బోనాల పండుగ

తెలంగాణా సంస్కృతి, సంపప్రదాయాలకు పట్టుగొమ్మ… బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా వేపాకులతో వీధుల అలంకరణ, నెల రోజుల పాటు జంటనగరాలు ఆధ్యాత్మిక సంద్రంగా మారుతాయి. జంట నగరాలలో 115 ఆలయాలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

ఆషాఢమాసం ప్రారంభమైన తొలి ఆదివారం నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తొలివారం గోల్కొండ కోటలో వెలసిన శ్రీజగదాంబా మహంకాళి (ఈ దేవతనే ఎల్లమ్మ తల్లిగా పిలుచుకుంటారు) ఆలయం నుండి ప్రారంభమవుతాయి. తరువాత లష్కర్‌ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్‌లోని ఉజ్జయనీ మహంకాళి ఆలయం, కట్ట మైసమ్మ ఆలయం మీదుగా పాతబస్తీకి చేరుతాయి. ఎల్లమ్మ దేవతతో మొదలయ్యే బోనాలు అఖరి రోజున ఎల్లమ్మ దేవత అర్చనతోనే ముగుస్తాయి. రంగురంగుల కాగితాలతో కట్టిన తొట్లు బోనాల ప్రత్యేక ఆకర్షణ.

బోనం తమ ఇష్టదైవాలకు సమర్పించే నైవేద్యమే బోనం. కొత్త కుండలో బియ్యం, బెల్లం, పాలతో వండి నైవేద్యంగా సమర్పిస్తారు. వేటపోతుకు మెడలో వేపమండలు కట్టి పసుపు కలిపిన నీరు,వేపాకులను చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గుళ్లకు తరలి వస్తారు. జాతరను కన్నుల పండుగగా జరుపుతారు. అమ్మవారి దర్శనానికి సకుటుంబ సమేతంగా వెళ్ళి బోనాలు సమర్పించాక ప్రసాదంగా ఇంటికి తీసుకొచ్చి బంధుమిత్రులతో కలిసి మాంసాహార విందు ఆరగిస్తారు.

రంగం బోనాల వేడుకలో రెండో రోజు జరిగే ఉత్సవాన్ని రంగం అంటారు. ఈ సందర్భంగా పూనకం వచ్చిన భక్తురాలు ఆలయం ముందు భక్తులకు భవిష్యవాణి వినిపిస్తుంది. అమ్మవారి సోదరుడు పోతరాజుగా ఒక వ్యక్తిని అంకరిస్తారు. అతను ఎర్రటి ధోవతి కట్టి,శరీరమంతా పసుపు రాసుకొని, నుదుటి మీద కుంకుమ, కాళ్ళకు గజ్జెలు కట్టి నాట్యం చేస్తాడు.

ఘటం రంగం తరువాత ఘటం ముఖ్య వేడుక. అమ్మవారి ఆకారంలో అంకరించిన రాగి కలశాన్ని ఘటం అంటారు. పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పాతబస్తీలో ఈ వేడుకు 11 రోజుల పాటు జరుగుతాయి.

ఉజ్జయనీ మహంకాళి బోనాలు గోల్కొండ కోట బోనాలు తరువాత ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయనీ మహంకాళి ఆలయం (లష్కర్‌ బోనాలు) మరియు లోయర్‌ టాంక్‌బండ్‌లోని కట్టమైసమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి.
లష్కర్‌ బోనాలు వచ్చే గురువారం నాడు మూసాపేటలోని అన్ని బస్తీల ప్రజలు ఒకేరోజు బోనాలు ఉత్సవాటను నిర్వహిస్తారు.

పాతబస్తీ బోనాలు తరువాత లాల్‌దర్వాజ బోనాలుగా ప్రసిద్ధి చెందిన పాతబస్తీ బోనాలు 11 రోజుల పాటు పాతబస్తీలోని ఆలయాలలో జరుగుతాయి. అక్కన్న, మాదన్న మహంకాళి ఆలయం నుంచి అమ్మవారి ఘటాన్ని ఏనుగు అంబారీపై అలంకరించి ఊరేగించడం అత్యంత వైభవంగా జరుగుతుంది. సాయంత్రం నయాపూల్‌లో ఘట నిమజ్జనంతో ఉత్సవం ముగుస్తుంది.

బల్కంపేట ఎల్లమ్మ బోనాలు ఎల్లమ్మ అమ్మవారు ఇక్కడ బావిలో 10 అడుగుల లోతులో దర్శనమివ్వటం ఓ ప్రత్యేకత. నిజాం కాలం నుండి ఇక్కడ పూజలు చేస్తున్నారు. సికింద్రాబాద్‌ ఉజ్జయనీ బోనాల తరువాత ఆదివారం ఇక్కడ బోనాలు ప్రారంభమవుతాయి. మంగళవారం అమ్మవారి కళ్యాణం, ఆదివారం బోనాలు జరుపుతారు.

చిత్తారమ్మ బోనాలు మూసాపేట చిత్తారమ్మ అమ్మవారి బోనాలు ఆషాఢమాసం చివరి ఆదివారం నాడు జరపటం ఆనవాయితీ. ఈ రోజు అమ్మవారికి బోనాలతో పాటు పలహారం బళ్ళు, తొట్టెలు, ఎడ్లబండ్లు వంటివి ఊరేగిస్తారు.

%d bloggers like this: