Aangioplasty….యాంజియో ప్లాస్టీ

ఒక సూక్ష్మనాళం ద్వారా శరీరంలోని రక్తనాళాల్లోకి బెలూన్‌ అనే పరికరాన్ని పంపి కొవ్వులతో పూడుకుపోయిన ఆ రక్తనాళాలను విచ్చుకుపోయేలా చేయడమే యాంజియో ప్లాస్టీ.
గుండెపోటును నివారించడానికి ఇప్పుడు లక్షలాది మంది హృద్రోగులు ఈ మార్గం ద్వారా లబ్ది పొందుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం ఇప్పుడు బైపాస్‌ కన్నా అధిక సంఖ్యలోఈ యాంజియోప్లాస్టి చికిత్సలు జరుగుతున్నాయని అంచనా. ఈ ప్రక్రియలో ముందుగా సూక్ష్మనాళాన్ని (కేథటర్‌) మూసుకుపోయిన రక్తనాళంలోకి పంపిస్తారు. తర్వాత సన్నని తీగను రక్తనాళం వద్దకు జొప్పించి లోపలికి ఒక బెలూన్‌ పంపుతారు. ఈ బెలూన్‌ను ఉబ్బేలా చేయడం ద్వారా రక్తనాళం పూడుకుపోయిన ప్రాంతాన్ని విచ్చుకునేలా చేస్తారు. ఫలితంగా రక్తనాళంలోని అడ్డంకి తొలగిపోవడం వల్ల రక్తప్రసారం మునుపటిలాగే జరడానికి ఆస్కారం ఉంటుంది.
గుండెకు సరఫరా చేసే రక్తనాళాల ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రధానంగా రక్తనాళాలలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోవటంతో ఈ అడ్డంకులు ఏర్పడుతుంటాయి. వీటిని బైపాస్‌ సర్జరీ లేదా యాంజియో ప్లాస్టీ చికిత్స ద్వారా తొలగించవచ్చు.
బైపాస్‌ సర్జరీ అంటే ఛాతీభాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తెరచి గుండెకు జరిగే రక్తప్రవాహాన్ని యధాతధంగా జరిగేందుకు మరో మార్గాన్ని ఏర్పరచడం అన్నమాట. ఇందుకోసం పూడుకుపోయిన రక్తనాళాలకు ప్రత్యామ్నాయంగా ఇతర రక్తనాళాలను కలుపుతారు. అయితే ఇది మేజర్‌ శస్త్రచికిత్స. ఆపరేషన్‌ అయిన తర్వాత కూడా రోగి కనీసం వారం రోజులపాటు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంది. పూర్తిగా కోలుకోవడానికి 2 – 3 నెలలు సమయం పడుతుంది. ఈ శ్రమ, ఆందోళన లేకుండా రక్తనాళాల్లో అడ్డంకులను సులువుగా తొలగించడానికి ఇప్పటి మేలైన పద్దతే యాంజియోప్లాస్టీ.
యాంజియో ప్లాస్టీ అంటే … రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగించడానికి శస్త్రచికిత్స లేకుండానే చేసే ఈ చికిత్సలో ఎలాంటి కోతా ఉండదు. తొడ లేదా చేతిలోని రక్తనాళం ద్వారా గుండెకు వెళ్ళే రక్తనాళాల్లోకి సన్నని బెలూన్‌ను పంపుతారు. రక్తనాళం పూడుకుపోయిన స్థానాన్ని చేరగానే ఆ బెలూన్‌ను ఉబ్బేలా చేస్తారు. అలా రక్తనాళంలోని అడ్డంకులను తొలగిస్తారు. ఆ తర్వాత ఆ ప్రదేశంలో పూడిక ఏర్పడే అవకాశాన్ని తగ్గించడానికి చాలా సందర్భాల్లో స్టంట్ అనే లోహపు గొట్టాన్ని అమర్చుతారు. దీనివల్ల రోగి 1-2 రోజుల్లోనే అసుపత్రినుంచి డిశ్చార్‌ అయి, తన రోజువారీ పనులను సాధారణంగా చేసుకోవచ్చు. ఫలితాలు, ప్రయోజనాలు ఎక్కువగా ఉండటం వల్ల బైపాస్‌ సర్జరీకన్నా చాలా మంది రోగులు, డాక్టర్లు ఇప్పుడు యాంజియోప్లాస్టీ వైపు మొగ్గు చూపుతున్నారు.
యాంజియోప్లాస్టీ అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది బైపాస్‌ సర్జరీనే ఆశ్రయించేవారు. కానీ ఇటీవల యాంజీయోప్లాస్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. కారణం..ఇందులో ఉండే సౌకర్యం, పైగా సర్జరీతో సమకూరే ప్రయోజనాలు, కోత లేకుండానే సమకూరడం వల్ల దీనివైపు రోగులు మొగ్గు చూపుతున్నారు.
కొన్నేళ్ళుగా యాంజియోప్లాస్టీకోసం మరింత మొరుగైన ఉపకరణాలు అందుబాటులోకి వస్తున్నాయి. మునుపటి కంటే మెరుగైన బెలూన్లు ఇప్పుడు అందుబాటులోఉన్నాయి. రోటా బ్లాటర్‌ నిమిషానికి ఒకటిన్నర నుండి రెండు లక్షలసార్లు పరిభ్రమిస్తుంది. దీనివల్ల ఎంత గట్టిగా ఉన్న అడ్డంకినైనా డ్రిల్‌ చేసి తొలగించడం సాధ్యమవుతుంది. రక్తనాళంలోకి ప్రవేశపెట్టానికి వీలుగా ఉన్న ఇంట్రావాస్క్యులార్‌ ఆల్ట్రాసౌండ్‌ ప్రోబ్‌ అనే పరికరం వల్ల రక్తనాళంలోపలి భాగాలను స్పష్టంగా చూడడంకూడా ఇప్పుడు సాధ్యమే. యాంజీయోప్లాస్టీ సమయంలో రక్తనాళంలో పోగుపడ్డ వ్యర్థాలను సైతం ఫిల్టర్‌ వైర్‌ సహాయంతో బయటకు లాగేయవచ్చు ఈ ప్రక్రియను నెరవేర్చే క్యాథ్‌లాబ్‌లో ఇప్పుడు అత్యంత నాణ్యమైన ఇంట్రా అయోర్గిక్‌ బెలూన్‌ పంపుల సహాయంతో గుండెపనితీరు, బీ.పి స్థిరంగా ఉండేలా చేయవచ్చు.
అత్యాధునిక ట్రాన్స్‌ రేడియల్‌ విధానం…. యాంజియోప్లాస్టీలో ట్రాన్స్‌రేడియల్‌ విధానం అధునాతనమైనదిగా చెప్పవచ్చు. ఇది రోగులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే…గతంలో సంప్రదాయ యాంజియోగ్రామ్‌ లేదా యాంజియోప్లాస్టీని తొడలోని రక్తనాళం ద్వారా చేసేవారు. దాంతో యాంజియోగ్రామ్‌ తర్వాత 5-7 గంటలపాటు, యాంజియోప్లాస్టీ తర్వాత 10-14 గంటలపాటు మంచంమీద కదలకుండా పడుకోవాల్సి వచ్చేది. అయితే ఈ ట్రాన్స్‌రేడియల్‌ పద్ధతిలో చేతిలోని రక్తనాళంద్వారా యాంజియోగ్రామ్‌ లేదా యాంజియోప్లాస్టీ చేయడం వల్ల రోగి వెంటనే నడవవచ్చు. హాస్పిటల్‌లో ఉండే సమయం, రక్తస్రావం జరిగే అవకాశం చాలావరకు తగ్గిపోతాయి.
యాంజియోప్లాస్టీ అందునా చేతి ద్వారా చేసే ట్రాన్స్‌ రేడియల్‌ యాంజీయోప్లాస్టీ ఇటీవల అందుబాటులోకి రావడంతో హృద్రోగ చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దీనితో గుండెపోటు వచ్చే అవకాశాన్ని చాలావరకు నివారించడానికి వీలవుతుంది.
తిరిగి అడ్డంకులు ఏర్పడే అవకాశాలు చాలా తక్కువ… గతంలో స్టంట్ అమర్చినా మళ్ళీ కొంతకాలానికి రక్తనాళాల్లో పూడిక చేరేది. అయితే ఇప్పుడు గతంలోని వాటి స్థానే ఔషధపూరిత స్టెంట్లను ప్రవేశపెట్టారు. దీనివలన రీబ్లాకేజ్‌లు చాలావరకు తగ్గాయి. ఔషధాలతో కోటింగ్‌ చేసిన స్టంట్లు 2-3 నెలల్లో నెమ్మదిగా మందులను రిలీజ్‌ చేసి మళ్ళీ బ్లాకేజెస్‌ వచ్చే అవకాశాలను చాలావరకు తగ్గిస్తాయి. కాబట్టి గుండె రక్తనాళాల్లో క్లిష్టమైన అడ్డంకులను తొలగించడానికి బైపాస్‌ సర్జరీ ద్వారా పొందే ఫలితాలన్నీ ఇప్పుడు శస్త్రచికిత్స అవసరంలేకుండా యాంజియోప్లాస్టీ స్టెంట్ల ద్వారా పొందవచ్చు.

%d bloggers like this:
Available for Amazon Prime