అక్షయ తృతీయ

అక్షయమైన సౌభాగ్యాన్ని, విజయాలను, దైవకటాక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి వైశాఖ శుద్ధ తదియను ‘‘అక్షయతృతీయ’’గా పరిగణిస్తారు. కృతయుగం అక్షయతృతీయరోజునే ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి. నాలుగు యుగాలలో మొదటిది కృతయుగంలో (సత్యయుగం అని కూడా పిలుస్తారు) ప్రతిదీ అక్షయంగా ఉండేదని చెబుతారు. పరశురామావతారం ప్రారంభమైంది ఇదే రోజంటారు. కుబేరుడికి శంఖనిథి, పద్మనిథి అనంతమైన సిరిసంపదలు లభించినది ఇదే రోజంటారు. కుచేలుడు శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుడుని కరుణించిన రోజుకూడా ఇదే నంటారు. క్షీరసాగరమథనం తర్వాత లక్ష్మీదేవి మహావిష్ణువును వరించిన రోజుకూడా ఇదే నంటారు. అక్షయతృతీయ రోజునే విశాఖపట్నంలోని సుప్రసిద్ధ దేవాలయం సింహాచలం శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూపదర్శనం జరుగుతుంది.

అక్షయతృతీయ నాడు రాహుకాలాలు, వ్యర్జ్యాలు ఉండవు ప్రతి నిమిషం కూడా శుభమూహూర్తమే. ఉత్తరాదిలో గృహప్రవేశాలు, వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాలు, అక్షరాభ్యాసాలు ఈరోజే పెట్టుకుంటారు.

పురాణపరంగా….
మత్స్యపురాణంలో పరమేశ్వరుడు పార్వతీ దేవికి అక్షయతృతీయ వ్రత ప్రాశస్త్యాన్ని వివరిస్తాడు. అక్షయుడైన విష్ణుమూర్తే ఈ అక్షయతృతీయకు అథిపతి. సూర్యోదయానికి ముందే లేచి, తలంటుస్నానం చేసి భక్తితో స్వామిని పూజించి, అక్షతలు చల్లుకొని కొత్తబిందెలో పానకాలు పంచుతారు. ఈ రోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం చేసినా ఫలం అక్షయంగా ఉంటుందంటారు. ఇదేరోజు గోసేవ చేస్తారు, లక్ష్మీదేవిని పూజిస్తారు,పితృదేవతలను ఆరాధిస్తారు.

స్తోమత ఉంటే నగనట్రా కొనవచ్చు కానీ అప్పుచేసి కొనకూడదు. అప్పుకూడా అక్షయమవుతుంది. ఈ రోజు ఏది కొన్నాకూడా మంచిదేనంటారు. ఏ పని చేసినా మంచిదే. వేసవికాలం కనుక మజ్జిగ, మంచినీరు ఇవ్వవచ్చు. యాచకులకు చెప్పులు, గొడుగులు ఇవ్వవచ్చు.

%d bloggers like this: