రుద్రమదేవి

Rudrama Devi

రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక మణిగా వెలిగిన మహారాణి కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేనందువలన రుద్రాంబకు రుద్రదేవుడని పేరుపెట్టి యుద్ధవిద్యలు, గుర్రస్వారీ నేర్పుతాడు. తర్వాత రుద్రాంబను తూర్పు చాళుక్యరాజు నిడవద్యపురం (నేటి నిడదవోలు) పాలకుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు కలుగుతారు.

తన తండ్రి గణపతిదేవుని తరువాత 1262 లో రుద్రమదేవి ‘ రుద్రమహారాజు ‘ బిరుదంతో కాకతీయ మహాసామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించింది. అయితే ఒక మహిళ పాలకురాలు కావటం ఓర్వలేని అనేకమంది సామంతులు తిరుగుబాటు చేసారు. కానీ రుద్రమదేవిని అభిమానించే గోనగన్నారెడ్డి, రేచర్ల ప్రసాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, బెండపూడి ఈమెకు బాసటగా నిలుస్తారు.

అదేసమయంలో నెల్లూరు పాండ్యుల కింద, వేంగి ప్రాంతం గొంకరాజు మొదటి నరసింహుడు ఆక్రమిస్తారు… పాకనాటి కాయస్థ అంబదేవుడు, కళింగ నరసింహుని కుమారుడు వీరభానుడు తిరుగుబాట్లు చేస్తారు. రుద్రమ తన సేనానులతో కలిసి ఈ తిరుగుబాట్లనన్నిటినీ విజయవంతంగా అణచివేస్తుంది. రుద్రమాంబ ఎదుర్కొన్న దండయాత్రలన్నిటిలోకీ దేవగిరి యాదవరాజుల దండయాత్ర అతి పెద్దది, కీలకమైనది. దేవగిరి యాదవ మహాదేవుడు ఎనిమిది లక్షల మహాసైన్యంతో రుద్రమపైకి యుద్దానికి వస్తాడు. మహదేవునిపై పదిరోజులకు పైగా జరిగిన భీకర పోరాటంలో రుద్రమ ప్రత్యక్షంగా పాల్గొన్నది. తన అపార శక్తి సామర్థ్యాలతో అపర భద్రకాళిలా విజృంభించింది. ఆమె తన చిరకాల ప్రత్యర్థి మహదేవుడ్ని ఆ యుద్ధంలో మట్టికరిపించి మూడు కోట్ల బంగారు వరహాలను పరిహారంగా గ్రహించింది. శత్రువును ఆర్థికంగా చావు దెబ్బకొట్టి మళ్లీ తలెత్తకుండా చేసింది.

రుద్రమదేవికి గురువు విశ్వేశ్వర శివశంబు. గణపతి దేవునికి, రెండవ ప్రతాపరుద్రునికి కూడా ఈయనే గురువు. రుద్రమదేవి పాలనలో అప్పటి ప్రధాన రంగమైన వ్యవసాయం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లింది. సాగునీటి కొరత లేకుండా సువిశాలమైన చెరువులు తవ్వించారు.తెలంగాణలో ఇప్పుడు ఉన్న గొలుసు కట్టూ చెరువుల విధానం ప్రపంచం మొత్తం తిరిగి చూసిన మరెక్కడ కనిపించని శాస్త్రీయవిధానం రాణి రుద్రమ దేవి స్థాపించిన వ్యవస్ధా విధానం 800 సం.లు దాటినా తెలంగాణలో రైతులకు వ్యవసాయానికి ప్రదాన మూలాధారాం. ప్రతి గ్రామానికీ ఊట చెరువులు మరియు కుంటలు త్రవ్యించారు. లక్నవరం, పాకాల, రామప్ప లాంటి పెద్ద పెద్ద జలాశయాలు … కాకతీయుల పరిపాలనదక్షతకు నిదర్శనం.వారి కాలంలో వ్యవసాయంతో పాటు వాణిజ్యం విస్తరించింది. విరాజిల్లింది. భరతనాట్యం, కూచిపూడి వంటి సంప్రదాయ నృత్యాలకు దీటైన పేరిణీ శివతాండవమనే నూతన నృత్య విధానం పురుడుపోసుకుంది రుద్రమ కాలంలోనే. కాకతీయుల సైన్యాధిపతి అయిన జాయప సేనాని పేరిణీ నృత్య సృష్టికర్త. రుద్రమదేవి కాలంలో సంగీతం, సాహిత్యం, శిల్ప కళ, నృత్యం కలగలిసిపోయి విరాజిల్లాయి.

అనేకసార్లు ఓటమి పాలైన సామంతరాజు అంబదేవుడు రుద్రమదేవిపై కక్షగట్టాడు. రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను సమీకరించాడు. అదునుకోసం చూస్తున్న అంబదేవుడికి సమయం కలిసి వచ్చింది. రుద్రమ రాజ్యంపైకి పాండ్యులు, చోళులు, ఇతర సామంతులు ముప్పేట దాడికి దిగారు. రుద్రమకు అండగా నిలవాల్సిన తమ సేనలను రుద్రమపైకి ఎక్కుపెట్టాడు. అంబదేవుడి కుట్ర తెలుసుకున్న రుద్రమ అపర భద్రకాళి అయి కత్తిపట్టి కదన రంగాన దూకింది. అప్పటికి ఆమె వయస్సు ఎనభై ఏళ్లు. ఇరు పక్షాల మధ్య దాదాపు రెండు వారాలకు పైగా భీకర పోరాటం సాగింది. ఆ వయసులోనూ రుద్రమను అంబదేవుడు ఓడించలేకపోయాడు. యుద్ధంలో రుద్రమను నేరుగా ఎదుర్కోలేక కపట మాయోపాయం పన్నాడు. ఆ రోజు రాత్రియుద్ధ క్షేత్రానికి సమీపంలోని గుడారంలో కార్తీక సోమవారం సందర్భంగా పరమ భక్తురాలైన రుద్రమ ప్రత్యేక పూజల్లో నిమగ్నమై ఉంది. పూజారుల స్థానంలో తమ వాళ్లను పంపిన అంబదేవుడు తన దుష్టపథకాన్ని అమలు చేశాడు. పూజలో ఉన్న రుద్రమను అంబదేవుడి మనుషులు వెనుక నుంచి పొడిచారని చరిత్రకారులు చెబుతారు.

కాకతీయ సామ్రాజ్యానికే వన్నెతెచ్చిన వీర ధీరనారి ఆమె. శత్రువుకు ఎదురొడ్డి నిలిచి.. రాజ్యాన్ని పాలించింది. గొప్ప పరిపాలనాధ్యక్షురాలిగా.. కీర్తికెక్కిన మహిళామణి. ఆమే కాకతీయ సామ్రాజ్యాన్ని దశదిశలా విస్తరింపజేసిన రాణీ రుద్రమదేవి. అయితే రుద్రమదేవి చర్రిత అందరికి తెలిసినప్పటికీ.. ఆమె జీవిత చరమాంకానికి సంబంధించిన విషయాలు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ వివరాలు తెలియాలంటే నల్లగొండ జిల్లా చందుపట్లకు వెళ్ళాల్సిందే.

Chandupatla (నల్గొండ) శాసనం ఆధారంగా కాయస్త అంబదేవునితో జరిగిన యుద్ధాలలోనే మరణించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. చందుపట్లలో ఈ శాసనాన్ని ఇప్పటికి కూడా చూడవచ్చు.
రుద్రమదేవికి గల ఇతర బిరుదులు: రాయగజకేసరి, ఘటోదృతి

%d bloggers like this: