సూర్యగ్రహణం

Annular solar eclipse on June 21 - Sakshi

ఆకాశంలో అద్భుత దృశ్యమైన సూర్యగ్రహణాల్లో ఒకటైన వార్షిక సూర్యగ్రహణం ఆదివారం భారత్‌లో కనిపించి కనువిందు చేయనుంది. ఈ సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి సుదూరంగా వెళ్లడంతో పూర్తిగా సూర్యుడ్ని కప్పి ఉంచలేడు. 70శాతం మాత్రమే కప్పివేయడంతో ఖగోళ అద్భుత దృశ్యాల్లో ఒకటైన రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా తీసుకుంటే సూర్యగ్రహణం ఉదయం గం.9:15 గంటలకు మొదలై మధ్యాహ్నం 12:10 గంటలకు అత్యున్నత స్థితికి చేరుకొని మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రాంతాలను బట్టి సమయంలో కాస్త మార్పులు ఉంటాయని ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. గ్రహణం తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి 1.44 గంటల వరకు ఉంటుంది. 51 శాతం గ్రహణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం గ్రహణం ఉంటుంది. విశ్వ వ్యాప్తంగా 3గంటల 33 నిమిషాలపాటు గ్రహణం ఉంటుంది.

► 2020లో సంభవించే రెండు సూర్యగ్రహణాల్లో ఇది మొదటిది. ఇది పాక్షిక సూర్య గ్రహణమే. డిసెంబర్‌ 14న ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం.
► దేశంలో గుజరాత్‌లోని భుజ్‌లో మొదట కనిపిస్తుందని, అస్సాంలోని దిబ్రూగఢ్‌లో చివరిగా మధ్యాహ్నం 2:29 గంటలకు పూర్తవుతుందని నెహ్రూ ప్లానెటోరియంలోని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
► ఇవాళ్టి వార్షిక సూర్యగ్రహణంలో ఆకాశంలో అద్భుత దృశ్యమైన రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ కనువిందు చేయనుంది. రాజస్తాన్, హరియాణా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ప్రజలు దీనిని వీక్షించవచ్చును.

ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌, డెహ్రాడూన్‌ తదితర ప్రాంతాల్లో సూర్యగ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుందని బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డా.బి.జి.సిద్ధార్థ్‌ చెప్పారు. హైదరాబాద్‌తోపాటు మిగతా చోట్ల పాక్షికంగానే కనిపిస్తుందన్నారు. సూర్యగ్రహణాన్ని నేరుగా, ఎక్స్‌రే ఫిలిం, నల్లని గాజు ముక్కల ద్వారా చూడడం ప్రమాదకరమని తెలిపారు. వైద్యులు సూచించిన ఎక్లిప్స్‌ అద్దాలతోనే గ్రహణాన్ని చూడాలని సూచించారు. వలయాకార సూర్యగ్రహణంలో సూర్యుడి కేంద్ర భాగం కనిపించకుండా జాబిల్లి అడ్డుగా ఉంటుంది. దీంతో చంద్రుడి వెనుక సూర్యుడి వెలుపలి భాగం వలయాకారంలో మెరుస్తూ కనువిందు చేస్తుంది. ఆ వలయాన్ని ‘జ్వాలా వలయం’గా పిలుస్తారు. ఒక్కోసారి ఒక సెకను కంటే తక్కువ కాలంలోనే జ్వాలా వలయం మాయమవుతుంది. కొన్నిసార్లు 12 నిమిషాలకుపైగా కనిపిస్తుంది.
► రాజస్తాన్‌లో సూరత్‌గఢ్, అనూప్‌గఢ్, హరియాణాలో సిర్సా, రాటియా, కురుక్షేత్రలోనూ, ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్, చంబా, చమోలిŠ‡లో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ఒక్కనిమిషం వరకు కనిపిస్తుంది. 
► సెంట్రల్‌ ఆఫ్రికా, పాకిస్తాన్, దక్షిణ సెంట్రల్‌ చైనా, యూరప్‌లో కొన్ని ప్రాంతాలు, ఆస్ట్రేలియాలోనూ సూర్యగ్రహణం కనిపిస్తుంది.
► సూర్యగ్రహణాన్ని నేరుగా చూస్తే మనిషి కంటిలో రెటీనా దెబ్బ తింటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తగినన్ని రక్షణ జాగ్రత్తలతో ఫిల్టర్‌ కళ్లద్దాలు ధరించిన తర్వాతే రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ దృశ్యాన్ని చూడొచ్చు.
%d bloggers like this:
Available for Amazon Prime