సోషియాలజీ కోర్సులు

ఒక మనిషి వ్యవహారశైలిని సమాజానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించే సబ్జెక్టు సోషియాలజీ. రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీల్లోనూ బీఏలో సోషియాలజీ ఒక సబ్జెక్టుగా అందుబాటులో ఉంది. అంతేకాకుండా సోషియాలజీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ తదితర ప్రముఖ విద్యాసంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీలు పీజీ స్థాయిలో సోషియాలజీని అందిస్తున్నాయి. ఐఐటీలు కూడా సోషియాలజీని కోర్ సబ్జెక్టుగా లేదా ఇంటర్ డిసిప్లినరీ కోర్సుగా పలు స్థాయిల్లో (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ) అందుబాటులో ఉన్నాయి. సోషియాలజీలో ఉమెన్ డెవలప్‌మెంట్, రూరల్ డెవలప్‌మెంట్, ట్రైబల్ డెవలప్‌మెంట్ తదితర స్పెషలైజేషన్లలో రీసెర్చ్ చేయడం ద్వారా అద్భుత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. సోషియాలజీ కోర్సు పూర్తిచేసిన వారు అకడమిక్ అండ్ రీసెర్చ్ సంస్థల్లో అధ్యాపకులుగా అవకాశాలను దక్కించుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) విభాగాల్లో, ప్రభుత్వ పథకాల్లో వివిధ హోదాల్లో అవకాశాలుంటాయి. ఆఫీస్‌లో వర్క్ ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ కల్పించడం ద్వారా ఉద్యోగులతో మరింత ప్రభావవంతంగా పని చేయించుకునేందుకు ఎంఎన్‌సీలు కూడా సోషియాలజీ అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. ప్రభుత్వాలు సామాజిక అభివృద్ధి కోణంలో విద్య, ఆహార భద్రత, ఆరోగ్యం తదితర విషయాల్లో వివిధ పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు సక్రమంగా అంది, సత్ఫలితాలు వచ్చేలా చేసే సుశిక్షితులైన నిపుణుల అవసరం ఉంది. ఈ క్రమంలో సోషియాలజీలో కోర్సులు పూర్తిచేసిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రారంభంలో నెలకు కనీసం రూ.20 వేల వేతనం ఖాయం. సోషియాలజీలో కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు స్వయం ఉపాధి దిశగా ఆలోచించవచ్చు. ఫ్యామిలీ కౌన్సిలర్లుగా, కమ్యూనిటీ కౌన్సిలర్లుగా మారొచ్చు.
%d bloggers like this: