Posted in జాతరలు

కృష్ణాష్టమి

కృష్ణాష్టమి అంటే కృష్ణపక్షంలో వచ్చే అష్టమి. కృష్ణుడు జన్మించిన రోజు. కృష్ణుడు పుట్టిన సమయానికే, నంద గోకులంలో యశోదాదేవికి పుత్రికగా మహాశక్తి యోగమాయ జన్మించింది. ఆ తల్లి పుట్టిన అష్టమి కూడా ఇదే!
దైవీ గుణసంపద గలవారి మోహాది మాయాజాలాన్ని క్షయింపజేసే మోక్ష కారకుడు, జగన్మోహనుడు శ్రీకృష్ణుడు. ఆ అవతారం అగాధమైనది, అనంతమైనది! పరమాత్మ తత్వాన్ని, ఉపనిషత్ రహస్యాలను తన లీలల ద్వారా ప్రకటించిన భగవానుడు ఆయన. ప్రేమ, రౌద్ర, వీర, కరుణ, హాస, శాంత భావాల్ని ప్రకటించిన గోవిందుడి గాథ
బాల్యంలోనే దావాగ్నిని మింగి గోకులాన్ని కాపాడిన స్వామి కృష్ణుడు. బ్రహ్మదేవుడి అహాన్ని అణచివేస్తూ- ఏకకాలంలో అనేక వేల రూపాలలో లేగ దూడల, గోప బాలుర రూపాల్ని ధరించి ఆశ్చర్యపరడాడు. పాలకడలిపై శేషతల్పంపై శయనించిన స్వామి వైకుంఠ ఏకాదశి రోజున కోటి వెలుగులతో దర్శనమిస్తాడు..ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుని దర్శించుకునే రోజు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. తిరుమలతో సహా అన్ని దేవాలయాలలో ఉత్తరంవైపున ఉండే వైకుంఠద్వారాన్ని తెరుస్తారు ఈ రోజున. సౌరశక్తి ఉత్తరాయణానికి మారే సుదినం.

తనను మట్టుపెట్టడానికి మాయారూపాలతో వచ్చిన రాక్షసులను చడీచప్పుడు లేకుండా రూపుమాపిన బాల వీరుడు కృష్ణుడు. చిటికెన వ్రేలితో గోవర్ధనగిరిని ఎత్తినవాడు. స్వర్గలోకంలోని ఇంద్రుడి దర్పాన్ని నిగ్రహించాడు. శుద్ధజలాల్ని విషమయం చేసిన కాళీయ సర్ప గర్వాన్ని అణచివేశాడు. ఫణి ఫణాలపై నర్తించి, అతడిని ఆ నీటి నెలవు నుంచి మళ్లించి, సురక్షిత స్థలానికి పంపి అనుగ్రహించాడు. ప్రకృతిని కలుష రహితంగా ఉంచాలని సకల మానవాళికీ బోధించాడు కృష్ణుడు.
బహుజన్మల యోగసాధనతో పరబ్రహ్మ ప్రాప్తి కోసం గోపికా రూపాలు ధరించిన శుద్ధ జీవులకు ఆయన బ్రహ్మానంద రసానుభవాన్ని ప్రసాదించాడు. రాసలీలా వినోది, నాదావతారుడికి వేణుగానాన్ని వినిపించిన మూర్తి కృష్ణపరమాత్మ.
కృష్ణుడు కంసునికి చెందిన కువలయాపీడం అనే మదగజాన్ని నిరోధించాడు. చాణూర ముష్టికాది మల్లయోధుల్ని ఓడించాడు. కంస శిశుపాలాది దుష్టుల్ని పరలోకానికంపిన ప్రతాపశాలి. జరాసంధ, రుక్మి, కాలయవనుడు వంటి దుర్మార్గుల దురాగతాల్ని అడ్డుకున్నాడు.రాజనీతి చతురుడు. వంచనతో ఆగకుండా ద్రౌపదీదేవిని నిండుసభలో పరాభవించిన కౌరవుల్ని హెచ్చరించాడు. అనివార్యమైన సంగ్రామంలో వారికి తగిన పాఠం చెప్పిన ధర్మరక్షకుడు కృష్ణుడు. .
కృష్ణభగవానుడు ఆర్తితో శరణు వేడిన పాంచాలిని ఆదుకున్నాడు. ధర్మానికి కట్టువడి తననుఆశ్రయించిన పాండవుల్ని కాపాడాడు. జ్ఞానభక్తుడై చేరుకున్న కుచేలుణ్ని ఆదరించి, అనుగ్రహించిన స్వామి కృష్ణుడు. జరాసంధుడి చెరలో గల ఎనభై మంది రాజుల్ని విడిపించి, సుస్థిరత కలిగించిన కృపాళువు. నరకాసురుడి బారిన పడిన పదహారువేల మంది రాచకన్యలను విడిపించి, వారి కోరిక మేరకు భద్రత చేకూర్చిన స్వామి! .
తన వైపు గల సైన్యం వద్దని తానే చాలని ఎంచుకున్న అర్జునుడి రథానికి సారథిగా విజయాన్ని ప్రసాదించాడు. కృష్ణుడు విశ్వజనీన తత్వశాస్త్రమైన గీతామృతాన్ని యుద్ధభూమిలో అర్జునినికి ఉపదేశించిన స్వామి.
వేదాల నుంచి విస్తరించిన కర్మ, యోగ, ఉపాసన, తత్వమార్గాల్ని కృష్ణుడు చక్కగా సమన్వయించాడు.సర్వశాస్త్రసారంగా అర్జునుడికి గీతాశాస్త్రాన్ని బోధించడమే కాక, తన అవతార పరిసమాప్తి వేళ ఉద్ధవుడికి తత్వబోధ చేసిన జగద్గురువు ఆయన. .
అవతార కాలంలోనే కాక ఆ తరవాతి కాలంలోనూ- తనను స్మరించి, ఆరాధించి, కీర్తించిన యోగుల్ని తరింపజేసిన భగవానుడు. శుక యోగి, ఆదిశంకరులు, రామానుజాచార్య, మధ్వాచార్య, చైతన్య మహాప్రభు, వల్లభాచార్య, జయదేవుడు, పోతన, లీలాశుకుడు, నారాయణ తీర్థులు, మధుసూదన సరస్వతి, మీరాబాయి, తుకారాం, సక్కుబాయి, సూరదాసు… ఇలా ఎందరెందరో కృష్ణయోగులున్నారు. వారందరూ సాత్విక, మధుర, దివ్య భక్తిమార్గంలో జ్యోతి స్వరూపులై వెలుగునింపారు. .
ఇంతమంది మహాత్ముల భావనలో ప్రకాశించిన శ్రీకృష్ణ భగవానినుని, ఈ రోజే కాదు ప్రతిరోజూ స్మరిద్దాం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s