ఓనమ్

మహాబలి ఆగమనాన్ని పురస్కరించుకొని కేరళవాసులు సంబరం జరుపుకొనే పండుగే ఓనమ్‌. కేరళ ఘనమైన సంస్కృతీ వారసత్వంగా ఈ పండగను పదిరోజుల పాటు జరుపుతారు. సెప్టెంబర్‌ 2 నుంచి 13 వరకు జరిగే ఈ పండుగ విశేషాలను తిలకించడానికి విదేశీ పర్యాటకులు సైతం వస్తారు. ఇక్కడ నృత్యాలు, విందుభోజనాలు, పులివేషాలు, ప్రాచీన విద్యలు-ఆటలు, పడవ పందేలు కన్నులపండువగా జరుగుతాయి.

ఒక్కొక్కరోజు ఒక్కో పేరుతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఓనమ్‌ పండుగను చూడాలని ఆసక్తి ఉన్న పర్యాటకుల కోసం టూరిజం శాఖ ప్రత్యేక సదుపాయాలను కలిపిస్తున్నది. పదిరోజులు జరిగే ఓనమ్‌ వేడుకల్లో ప్రతి రోజూ జరిగే వేడుకలను వివిధ పేర్లతో పిలుస్తారు. సెప్టెంబర్‌ 2న అథం పేరుతో తొలిరోజు పండుగ ప్రారంభమవుతుంది. ఆ రోజు ఇంటిని అందంగా అలంకరిస్తారు. పూలతో చేసిన అలంకరణ ఆకర్షణీయం గా ఉంటుంది. సెప్టెంబర్‌ 3న చితిరా అంటారు. ఈ రోజు కొత్త బట్టలు కొనుక్కోవడం, బహుమతులు కొనడం చేస్తారు.

మూడో రోజు విశాఖం. ఈ రోజు ఓనమ్‌ భోజనం చేయడానికి అవసరమైన పదార్థాలను సేకరించడం, నిల్వచేయడం చేస్తారు. పూకం డిజైన్‌ పోటీలు కూడా ప్రారంభమవుతాయి. నాల్గవరోజు అనిజమ్‌. ఈ రోజు పాముపడవ పోటీలు ప్రారంభమవుతాయి. దీన్ని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు, పర్యాటకులు వస్తారు. తరువాత త్రికెటా, ఆరవ, ఏడవ రోజు మూలం అంటారు. ఈరోజు రాష్ట్రాన్ని అందంగా అలంకరిస్తారు. సెప్టెంబర్‌ 9న పూరడం. ఈ రోజు బంకమట్టితో చేసిన ఒనాతప్పన్‌ అనే విగ్రహాలను ప్రతిష్టిస్తారు.

10న ఉత్రాడోమ్‌ ఈ రోజును ఓనమ్‌ ఈవ్‌గా పరిగణిస్తారు. 11న తిరుఓనం. ఈ రోజు మహాబలి ప్రజల ఇళ్లను సందర్శిస్తారని నమ్ముతూ వనసద్య అనే శాఖాహార విందును ఏర్పాటు చేస్తారు. 12న అవవిట్టం. మహాబలి తిరిగి వెళ్లిపోవడం. ఒనాతప్పన్‌ విగ్రహాలను నది లేదా సముద్రంలో కలుపుతారు. 13న నాల్గవ ఓనం. ఈరోజు పాము పడవ రేసులు, పులిక్కలి టైగర్‌ ప్లే (పులి బొమ్మల ఆటలు), కేరళ టూరిజం శాఖ ఓనమ్‌ వీక్‌ కార్యక్రమంతో వేడుకలు ముగింపు దశకు చేరుకుంటాయి.

త్రిపునితుర అత్తఛమయం సంప్రదాయం ప్రకారం, ఎర్నాకులం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిపునితురలో ఓనం పండుగ ఉత్సవాలు మొట్టమొదట ప్రారంభమవుతాయి. ఆ రోజున పురవీధులన్నీ విద్యుద్దీ పాలతో అందంగా ముస్తాబు చేస్తారు. ఏనుగులను అందంగా అలంకరించి వరుసలో నిలబెడతారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల సంగీత, నృత్య ప్రదర్శన ఆకట్టుకుంటుంది.

వామనమూర్తి టెంపుల్‌ ఓనమ్‌ పండుగ రోజులలో కేరళలోని త్రిక్కకరలో గల వామనమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తమ తమ ఇళ్లలో త్రిక్కకర అప్పన్‌ (వామనుడు) విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. ఇక్కడ కూడా ఓనమ్‌ పండుగ ఘనంగా నిర్వహిస్తారు. వీధులెంబట స్టాల్స్‌, పూల అలంకరణలు అలరిస్తాయి.

కోవలమ్‌ ఈ ప్రదేశం కథాకళి నృత్యానికి ఖ్యాతి గాంచింది. ఇక్కడ ఏ చిన్న వేడుక జరిగిన ఈ నృతాన్ని ప్రదర్శిస్తారు. ఓనమ్‌ నాడు వందల కొలది కళాకారులు వరుసలో నిలబడి నృత్యం చేసే తీరు యాత్రికులను ఆకట్టుకుంటుంది. దీంట్లో చివరి రోజున అలంకరించిన గజరాజుల విన్యాసాలు ఉంటాయి. స్నేక్‌ బోట్‌ రేస్‌ ఓనమ్‌ పండుగలో ప్రధాన ఆకర్షణ స్నేక్‌ బోట్‌ రేస్‌. అరన్ముల బోట్‌ రేస్‌ పార్థసారధి దేవాల యం దగ్గర పంపానదిలో సెప్టెంబర్‌ 5 న జరుగుతుంది.

వెల్లాయని సరస్సు తిరువనంతపురంలోని రైల్వేస్టేషన్‌లో ట్రైన్‌ దిగాక, అక్కడి నుంచి కోవలమ్‌ బీచ్‌కు బస్‌ సౌకర్యం ఉంటుంది. అదే మార్గంలో వెల్లాయని సరస్సు ఉంటుంది. తిరువునంతపురం జిల్లాలో ప్రవహించే అతి పెద్దమంచి నీటిసరస్సు వెల్లాయని. స్థానికులు దీన్ని వెల్లాయని కాయల్‌ అని పిలుస్తారు. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే విహార కేంద్రాల్లో వెల్లాయని సరస్సు ఒకటి. ఓనమ్‌ పండగ సందర్భంగా పడవ పందాలు ఇక్కడ నిర్వహిస్తారు. వీటిని చూడడానికి వందల సంఖ్యలో ప్రజలు వస్తారు. సరస్సు మీద వెన్నెల పడగానే ఈ ప్రాంతం అంతా మనోహరంగా మారిపోతుందట. ఆ దృశ్యాన్ని చూడడానికి పర్యాటకులు రాత్రిదాకా వేచి ఉంటారు.

కోవలమ్‌ బీచ్‌ ఓనమ్‌ పండుగ రోజుల్లో కోవలమ్‌ బీచ్‌లో సందడి నెలకొంటుంది. వెల్లాయని నుంచి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఈ బీచ్‌ ఉంటుంది. రోడ్డుకు ఇరువైపులా కొబ్బరిచెట్లు, అరటిచెట్లు, పచ్చని పంటపొలాలు, జలాశయాలు మనకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. బీచ్‌లో ఎగిసిపడే సముద్రపు కెరటాలు కనువిందు చేస్తాయి. అక్కడ విడిది చేయాలనుకునేవారికి హోటళ్ళు, దుకాణాలు అందుబాటులో ఉంటాయి. ఈ బీచ్‌ను హావా బీచ్‌, లైట్‌హౌస్‌ బీచ్‌, సముద్ర బీచ్‌ అని మూడు భాగాలుగా విభజించారు.

పులి వేషాలు… శాస్త్రీయ వాద్యపరికరాలను వాయిస్తుండగా పులి వేషాలు కట్టిన వారు ఆ చప్పుళ్లకు నృత్యాలు చేయడమనే ఆచారం ఈ పండుగకు మరో ఆకర్షణ. దీనిని ‘పులిక్కలి’ అంటారు. భారతదేశంలోనే అతి ప్రాచీన వేడుకగా దీనికి పేరుంది. సరైన పులివేషధారికి బహుమతులు కూడా ఉంటాయి. త్రిసూర్‌లో ఈ వేడుకలు సెప్టెంబర్‌ 13న ఘనంగా జరుగుతాయి.
తిరువనంతపురంలో జరిగే బాణాసంచా వేడుక ఆ ప్రాంతాన్ని అద్భుత లోకంగా మార్చివేస్తుంది. కొత్త దుస్తులు, సంప్రదాయ వంటలు, నృత్యం, సంగీతాలతో రాష్ట్రమంతటా పాటించే ఆచారాలు ఈ వ్యవసాయ పండుగకు చిహ్నాలు. తిరుఓనమ్‌ సాంప్రదాయిక కేరళ భోజనం తొమ్మిది రకాల వంటకాలతో నోరూరిస్తుంది. దీనిని ‘వన సద్య’ అంటారు. అదనంగా మరో పదకొండు రుచులను అరిటాకుల మీద వడ్డించడానికి కేరళ రెస్టారెంట్లు సిద్ధమవుతాయి. సెప్టెంబర్‌ 7న (తిరుఓనమ్‌) కేరళలోని అన్ని రెస్టారెంట్లలోనూ విందుభోజనాలు ఉంటాయి.

కోయంబత్తూరు నుంచి రైలులో ప్రయాణిస్తే కేరళ చేరుకోవచ్చు. తిరువనంతపురంలోని రైల్వేస్టేషన్‌లో ట్రైన్‌ దిగాక, అక్కడి నుంచి కోవలమ్‌, వెల్లాయని చేరుకోవచ్చు. ఓనమ్‌ ఉత్సవాలు జరిగే త్రిసూర్‌ మధ్య కేరళ ప్రాంతంలో ఉంటుంది. కొచ్చి నుంచి రెండు గంటల ప్రయాణం. రైలు, బస్సు ద్వారా చేరుకోవచ్చు.
వసతి ఇక్కడ బస చేయడానికి పేరొందిన చిన్న, పెద్ద హోటల్స్‌ ఉన్నాయి. పర్యాటక శాఖ వివిధ ప్రాంతాల సందర్శనకు ప్యాకేజీలుఉన్నాయి
మరిన్ని వివరాలకు: కేరళ టూరిజమ్‌ పార్క్‌ వ్యూ,
తిరువనంతపురం
టోల్‌ ఫ్రీ నెం. 1-800-425-4747 ఫోన్‌: +4712321132

%d bloggers like this: