కెలాధియా

కెలాధియా

మరాంతాలను, అగ్లోనిమాలను పోలి ఉండి, ఇంట్లో పెంచుకోవడానికి అనువైన అందమై మొక్క కెలాధియా. ఆకుల మీద ఉండే మచ్చలు లేదా చారల వల్ల దీన్ని నెమలిమొక్క, జీబ్రా మొక్క అని కూడా అంటారు. వీటిని సాధారణంగా అందమైన ఆకులకోసం పెంచుతారు. ఈ ఆకులు రకాన్నిబట్టి వివిధ పరిమాణాల్లో ఆకారాల్లో ముచ్చట గొలుపుతాయి. ఏ రకానికదే మనోహరంగా, సహజమైనది కాదు కృత్రిమమైనదేమో అనిపిస్తూ ఎవరైనా చేయి తిరిగిన కళాకారుడి అద్భుతమైన సృష్టేమో అని భ్రమింప చేస్తుంది.
రెండడుగుల వరకూ పెరుగుతుంది.
కెలాధియాలు నీడలో పెరిగే సున్నితమైన మొక్కలు ఎండ తీవ్రతను అస్సలు తట్టుకోలేవు. సూటిగా పడే ఎండలో ఉన్నపుడు ఆకులు కాలినట్లు అయిపోతాయి. చెట్లు కిందగానీ, ఇతర మొక్కల మధ్యగానీ నాటుకోవడమో, షెడ్ నెట్ కింద పెంచుకోవడమో చేస్తే చక్కగా పెరుగుతాయి. ఇది సాధారణంగా ఒకటిన్నర నుంచి రెండు అడుగుల వరకు పెరుగుతుంది. కెలాధియాలకు అగ్లోనిమాలలాగా ప్రత్యేకమైన కాండం ఉండదు. నేలలో ఉన్న దుంపనుంచి ఒకే కుదురు నుంచి గట్టిగా ఉన్న కాడలతో అనేక ఆకులు వస్తాయి. లేత ఆకులు గుండ్రంగా చుట్టుకుని ఉండి పెరిగే కొద్దీ నెమ్మదిగా విచ్చుకుంటాయి.
శ్రద్ధ అవసరం
వీటి ఆకులు సుకుమారంగా మృధువుగా ఉంటాయి. ఆకుల పైభాగం లేతాకుపచ్చ ముదురాకుపచ్చ మీగడ రంగులలో, చారికలు, మచ్చలతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అఢుగుభాగం వంకాయ రంగులో అందంగా ఉంటుంది. కెలాధియా క్రొకెటా రకం మాత్రం అందమైన అరుదైన పూలు పూస్తుంది. ఈ రకాన్ని పూల కెలాధియా అని కూడా అంటారు. కంపోస్టు, ఇసుక మట్టి లేదా కోకోపిట్ సమపాళ్ళలో ఉండే సారవంతమైన, నీరు నిలవని మట్టి మిశ్రమంలో ఇది బాగా పెరుగుతుది. ఎన్ పి కె ఉండే సమగ్ర ఎరువును నీటిలో కలిపి రెండు వారాలకోసారి పోస్తూ ఉంటే మంచిది. మట్టి ఎప్పుడూ పొడిబారకుండా చూసుకోవాలి. అలాగే గాలిలో తేమ శాతం తగినంత ఉండేందుకు నీళ్ళు అప్పుడప్పుడూ పిచికారీ చేస్తూ ఉండాలి.
కెలాధియా కొంచెం శ్రద్ధ తీసుకుని పెంచుకోవలసిన మొక్క. ఎండ ఎక్కువైనా, ఎరువులు ఎక్కుమైనా, నీటిలో లవణాల శాతం పెరిగినా ఆకుల అంచులు, చివర్లు మాడిపోతాయి. అలాగే ఆకుల మీద కుళ్ళినట్లయి రంధ్రాలు పడుతుంటే నీళ్ళు పై నుంచి కాకుండా మొదలు దగ్గర పోయాలి. ఆకు కషాయాలు తరచూ చల్లుతూ జాగ్రత్తగా చూసుకోవాలి. కెలాధియా ఆకులను ప్రకాశవంతంగా ఉంచుకోవాలంటే తడివస్త్రంతో తుడిస్తే సరిపోతుంది.
లీఫ్ షైన్ వంటి కృత్రిమ ఉత్పత్తులను వాడితే సున్నితమైన ఈ మొక్క త్వరగా దెబ్బతింటుంది. కెలాధియాను దుంపను విడదీసి సులువుగా ప్రవర్ధనం చేసుకోవచ్చు.

%d bloggers like this:
Available for Amazon Prime