Posted in కాళ్ల జబ్బులు

Bone Fracture

విరిగిన ఎముకలు వాటంతట అవే అతుక్కుంటాయి. అతుక్కునే శక్తి ప్రకృతి సహజంగానే ఎముకలకు ఉంది. కాకపోతే మనం చెయ్యాల్సిందల్లా.. అవి అతుక్కునేలా దగ్గరగా చేర్చటం! అలా స్థిరంగా ఉంచటం!! వంకర టింకరగా, అడ్డదిడ్డంగా అతుక్కుపోకుండా.. సజావుగా, సరైన తీరులో అతుక్కునేలా చూడటం!!! అంతే!
కానీ ఇప్పటికీ మన సమాజంలో ఈ వాస్తవం చాలామందికి తెలియటం లేదు. అందుకే ఎముకలు విరిగినప్పుడు నానా రకాలుగా గందరగోళ పడుతున్నారు. ఎముకలు అతుక్కునేందుకంటూ మందుమాకులు, పసర్లు, నాటు వైద్యాల వంటివాటన్నింటినీ ఆశ్రయిస్తున్నారు. అపోహల్లో కూరుకుని, అనవసర సమస్యలనూ తెచ్చుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మన సమాజం- ఎముకలు విరిగినప్పుడు ఏం చెయ్యాలో తెలుసుకోవటం ఎంత అవసరమో.. ఏం చెయ్యకూడదో తెలుసుకోవటం కూడా అంతే అవసరం.
మన శరీరానికి బలమైన మూలాధార పంజరం.. ఎముకలే!
గట్టిగా, దృఢంగా ఉంటాయి కాబట్టి దెబ్బ తగిలినప్పుడు ఎముక చిట్లటం లేదా విరగటం సహజం. ఈ సమస్య మనిషిని అనాదిగా వేధిస్తున్నదే. వాస్తవానికి ఎముక కూడా సజీవ కణజాలమే. అయితే దీనిలో దట్టంగా పేరుకున్న క్యాల్షియం, అక్కడి ప్రోటీన్ల ప్రత్యేకమైన కలయిక మూలంగా ఎముక చాలా గట్టిగా, దృఢంగా ఉంటుంది. శరీరానికి సుస్థిర ఆకారాన్ని తెస్తుంది. చాలా బరువు కూడా మోస్తుంది. ఎంతో బలమైన ఒత్తిడికి గురైనప్పుడు మాత్రమే ఈ ఎముక విరుగుతుంది. ఎముక విరిగిందంటే దాని మీద బలమైన ఒత్తిడి పడినట్లే! ఎముకలు విరగటమన్నది మన సమాజం ఎదుర్కొంటున్న సర్వసాధారణమైన, అతిపెద్ద సమస్య. వాహనాలు, ప్రయాణాలు, వాటితో పాటే ప్రమాదాలు పెరుగుతున్న ఈ ఆధునిక కాలంలో ఈ సమస్యా పెరిగిపోతోంది.
విరుగుట: పలు రకాలు!
తగిలిన దెబ్బ, దాని తీవ్రతను బట్టి ఎముకలు రకరకాలుగా విరగొచ్చు. లోతుగా పరిశీలించి వైద్యశాస్త్రం వీటిని ఎన్నో రకాలుగా వర్గీకరిస్తోందిగానీ స్థూలంగా 4 రకాలను చెప్పుకోచ్చు.
– -చిట్లటం: తగిలిన దెబ్బకు ఎముక మీద ఒకవైపు కాస్త పగులు వచ్చి చిట్లొచ్చు. దీన్ని ‘హెయిర్‌లైన్‌ ఫ్రాక్చర్‌’ అంటారు. చిట్లినా కూడా ఎముక ఆకారం స్థిరంగానే ఉంటుంది కాబట్టి పైకేమీ తేడా కనిపించదు. ఎక్స్‌రే తీస్తే పగుళ్లు కనబడొచ్చు. గాయమైన భాగం కదలకుండా పట్టీవేసి, విశ్రాంతి ఇస్తే చాలు, ఇవి చాలావరకూ వాటంతటవే మానిపోతాయి.
– -విరగటం: ఎముక విరిగి.. ఎక్కడిదక్కడే ఉండిపోతే దీన్ని సింపుల్‌ ఫ్రాక్చర్‌ అంటారు. విరిగినవి కదలకుండా చూసుకోవటం ముఖ్యం. ఇందుకోసం పైన సిమెంటు పట్టీ వేస్తే సరిపోతుంది. దీంతో ఎముక కదలిక ఆగిపోతుంది, నొప్పి తగ్గుతుంది. నాలుగు వారాల్లో ఎముక అతుక్కుంటుంది. అయితే ఈ మధ్యలో తరచూ ఎక్స్‌రే తీస్తూ, ఒకవేళ ఎముక బెసిగిపోతోందేమో గమనిస్తుండటం ముఖ్యం.
– -విరిగి బెసగటం: ఎముక పూర్తిగా విరిగి, అటూ ఇటూ జరిగిపోతే ముందు దాన్ని సరైన స్థితికి తీసుకురావాలి. మత్తుమందు ఇచ్చి వాటిని సరిచేసి, కదలకుండా పట్టీ వెయ్యచ్చు. పైనుంచి సరిచేయలేని స్థితిలో ఆపరేషన్‌ చేసి లోపల రాడ్‌, ప్లేట్ల వంటివి అమరస్తారు. దీంతో ఎముక అతుక్కుంటుంది. లోపల ప్లేట్లు అమర్చే అవకాశం లేకపోతే పై నుంచే రాడ్స్‌ వేసి స్థిరపరుస్తారు.
– -ముక్కలవటం: ఎముక విరిగి ముక్కలు ముక్కలైతే.. వాటన్నింటినీ యథాస్థానానికి తెచ్చి జోడించాల్సిన అవసరం ఉండదు. కష్టపడి జోడించినా రక్తసరఫరాలో ఇబ్బందులొచ్చి సరిగా అతక్క పోవచ్చు. అందుకని ఇలాంటప్పుడు ఆ ముక్కల జోలికిపోకుండా- ప్లేట్‌ వేయటం ద్వారా ఎముక పైభాగాన్నీ, కింది భాగాన్నీ బలంగా స్థిరపరిచే ‘మినిమల్లీ ఇన్‌వేసివ్‌ ప్లేట్‌ ఆస్టియోసింథసిస్‌ (మిపో)’ విధానం ఉపకరిస్తుంది. ఈ సమయంలో ఎముక పొడవు, వంపు మాత్రం సరిగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. దీంతో కొంతకాలానికి ఆ ముక్కల చుట్టూ కొత్త ఎముక ఏర్పడి అవన్నీ ముద్దలా దగ్గరకు అతుక్కుపోతాయి.
– -గాయంతో: ఎముక విరగటంతో పాటు పెద్ద పుండు, గాయం కూడా ఉన్నప్పుడు దానికి అత్యవసరంగా చికిత్స చెయ్యాలి. గాయం చూసి చాలామంది రక్తం కారిపోతోందని భయపడుతుంటారు. దానికంటే కూడా ముఖ్యం- ఆ ప్రాంతాన్ని శుభ్రం చెయ్యటం! ఎక్కడెక్కడో తగిలిన దెబ్బలు కాబట్టి వాటిలో గులకరాళ్లు, చెత్త, గడ్డి, బురద వంటివెన్నో ఉండిపోతాయి. వీలైనంత వరకూ 6 గంటల్లోపు శుభ్రం చెయ్యాలి. లేకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చి, ఎముకలు అతుక్కోవు. పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత విరిగిన ఎముకలను స్థిరపరచాలి. గాయం మరీ పెద్దగా ఉన్నప్పుడు పైవైపునే.. అవసరమైతే కిందా పైనా రాడ్లు వేసి, దాన్ని ఫిక్స్‌ చెయ్యాల్సి ఉంటుంది. సర్జరీలు చేసేటప్పుడు మొదట్లోనే సరిగా చెయ్యకపోతే.. ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

ఎముకలు విరగటానికి సర్వసాధారణ కారణాలు:
రోడ్డు, వాహన ప్రమాదాలు
ఆటల్లో దెబ్బలు తగలటం
మెట్ల మీంచి పడటం
స్నానాల గదుల్లో జారిపోవటం
లోలోపలి కారణాలు
అరుదే అయినా కొద్దిమందికి దెబ్బల్లాంటివేమీ తగలకుండానే చిటుక్కున ఎముకల విరుగుతుంటాయి. దీనికి ఇతరత్రా శారీరక సమస్యలు కారణమవుతుంటాయి, వీటిని ‘పెథలాజికల్‌ ఫ్రాక్చర్స్‌’ అంటారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎముక గుల్లబారటం (ఆస్టియోపొరోసిస్‌). ఈ సమస్య వృద్ధుల్లో ఎక్కువ. వయసు పెరుగుతున్నకొద్దీ ఎముకలు గుల్లబారుతూ.. వాటి పటుత్వం తగ్గుతుంది. దీంతో చిన్నపాటి కుదుపునకు కూడా ఎముక విరగొచ్చు. కారు వేగంగా వెళుతున్నప్పుడు హఠాత్తుగా బ్రేకు వేసినా, ఏదైనా వస్తువు అందుకోటానికి అటూఇటూ తిరిగినా కూడా ఎముకలు విరగొచ్చు.
కొందరిలో ఒంట్లో ఎక్కడైనా క్యాన్సర్‌ తలెత్తితే అది ఎముకకు విస్తరించి స్థిరపడుతుంటుంది. దీంతో అక్కడ ఎముక గుల్లబారి, పటుత్వం తగ్గి విరుగుతుంటుంది.
పసరుకట్లు వద్దు!
చాలామంది నేటికీ ఎముకలు విరిగినప్పుడు పసరు కట్లను ఆశ్రయిస్తున్నారు. వాస్తవానికి ఆ పసరులో ఎముక అతుక్కునేలా చేసే గుణమేదీ ఉండదు. గట్టిగా లాగి కట్టటం వల్ల విరిగిన ఎముకలు కదలకుండా ఉండి, అవి సహజంగానే అతుక్కుంటాయి. కానీ కొన్నిసార్లు కట్టు మరీ గట్టిగా కట్టటం వల్ల రక్తసరఫరా ఆగిపోయి ఆ భాగం కుళ్లిపోయిన (గ్యాంగ్రీన్‌) ఘటనలూ ఉంటున్నాయి. అలాగే ఎముక విరిగి, అటూఇటూ జరిగినప్పుడు దాన్ని సరైన స్థానంలో ఉంచటం అన్నది ఈ పసరు కట్లతో సాధ్యం కాదు. ఏదో ఉజ్జాయింపుగా ఎముకలను లాగి కట్టేస్తుంటారు. దీనివల్ల ఎముకలు వంకరగా అతుక్కుపోతూ, జీవితాంతం ఆ ఎముక, కీళ్ల కదలికలు అస్తవ్యస్తంగానే ఉండిపోతాయి. పసరు కట్లు శాస్త్రీయమైనవి కావు. ఏదో తాతముత్తాతలు చేస్తున్నది చూసి నేర్చుకోవటం తప్పించి సరైన శిక్షణ తీసుకున్న వారు కాకపోవటం వల్ల- సంక్లిష్టమైన ఫ్రాక్చర్లను సరిచేసే అవకాశం ఉండదు. సాధారణ ఫ్రాక్చర్ల విషయంలో కూడా అవి సరిగ్గా అతుక్కుంటాయన్న నమ్మకం ఉండదు. కాబట్టి ఈ ఆధునిక కాలంలో పసరు కట్లను ఆశ్రయించటం మంచి పద్ధతి కానేకాదు. పొగ దెబ్బే!
పొగ తాగే వాళ్లలో విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవు! ఇది శాస్త్రీయంగా నిరూపణ అయిన వాస్తవం. పొగలో ఉండే నికొటిన్‌ శరీరంలో చేరి కణవిభజననూ, ఎముక అతుక్కునే ప్రక్రియను దెబ్బతీస్తుండటం వల్ల వీరిలో ఎముకలు అతుక్కోవటం చాలా ఆలస్యమవుతుంటుంది, కొన్నిసార్లు ఎంతకీ అతుక్కోవు కూడా. సాయం చెయ్యాలిగానీ..!
చాలామంది ప్రమాదం జరిగినప్పుడు- బాధితులను రక్షించాలన్న తాపత్రయంలో వారిని కారుల్లో, ఆటోల్లో, స్కూటర్ల మీద తీసుకుపోతుంటారు. దీనివల్ల అప్పటికే విరిగిన ఎముకల వంటివి మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఎముకలు విరిగాయన్న అనుమానం తలెత్తినప్పుడు ముందు బాధితుల కాళ్లు చేతుల వంటి అవయవాలు కదలిపోకుండా స్థిరంగా ఉంచే బద్దలు (యూనివర్సల్‌ స్లి్పంట్‌) వంటవి అమర్చి జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించాలి. విరిగిన ఎముకలు కదులుతుంటే నొప్పి తీవ్రమై, ఒంట్లో క్యాటకోలమైన్స్‌ ఎక్కువగా విడుదలై, బీపీ పడిపోయి, ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
ఎలా అతుక్కుంటాయి?
చర్మం గీసుకుపోతే కొద్దిరోజుల్లో దానంతటదే మానిపోతుంది. మనం చెయ్యాల్సిందల్లా గీరుకున్న చర్మం అంచులు దగ్గరగా ఉండేలా చూడటం. అచ్చం ఎముక విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఎముక మీద ‘పెరియాస్టియమ్‌’ అనే దట్టమైన పొర ఉంటుంది. బలమైన దెబ్బ తగిలి, గాయమైతే ఈ పొర చినిగి, రక్తనాళాలు తెగి రక్తస్రావమవుతుంది. ఈ రక్తంలోని ప్లేట్‌లెట్‌ కణాలు విడివడి, అక్కడున్న మూలకణాలను ప్రేరేపించే రసాయనాలు (గ్రోత్‌ ఫ్యాక్టర్స్‌) విడుదల అవుతాయి. దీంతో మూలకణాలు వృద్ధి చెందుతూ, ఎముకల మధ్య ఏర్పడిన ఖాళీలో చేరతాయి. ముందుగా అక్కడ మృదు కణజాలం (కార్టిలేజ్‌ కణాలు), తర్వాత ఎముక కణాలు ఏర్పడతాయి. ఈ కణాల్లో, వాటి మధ్యలో క్యాల్షియం చేరి, గట్టిపడుతుంది. దీంతో ఎముక మళ్లీ దృఢంగా అతుక్కుపోతుంది. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియే!
ఇదీ చికిత్స! ఇవీ సూత్రాలు!!
ఎముక దానంతట అదే అతుక్కుంటుందిగానీ అది- వేగంగా, సరిగ్గా అతుక్కునేలా చూడటం, దానివల్ల ఇతరత్రా దుష్ప్రభావాలు రాకుండా చూడటం చాలా కీలకం. కాబట్టి ఈ సందర్భంగా కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

ఎముక విరిగింది.. అతుక్కోవాలంటే ఏం చెయ్యాలి?

1. కదలకుండా ఉంచటం: విరిగిన ఎముకలు కదులుతూనే ఉంటే ఎముక అతుక్కునే ప్రక్రియ దెబ్బతినిపోతుంది. కాబట్టి విరిగిన భాగం కదలకుండా చూసేందుకు- సిమెంటు కట్లు, బద్దలతో కట్టటం, బరువు వేలాడ దీయటం వంటివన్నీ చేస్తుంటారు. అయితే సిమెంటు పట్టీ ఎక్కువకాలం అలాగే ఉంచితే కండరాలు క్షీణించే ప్రమాదముంది. అటుపక్క ఇటుపక్క కీళ్లు బిగుసుకుపోవచ్చు. భోజనం, స్నానం చేయటం వంటి పనులకు ఇబ్బంది తలెత్తొచ్చు. లోపల దురద, చర్మం కందిపోవటం వంటి సమస్యలూ ఉంటాయి. ఇంతా చేసి, లోపల ఎముక సరైన స్థితిలోనే అతుక్కుంటోందో లేదో తెలియకపోవచ్చు. అందుకే ఇటీవలి కాలంలో ఆపరేషన్‌ చేసి- లోపలి ఎముకలను ప్లేట్లు, రాడ్లు, స్క్రూలతో దగ్గరకు తెచ్చి, స్థిరంగా ఉండేలా చూడటం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇవి విరిగిన ఎముకను కదలకుండా ఉంచుతూ.. త్వరగా అతుక్కోటానికి అనువైన పరిస్థితులను కల్పిస్తాయి. ఆపరేషన్‌ చేసిన వారం పది రోజుల్లోనే తేలికపాటి కదలికలు ఆరంభించొచ్చు. దీంతో కీళ్లు బిగుసుకుపోయే సమస్య ఉండదు. కండరాలు క్షీణించవు. పైన సిమెంటు పట్టీ వంటివేవీ ఉండవు కాబట్టి పనులకు వెళ్లొచ్చు. కాకపోతే వైద్యులు చెప్పే వరకూ కొంతకాలం బరువు పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
2. సరైన స్థితిలో ఉంచటం: విరిగిన ఎముకలను సరైన స్థితిలో, సరైన కోణంలో, కచ్చితంగా దగ్గరకు చేర్చి.. అలాగే కదలకుండా చూడటం ముఖ్యం. లేకపోతే ఎముకలు వంకరగా అతుక్కుని, కీళ్లు అస్తవ్యస్తంగా అరిగిపోవటం వంటి సమస్యలు జీవితాంతం వేధిస్తుంటాయి. విరిగిన ముక్కలు సరైన స్థితిలో, అలాగే కదలకుండా ఉండేందుకు ప్లేట్లు, స్క్రూల వంటివి దోహదం చేస్తాయి.
3. సమస్యలు రాకుండా చూడటం: దెబ్బతిన్న భాగానికి రక్తసరఫరా సరిగా జరిగేలా, ఇన్‌ఫెక్షన్లు తలెత్తకుండా చూడటం ముఖ్యం. వేగంగా నడుస్తున్న వాహన ప్రమాదాల వల్ల సంభవించే ఫ్రాక్చర్లలో- ఎముకకు అంటుకొని ఉండే కండరం కూడా పక్కకు తొలగిపోతుంది. దీంతో రక్త సరఫరా తగ్గి ఎముకలు అతుక్కోవటం ఆలస్యమవుతుంది. అందువల్ల రక్తసరఫరా సాఫీగా జరిగేలా చూడాల్సి ఉంటుంది. గాయాల వల్ల సూక్ష్మక్రిములు లోపల చేరి, ఇన్‌ఫెక్షన్లు మొదలై ఎముక అతుక్కోవటం ఆలస్యమవుతుంది. కాబట్టి ఇన్‌ఫెక్షన్‌ తలెత్తకుండా, శుభ్రంగా ఉండేలా చూడటమూ కీలకమే. ఒక్కోసారి ఆపరేషన్‌ గదిలో పరిశుభ్రత లోపించటం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. దీంతో ఎముక అతకటం అటుంచి ఈ ఇన్ఫెక్షన్‌ను తగ్గించటం పెద్ద సమస్యగా తయారవుతుంది. అందుకోసం వేసిన రాడ్‌ను, ప్లేట్లను కూడా తీసి, కొద్దిరోజుల తర్వాత మళ్లీ వెయ్యాల్సి ఉంటుంది. కాబట్టి శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

ఎన్నో అపోహలు …………………
బోన్‌సూప్‌
ఎముకలు విరిగాయి కాబట్టి ఎముకల సూపు తాగితే త్వరగా అతుక్కుంటాయన్నది పెద్ద భ్రమ. అది రుచికరంగా ఉంటే ఉండొచ్చు. ఆ రుచి నచ్చిన వాళ్లు తీసుకోవచ్చు. అంతేగానీ ఎముకలు విరిగాయి కాబట్టి అవి అతుక్కోవటానికి ఎముకల సూపుతో ప్రయోజనం ఉంటుందనుకోవటం అపోహే. ఇలాంటి అపోహలకు ఆస్కారం ఇవ్వకపోవటం ఉత్తమం.
క్యాల్షియం
కొందరు క్యాల్షియం మాత్రలు తీసుకుంటే ఎముకలు త్వరగా అతుక్కుంటాయని భావిస్తుంటారు. ఇది సరికాదు. ఒకవేళ ఇప్పటికే ఒంట్లో క్యాల్షియం లోపం ఉంటే క్యాల్షియం మాత్రలతో ప్రయోజనం ఉంటుందిగానీ లేకపోతే వాటిని తీసుకోవటం నిరుపయోగం!
గుడ్డుసొన
కోడిరక్తం, కోడిగుడ్డు సొన కొన్ని రకాల పసర్ల వంటివన్నీ వేసి కడుతుంటారు. ఇవి వైద్యులు కట్టే ‘ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌’లా గట్టిపడి, తర్వాత ఎముకలు కదలకుండా స్థిరంగా ఉండేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. అంతేకానీ వాటివల్ల ఎముకలు అతుక్కోవటమన్నది ఉండదు.
అతుక్కోపోతే..!
కొన్ని సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకున్నా ఎముకలు ఎంతకీ అతుక్కోవు. ముఖ్యంగా పొగ అలవాటు, పెద్ద వయసు, అత్యంత వేగవంతమైన ప్రమాదాల్లో ఎముకలు విరగటం.. ఇలాంటి సందర్భాల్లో ఎముకలు 6-9 నెలలు దాటినా అతకవు. దీన్నే ‘నాన్‌ యూనియన్‌’ అంటారు. వీరికి మరోసారి సర్జరీ చేసి- కటి ఎముక పైభాగం నుంచి చిన్నచిన్న ఎముక ముక్కలను తెచ్చి ఆ ఖాళీలో పూరించే ‘బోన్‌ గ్రాఫ్టింగ్‌’ సర్జరీ చెయ్యాల్సి ఉంటుంది. దీంతో అక్కడ వేగంగా కొత్త ఎముక ఏర్పడుతుంది. వృద్ధుల్లో తుంటి బంతి కీలు విరిగితే రక్తసరఫరా తెగిపోయి, అది తిరిగి అతుక్కోదు. ఇలాంటి వారికి కృత్రిమ బంతికీలు వెయ్యాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఆపరేషన్లు సక్రమంగా చెయ్యకపోవటం, ఆపరేషన్‌ గది పరిశుభ్రంగా లేకపోవటం కూడా ఇన్ఫెక్షన్లకు, ఎముకలు అతుక్కోకపోవటానికి ముఖ్య కారణాలుగా నిలుస్తున్నాయి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s