థితిలో ఉన్నారు.
………………………………………………………………………………………….
నేరనన్నవాఁడె నేర్పరి మహిలోన
నేర్తునన్నవాఁడు నిందఁజెందు
ఊరకున్నవాఁడె యుత్తమ యోగిరా!
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తెలివిగలవాడు తనకేమియు తెలియదు. అని నిదానముగా మాట్లాడును. తెలియునన్నచో వాదించెదరు. అపకీర్తి రావచ్చును గాన తెలివిగలవాడు ఋషివలె మౌనంగా నుండును. తెలివి తక్కువవాడు అన్నియు తెలిసినట్లు నటనచేయుచూ చివరకు అపనిందను పొందగలడు.
………………………………………………………………………………………….
పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న నెంచ గుణపు ప్రధానంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమనా! దేవుని పూజలకంటే నిశ్చలమైన బుద్ధి ఉండుట మంచిది. మాటలు చెప్పుట కంటే నిశ్చలమైన మనస్సు కల్గియుండుట మంచిది. వంశము యొక్క గొప్పతనం కంటే వ్యక్తి యొక్క మంచితనం ముఖ్యము.
………………………………………………………………………………………….


కానివానితోడ గలసి మెలఁగుచున్నఁ
గానివానిగానె కాంతు రవనిఁ
దాటి క్రిందఁబాలు త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: గ ౌరవం లేని వారితో కలిసి తిరుగుచున్నచో ఆ వ్యక్తిని అందరూ గౌరవము లేని వానిగానే భావిస్తారు. ఎట్లనగా తాటి చెట్టు క్రింద కూర్చొని ఓ వ్యక్తి పాలు తాగుచున్ననూ, అతడు తాగుచున్నది పాలు అనికాక కల్లు త్రాగుచున్నారని భావించగలరు గదా! అని అర్థం.
………………………………………………………………………………………….
పరనారీ సోదరుడై
పరధనముల కాసపడక! పరహితచారై
పరు లలిగిన తా నలగక
పరులెన్నగ బ్రతుకువాడు! ప్రాజ్ఞుఁడు వేమా!
తాత్పర్యం: తోటి స్త్రీలను తన సొదరిలుగా భావించి, పరుల ధనమును సేకరించుట మానివేసి, ఇతరుల కోపించినను తాను కోపించుకొనక, ఇతరులచే కీర్తింపబడుతూ జీవన విధానమును చేయవలెను అని భావం.
………………………………………………………………………………………….
అల్పజాతి వాని కధికార మిచ్చిన
దొడ్డవారి నెల్ల దోలి తిరుగుఁ
జెప్పు దినెడి కుక్క చెఱకు తీపెఱుగునా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: అల్పబుద్ది వానికి అధికారము కట్టబెట్టినచో మంచివారిని వెళ్ళగొట్టును, మరియు అవమానములు పెట్టగలడు. ఏలనగా చెప్పులు తిను కుక్క చెఱకు తీపి యేమి తెలియును. అట్లే మంచి గుణములు వానికి ఉండవని భావము.
………………………………………………………………………………………….
నీళ్ళ మీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు
బైట మూరెడైనఁబాఱలేదు
నెలవు తప్పుచోట నేర్పరి కొరగాఁడు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: పడవ నీటియందు చక్కగా నడుచును. భూమి మీద మూరెడైననూ పోజాలదు. అట్టే స్థానబలము లేకున్నచో బుద్ధిమంతుడైననూ మంచిని గ్రహింపలేరు.
………………………………………………………………………………………….
అల్పుడైనవాని కధిక భాగ్యము గల్గ
దొడ్దవారిఁదిట్టి తొలఁగ గొట్టు
అల్పజాతి మొప్పె యధికుల నెఱఁగునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: అల్పబుద్ధివానికి సంపద కలిగినచో మంచివారిని తిట్టి అవమానించును. నీచ్యకులమున పుట్టినవాడు మంచివారిని తెలుసుకొనలేడు.
………………………………………………………………………………………….
కులములో నొకండు గుణవంతుడుండిన
కులము నెలయువాని గుణముచేత
వెలయు వనములోన మలయజం బున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమనా! అడవిలో ఒక మంచి గంధపు చెట్టున్నను ఆ అడివి అంతటినీ తన సుగంధము వ్యాపింపజేయును. అట్లే వంశములో ఒక్కడు ఉత్తముడు ఉన్ననూ వాని గుణముల చేత ఆ వంశమంతయు మంచిపేరు పొందును.
………………………………………………………………………………………….
పందిపిల్ల లీను పదియు నైదింటిని
కుంజరంబు లీను కొదమ నొకటి
యుత్తమ పురుషుండు యొక్కడు చాలడా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: పంది ఒక్కసారే పదునైదు పిల్లలను కనును. కాని గొప్పదైన ఏనుగు ఒక పిల్లనే కనును. కాబట్టి పెక్కు సంతానమున కంటే గుణవంతుడగు ఒకడు మేలు అని అర్థము.
………………………………………………………………………………………….
ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన
మాట దెలిసి నడచు మర్మమెఱిగి
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: బండి లాగే ఎద్దుకైననూ ఒక సంవత్సరం తర్ఫీదు ఇస్తే మాటలు గ్రహించి నడుచుకొనును. మూఢుడికి మాత్రం ముప్పై ఏండ్లకైనా బుద్ధి నేర్వలేడు. మూఢత్వమును మార్చుకోలేడు సుమా!
………………………………………………………………………………………….
పాలు పంచదార పాపర పండ్లలోఁ
జాల బోసి వండఁ జవికిరాదు
కుటిల మానవులకు గుణమేల కల్గురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: చేదుగల పండ్లలో పాలు, పంచదార పోసి వంటకం చేసిననూ ఆ పండ్లకు గల చేదు గుణములెట్లు ఉండునో, అలానే మంచి గుణములు ఎన్ని ప్రభోధించిననూ కుటిలుడు దుర్గుణములను వీడడని భావము.
………………………………………………………………………………………….
పట్టు పట్టరాదు పట్టు విడవరాదు
పట్టెనేని బిగియ బట్టవలయు
బట్టి విడుటకన్నఁబరగఁజచ్చుట మేలు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: కార్యమునకు ముందు పట్టుదల చేయరాదు. పట్టుదల పట్టిన తర్వాత కార్యాన్ని వదలరాదు. పట్టుదల పట్టి విడుచుట కన్నా చచ్చుట మంచిది. చదువు జదువకున్న సౌఖ్యంబులును లేవు
………………………………………………………………………………………….
చదువు జదివెనేని సరసుడగును
చదువు మర్మమెరిగి చదువగ చూడుము
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: చదువు లేనివారికి సౌఖ్యం లభించదు. చదువుకున్నవాడే సజ్జనుడు. చదువుకోవాలనే అభిలాష కలవాడు విద్యలలోని సారాన్ని, మర్మాన్ని గ్రహించడానికి చదవలిగాని వృధా పఠనమువలన ప్రయోజనం లేదు అని భావం.
………………………………………………………………………………………….
కులములేనివాఁడు కలిమిచే వెలయును
గలిమిలేనివాఁడు కులము దిగును
కులముకన్న భువిని గలిమి ఎక్కవసుమీ
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: కులము తక్కువ వాడు సంపదచే కీర్తి పొందును. భాగ్యము లేనివాడు కులముతో పొత్తు పెట్టుకోడు. జీవన విధానము చూచును. అందుచే కులము కంటే సంపద ముఖ్యము అని భావం.
………………………………………………………………………………………….
కులము గలుగువాడు గోత్రంబు గలవాడు
విద్య చేత విఱ్ఱవీగువాఁడు
పసిడిగల్గువాని బానిస కొడుకులు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మంచి కులముగల వాడునూ, మంచి గోత్రము కలవాడునూ, విద్యచేత గర్వించువాడునూ ముగ్గురూ సంపద గలవానిని చూచి ఆశ్రయిస్తారు. ఆతిథ్యము పొందుతారు. వానికి బానిసగా ఉంటారని భావం.
………………………………………………………………………………………….
నీళ్ళలోని మీను నెఱిమాంస మాశించి
గాలమందు జిక్కుకరణి భువిని
ఆశ దగిలి నరుడు నాలాగె చెడిపోవు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: నీటియందలి చేప మాంసమును ఆశించి గాలమునకు చిక్కుకున్నట్లు, భూమియందు ఆశతో నరుడు చేపవలె జీవించి నశించును అని భావం. ………………………………………………………………………………………….
త్రాడు పామటంచు దాజూచి భయపడు
దెలిసి త్రాడటన్న దీరు భయము
భయము తీరినపుడె బ్రహ్మంబు తానగు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: త్రాడును పాముగా బ్రమించి భయపడతాడు మానవుడు. అది పాము కాదు, త్రాడు అన్న నిజాన్ని తెలుసుకున్న క్షణంలో భయం తొలగి పోతుంది. భయం తొలగితే ఆనందం కలుగుతుంది. రజ్జుసర్ప భ్రాంతి వంటిదే సంసారం. సంసారం భ్రాంతి అనే సత్యాన్ని గుర్తించినవాడు తానే బ్రహ్మ అవుతాడు. అందుకే “ఆనందో బ్రహ్మ” అని అన్నారు.
………………………………………………………………………………………….
మేఁక కుతిక పట్టి మెడచన్ను గుడవగా
ఆక లేల మాను నాశగాక
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మేక యొక్క మెడచన్ను పట్టుకొని కుడిచినచో ఆకలి తీరదు. పాలు లభించవు. అట్లే లోభివానిని అడిగి ప్రయోజనము లేదని గ్రహించాలి. ఏమి గొంచువచ్చె నేమి తాఁగొనిపోవు
………………………………………………………………………………………….
బుట్టువేళ నరుఁడు గిట్టువేళ
ధనము లెచట కేఁగు దానెచ్చటికి నేగు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మనుజుడు పుట్టుకతో ఏమి తీసుకురాడు, చచ్చినచో ఏమీ తీసుకుపోడు. అట్లే ఈ సంపదలు ఎక్కడికీ పోవు. తానేక్కడికీ పోడు అని తెలుసుకోలేడు అని భావం.

పెట్టిపోయలేని వట్టి నరుడు భూమి
బుట్టనేమి వారు గిట్టనేమి
పుట్టలోనఁజెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: దానధర్మములు ఏ మాత్రము చేయునట్టి మనుజుడు పుట్టినా, గిట్టినా ప్రయోజనం లేదు. ఎలాగంటే చదల పురుగులు పుట్టుటలేదా? చచ్చుట లేదా? ఆ విధంగానే ఉండును అని భావం.
…………………………………………………………………………………………
బహుళ కావ్యములను పరికింపగా వచ్చు
బహుళ శబ్దచయము బలుకవచ్చు
సహనమొక్కటబ్బ చాలా కష్టంబురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: చాలా కావ్యాలను చదువవచ్చును. అనేక మాటలు నేర్పవచ్చును, కానీ ఓర్పును అలవరచుకోవడం చాలా కష్టం అని భావం.
…………………………………………………………………………………………
ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు
తిరుగుచుంద్రు భ్రమము ద్రిప్పలేక
మురికి భాండమందు ముసురు నీఁగల భంగి
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: జనులు ఆశచే ఆయుర్దాయము ఉన్నంతవరకు కోరికలను విడువలేక తిరిగుచుందురు. ఎలాగనగా దుర్వాసనగల కుండ యందు ముసురు ఈగలవలె తిరుగుచుందురు కదా అని అర్థం.
…………………………………………………………………………………………
తనువ దెవరిసొమ్ము తనదని పోషింప
ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనఁగ
బ్రాణ మెవరి సొమ్ము పారిపోకను నిల్వ
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఈ శరీరం ఎవరి సొత్తూ కాదు, ఈ ధనము ఎవరిదీ కాదు, ప్రాణము పోకుండా ఎవరూ ఉండరు. ఇదంతా ప్రకృతి సహజమని గ్రహించవలెను అని భావం.
…………………………………………………………………………………………
ఆశ కోసి వేసి యనలంబు చల్లార్చి
గోఁచి బిగియగట్టి గుట్టు దెలిసి
నిలిచి నట్టివాఁడె నెఱియోగి యెందైన
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఆశను కోసి, అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియ కట్టి, ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. వాడినే యోగి అందురు.
…………………………………………………………………………………………


ఇమ్ము దప్పువేళ నెమ్మిలెన్నియు మాని
కాల మొక్కరీతి కడపవలయు
విజయుఁడిమ్ము దప్పి విరటుని కొల్వఁడా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: పంచ పాండవులందు గల అర్జునుడు విరటుని కొల్వుయందు ఉన్నాడు కదా! అట్లే స్థానము దప్పినపుడు విషయ వాంఛను, దిగులును, విడచి కాలమును గడుపవలెను. జీవన మార్గమును అన్వేషించి బ్రతుకుట మంచిది అని భావం.
…………………………………………………………………………………………
చచ్చిపడిన పశువు చర్మంబు కండలు
పట్టి పెఱిగి తినును పరగ గ్రద్ద
గ్రద్ద వంటివాడు జగపతి కాడొకో
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: గ్రద్ద చచ్చిపడియున్న పశువు చర్మమును తినును. అట్లే రాజులునూ గ్రద్ద లాంటివారే కదా! అని భావం.
…………………………………………………………………………………………
ఎరుకలేని దొరల నెన్నాళ్ళు గొలిచిన
బ్రతుకలేదు వట్టి భ్రాంతికాని
గొడ్డుటావు పాలు గోరితే చేపునా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఎండిపోయిన ఆవును పాలు ఇవ్వమంటే ఏ విధంగా ఇవ్వదో, అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంత కాలము చేసినా వ్యర్థమే కదా! అని భావం.
…………………………………………………………………………………………
ఐదు వేళ్ళ బలిమి హస్తంబు పని చేయును
నందొకటియు వీడ బొందిక చెడు
స్వీయుడొకడు విడిన జెడుగదా పని బల్మి
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: చేతికి ఐదు వేళ్ళూ ఉన్నపుడే నువ్వు చేయదలచిన పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలవు. ఆ ఐదింటిలో ఏ ఒక్కవేలు లోపించినా ఆ హస్తం ఎందుకూ కొరకరాదు. అలాగే మనలను ప్రాణ సమానంగా భావించి ప్రేమించే ఆప్తుడు ఒక్కడు వీడినా కార్యహాని జరగడమే కాకుండా జీవితంలో అభివృద్ధి సాధించటం కూడా చాలా కష్టం అవుతుంది.
…………………………………………………………………………………………
పూర్వజన్మమందు పుణ్యంబు చేయని
పాపి తా ధనంబు బడయలేడు
విత్తమరచి కోయ వెదకిన చందంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: పూర్వజన్మలో ఒక్క పుణ్య కార్యం కూడా చేయకుండా, ఈ జన్మలో ధన, ధాన్యాలతో తుల తూగాలని, స్వర్ణ సుఖాలు అనుభవించాలి అని కోరుకున్నంత మాత్రాన లభించవు. విత్తనమే నాటకుండా పంటకు ఆశ పడడం ఎంత అజ్ఞానమో, పుణ్య కార్యాలు ఆచరించకుండా సుఖ భోగాలను, అష్టైశ్వర్యాలను కోరుకోవటం కూడా అజ్ఞానమే అని భావం.
…………………………………………………………………………………………
గొడ్డుటావు బితుక గుండ గొంపోయిన
బండ్ల నూడ దన్ను పాల నీదు
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: గొడ్డుటావు దగ్గరకి కుండని తీసుకునిపోయి ప్రయత్నిస్తే పళ్ళు రాలేలా తంతుందే గాని పాలనివ్వదు. అదే విధంగా పిసినిగొట్టు వానిని ఎంత ప్రాధేయపడినా నోరు నొప్పి పుడుతుందే కాని పైసా కూడా వాని నుంచి పొందలేము అని అర్థం.
…………………………………………………………………………………………
అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను
గలను గాంచు లక్ష్మిఁగనుటలేదు
ఇలను భోగభాగ్యమీతీరు గాదొకో
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: సముద్రపు అలలందు బుడగ ఏ విధంగా పుట్టుచూ గిట్టుచూ ఉండునో, అలాగే ఎల్లప్పుడూ భోగభాగ్యములుండవు. ఒకదాని తర్వాత ఒకటి అనుభవించవలసివచ్చుచుండును అని అర్థం.
…………………………………………………………………………………………
కోతినొనరదెచ్చి కొత్తపట్టముగట్టి
కొండముచ్చు లెల్ల గొలిచినట్లు
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: జ్ఞానములేని వానిని తెచ్చి రాజుని చేసిన వాని వద్ద అటువంటివారే మనగలరు. ఎలాగనగా, కోతిని తెచ్చి రాజ్యాభిషేకమును చేసిన కొండముచ్చు లెల్ల వానిని కొలిచినట్లు ఉండును అని భావం.
…………………………………………………………………………………………
ఒకనిఁజెఱిచెదమని యుల్లమం దెంతురు
తమదు చే టెరుఁగరు ధరను నరులు
తమ్ము జెఱుచువాఁడు దైవంబుగాడొకో
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: కొందరు దుర్మార్గులు మంచివారికి ఆపదలను కలిగిస్తారు. కాని ఆ దుర్మార్గులను శిక్షించి మంచివారిని దేవుడు రక్షిస్తాడని భావం.
…………………………………………………………………………………………
భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దానహీను జూచి ధనము నవ్వు
కదన భీతుఁజూచి కాలుడు నవ్వును
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు అన్న సంగతి తెలుసుకోలేక ఈ భూమి నాది అని అంటే భూమి ఫక్కున నవ్వుతుంది. పోయేటప్పుడు తన వెంట చిల్లి కాసు కూడా వెంట రాదనీ తెలిసి కూడా దాన గుణం లేని లోభివానిని చూసి ధనం నవ్వుతుంది. ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో చావు తప్పదని తెలిసి కూడా యుద్ధం అంటే భయపడి పారిపోయే వానిని చూచి మృత్యువు నవ్వుతుంది.
…………………………………………………………………………………………
కల్లలాడువాని గ్రామకర్త యెఱుంగు
నీరు పళ్ళ మెఱుగు నిజముగాను
దల్లి తానెరుగును దనయుని జన్మంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మనుజుడు ఆడే అబద్ధములు, నిజాములు ఈశ్వరునకు తెలుసును. నీరు పల్లపు ప్రదేశమునకే పోవును. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలుస్తుందని భావం.
…………………………………………………………………………………………
మైలకోక తోడ మాసిన తలతోడ
ఒడలు ముఱికి తోడ నుండెనేని
అగ్రకులజు డైన నట్టిట్టు పిల్వరు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మురికిబట్టలతో గానీ, మాసిన శిరస్సుతో కానీ, శరీరమునందు దుర్గంధముతో గాని ఉన్నచో అగ్రకులజుడైననూ పంక్తి వద్దకు ఆహ్వానించరు, గౌరవముగా చూడరు అని భావం.
…………………………………………………………………………………………
తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనుల కెల్లా నుండు దప్పు
తప్పులెన్నువారు తమ తప్పు లెఱుగరు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఎదుటివారు తప్పులను లెక్కించువారు అనేకులు ఉందురు. తన యొక్క తప్పులను తెలుసుకొనువారు కొందరే యందురు. ఇతరుల తప్పులెన్నువారు తమ తప్పులను తెలుసుకోలేరు అని భావం.
…………………………………………………………………………………………
తనకుగఁల్గు పెక్కు తప్పులు నుండఁగా
ఓగు నేర మెంచు నొరులఁగాంచి
చక్కిలంబుఁగాంచి జంతిక నగినట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా, వాడు ఇతరులను తప్పులను లెక్కించుచూ ఉండును. చక్కిలమును చూచి జంతిక నవ్వినట్లు ఉండునని భావం.

విడువ ముడువ లేక కుడువగట్టగలేక
వెరపులేక విద్యవిధము లేక
వెడలలేనివాని నడపీను గనరొకో
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: సమయం సందర్భాలకూ తగినట్టుగా పట్టువిడుపులు ప్రదర్శించలేని అలౌక్యుడూ, ధనం సంపాదించి కూడా ఆప్తులను ఆదుకోలేనివాడు, లోకానికి మంచి చెడ్డలకు భయపడనివాడు, విద్యాహీనుడు, నలుగురిలో కలిసి మెలిసి మెలగనివాడు, క్రమ పద్ధతి లేనివాడు నడిచే శవంగా పరిగణించబడతాడు.
…………………………………………………………………………………………
వాన రాకడయును బ్రాణంబు పోకడ
కానఁబడ దదెంత ఘనునికైన
గానఁబడిన మీఁద గలియెట్లు నడుచురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: వర్షము వచ్చుట, ప్రాణము పోవుట యే మనుజునకైనా తెలియదు. అది తెలిసినచో కలికాలము ముందుకు నడవదు అని భావం. …………………………………………………………………………………………
కానివాని చేతఁగాసు వీసంబిచ్చి
వెంటఁదిరుగువాఁడె వెఱ్ఱివాఁడు
పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: హీనునకు వడ్డీ కొరకు డబ్బునిచ్చి వసూలు చేయుటకు వాని వెంట తిరుగువాడు వెర్రివాడు. పిలిచే తినబడిన కోడి పలుకరించితే పలుకదు కదా అని భావం. వాన కురియకున్న వచ్చును కక్షామంబు
…………………………………………………………………………………………
వాన గురిసెనేని వఱద పాఱు
వఱద కఱవు రెండు వరుసతో నెఱుగుడి
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ప్రకృతి యందు వర్షము లేకున్నా దేశమునకు కరువు కాటకములు వచ్చును, మరియు వర్షములున్నచో వరదలు వచ్చును. రెండు వెంట వెంట వచ్చుట సహజమే కదా అని భావం.
…………………………………………………………………………………………


ఆలి మాటలు విని అన్నదమ్ములఁబాసి
వేఱె పోవువాఁడు వెఱ్ఱివాడు
కుక్క తోకఁబట్టి గోదావరీదునా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తన భార్య మాటలు విని ప్రత్యేక కాపురము పెట్టువాడు వెర్రివాడు. ఎట్లనగా కుక్కతోక పట్టుకొని గోదావరి నది దాటుత అసాధ్యము కదా! కనుక భార్యం మాట విని ఆలోచించి కాపురము పెట్టాలని భావము.
…………………………………………………………………………………………
మాటలాడ నేర్చి మనసు రంజిల జేసి
పరగ ప్రియము జెప్పి బడలకున్న
నొకరి చేతి సొమ్ములూరక వచ్చునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మంచి మాటలు పలికి, మనసును రంజింపజేసి, ప్రియంగా హితవులు చెప్పి ఇతరులకు ఆనందం కలుగ చేసినపుడే వారి నుంచి ధనాన్ని పొందగలుగుతాము. కనుక సుమధుర, సరస సంభాషణ అన్ని వేళలా లాభదాయకం అని తెలుసుకోండి.
…………………………………………………………………………………………
తనువులోని యాత్మ తత్వ మెఱుంగక
వేరె కలడటంచు వెదుక డెపుడు
భానుడుండ దివ్వె పట్టుక వెదుకునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: “దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః” అన్నారు ఆర్యులు. దేహంలోనే దేవుడున్నాడని గ్రహించిన విద్వాంసులు తమలోనే ఆత్మస్వరూపాన్ని చూస్తారేగానీ వేరొక చోట వెతకరు. కోటి ప్రభలలో సూర్యుడు ప్రకాశించుచుండగా గుడ్డిదీపంతో వస్తువులను అన్వేషించడం అజ్ఞానం కదా! అని భావం.
…………………………………………………………………………………………
కలుష మానసులకు గాన్పింపగారాదు
అడుసులోన భానుడడగినట్టు
తేటనీరు పుణ్యదేహమట్లుండురా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: బురదలో సూర్యుని ప్రతిబింబం ఏ విధంగా కనపడదో, అలాగే పాప చిత్తులకు జ్ఞానం కనిపించదు. నిర్మలమైన తేటనీటిలో సూర్యుని ప్రతిబింబం ఎలా ప్రకాశవంతంగా కనిపిస్తుందో అలాగే పరిశుద్ధమైన మనస్సుగల పుణ్యాత్ములకు మాత్రమే జ్ఞానం గోచరిస్తుంది అని అర్థం.
…………………………………………………………………………………………
ఇచ్చువాని యొద్ద నీయని వాఁడున్న
జచ్చుగాని యీవి సాగనీఁడు
కల్పతరువు క్రింద గచ్చ పొదున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: దానము చేయువాని వద్ద లోభియగు బంట్రోతు ఉన్నచో దానములు ఇవ్వనీయడు. కీర్తి తీసుకురానివ్వడు. ఎలాగనగా కోరికలు ఇచ్చు కల్పవృక్షం క్రింద ముళ్ళపొద ఉంటే ఆ వృక్షసమీపమునకు రానివ్వదు కదా! ధర్మాత్ముని వద్ద కూడా లోభి ఉంటే అలాగే జరుగుతుందని భావం.
…………………………………………………………………………………………
ఎన్ని చోట్ల తిరిగి యేపాట్లు పడినను
అంటనియ్యక శని వెంటఁదిరుగు
భూమి క్రొత్తలైన భుక్తులు క్రొత్తలా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఎన్ని స్థలములు తిరిగిననూ, ఎన్ని కష్టములు పడిననూ, ఏమి యును పొందనీయక శని వెన్నంటుచూ తిరుగుచుండును. మునుపు శివుని వెంబడించి బాధలు పెట్టెను కదా! అలాగే భూమి కొత్తదైనచో జ్యోతిషభుక్తి కొత్తది కాదు కదా! అని భావం.
…………………………………………………………………………………………
హీను డెన్ని విద్య లిల నభ్యసించిన
ఘనుడుగాడు మొఱకు జనుడెగాని
పరిమళములు గర్దభము మోయ ఘనమౌనె
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఎంతటి ఉన్నత విద్యావంతుడైనా, బహు గ్రంథ పారంగతుడైన మూర్ఖుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. సుగంధ పరిమళ ద్రవ్యాలను మోసినంత మాత్రాన గాడిద గొప్పదవదు కదా! గాడిద గాడిదే, మూర్ఖుడు మూర్ఖుడే, మార్పు రాదు అని భావం.
…………………………………………………………………………………………
ఉన్నఘనతబట్టి మన్నింతురే కాని
పిన్న, పెద్దతనము నెన్నబోరు
వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మనిషి ఎన్ని గొప్ప గుణాలు కలిగి ఉంటే సంఘంలో అంత గొప్పగా గౌరవించబడతాడు. గొప్పతనానికి వయస్సుతో నిమిత్తం లేదు. వాసుదేవుడైన శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వాసుదేవుని కంటే ఎక్కువగా గౌరవించి పూజింపబడుతున్నాడంటే దానికి అతని గొప్ప గుణాలే కారణం.
…………………………………………………………………………………………
కర్మ మధికమైన గడచి పోవగరాదు
ధర్మరాజు దెచ్చి తగని చోట
గంకుభట్టుఁజేసెఁగటకటా దైవంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: కర్మమును ఎవ్వరూ దాటజాలరు. దైవము రాజగు ధర్మరాజుని విరాట రాజువద్ద కంకుభట్టు వేషమును ధరింపజేశారు. అలాగే విధి బలవత్తరమని గ్రహించుము అని భావం.
…………………………………………………………………………………………
మగని కాలమందు మగువ కష్టించిన
సుతుల కాలమందు సుఖమునందు
కలిమి లేమి రెండు గల వెంతవారికి
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఆడది భర్త ఉన్నపుడు కష్టపడినచో కొడుకుల కాలంలో సుఖమును పొందును. సంపద, దారిద్ర్యములు రెండునూ ఎంతవారైననూ అనుభవించవలసిందే కదా! అని భావం.
…………………………………………………………………………………………
చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయె
నీటిబడ్డ చినుకు నీటఁగలిసె
బ్రాప్తిగల్గు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: స్వాతి కార్తె యందు వర్షపు బిందు చిప్పయందు పడినచో ముత్తెమగును. నీటియందు పడినచో నీటిలో కలిసిపోవును, కనుక ప్రాప్తి ఉన్నచో అదృష్టము ఎక్కడికీ పోదని భావం.
…………………………………………………………………………………………
బక్కకుక్కకఱచి బాధ చేయు
బలిమి లేని వేళఁబంతంబు చెల్లదు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: బలము తగ్గి యున్నచో సింహమునైననూ బక్కకుక్క కరచును. ఆ విధంగానే బలము లేనపుడు పంతము చెల్లనేరదు అని భావం.

%d bloggers like this: