పోల్కాడాట్

చూడచక్కని పోల్కాడాట్

చూడచక్కని పోల్కాడాట్ గులాబీ, ఎరుపు లేదా తెలుపు మచ్చలూ, చుక్కలతో కూడిన చిత్రపటం లాంటి ఆకులు దీని సొంతం. అందుకే దీన్ని పోల్కాడాట్ అని పిలుస్తుంటారు.
పోల్కాడాట్ శాస్త్రీయనామం హైపోస్టెస్ ఫైలోస్టాకియా. ఇది ఏకవార్షికం. ఆరు అంగుళాల నుంచి అడుగున్నర ఎత్తువరకూ పెరిగే ఈ సుకుమారమైన ముచ్చటైన మొక్క కొద్దిపాటి నీడలో చక్కగా పెరుగుతుంది. అయినా ప్రకాశవంతమైన వెలుతురు మాత్రం తప్పనిసరి. పోల్కాడాట్ కు గాలిలోనూ, నేలలోనూ తేమ ఎక్కువగా ఉండాలి. మట్టి మిశ్రమం నీరు నిలవనిదై ఉండాలి. తరచూ మొక్కల చుట్టూ నీటిని పిచికారీ చేస్తూ ఉంటే ఆ తేమకు అవి నవనవలాడుతూ ఉంటాయి.
మొదట్లో పోల్కాడాట్ అంటే ముదురాకుపచ్చ మీద ప్రకాశవంతమైన గులాబీ రంగు చుక్కలతో మాత్రమే ఉండేది. ఇప్పుడు అనేక రంగుల చుక్కలతో మచ్చలతో ఇంకా ఆకర్షణీయమైన కొత్త రకాలు వచ్చాయి. పోల్కాడాట్ ను సాధారణంగా లోతు తక్కువ కుండీల్లో పెంచుకుని ఇంట్లో అలంకరించుకుంటారు. బయట తోటలో వెలుతురు పడేలా చెట్లకింద ఇతర మొక్కలతో కలిపి నాటుకోవడానికి కూడా బాగుంటుంది. దీని ప్రకాశవంతమైన, ఆకర్షణీయమైన ఆకుల వల్ల ఎలాంటి మొక్కల మధ్య ఐనా కుదురుకుంటుంది. ముఖ్యంగా ఫెర్రస్ లు, మోండా గ్రాస్, రిబ్బన్ గ్రాస్ వంటి వాటి మధ్య అద్భుతంగా ఉంటుంది.
పోల్కాడాట్ పూలు పెద్దగా పట్టించుకోవలసినవి కావు. పైగా పూలు వచ్చాక మొక్క చనిపోవటమో, ఎదుగుదల ఆగిపోవటమో జరుగుతుంది. అందువల్ల పూలు రాకుండా చివర్లు తుంచివేస్తుంటే మంచిది. దీని వల్ల మొక్క సాగినట్లు పెరిగి కళావిహీనంగా మారే ప్రమాదం తప్పుతుంది.
క్లోరిన్ కలిపిన నీళ్ళవల్ల పోల్కాడాట్ త్వరగా దెబ్బతింటుంది. అందువల్ల పంపునీళ్ళను పట్టి ఒక గంట నిలవ ఉంచి పోయటం మంచిది. పోల్కాడాట్ ను పిండి పురుగులూ, తెల్లదోమ వంటి రసం పీల్చే పురుగులు ఆశించవచ్చు. ఆకు కషాయాలను క్రమం తప్పకుండా చల్లుతూ ఉంటే ఆ సమస్యను చాలావరకూ నివారించవచ్చు. మొక్క పెరుగుతున్నపుడు పాలీఫీడ్ వంటి నీటిలో కరిగే సమగ్ర ఎరువును వారానికోసారి లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కలిపి పోస్తుంటే ఆరోగ్యంగా పెరుగుతుంది. పోల్కాడాట్ ను విత్తనాలతో సులువుగా ప్రవర్ధనం చేయవచ్చు. శీర్ష కత్తిరింపుల ద్వారా కూడా సులువుగానే వేళ్ళూను కుంటాయి. సుకుమారంగానే కనిపిస్తూనే సులువుగా పెరిగే అందాల మొక్క పోల్కాడాట్.

%d bloggers like this:
Available for Amazon Prime