Ringworm….. తామర

గోటితోనే పోతుంది. కానీ గొడ్డలిదాకా తెచ్చుకుంటున్నాం. తామర (రింగ్వామ్) విషయంలో ఇప్పుడు జరుగుతున్నదిదే. ఒకట్రెండు వారాలు మందులేసుకుంటే తగ్గిపోయేది కాస్తా- ఇప్పుడు నెలలకొద్దీ వేధిస్తూ.. మహా మొండిగా తయారవుతోంది. మహిళల్లో అరుదనీ అనుకున్నది- ప్రస్తుతం తరచుగానూ కనిపిస్తోంది. పిల్లలను అసలే అంటుకోనిది- నేడు నెలల పిల్లలనూ పట్టి పీడిస్తోంది. ఇదంతా మన స్వయంకృతాపరాధమే. సిగ్గు, బిడియంతో సమస్యను దాచిపెట్టుకోవటం, డాక్టర్ను సంప్రతించకుండా సొంతంగా.. ముఖ్యంగా స్టిరాయిడ్స్ పూత మందులు కొనుక్కోవటం, వాటిని చాటుమాటుగా వాడుకోవటం, నివారణ చర్యలు పాటించకపోవటం వంటివన్నీ తామర విజృంభణకు దోహదం చేస్తున్నాయి. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే మరింత ప్రమాదంలోకి జారిపోవటం ఖాయం.
ఒకటే దురద. రాత్రిపూట మరింత ఎక్కువ. ఏ పని చేస్తున్నా మనసంతా దాని మీదే. ఎప్పుడూ గోక్కోవాలనే అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు నలుగురు చూస్తున్నారన్న ధ్యాస కూడా ఉండదు. ఇలా తామరతో బాధపడేవారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
నున్నగా నిగనిగలాడే చర్మానికి ‘చెద’ పట్టించే దీనికి మూలం ఫంగస్ ఇన్ఫెక్షన్. గజ్జల్లో తొడలమీద రెండు వైపులా అర్ధచంద్రాకారంలో విస్తరించి, చూడటానికి తామరాకు మాదిరిగా కనబడుతుంటుంది. అందుకే దీన్ని తామర అని పిలుస్తుంటారు. ఫంగస్ బీజకణాలు చర్మం పొలుసుల్లో చాలాకాలం వరకూ జీవించి ఉంటాయి. అందువల్ల ఒక పట్టాన తగ్గకుండా తెగ వేధిస్తుంటుంది.
తగ్గినట్టే తగ్గి తిరిగి విజృంభిస్తుంటుంది. అలాంటి మొండి సమస్య ఇప్పుడు మహా మొండిగానూ మారుతోంది. గత ఏడేళ్లుగా మరింత ఎక్కువగానూ, ఉద్ధృతంగానూ దాడిచేస్తోంది. ఒకప్పుడు చికిత్సతో మూడు, నాలుగు వారాల్లో పూర్తిగా తగ్గిపోయేది. ఇప్పుడు పూత మందులతో పాటు మాత్రలు కూడా వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయినా కూడా వెంటనే తగ్గటం లేదు. మన వ్యక్తిగత అలవాట్ల దగ్గర్నుంచి.. సరైన చికిత్స తీసుకోకపోవటం వరకూ ఎన్నెన్నో కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. స్టిరాయిడ్ పూత మందుల విచ్చలవిడి వాడకం దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. కాబట్టి తామరను తేలికగా తీసుకోవటం తగదు. వైద్యులు, ప్రజలు, ప్రభుత్వం.. అంతా కలిసి కృషి చేస్తేనే దీన్ని సమర్థంగా అడ్డుకోగలం.
మూడు రకాలు
చర్మాన్ని వేధించే ఫంగస్ ఇన్ఫెక్షన్లలో కొన్ని చర్మం పైపొరకు మాత్రమే పరిమితమైతే.. మరికొన్ని చర్మం లోపలి పొరలకూ (సబ్క్యుటేనియస్) విస్తరించొచ్చు. ఇంకొన్ని ఊపిరితిత్తులు, మెదడు వంటి లోపలి అవయవాలకు వ్యాపించొచ్చు కూడా. రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారిలో- ఎయిడ్స్ బాధితులు, గ్లూకోజు నియంత్రణలో లేని మధుమేహుల వంటివారిలో- ఇలాంటి రకం ఇన్ఫెక్షన్లు ఎక్కువ. తామరను తెచ్చిపెట్టే ఫంగస్లు ప్రధానంగా మూడు రకాలు. అవి మైక్రోస్పోరమ్, ట్రైకోఫైటాన్, ఎపిడెర్మోఫైటాన్. వ్యాపించే తీరును బట్టి వీటిని మళ్లీ మూడు రకాలుగా వర్గీకరించుకోవచ్చు.
1 మనిషి నుంచి మనిషికి వచ్చేది (ఆంత్రోపొఫిలిక్): దీన్నే ‘మ్యాన్ లవింగ్ ఫంగస్’ అనీ అంటారు. ఇది ఇన్ఫెక్షన్ గలవారిని తాకటం, వారి వస్తువులను వాడటం వంటి వాటి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ముఖ్యంగా దుస్తుల ద్వారా ఎక్కువగా సంక్రమిస్తుంటుంది. ఒకప్పుడు రజకులు వివిధ కుటుంబాలకు చెందినవారి దుస్తులను ఒకేదగ్గరి కలిపి, ఉతికేవారు. ఎండిన తర్వాత అన్నీ కలిపి తెస్తుండేవారు. వీరిలో ఎవరికైనా తామర ఉంటే అది దుస్తుల ద్వారా ఇతరులకూ వ్యాపించేది. అందుకే దీన్ని ‘దోభీ దురద’ అని కూడా పిలుస్తుంటారు. ఈతకొలనుల్లో ఈదే అలవాటు గలవారికీ ఇది రావొచ్చు.
సాధారణంగా ఈత కొలనులోకి దిగటానికి ముందు, తర్వాత కూడా శుభ్రంగా స్నానం చేయాల్సి ఉంటుంది. చాలామంది ఒకటే బాత్రూమ్ను వాడుకుంటుంటారు. వీరిలో ఎవరికైనా తామర ఉంటే స్నానం చేసినపుడు ఫంగస్ గచ్చుకు అంటుకోవచ్చు. దాన్ని తొక్కితే మిగతావారికీ అంటుకోవచ్చు.
2జంతువుల నుంచి వచ్చేది (జూఫిలిక్): దీన్ని ‘ఎనిమల్ లవింగ్ ఫంగస్’ అని అంటారు. ఇది పిల్లులు, కుక్కలు, కొన్నిరకాల పశువుల వంటి వాటి ద్వారా మనుషులకు అంటుకుంటుంది. పిల్లలు పెంపుడు జంతువులతో ఎక్కువగా ఆడుకుంటుంటారు. అందువల్ల ఇది పిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది. సాధారణంగా జూఫిలిక్ రకం ఫంగస్కు జంతువుల శరీరం అలవాటు పడి ఉంటుంది. అందువల్ల ఫంగస్ వాటికి పెద్దగా ఇబ్బందేమీ కలిగించదు. కానీ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించినపుడు మాత్రం తీవ్రమైన ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. దురద, వాపు వంటి లక్షణాలు మరింత ఉద్ధృతంగానూ ఉంటాయి.
3 నేల నుంచి వ్యాపించేది (జియోఫిలిక్): దీన్ని ‘సాయిల్ లవింగ్ ఫంగస్’ అంటారు. ఇది మట్టి నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఫంగస్ బీజకణాలు నేలలో ఎక్కువకాలం జీవిస్తాయి. కొన్నిసార్లు సంవత్సరాల కొద్దీ జీవించి ఉండొచ్చు. అలాంటి ప్రాంతాల్లో చెప్పుల్లేకుండా నడిచినపుడు, తిరిగినపుడు ఫంగస్ వ్యాపించొచ్చు. వ్యవసాయ పనులు చేసేవారికి, గనుల్లో పనిచేసేవారికి దీని ముప్పు ఎక్కువ.

ఎక్కడెక్కడ? ఎలా?
మన ఒంటి మీద ఆవాసం ఏర్పరచుకునే ఫంగస్ చర్మంలోని కెరటిన్ పొరను తిని జీవిస్తుంటుంది. ఇది ముందు ఒకచోట చిన్నగా గుండ్రంగా ప్రారంభించి.. అక్కడ కెరటిన్ అయిపోయాక ఇంకాస్త ముందుకు జరుగుతుంటుంది. ఇలా చర్మం మీద క్రమంగా రింగులు రింగులుగా.. వలయాకారంలో విస్తరిస్తూ సాగుతుంటుంది (టీనియా కార్పొరిస్). దీంతో అక్కడ చర్మం దెబ్బతిని దురద, ఎరుపు, పొలుసులు, మంట వంటివి వేధిస్తాయి. గజ్జల్లో, తొడల మీద (టీనియా క్రురిస్) కూడా ఇది ఎక్కువగానే కనబడుతుంది. చాలావరకూ దుస్తులు, వస్తువుల ద్వారానే ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. ఇటీవలి కాలంలో కొందరికి లోదుస్తులు వేసుకోవటానికి ఇష్టపడటం లేదు. ఒకవేళ వేసుకున్నా చేతుల్లేని బనియన్లు, బిగుతైన డ్రాయర్లు ధరిస్తుంటారు. సాధారణంగా యుక్తవయసు వచ్చాక చంకల్లో, గజ్జల్లో వెంట్రుకలు మొలుస్తుంటాయి.
అక్కడ చెమట కూడా ఎక్కువగా పోస్తుంటుంది. సరైన లోదుస్తులు వాడకపోతే ఈ చెమట త్వరగా ఆరిపోకుండా ఎక్కువసేపు అలాగే ఉండిపోతుంటుంది. ఇది ఫంగస్ పెరగటానికి అవకాశం కల్పిస్తుంది. ఇటీవలి కాలంలో బిగుతైన జీన్స్ ప్యాంట్ల వాడకం పెరగటమూ ఇందుకు దోహదం చేస్తోంది. జీన్స్ దుస్తులు మందంగా ఉంటాయి. దీంతో గాలి సరిగా ఆడదు, చెమట త్వరగా ఆరదు. దీనికి తోడు చాలామంది వీటిని ఉతక్కుండానే మళ్లీ మళ్లీ ధరిస్తుంటారు. ఒకరు వేసుకున్నవి మరొకరు వాడుతుంటారు కూడా. హాస్టళ్లలో ఇలాంటి ధోరణి ఎక్కువ. ఇలాంటి దుస్తుల్లోకి ఫంగస్ చేరితే ఒక పట్టాన పోదు. ఇది తామర వ్యాపించటానికి, మళ్లీ మళ్లీ దాడిచేయటానికి అవకాశం కల్పిస్తుంది. కొందరిలో పాదాలకూ ఫంగస్ ఇన్ఫెక్షన్ (టీనియా పీడిస్) రావొచ్చు.
ఇది సాక్స్, షూ ద్వారా వ్యాపిస్తుంది. క్రీడాకారులు ఒకరి సాక్స్, షూ మరొకరు వాడుతుంటారు. వీరిలో ఎవరికైనా పాదాలకో, గోళ్లకో ఫంగస్ ఉంటే వీటి ద్వారా మరొకరికి వ్యాపిస్తుంటుంది. అందుకే దీన్ని అథ్లెట్స్ ఫుట్ అనీ పిలుస్తుంటారు. కొందరికి చేతులకు (టీనియా మానమ్) గడ్డం మీద (టీనియా బార్బే), ముఖానికి (టీనియా ఫేసియా), వెంట్రుకల కుదుళ్లకు (టీనియా క్యాపిటస్) తామర రావొచ్చు. తలకు వచ్చే తామర బడి పిల్లల్లో ఎక్కువగా కనబడుతుంటుంది. పిల్లలు పెంపుడు జంతువులకు సన్నిహితంగా ఉండటం, తలను గోక్కొని అవే చేతులతో ఇతరులను తాకటం వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఇక గోళ్లకు వచ్చే ఇన్ఫెక్షన్ (టీనియా అంగ్వమ్) ఒక పట్టాన తగ్గదు. ఇది నయం కావటానికి 3-6 నెలలు పడుతుంది. కాలి బొటనవేలికి ఫంగస్ సోకితే తగ్గటానికి 6-12 నెలలు పట్టొచ్చు కూడా.
ఎలా నిర్ధరిస్తారు?
తామరను చాలావరకు లక్షణాల ఆధారంగానే గుర్తించొచ్చు. అవసరమైతే ఇన్ఫెక్షన్ వచ్చినచోట చర్మం పైపొర నుంచి నమూనాను తీసి పరీక్షిస్తారు. కొన్నిసార్లు కల్చర్ పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఫంగస్ చాలా నెమ్మదిగా పెరుగుతుంది కాబట్టి కల్చర్ ఫలితం రావటానికి 2-4 వారాల సమయం పడుతుంది.
చికిత్స- పూత మందులు, మాత్రలు
చర్మానికి వచ్చే ఫంగస్ ఇన్ఫెక్షన్లకు చాలావరకు పైపూత మందులతోనే మంచి ఫలితం కనబడుతుంది. ఇమిడజోల్ రకం (క్లోట్రైమిజాల్, మైకొనజాల్, ఇకొనజాల్ వంటివి), అలీలమైన్ రకం (నాఫ్టపీన్, బ్యుటనఫీన్, టెర్బనఫీన్) పూత మందులు బాగా పనిచేస్తాయి. ఇప్పుడు సైక్లోఫైరాక్స్ ఓలమిన్ రకం మందులూ అందుబాటులో ఉన్నాయి. పూత మందులు ఫంగస్ కణ విభజనను అడ్డుకుంటాయి. వాటికి ఆహారం అందకుండానూ చేస్తాయి. అంటే ఒకవైపు ఫంగస్ వృద్ధి కాకుండా చూస్తూనే మరోవైపు వాటికి ఆహారం అందకుండా చేస్తూ అవి చనిపోవటానికి దోహదం చేస్తాయన్నమాట. పూత మందులతో ఫలితం కనబడకపోతే మాత్రలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వెంట్రుకల కుదుళ్లు, గోళ్ల వంటి భాగాల లోపలికి పూత మందులు సరిగా వెళ్లవు. అందువల్ల ఇన్ఫెక్షన్ అంత తేలికగా తగ్గదు. అలాగే మధుమేహం, రోగనిరోధకశక్తి తగ్గినవారిలోనూ ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గవు. ఇలాంటివారికి అవసరాన్ని బట్టి గ్రీసియోఫుల్విన్ రకం, ఇమిడజోల్ రకం (ఫ్లూకొనజోల్, కీటోకొనజోల్, ఐట్రికొనజోల్), అలీలమైన్ రకం (టెర్బనఫీన్) మాత్రలు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో తామర చాలావరకు తగ్గుతుంది.
దుస్తులను వేడినీటిలో ఉతికితేనే.. అదీ కనీసం అరగంట నుంచి గంటసేపు వేడినీటిలో ఉంచితే గానీ ఫంగస్ చనిపోదు. చన్నీళ్లతో ఉతికితే అలాగే ఉండిపోతుంటుంది. మందంగా, బిగుతుగా ఉండే దుస్తుల్లోనైతే ఫంగస్ మరింత ఎక్కువకాలం జీవించి ఉంటుంది కూడా.
స్టిరాయిడ్ పూత మందులతో దురద, ఎరుపు వంటివి వెంటనే తగ్గుముఖం పట్టినా అదంతా మూణ్నాళ్ల ముచ్చటే. త్వరలోనే తిరిగి ఇన్ఫెక్షన్ విజృంభిస్తుంది. ఈసారి అది మరింత బలం పుంజుకొని, మొండిగానూ తయారవుతుంది.

స్టిరాయిడ్ పూతలతో అనర్థం
మొండిగా తయారైన తామరకు చికిత్స కూడా కష్టమే. దీనికి పూత మందులతో పాటు 2-6 నెలల పాటు మాత్రలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే మందుల మోతాదునూ పెంచాల్సి రావొచ్చు. దీంతో పిలల్లో కాలేయం దెబ్బతినటం వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. కాబట్టి మరింత జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సి వస్తుంది.
గతంలో తామరకు చికిత్స తీసుకుంటే 3-4 వారాల్లో నయమయ్యేది. ఇప్పుడు నెలలకొద్దీ మందులు వాడినా తగ్గటం లేదు. ఇలా ఇది మొండి సమస్యగా మారటానికి ప్రధాన కారణం స్టిరాయిడ్స్ కలిపిన పూత మందుల వాడకం పెరగటం. స్టిరాయిడ్లతో పాటు యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియా మందులనూ కలిపి వీటిని తయారుచేస్తున్నారు. ఒకప్పుడు బీటామెతజోన్ అనే స్టిరాయిడ్ పూత మందు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇది దురద, ఎరుపు, వాపు వంటివి తగ్గటానికి బాగా తోడ్పడే దీంతో పెద్ద దుష్ప్రభావాలేవీ ఉండేవి కావు. అందువల్ల పేదలందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ధరల నియంత్రణ కిందికి తీసుకొచ్చింది. దీంతో ధర బాగా తగ్గిపోయింది. అయితే ఔషధ కంపెనీలు లాభాపేక్షతో.. ధరల నియంత్రణ నుంచి తప్పించుకోవటానికి బీటామెతజోన్కు బదులు శక్తిమంతమైన క్లొబిటజోల్ ప్రొపినేట్ అనే స్టిరాయిడు కలిపిన పూతమందులను మార్కెట్లోకి తేవటంతో పరిస్థితి మారిపోయింది. సాధారణంగా ఫంగస్ ఇన్ఫెక్షన్ దాడిచేసినపుడు దాన్ని ఎదుర్కోవటానికి మన శరీరం అక్కడ రోగనిరోధక ప్రతిస్పందనలు పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
ఇలా ఇన్ఫెక్షన్ మరింత విస్తరించకుండా చూసుకుంటుంది. అయితే స్టిరాయిడ్ పూత మందులను రాసినపుడు ఈ రోగనిరోధక ప్రతిస్పందనలు నెమ్మదిస్తాయి. దీంతో లక్షణాలు తాత్కాలికంగా తగ్గినట్టు కనిపించినా ఇన్ఫెక్షన్ మాత్రం వ్యాపిస్తూనే ఉంటుంది. వారం, పది రోజులకు ఇన్ఫెక్షన్ మళ్లీ విజృంభిస్తుంది. దీంతో మళ్లీ స్టిరాయిడ్ పూతమందు కొనుక్కొని వాడుకోవటం ఆరంభిస్తారు. ఇలా చివరికి ఇదొక విష వలయంలా తయారవుతుంది. ఈ క్రమంలో ఇన్ఫెక్షన్ ఇంట్లో మిగతావాళ్లకూ అంటుకుంటుంది. పైగా ఇది అప్పటికే ఫంగల్ మందులకు లొంగని విధంగానూ మారిపోయి ఉంటుంది కూడా. ఇన్ఫెక్షన్ తలెత్తిన చోట ఫంగల్ మందులు ఎంత ఎక్కువసేపు ఉంటే అంత ఎక్కువ ప్రభావం చూపుతాయి. కానీ స్టిరాయిడ్స్ వీలైనంత త్వరగా మందును బయటకు పంపటానికే ప్రయత్నిస్తుంటాయి. ఇది ఫంగస్ బలపడి మరింత మొండిగా తయారవటానికి అవకాశం కల్పిస్తోంది.
దీంతో గతంలో ఒక్క పూత మందులతోనే 4 వారాల్లో తగ్గిపోయే తామరకు ఇప్పుడు నెలల కొద్దీ మాత్రలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. మరో ప్రమాదమేంటంటే- స్టిరాయిడ్ పూత మందులతో తాత్కాలింకగా ఇన్ఫెక్షన్ తగ్గినచోట దురద, పొక్కుల వంటి సాధారణ లక్షణాలేవీ కనబడకపోవటం. దీని మూలంగా సమస్యను గుర్తించటం, నిర్ధరించటమూ కష్టమవుతోంది. కొందరికి చర్మం దెబ్బతిని పులిచారలు (స్ట్రెచ్ మార్క్స్), మొటిమల వంటివీ ఏర్పడొచ్చు. స్టిరాయిడ్ పూత మందుల వల్ల ఇన్ఫెక్షన్ హద్దులు (మార్జిన్స్) మాయమవుతాయి. దీంతో పొలుసులు కనబడవు. అందువల్ల పరీక్ష చేసినా ఫంగస్ బయటపడదు.
సిగ్గు, బిడియంతో డాక్టర్కు చూపించుకోకపోవటం.. సొంతంగా మందులు కొనుక్కొని వాడుకోవటం.. ఇంట్లో వాళ్లకు తెలియకుండా సమస్యను దాచుకోవటం.. ఒకరి దుస్తులు, వస్తువులు మరొకరు వాడటం వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. కొందరు వైద్యులు కూడా తెలిసో తెలియకో ఇలాంటి మందులు సిఫారసు చేయటమూ కనబడుతోంది. ఇది మంచి పద్ధతి కాదు. నిజానికి స్టిరాయిడ్లు కలిపిన ఇలాంటి పైపూత మందులు ప్రపంచంలో మరెక్కడా అందుబాటులో లేవు. అందుకే వీటి దుర్వినియోగాన్ని అరికట్టటానికి చర్మ, సుఖ, కుష్టు నిపుణుల సంఘం (ఐఏడీవీఎల్) గట్టిగా పోరాడుతోంది.
నివారణే అత్యుత్తమం
తామర వచ్చాక బాధపడే కన్నా అసలు దీని బారినపడకుండా చూసుకోవటమే అత్యుత్తమం. ఇందులో మన వ్యక్తిగత పరిశుభ్రతే కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని అందరూ గుర్తించాలి.
– చెమట ఎక్కువగా పోసే చంకలు, గజ్జల్లో తడి లేకుండా చూసుకోవటం ముఖ్యం. ఫుల్ బనియన్లు, డ్రాయర్లు.. అవీ కాటన్వే ధరించాలి. అలాగే లోదుస్తులు మరీ బిగుతుగా లేకుండా చూసుకోవాలి.
– ఒకరి దుస్తులు, జీన్స్, సాక్స్, టీషర్టులు, తువ్వాళ్ల వంటివి మరొకరు వాడకూడదు.
– తామరతో బాధపడేవారి దుస్తులను ఇతరుల దుస్తులతో కలపకూడదు. వీటిని విడిగానే ఉతకాలి. వాషింగ్ మిషన్లో వేయకూడదు.
– చన్నీటితో దుస్తులు ఉతికినా తామరకు దారితీసే ఫంగస్ అలాగే ఉండిపోతుంది. కాబట్టి తామరతో బాధపడేవారి లోదుస్తులు, జీన్స్ ప్యాంట్ల వంటి వాటిని తప్పకుండా గంటసేపు వేడినీటిలో నానబెట్టాలి. ఈ వేడి నీటిలో ఇతరత్రా సూక్ష్మక్రిమి నాశక ద్రావణాలు కలపాల్సిన అవసరమేమీ లేదు.
– శుభ్రంగా ఉతికిన తర్వాత దుస్తులను ఎండలో బాగా ఆరబెట్టాలి. ఇస్త్రీ చేసుకోవటం మరీ మంచిది. దీంతో ఆ వేడికి ఫంగస్ చనిపోతుంది.
– గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. ఇది ఒంటిపై ఒక చోటు నుంచి మరొక చోటుకు ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా చూసుకోవటానికే కాకుండా అది ఇతరులకు అంటుకోకుండా కాపాడుకోవటానికీ తోడ్పడుతుంది.
– దురద వంటి లక్షణాలు వేధిస్తుంటే సొంత వైద్యం ఏమాత్రం పనికిరాదు. సిగ్గు, బిడియం లేకుండా వెంటనే డాక్టర్ను సంప్రతించి తగు చికిత్స తీసుకోవాలి. లక్షణాలు తగ్గుముఖం పట్టినా డాక్టర్ చెప్పినంత కాలం మందులు వాడుకోవాలి.
– తాత్కాలికంగా గుణం చూపించే స్టిరాయిడ్ కలిపిన పూత మందులు అసలే వాడకూడదు.
-స్నేహితులో, చుట్టుపక్కలవాళ్లో చెప్పిన సలహాలను గుడ్డిగా నమ్మటం తగదు. అలాగే ఇంటర్నెట్లో, సామాజిక మాధ్యమాల్లో కనబడే చిట్కాలను నిపుణుల సలహాకు ప్రత్యామ్నాయంగా భావించరాదు.

%d bloggers like this:
Available for Amazon Prime