పాలిటెక్నిక్

సుస్థిర కెరీర్ ప్రగతి దిశగా చేసే ప్రయాణంలో పదో తరగతి తొలి సోపానం.   ఇక్కడ మనం వేసే అడుగే మన జీవితాన్ని, భవిష్యత్తును, కెరీర్‌ను నిర్ణయిస్తుంది. ఒకవేళ ఇక్కడ తప్పటడుగు వేస్తే జీవితాంతం సర్దుకుపోతూ గడపాల్సిందే. అందుకే ఇప్పుడు తీసుకునే నిర్ణయం తెలివైనదై ఉండాలి. మన ఆసక్తికి అనుగుణంగా మన కెరీర్‌ను ఎంపిక చేసుకునేదై ఉండాలి. భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దేదై ఉండాలి. మంచి వేతనం, ఎదుగుదల, పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టేదై ఉండాలి. అందుకే ఇప్పుడు వేసే అడుగు పదిలంగా వేయాలి. పెద్దలు, చదువుకున్నవారి వద్ద నుంచి మంచి సలహాలు, సూచలను తీసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. పదో తరగతి పాసైనప్పటి నుంచి ఏ కోర్సులో చేరాలి? ఎందులో చేరితే అవకాశాలు ఎలా ఉంటాయి? ఏ కోర్సు కష్టంగా ఉంటుంది? ఏ కోర్సు చదివితే జీవితంలో త్వరగా స్థిరపడవచ్చు? ఇలా ఎన్నో ప్రశ్నలు మనల్నే కాకుండా మన తల్లిదండ్రులకు కూడా ఎదురవుతుంటాయి.  

పాలిటెక్నిక్కోర్సులు -విభాగాలు

  • సివిల్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఆటోమొబైల్
  • రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్
  • ఈఈఈ, ఈసీఈ
  • కంప్యూటర్ ఇంజనీరింగ్

తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు యువత సత్వర ఉపాధి పొందేందుకు వీలుకల్పిస్తున్నాయి. చిన్న వయసులోనే ఉన్నత ఉద్యోగాలు, అత్యున్నత సాంకేతిక విద్య దిశగా ప్రయాణించేందుకు పునాదులు వేస్తున్నాయి.
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చు. ఈ పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌బీటీఈటీ) నిర్వహిస్తోంది. ఇందులో సాధించిన ర్యాంకు ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.
మూడేళ్ల కోర్సులు: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్‌కండీషనింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటి బ్రాంచ్‌లున్నాయి.
మూడున్నరేళ్ల కోర్సులు: కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటివి.
కెరీర్:పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ (బీటెక్/బీఈ) కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ స్కీం ద్వారా ప్రవేశించవచ్చు. దీనికి ఈ-సెట్ రాయాల్సి ఉంటుంది. ఉద్యోగాల పరంగా చూస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. వీటికి సంబంధించి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్, ప్రముఖ దినపత్రికలలో ప్రకటనలు వెలువడుతుంటాయి. డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు స్వయం ఉపాధిని కూడా పొందొచ్చు.
వేతనాలు: చేరిన సంస్థనుబట్టి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ప్రారంభ వేతనం ఉంటుంది.

పాలిటెక్నిక్‌తో బహుళ అవకాశాలుఅనేక రంగాలు విస్తరిస్తూ ఉండడంతో పాలిటెక్నిక్ అర్హతతో విధులు నిర్వర్తించే సూపర్‌వైజరీ పోస్టుల సంఖ్య పెరుగుతున్నా… విద్యార్థులు అవగాహన లేమితో వదులుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నో ఆధునిక కోర్సులు వస్తున్నాయి. వాటిని పూర్తిచేస్తే ఎన్నో అవకాశాలుంటాయి. మూడేళ్ల కోర్సులో థియరీ నాలెడ్జ్‌తోపాటు ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంచుకుంటే బీటెక్ అభ్యర్థులతో దీటుగా పోటీ పడే సామర్థ్యం కూడా లభిస్తుంది.

 వ్యవసాయ పాలిటెక్నిక్‌లు

  • డిప్లొమా ఇన్ అగ్రికల్చర్
  • డిప్లొమా ఇన్
  • సీడ్ టెక్నాలజీ
  • అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా

గ్రామీణ యువత స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌లు ఏర్పాటు చేశారు. పాలిటెక్నిక్‌లలో మూడు రకాల కోర్సులున్నాయి. అవి.. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సుల కాల పరిమితి రెండేళ్లు. ఇంజనీరింగ్ కోర్సు కాల పరిమితి మూడేళ్లు.
అర్హత, ప్రవేశాలు: పదేళ్ల చదువు కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదివి ఉండాలి. పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంటర్, ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు కారు. అర్హత పరీక్షలో సాధించిన గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ) ప్రకారం కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు.
అవకాశాలు: వ్యవసాయ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థలు వంటివాటిలో ఉద్యోగాలు లభిస్తాయి. సొంత ప్రాజెక్టులతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయొచ్చు. ప్రారంభంలో రూ.15వేల వరకు వేతనం లభిస్తుంది.

%d bloggers like this: