స్విట్జర్లాండ్‌ పర్యాటకం

స్విట్జర్లాండ్‌ రాజధాని బెర్న్‌. విస్తీర్ణం 41,285 చదరపు కిలోమీటర్లు వీరి భాషలు జర్మన్‌, ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, రోమన్ష్‌ కరెన్సీ: స్విస్‌ ఫ్రాంక్‌
స్విట్జర్లాండ్‌ లో చలి ఎక్కువ. శీతకాలం -20డిగ్రీలు కూడా నమోదవుతుంది. తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలోనే ఎక్కువ ఆయుర్దాయం ఉన్న పురుషులు స్విస్‌వారే. సంతోషంగా జీవించేందుకు ఇది చక్కటి దేశం. ‘వరల్డ్‌ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌’లో డెన్మార్క్‌ తర్వాత ఇది రెండో స్థానంలో ఉంది.
ఏడాదికి సరాసరిన ఒక్కొక్కరూ 11 కేజీల చాక్లెట్లు తినేస్తారు. ఎక్కువ చాక్లెట్‌ను ఎగుమతి చేసే దేశాల్లో ఇదొకటి.
బెర్న్‌లో 100కు పైగా ఫౌంటేన్లు ఉన్నాయి. అందుకే దీన్ని ‘సిటీ ఆఫ్‌ ఫౌంటేన్స్‌’ అంటారు.
ఐరోపా ఖండంలో ఉన్న స్విట్జర్లాండ్‌ దేశంలో అతి పెద్ద నగరం జ్యురిచ్‌. 60 శాతం భూభాగంలో ఆల్ప్స్‌ పర్వతాలే ఉన్నాయి. మోంటే రోసా అన్నింటికంటే ఎత్తైనది. ఏకంగా 24 పర్వతాలు 4000 మీటర్లకంటే ఎత్తున్నాయి. జపాన్‌ తర్వాత సమయానికి రైళ్లు నడిచేదిక్కడే.
బస్సుల్లో డ్రైవర్లే టిక్కెట్లిస్తారు. ప్రపంచంలోనే పొడవైన గొత్తర్డ్‌ సొరంగం(రైల్వే టన్నెల్‌) ఉన్నదిక్కడే. దీని పొడవు 57 కిలోమీటర్లు. అందులో 2.3కిలోమీటర్లు ఆల్ప్స్‌ పర్వతాల కింద నుంచే ఉంది. ఇటు నుంచి అటు ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ప్రయాణించేందుకు 45 నిమిషాలపైనే సమయం పడుతుంది.
ఇక్కడి అరావూ రైల్వే స్టేషన్‌ వద్ద పెద్ద గడియారం ఉంది. ఐరోపాలో అది రెండో అతిపెద్దది. జనాభాలో 25 శాతం మంది విదేశీయులే. 1500కు పైగా సరస్సులున్నాయి.
స్విట్జర్లాండ్ లో చూడవలసినవి……
రైనే జలపాతం…
నయాగరా జలపాతంతో పోలిస్తే రైనె జలపాతం చిన్నదే. కానీ 75 అడుగుల ఎత్తులో 450 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ జలపాతంలో ఏదో ప్రత్యేకత. పైగా ఐరోపాలోని సమతల నీటి జలపాతాల్లోకెల్లా ఇదే పెద్దది. ఈ జలపాతానికి దగ్గరలోనే న్యూహసన్ గుహలు ఉన్నాయి. వాటిని సందర్శించాక జలపాతానికి ఇరువైపులా దాన్ని దగ్గరగా చూసేందుకు పర్యటకులకోసం ప్లాట్ఫామ్లు నిర్మించారు. ఈ జలపాతం కిందకి దూకి నదిగా మారే ప్రదేశం మధ్యలో రైనేఫాల్ ఫెల్సిన్ అనే పెద్ద బండరాయి ఉంది. ఇది చాలా లక్షల సంవత్సరాల నాటిదిగా చెబుతారు. జలపాతానికి దిగువనే పారే నదిలో పడవలు తిరుగుతుంటాయి. ఆ పడవల ద్వారా సందర్శకులు ఆ బండరాయి వరకూ వెళ్లి వస్తుంటారు. జలపాతం దిగువనుంచి మలుపు తీసుకుని, కొండలమీదుగా జలపాతం పైకి రైల్లో ప్రయాణిస్తూ ఆ రైనే జలపాత అందాల్ని చూడటం మరిచిపోలేని అనుభూతి
జ్యురిచ్ …
ఇక్కడ పన్నులు తక్కువ. కానీ చాలా ఖరీదైన నగరం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక నగరాల్లో ఇదొకటి. స్విట్జర్లాండ్ దేశంలోని ముఖ్య బ్యాంకులూ పరిశోధన కేంద్రాలూ అన్నీ ఇక్కడే ఉన్నాయి. జ్యూరిచ్ సెంట్రల్ రైల్వేస్టేషన్ ప్రాంతమే నగరానికి ప్రధాన వ్యాపార కూడలి. జ్యూరిచ్ సరస్సు దిగువ భాగంలో ప్రయాణించే లిమ్మాట్ నది చుట్టూ ఈ సుందర నగరాన్ని నిర్మించారు. నిజానికి పగటివేళలో అక్కడ బస చేయగలిగితే మంచిది. జ్యూరిచ్ కళల మ్యూజియం, బొటానికల్ ఉద్యానవనమూ, ఫిపా ప్రపంచ ఫుట్బాల్ మ్యూజియమూ ప్రార్థనామందిరాలూ… ఇలా చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి.

పిలాటుస్ గోల్డెన్ రౌండ్ ట్రిప్’ టిక్కెట్లు
ఒకవైపు నుంచి కేబుల్ కారులో పిలాటుస్ పర్వతశిఖరంమీదకి చేరుకుని, అక్కడ నుంచి రైల్లో మరోదిశగా పర్వతం కిందకివచ్చే ఈ యాత్ర ఐదు అంచెలుగా సాగుతుంది. మొదటి దశలో క్రియొన్స్ నుంచి క్రియెన్సెరిగ్, ఆ తరవాత ప్రాన్మున్టెగ్ వరకూ పనోరమిక్ గండోలా అని పిలిచే కేబుల్ కారులలో వెళ్లాలి.
పచ్చదనంతో నిండిన కొండలమీదుగా 45 డిగ్రీల వాలులో ఈ ప్రయాణం 25 నిమిషాలపాటు సాగుతుంది. అక్కడకు వెళ్లాక ప్రాన్మున్టెగ్ అనే నది మధ్యలో ఓ విడిది ప్రదేశం ఉంది. ఒకవైపు ఎత్తైన కొండ, మరో వైపు లోతైన లోయ, మూడోవైపుకి చూస్తే ల్యూసెర్న్ సరస్సుతో కూడిన సుందర ప్రదేశం అది. రెస్టారెంట్లు కూడా ఎంతో అందంగా ఉంటాయి
చెట్లకాండంమీద ఏర్పాటుచేసిన చిన్న మెట్లను ఎక్కుతూ చెట్టు పై భాగానికి ఎక్కడం వింత అనుభూతిని కలిగిస్తుంది.
తరవాత సమతలంలో సమాంతరంగా కట్టిన తాళ్లలో పై దాన్ని పట్టుకుని కింది తాడుమీద నడవాలి. ఇది నిజంగా సాహసక్రీడే. ఏమాత్రం తడబడినా ప్రమాదం.
పిలాటుస్ శిఖరం మీదకి కేబుల్ బస్సులో పది నిమిషాలపాటు ప్రయాణం… దీన్నే డ్రాగన్ ప్రయాణంగా పిలుస్తారు. ఈ పర్వతం మీద మూడు శిఖరాలు ఉన్నాయి. ఒక్కో శిఖరం సముద్రమట్టం నుంచి ఏడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.
వేసవిలోనే అయినా అక్కడ ఉష్ణోగ్రత ఐదారు డిగ్రీల సెల్సియస్కు మించదు. వేసవిలో తప్ప మిగిలిన సమయాల్లో ఇక్కడ మొత్తం మంచుతో నిండిపోయి ఉంటుంది. కొండ శిఖరం ఎక్కి చుట్టూ చూస్తే ప్రపంచాన్ని జయించినంత గర్వంగానూ ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందంగానూ అనిపిస్తుంది.
పిలాటుస్ పర్వతం వెనక భాగం నుంచి కోగ్ రైలుపెట్టెలో కిందకి ప్రయాణించాం. దట్టమైన చెట్లూ, సొరంగాలూ, వంతెనలూ, కొండ మలుపుల గుండా సాగే ఈ ప్రయాణం అందించే అనుభూతిని అనుభవించాల్సిందే. ప్రపంచంలోకెల్లా ఏటవాలుగా ఉండే రైలుమార్గం ఇదే. సుమారు 50 నిమిషాల రైలు విహారం
ఆల్పానాస్టెడ్ నుంచి ఓ పెద్ద పడవలో ల్యూసెర్న్ సరస్సులో ప్రయాణించడం నిజంగా అద్భుతమే. మధ్యమధ్యలో ఆగుతూ ప్రకృతి సౌందర్యాన్ని గుండెలనిండుగా నింపుకుంటూ సాగే ఈ ప్రయాణం ఆహ్లాదభరితం.
చుట్టూ పచ్చని పర్వతాలూ వాటి మధ్యలోంచి దూకే చిన్న చిన్న జలపాతాలూ మనోల్లాసాన్ని కలిగిస్తాయి.
ల్యూసెర్న్ పట్టణం...
1333వ సంవత్సరంలో చెక్కతో కట్టిన 200 మీటర్ల పొడవుగల చాపెల్మీద నడవడం ఓ వింత అనుభూతి. ఇది 1993లో అగ్నిప్రమాదంలో కాలిపోయింది. అయితే ఏడాదిలోనే దీన్ని అంతే అందంగా మరింత సురక్షితంగా నిర్మించారు. పాదచారులు ఈ వంతెనమీద నడిచేటప్పుడు పై కప్పు కింద ఒకదాని తరవాత ఒకటి వరసగా అమర్చిన 30 తైలవర్ణ చిత్రపటాలు ల్యూసెర్న్ చరిత్రనూ క్యాథలిక్ ల సంస్కృతినీ తెలియజేస్తాయి.
లయన్ మెమోరియల్……
ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా మరణించిన స్విస్ గార్డుల స్మృత్యర్థం దీన్ని 19వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించారు. కొండకి దిగువ భాగంలో పదిమీటర్ల వెడల్పూ ఆరుమీటర్ల ఎత్తులో చెక్కిన ఈ సింహం ప్రతిమ సందర్శకుల్ని ఆకర్షిస్తుంటుంది.

%d bloggers like this:
Available for Amazon Prime