Posted in క్యాన్సర్

Lung Cancer / ఊపిరితిత్తుల కేన్సర్

భోజనం చేయకుండా కొద్దిరోజులు జీవించొచ్చు. నీళ్లు తాగకుండా కొన్ని గంటలు గడపొచ్చు. కానీ శ్వాస తీసుకోకుండా ఒక్క క్షణమైనా నిలవలేం. మన ప్రాణాలు నిలబడటానికి అత్యవసరమైన ఆక్సిజన్‌ అందటం నిమిషం ఆలస్యమైనా ఉక్కిరిబిక్కిరైపోతాం. కాబట్టే వూపిరితిత్తులకు అంతటి ప్రాధాన్యం. ఇవి ప్రకృతి నుంచి లభించే ఆక్సిజన్‌ను శ్వాస ద్వారా లోపలికి తీసుకుంటూ.. దాన్ని రక్తం ద్వారా అన్ని కణాలకు సరఫరా అయ్యేలా చేస్తూ.. అవసరం లేని కార్బన్‌ డయాక్సైడ్‌ను బయటికి పంపిస్తూ.. మన జీవం, జీవితం సజావుగా సాగటానికి నిరంతరం అలుపెరగకుండా పనిచేస్తుంటాయి. ఇలాంటి వూపిరితిత్తుల్లో ఏ చిన్న సమస్య తలెత్తినా ఇబ్బందే. అలాంటిది అనుక్షణం శరీరాన్ని కబళిస్తూ.. అహరహం నిర్వీర్యం చేసే క్యాన్సర్‌ ముంచుకొస్తే? పచ్చగా కళకళలాడే చెట్టుకు చీడ సోకితే వాడిపోయినట్టుగానే.. మనకు వూపిరిని అందించే తిత్తులూ వాడిపోవటం మొదలెడతాయి. పైగా వూపిరితిత్తుల క్యాన్సర్‌తో ముప్పేటంటే.. నూటికి 80% మందిలో ఇది బాగా ముదిరిన తర్వాతే బయటపడటం. దీంతో నయం కావటం అటుంచి.. అదుపులో పెట్టుకోవటమే కష్టమవుతోంది. ఒకప్పటి కన్నా ఇప్పుడు మంచి చికిత్సలు అందుబాటులోకి వచ్చినా.. ఇంకా ఇది కొరకరాని కొయ్యగానే సవాల్‌ చేస్తోంది. వూపిరితిత్తుల క్యాన్సర్‌ ఎందుకొస్తుందో కచ్చితంగా తెలియదు. ఎవరికి వస్తుందో తెలియదు. కానీ రావటానికి దోహదం చేసే కొన్ని కారణాలను మాత్రం మనం తప్పకుండా నిలువరించుకోవచ్చు.
మన ప్రాణానికి, జీవానికి శ్వాస అత్యంత కీలకం. గుండె కొట్టుకోవటం వంటి ఇతర ప్రక్రియలు సజావుగా జరుగుతున్నా.. శ్వాస సరిగా సాగకపోతే శరీరం వెంటనే కుప్పకూలుతుంది. తగినంత ఆక్సిజన్‌ అందక కణాలన్నీ చేతులెత్తేస్తాయి. కాబట్టే వూపిరితిత్తులకు ఎలాంటి సమస్య వచ్చినా భరించటం కష్టం. ఇక క్యాన్సర్‌ వంటి తీవ్ర సమస్యలు ముంచుకొస్తే జీవితం మరింత నరకప్రాయంగా మారుతుంది. మనదేశంలో అతి ఎక్కువగా కనబడే ఐదు రకాల క్యాన్సర్లలో వూపిరితిత్తుల క్యాన్సర్‌ ఒకటి. ఒకప్పుడు పురుషుల్లో నోటి క్యాన్సర్‌, గొంతు క్యాన్సర్‌, జీర్ణాశయ క్యాన్సర్లు ఎక్కువగా కనబడుతుండేవి. ఇప్పుడు వూపిరితిత్తుల క్యాన్సర్‌ వీటన్నింటినీ అధిగమించి ప్రథమ స్థానాన్ని ఆక్రమించేసింది. స్త్రీలు, పురుషులు..
ఇద్దరినీ పరిగణనలోకి తీసుకుంటే రొమ్ము క్యాన్సర్‌ తర్వాత రెండో స్థానం కూడా దీనిదే కావటం గమనార్హం. మనదేశంలో కొత్తగా బయటపడుతున్న క్యాన్సర్‌ కేసుల్లో 6.9% కేసులు వూపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించినవే. క్యాన్సర్ల మూలంగా చనిపోతున్న వారిలో 9.3% మంది వూపిరితిత్తుల క్యాన్సర్‌ బాధితులే. అయినా కూడా మన సమాజంలో దీనిపై చాలామందికి అవగాహన ఉండటం లేదు. దీనిలోనూ క్షయ మాదిరి లక్షణాలు కనబడుతుండటం పొరబడటానికి దారితీస్తోంది. క్షయకు చికిత్స తీసుకుంటున్నా కూడా లక్షణాలు తగ్గుముఖం పట్టకపోయిన సందర్భాల్లోనూ క్యాన్సర్‌ను అనుమానించటం లేదు. అలాగే విచ్చలవిడిగా పెరిగిపోతున్న పొగాకు అలవాట్లు, వాయు కాలుష్యం వంటివీ వూపిరితిత్తుల క్యాన్సర్‌కు ఆజ్యం పోస్తున్నాయి.

లక్షణాలేంటి?
వూపిరితిత్తులకు మాత్రమే పరిమితమైన కణితులు, ఇతర భాగాలకు విస్తరించిన కణితులను బట్టి వేర్వేరు లక్షణాలు కనబడుతుంటాయి.
* విడవకుండా దగ్గు
* శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది
* కళ్లెలో రక్తం పడటం
* బరువు తగ్గటం
* ఆకలి తగ్గిపోవటం
* గొంతు బొంగురు పోవటం
* ముద్ద మింగటంలో ఇబ్బంది
* ఆయాసం
* బ్రాంకైటిస్‌, న్యుమోనియా
* జ్వరం
* నిస్సత్తువ
* కామెర్లు
* తలనొప్పి, వాంతి
* నాడీ సమస్యలు

దశలను బట్టి చికిత్స
వూపిరితిత్తుల క్యాన్సర్‌లో ఆయా దశలను బట్టి కీమోథెరపీ, రేడియోథెరపీ, టార్గెటెడ్‌ థెరపీ, ఇమ్యూనో థెరపీల్లో ఎవరికి, ఏది పనికొస్తుందనేది నిర్ణయిస్తారు.
1, 2 దశల్లో..
* మొదటి, రెండో దశ కణితులకు శస్త్రచికిత్స ఉత్తమమైన పద్ధతి. ఇందులో కణితి ఏర్పడిన భాగాన్ని పూర్తిగా తొలగిస్తారు. అవసరమైతే ఒక భాగాన్ని (లోబ్‌), ఒక వూపిరితిత్తి మొత్తాన్ని కూడా తొలగించాల్సి రావొచ్చు. శస్త్రచికిత్సతో కణితిని తొలగించినప్పటికీ.. కంటికి కనిపించని అతి సూక్ష్మమైన క్యాన్సర్‌ కణాలు ఛాతీలోనో, మరెక్కడో ఇంకా లోపలే ఉండిపోవచ్చు. ఇవి పెట్‌ స్కాన్‌లోనూ కనబడనంత చిన్నగానూ ఉండొచ్చు. ఒకవేళ క్యాన్సర్‌ కణాలు లోపల మిగిలిపోతే జబ్బు తిరగబెట్టే ప్రమాదముంది. అందువల్ల బయటకు తీసిన కణితిని పరిశీలించి.. జబ్బు తిరగబెట్టే అవకాశం ఎంత వరకు ఉందనేది అంచనా వేస్తారు. తిరగబెట్టే అవకాశం ఉంటే కీమో థెరపీ, రేడియో థెరపీ చేయాల్సి ఉంటుంది. కణితిని పూర్తిగా తొలగించటం సాధ్యం కానప్పుడు కొంత భాగం లోపలే వదిలేస్తుంటారు. ఇలాంటి వారికి కీమోతో పాటు రేడియోథెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
3వ దశలో..
* వీరికి ఒకే సమయంలో కీమోథెరపీ, రేడియోథెరపీ చేయాల్సి ఉంటుంది. కొందరికి శస్త్రచికిత్స కూడా చేయాల్సి రావొచ్చు. కణితి ఏర్పడిన చోటు, సైజు, లింఫ్‌ గ్రంథుల ఉబ్బు వంటి వాటిని బట్టి దీన్ని నిర్ణయిస్తారు. అయితే మూడో దశలో చికిత్స చేసినా క్యాన్సర్‌ నయమయ్యే అవకాశం 30% మాత్రమే. 70% మందిలో జబ్బు పూర్తిగా తగ్గకపోవచ్చు. ఒకవేళ తగ్గినా మళ్లీ తిరగబెట్టొచ్చు. 4వ దశలో..
* నాలుగో దశలో క్యాన్సర్‌ నయం కావటం దాదాపు అసాధ్యం. అందువల్ల రోగికి ఇతరత్రా సమస్యలేవీ లేకుండా.. బతికినంతకాలం ఇంట్లో హాయిగా జీవించేలా చూసేందుకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయంలో ‘టార్గెటెడ్‌ థెరపీ’ బాగా ఉపయోగపడుతుంది. కీమోథెరపీ క్యాన్సర్‌ కణాల మీదే కాదు. ఇతర కణాలపైనా ప్రభావం చూపుతుంది. దీంతో జుట్టు రాలటం, వాంతులు, రక్తకణాలు తగ్గటం, రోగనిరోధకశక్తి క్షీణించటం వంటి దుష్ఫలితాలు తలెత్తొచ్చు. అంటే చికిత్సతో ఒనగూడే ప్రయోజనం కన్నా సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదముంది. కాబట్టి వీరికి టార్గెటెడ్‌ థెరపీయే మంచిది. ఇందులో క్యాన్సర్‌ వృద్ధి చెందటానికి కారణమవుతున్న ప్రోటీన్‌ను గుర్తించి, అది పనిచేయకుండా చేసే మాత్రలు ఇస్తారు. వీటిని వేసుకుంటూ రోజువారీ పనులన్నీ చేసుకోవచ్చు. రెండు వారాల్లో దీని ప్రభావం కనబడుతుంది. పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవు. క్యాన్సర్‌ వృద్ధికి దోహదం చేస్తున్న ప్రోటీన్ల వంటివి కనబడనివారికి కీమోథెరపీ చేయాల్సి ఉంటుంది.
* రోగనిరోధకవ్యవస్థను ప్రేరేపించి క్యాన్సర్‌ కణాలను నిర్వీర్యం చేసే ‘ఇమ్యూనోథెరపీ’ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఇది గతి తప్పిన కణాలను గుర్తించే, వాటిని నిర్వీర్యం చేసే యంత్రాంగాలను తిరిగి ప్రేరేపితం చేస్తూ.. క్యాన్సర్‌ కణాలను చంపుతుంది.
జీవనకాలం మెరుగు టార్గెటెడ్‌, ఇమ్యూనోథెరపీలు ఆయా రకాలకు, వ్యక్తులకు అనుగుణంగా చికిత్స చేయటానికి బాగా తోడ్పడతాయి. వీటి ద్వారా 60% మందికి కీమోథెరపీని తప్పించే అవకాశముంది. ఇవి చాలాకాలం పనిచేస్తాయి కూడా. వీటి రాకతో జీవనకాలం గణనీయంగా పెరిగింది. గతంలో వూపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడితే ఆరు నెలల కన్నా ఎక్కువకాలం జీవించేవారు కాదు. ఇప్పుడు దాదాపు 25% మంది ఐదేళ్లకు పైగా జీవిస్తున్నారు! అయితే ఏదో ఒక చికిత్సకు మాత్రమే సరిపోయేవారి కన్నా అన్ని రకాల చికిత్సలకు అనుగుణంగా ఉన్నవారు ఎక్కువకాలం జీవించే అవకాశముంటుంది.
క్షయకు దగ్గరి పోలిక వూపిరితిత్తుల క్యాన్సర్‌, క్షయ..రెండింట్లోనూ దగ్గు, ఆయాసం, బరువు, ఆకలి తగ్గటం, జ్వరం వంటి లక్షణాలు కనబడుతుంటాయి. దీంతో వీటి మధ్య తేడాను గుర్తించటం చాలా కష్టమవుతోంది. వూపిరితిత్తుల క్యాన్సర్‌ చికిత్స కోసం వచ్చేవారిలో క్షయ చికిత్స తీసుకొని, ఇంకా దగ్గు తగ్గలేదని వచ్చేవారు దాదాపు 15-50% మంది కనబడుతుంటారు. అప్పటికే వీరిలో క్యాన్సర్‌ ముదిరిపోయి ఉంటుంది. అందువల్ల వీలైనంత త్వరగా వీటి మధ్య తేడాను గుర్తించటం చాలా అవసరం. సాధారణంగా క్షయ చికిత్స ఆరంభించిన మూడు, నాలుగు వారాల్లో లక్షణాలు తగ్గుముఖం పట్టాలి. ఆరోగ్యమూ కాస్త మెరుగవ్వాలి. లేకపోతే వెంటనే అప్రమత్తం కావాలి. ఎక్స్‌రే, సీటీస్కాన్‌.. అవసరమైతే బయాప్సీ చేసి వూపిరితిత్తుల క్యాన్సర్‌ ఉందేమో చూడాలి.
ఆలస్యమే.. పెద్ద సమస్య
వూపిరితిత్తుల క్యాన్సర్‌తో పెద్ద చిక్కటేంటంటే చాలా ఆలస్యంగా బయటపడుతుండటం. వూపిరితిత్తి పెద్ద అవయం. దీనిలో కణితి తలెత్తినా కూడా.. అది కీలకమైన భాగాలకు తగిలేంత వరకూ ఎలాంటి లక్షణాలు కనబడవు. అందువల్ల వూపిరితిత్తుల క్యాన్సర్‌ బయటపడేసరికే ముదిరిపోయి ఉంటోంది. ఇతరత్రా జబ్బుల్లో చేసే పరీక్షల్లో యాదృచ్ఛికంగా బయటపడటం తప్పించి.. తొలి దశలో వూపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తించటం చాలా అరుదు. సుమారు 70-80% మందిలో ఇది మూడు, నాలుగు దశల్లోనే బయటపడుతోంది. దీన్ని ఒకటో దశలోనే గుర్తించి శస్త్రచికిత్స చేయగలిగితే 90% వరకు నయం చేయొచ్చు. రెండో దశలో 70% వరకు నయం కావొచ్చు. అదే మూడో దశలో నయమయ్యే అవకాశం 30 శాతానికి పడిపోతుంది. ఇక నాలుగో దశలోనైతే నయం కావటం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి.
నివారణ కీలకం
వూపిరితిత్తుల క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించటం కష్టం. అందుకే అమెరికా వంటి దేశాల్లో వూపిరితిత్తుల క్యాన్సర్‌కు ముందస్తు పరీక్షలు చేస్తున్నారు. 55 ఏళ్లు పైబడి.. 20 ఏళ్లకు పైగా పొగ తాగే అలవాటున్నవారికి ఏడాదికి ఒకసారి తక్కువ మోతాదు సీటీస్కాన్‌ పరీక్ష చేస్తున్నారు. కానీ మనదేశంలో ఇదంత సులువైన పని కాదు. అందువల్ల నివారణ మీదే దృష్టి పెట్టటం చాలా అవసరం. క్యాన్సర్‌కు దారితీసే పొగాకు జోలికి వెళ్లకపోవటం అన్నింటికన్నా మంచిది. ఒకవేళ పొగ తాగటం, పొగాకు నమలటం అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మద్యం పరిమితం చేసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అధికబరువు, వూబకాయాన్ని తగ్గించుకోవాలి. పరీక్షలు: మూడు ప్రధానం
వూపిరితిత్తుల క్యాన్సర్‌ను నిర్ధరిచటంతో పాటు అది ఏ దశలో ఉందనేది గుర్తించటమూ చాలా అవసరం. ఎలాంటి చికిత్స చేయాలనేది దీని దశల ఆధారంగానే నిర్ణయిస్తారు. ఇందుకు ప్రధానంగా మూడు రకాల పరీక్షలు తోడ్పడతాయి.
* ఎక్స్‌రే: వూపిరితిత్తుల క్యాన్సర్‌ను అనుమానిస్తే ముందు ఎక్స్‌రే తీస్తారు. కణితి నీడ ఏదైనా ఉంటే బయటపడుతుంది. నీరు చేరిందా? ఛాతీలో గుండె సరైన స్థానంలో ఉందా? శ్వాసనాళం ఎలా ఉంది? అనేవీ ఇందులో తెలుస్తుంది.
* సీటీ స్కాన్‌: క్యాన్సర్‌ ఉన్నట్టు అనుమానిస్తే, లక్షణాలు కూడా అనుగుణంగానే కనబడుతుంటే సీటీ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. కణితి ఉంటే ఇందులో స్పష్టంగా బయటపడుతుంది.
* బయాప్సీ: కణితి ఉన్నట్టు తేలితే దాన్నుంచి చిన్న ముక్కను బయటకు తీసి (బయాప్సీ) పరీక్షిస్తారు. దీంతో క్యాన్సర్‌ నిర్ధరణ కావటమే కాదు, అది ఏ రకానికి (స్మాల్‌ సెల్‌, నాన్‌ స్మాల్‌ సెల్‌) చెందినదనేదీ తెలుస్తుంది.
* ఇతర పరీక్షలు: అవసరమైతే ఇతరత్రా వివరాల కోసం మరోసారి సీటీ స్కాన్‌, ఎముక స్కాన్‌, పెట్‌ స్కాన్‌ వంటివి చేస్తారు. దీంతో క్యాన్సర్‌ ఏ దశలో ఉంది, ఎక్కడెక్కడికి విస్తరించిందనేది బయటపడుతుంది.
నాలుగు దశలు
వూపిరితిత్తుల క్యాన్సర్‌ 4 దశలుగా కనబడుతుంది.
* స్టేజ్‌ 1: కణితి కేవలం ఒక వూపిరితిత్తిలోనే ఏర్పడటం. లింఫ్‌ గ్రంథులకు విస్తరించకపోవటం.
* స్టేజ్‌ 2: కణితి లింఫ్‌ గ్రంథులకు విస్తరించటం.
* స్టేజ్‌ 3: ప్రధాన శ్వాసనాళం చుట్టూరా ఉండే లింఫ్‌ గ్రంథులకు, ఛాతీ గోడకు, డయాఫ్రంకు కణితి విస్తరించటం.
* స్టేజ్‌ 4: వూపిరితిత్తుల్లో, గుండె చుట్టూ నీరు చేరటం.. కణితి ఇతర భాగాలకు విస్తరించటం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s