Posted in స్త్రీలు

తల్లిపాలు ….. ఆవశ్వకత

ఆరు నెలల వరకు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని తెలిసినా.. సగానికి పైగా పిల్లలకు ఈ అదృష్టం దక్కటం లేదు. ఆరు నెలల తర్వాత అదనపు ఆహారాన్ని ఆరంభించాలని తెలిసినా.. దాదాపు సగం మంది ఈ కమ్మదనాన్ని పొందటం లేదు. దీంతో ఎంతోమంది పోషణలోపం బారినపడుతున్నారు. ఎక్కడుందీ లోపం? అందరమూ వేసుకోవాల్సిన ప్రశ్న ఇది.
మొక్క ఏపుగా ఎదగాలంటే ఆయా దశలకు అనుగుణంగా అవసరమైన పోషకాలన్నీ అందాలి. పిల్లలూ అంతే. ఏ వయసులో అవసరమైన పోషకాలు ఆ వయసులోనే అందాలి. అప్పుడే చక్కటి ఆరోగ్యంతో ఎదుగుతారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారు. పిల్లల పోషణ విషయంలో పుట్టినప్పటి నుంచి తొలి రెండేళ్లు చాలా కీలకమైన దశ! వారి శారీరక ఎదుగుదలకు, మానసిక వికాసానికి బీజం పడేది ఈ వయసులోనే. ప్రవర్తన రూపుదిద్దుకోవటం, విషయాలను గ్రహించే నేర్పులూ పురుడుపోసుకునేదీ ఈ వయసులోనే. అందువల్ల తొలి రెండేళ్లలో పిల్లలకు తగినంత పోషణ లభించటం చాలా అవసరం. లేకపోతే వారి ఎదుగుదల కుంటుపడుతుంది. రకరకాల జబ్బులు చుట్టుముడతాయి. కొన్నిసార్లు బతికి బట్ట కట్టటమే కష్టమైపోతుంది. మనదేశంలో ఎంతోమంది బిడ్డలు కేవలం పోషకాహార లోపంతోనే చనిపోతుండటం ఆందోళకరం. కాబట్టి పిల్లల పోషణపై పుట్టినప్పటి నుంచే దృష్టి పెట్టటం.. జాగ్రత్తగా మసలుకోవటం.. చాలా అవసరం. ముఖ్యంగా తల్లులకు వీటిపై సరైన అవగాహన ఉండటం ముఖ్యం.
సీసాలు వద్దే వద్దు!
పిల్లలకు సీసాతో పాలు పట్టటం తగదు. మనదేశంలో ఏటా 5-6 లక్షల మంది పిల్లలు కేవలం ఈ సీసాల మూలంగానే మరణిస్తున్నారు. వీటితో పాలు పట్టటం వల్ల తీవ్రమైన విరేచనాలు, చెవిలో చీము, గొంతు నొప్పి, వూపిరితిత్తుల్లో నిమ్ము, పిప్పిపళ్లు.. వంటి రకరకాల సమస్యలు చుట్టుముడతాయి. నోట్లో తేనె పీకలు, పాసిఫయర్లు కూడా పెట్టొద్దు. పాలను మాత్రమే కాదు.. నీళ్లు తాగించటానికి కూడా సీసాను వాడొద్దు. తల్లీబిడ్డల అనురాగం, ఆప్యాయతలకు సీసా గొడ్డలిపెట్టు. వీటితో పెరిగే పిల్లలకు అనురాగం, ఆప్యాయత, మానవ స్పర్శ.. వాటి విలువలు తెలియవు. ఇలా యాంత్రికంగా సీసా పాలు తాగి పెరిగే పిల్లలు నలుగురితో కలిసిమెలసి ఉండలేకపోతున్నారని, కలివిడిగా పనిచేయలేకపోతున్నారని అధ్యయనాలు సైతం పేర్కొంటున్నాయి.
తిండితో పాటు ప్రేమా పెట్టాలి!
బిడ్డకు తిండి పెట్టటమే కాదు.. ప్రేమతో, బాధ్యతతో, సంతోషంతో తినిపించటమూ ముఖ్యమే. మనదగ్గర చాలామంది బిడ్డను కాళ్ల మీద వేసుకొని నోట్లో తిండి కుక్కుతుంటారు. పిల్లలేమో అటూఇటూ కదులుతూ, మూతి తిప్పేసుకుంటూ పోరాటం చేస్తుంటారు. కొందరు తల్లులు కొడుతుంటారు కూడా. దీనివల్ల క్రమంగా పిల్లలకు తిండిపై తిరస్కార భావన కలుగుతుంది. ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ తెచ్చుకోకూడదు. పిల్లలు సంతోషంగా తినేలా చూడాలి. అలాగని అన్నం పిల్లల ముందు పెట్టేసి వాళ్లే తింటారులే అని విడిచిపెట్టటమూ మంచిది కాదు. తినిపించేవారి ఎత్తులో పిల్లలను కూచోబెట్టి.. వారి కళ్లలోకి చూస్తూ.. నవ్వుకుంటూ.. అనునయంగా మాట్లాడుతూ తినిపించాలి. అదీ ఒకేసారి ఎక్కువగా కాకుండా.. కొంచెం కొంచెంగా పెట్టాలి. పెదవి దగ్గరకు తెస్తే బిడ్డ తనంత తానుగా లోపలికి తీసుకునే అవకాశం ఇవ్వాలి. దీంతో తన ఆహారం తనే తిన్నాననే తృప్తి పిల్లలకు కలుగుతుంది.
పిల్లలకు తినిపించే ఆహారం తాజాగా, వేడిగా ఉండాలి. వండాక రెండు గంటల్లోపే తినిపించాలి. వండే ముందు, తినిపించే ముందు.. దొడ్డికి కడిగిన తర్వాత.. తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

తొలిగంటలోనే తల్లిపాలు
బిడ్డ పుట్టిన తొలి గంటలోనే తల్లిపాలు ఆరంభించటం చాలా కీలకం. ఈ సమయంలో వచ్చే ముర్రుపాలు బిడ్డకు శక్తిమంతమైన రక్షణ కవచం లాంటివి. ఇదే మనం బిడ్డకు ఇచ్చే మొదటి టీకా అనీ అనుకోవచ్చు. ముర్రుపాలలో శిశువులకు అత్యావశ్యకమైన పోషకాలతో పాటు యాంటీబోడీలు కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తి పెంపొందటానికి తోడ్పడతాయి. ఇన్ఫెక్షన్ల బారినపడకుండా కాపాడతాయి. మరణం ముప్పు సైతం తగ్గుతుంది. కేవలం తొలి గంటలో తల్లిపాలు పట్టటం ద్వారానే సుమారు 10 లక్షల మంది శిశువులను కాపాడుకోవచ్చు! సిజేరియన్ కాన్పు అయినా కూడా వీలైనంత త్వరగా తల్లిపాలు మొదలెట్టాలి. సహజ కాన్పు కాదు కాబట్టి వెంటనే పాలు రావేమోన్న సందేహం అవసరం లేదు. పుట్టుకతో వచ్చే సమస్యల మూలంగా శిశువును ఇంక్యుబేటర్లో పెట్టినా కూడా తల్లిపాలను పిండి ట్యూబ్ ద్వారానో, చెమ్చాతోనో తాగించే ప్రయత్నం చేయాలి. బిడ్డ ఏడిస్తేనే పాలు ఇవ్వాలని కూడా లేదు. పాల కోసం పిల్లలు చేసే ప్రయత్నాల్లో ఏడ్వటమనేది చివరిది. అంతకుముందు చప్పరించినట్టు చప్పుడు చేయటం, గుప్పిళ్లతో నోటిని రుద్దుకోవటం, సున్నితమైన కూతలు, కళ్లు అటూఇటూ వేగంగా తిప్పటం, ఒకరకమైన చికాకుతో కదలటం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి గమనించి వెంటనే పాలు పట్టటం మంచిది. ఎంత ఎక్కువసార్లు ఇస్తే పాలు అంత బాగా వస్తాయి. అందుకే పగటిపూటే కాదు.. రాత్రిపూట కూడా బిడ్డకు తప్పనిసరిగా పాలు పడుతుండాలి.
ఆర్నెల్ల వరకూ కేవలం తల్లిపాలే
పసి పిల్లలకు ఆరు నెలల వయసు వరకూ పూర్తిగా తల్లిపాలే పట్టాలి. ఈ సమయంలో వారికి మంచి నీళ్లు తాగించాల్సిన అవసరమూ లేదు. తొలి ఆరు నెలల్లో బిడ్డ ఎదగటానికి అవసరమైన పోషకాలన్నీ తల్లిపాలలోనే ఉంటాయి. ప్రేమతో, ఆప్యాయతతో ఇచ్చే తల్లిపాలకు సాటి వచ్చేది మరేదీ లేదని గుర్తించాలి. చాలామంది బిడ్డకు 3, 4 నెలలు రాగానే పాలు సరిపోవేమోనని భావిస్తుంటారు. నిజానికిది పూర్తిగా అపోహే. ఆర్నెల్ల వరకూ బిడ్డ అవసరాలకు తగినన్ని పాలు తల్లి దగ్గర లభిస్తాయి. కొందరు 3 నెలలు దాటగానే బిడ్డకు అవీఇవీ పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. ఇలాంటివేవీ అవసరం లేదు. పనిచేసే తల్లులు కూడా ఉద్యోగాలకు వెళ్లేటప్పుడు పాలు పిండి ఇంట్లో పెట్టి వెళ్లొచ్చు. ఆఫీసులో ఉన్నప్పుడు కూడా పాలు పిండి నిల్వ చేసుకోవచ్చు. తల్లికి జ్వరం వచ్చినా నిరభ్యంతరంగా పిల్లలకు పాలు పట్టొచ్చు. పాలు రావటం లేదని కొందరు తల్లులు మధ్యలో మానేస్తుంటారు. ఇలాంటివాళ్లు పాలివ్వటం ఆరంభిస్తే మళ్లీ పాలు వస్తాయి. పాలు పడుతున్నకొద్దీ వస్తాయి, పట్టకపోతే రావనే విషయాన్ని గుర్తించాలి.
ఆర్నెల్లు దాటుతూనే అదనపు ఆహారం
ఇప్పటికీ గ్రామాల్లో కొందరు తల్లులు 9, 10 నెలలు దాటినా పిల్లలకు కేవలం తల్లిపాలే ఇస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆరు నెలల వయసు దాటుతూనే పిల్లలకు పోషకాల అవసరమూ పెరుగుతుంది. అందువల్ల తల్లిపాలు మాత్రమే ఇస్తే సరిపోదు. అదనపు ఆహారం కూడా మొదలెట్టాలి. లేకపోతే పిల్లలు బక్క చిక్కిపోతారు. ఎదుగుదల కుంటుపడుతుంది. ఇంట్లో ఉండే దినుసులతో చేసిన ఆహారమే పిల్లలకు మంచిది. రకరకాల ధాన్యాలు, పప్పులు కలిపి పిండి పట్టించి.. దాన్ని రెండు పూటలా జావలా చేసి పెట్టటం మంచిది. తమిళనాడులో దంపుడు బియ్యం, గోధుమ, జొన్నలు, సజ్జలు, రాగులు, సగ్గుబియ్యం, మొక్కజొన్న, కందిపప్పు, సెనగ పప్పు, పెసర పప్పు, మినపపప్పు, సోయా, పల్లీలు, జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, యాలకులు.. ఇలా 18 రకాల ఆహార దినుసులు కలగలసిన ‘కంజికట్’ అనేది ప్రాచుర్యంలో ఉంది. వీటిని ఎండబెట్టి, వేయించి, పొడికొట్టి.. రోజూ కొద్దిగా నీటిలో ఉడకబెట్టి జావలా చేసి పెడితే పిల్లలు హాయిగా తింటారు. దీంతో అన్ని పోషకాలు లభిస్తాయి. మనదగ్గర కూడా బియ్యం, రకరకాల పప్పులు పొడిగొట్టి వాడటం తెలిసిందే. వీటితో చేసిన ఉగ్గును ఒకట్రెండు చెమ్చాలతో మొదలుపెట్టి క్రమేపీ ఎంత తింటే అంత.. అంటే మూతి తిప్పేదాకా పెట్టాలి. ఈ పొడిని చేసుకోలేకపోతే బియ్యం-పప్పుతో చేసిన ఉగ్గు.. జావ మాదిరిగా చేసి ఇవ్వాలి. ఇందులో కాస్త ఉప్పు-నెయ్యి లేదా చక్కెర-నెయ్యి వేసి తినిపిస్తే తక్కువ ఆహారంతోనే ఎక్కువ కేలరీలు లభిస్తాయి. ఆ తర్వాత వారం వారం వాటిలో ఏదో ఒక కూరగాయ- ఉడకబెట్టిన బంగాళాదుంప, ఉడకపెట్టిన క్యారెట్ వంటివి కలిపి పెట్టాలి.
చిరుతిండిగా అరటిపండు పెట్టొచ్చు. దీన్ని చేత్తో ముట్టుకోకుండా అరటిపండును చెంచాతో కొద్ది కొద్దిగా గీరి బిడ్డ నోట్లో పెట్టటం మంచిది. ఆపిల్, ఆలుగడ్డను ఉడకబెట్టి గుజ్జుగానూ చేసి ఇవ్వొచ్చు. 9-12 నెలల వయసులో మూడుసార్లు ఉగ్గు, రెండుసార్లు చిరుతిండి పెట్టటం మంచిది.
చాలామంది బయట కొనుక్కొచ్చిన డబ్బాల్లోని పొడులే బలమిస్తాయని పొరపడుతుంటారు. ఇది నిజం కాదు. డబ్బాల్లో ఒకటో రెండో దినుసులే ఉంటాయి. వీటి ఖరీదు ఎక్కువ, పోషకాలు తక్కువ. పైగా కొనుక్కొచ్చి పెడతారు కాబట్టి పొదుపుగా, కొద్దికొద్దిగానే ఇస్తారు. ఇది బిడ్డ అవసరాలకు ఏమాత్రం సరిపోదు. ఇంట్లో చేసుకున్నదైతే ఎంత కావాలంటే అంత పెట్టొచ్చు.
బిడ్డకు 6-9 నెలల మధ్యలో గుడ్డు ఉడకబెట్టి.. పచ్చసొనను జావలోనే కలిపి ఇవ్వటం ఆరంభించొచ్చు. మాంసాహారులైతే 9 నెలల తర్వాత ఖీమానూ కలిపి ఇవ్వొచ్చు. ఇవేకాకుండా పెద్దలు వండుకున్న ఆహారాన్నే.. తాము తింటున్నప్పుడే.. కొద్దిగా తీసి మెత్తగా పిసికి పిల్లలకు పెట్టొచ్చు.

ఏడాది దాటితే పెద్దల ఆహారమే
పిల్ల్లల నాలుకల మీద కూడా రుచిమొగ్గలుంటాయి. వీటిని క్రమంగా మన ఇంటి వంటల రుచులకు అలవాటు చెయ్యాలి. ఇది 9 నెలల నుంచి ఏడాది మధ్య సాఫీగా జరిగిపోవాలి. అలాగే కొద్దికొద్దిగా బరక గింజలు తినటమూ అలవాటు చెయ్యాలి. దీంతో పిల్లలు తేలికగా, నమిలి మింగటానికి అలవాటు పడతారు. లేకపోతే ఆ తర్వాత అలవడటం కష్టమవుతుంది. ఏడాది దాటిన బిడ్డలకు ఇంట్లో అందరూ ఏం తింటుంటే అవన్నీ పెట్టాలి. ఏడాది తర్వాత పిల్లలకు ప్రత్యేకంగా ఏదీ వండి పెట్టాల్సిన అవసరం ఉండకూడదు. తల్లిదండ్రులు తాము తినేటప్పుడే పిల్లలను పక్కన కూచోబెట్టుకొని తినేలా చూసుకోవాలి. అదనపు ఆహారం పెట్టినా రెండు సంవత్సరాల వరకూ బిడ్డకు తల్లిపాలివ్వాలి. ఆ తర్వాత ఇవ్వటమా, ఇవ్వకపోవటమా అన్నది తల్లి ఇష్టం. చాలామంది రెండేళ్ల వరకూ తల్లిపాలు ఇవ్వాల్సిన అవసరముందా అనీ సందేహిస్తుంటారు. ఇందులో ఎంతో శాస్త్రీయత ఉంది. ఆర్నెల్ల నుంచి ఏడాది వరకు బిడ్డకు కావాల్సిన 50 శాతం పోషకాలు తల్లిపాల ద్వారానే అందుతాయి. ఇక ఏడాది నుంచి రెండేళ్లు నిండే వరకూ.. వారి పోషక అవసరాల్లో మూడింట ఒక వంతు తల్లిపాల నుంచే లభిస్తాయి. కాబట్టి రెండేళ్లు నిండేవరకూ బిడ్డకు తల్లిపాలు పట్టటం అవసరమే.

పోషణలోపం తొలి రెండేళ్లలోనే అధికం
మనదేశంలో ఏటా సుమారు 18 లక్షల మంది పిల్లలు ఐదేళ్లలోపే మరణిస్తున్నారు. ఇందులో చాలావరకు మరణాలకు పోషకాహార లోపమే కారణం. ఈ లోపం తొలి రెండు సంవత్సరాల వయసులోనే ఎక్కువగా ఉంటోంది. తల్లిపాలు ఇవ్వకపోవటం, సరైన అదనపు ఆహారం పెట్టకపోవటమే దీనికి ముఖ్య కారణం. బిడ్డ బక్కగా.. పొట్ట, బుగ్గలు లోపలికి పీక్కుపోయి కనబడుతున్నా.. చర్మం ముడతలు పడినట్టున్నా.. గుండ్రంగా ఉండాల్సిన తొడలు-పిర్రలు ముడతలు పడినట్టున్నా.. బిడ్డకు పోషకలోపం ఉన్నట్టే! ఇలాంటి పిల్లలకు మరింత తరచుగా ఆహారం ఇవ్వాలి. ప్రతిసారీ అదనంగా మరో రెండు చెంచాలు ఎక్కువగానూ తినిపించాలి. ఆహారంలో నెయ్యి, కొవ్వులు పెంచటం వల్ల మరింత శక్తి లభిస్తుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s