పకోడీ వంటలు

వానలు పడుతుంటే… నోటికి కరకరలు కావాలి… వేడివేడిగా… అప్పటికప్పుడు చేసుకుని తినాలి… వెంటనే పకోడీలు గుర్తుకు వచ్చాయి కదూ… అబ్బా… అవే పకోడీలా అనుకుంటున్నారా…
అవును… అవే పకోడీలు… కానీ పకోడీ మారింది… ఏంటా అనుకుంటున్నారా… షేప్‌ అందాజాగా అలాగే ఉంది… స్వరూపం మారలేదు…   స్వభావం మారింది
బ్రెడ్‌ పకోడీ

కావలసినవి: బంగాళ దుంపలు – 2 (మీడియం సైజువి); పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – 5 టీ స్పూన్లు; పుదీనా తరుగు – 2 టీ స్పూన్లు; మిరప కారం – పావు టీ స్పూను; ఆమ్‌ చూర్‌ పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత.
పిండి కోసం: సెనగ పిండి – ఒక కప్పు; వాము – అర టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; గరం మసాలా పొడి – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; బేకింగ్‌ సోడా – చిటికెడు; నీళ్లు – కొద్దిగా; ఉప్పు – తగినంత; వీట్‌ బ్రెడ్‌ – 5 స్లైసులు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.
తయారీ: ∙బంగాళ దుంపలను కుకర్‌లో ఉంచి మెత్తగా ఉడికించాలి ∙బయటకు తీసి తొక్క వేరు చేసి, బంగాళ దుంపను సన్నగా తురిమి పక్కన ఉంచాలి ∙కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, పచ్చి మిర్చి తరుగు, మిరప కారం, ఆమ్‌ చూర్‌ పొడి, ఉప్పు, బంగాళ దుంప తరుగులను ఒక పాత్రలో వేసి బాగా కలపాలి ∙పెనం మీద కొద్దిగా నూనె వేసి బ్రెడ్‌ స్లైసులను దోరగా కాల్చి, చిన్న చిన్న ముక్కలుగా చేయాలి ∙ఒక పాత్రలో సెనగ పిండి, వాము, మిరప కారం, గరం మసాలా, ఇంగువ, ఉప్పు, బేకింగ్‌ సోడా వేసి బాగా కలపాలి ∙అర కప్పు నీళ్లు జత చేసి మరోమారు కలపాలి ∙ఒక టీ స్పూను వేడి వేడి నూనె జత చేయాలి ∙బ్రెడ్‌ ముక్కలను ఈ పిండిలో వేసి బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, సిద్ధంగా ఉంచుకున్న పిండిని పకోడీల మాదిరి గా వేసి దోరగా వేయించి, పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.
ఫిష్‌ పకోడీ

కావలసినవి: ముల్లు లేని చేప ముక్కలు – 250 గ్రా.లు; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; నిమ్మ రసం – టీ స్పూన్‌; పచ్చి మిర్చి – 2 (సన్నగా తరగాలి); వెల్లుల్లి రెబ్బలు – 2  (సన్నగా తరగాలి); అల్లం – చిన్నముక్క (తురమాలి).
పిండి తయారీకి: కారం – తగినంత; వాము – అర టీ స్పూన్‌; ధనియాల పొడి – టేబుల్‌ స్పూన్‌ (వేయించి, కచ్చాపచ్చాగా దంచాలి); తందూరీ మసాలా – తగినంత; బియ్యప్పిండి / కార్న్‌ ఫ్లోర్‌ – టేబుల్‌ స్పూన్‌; సెనగపిండి – 4 టేబుల్‌ స్పూన్లు; యోగర్ట్‌ – 2 టేబుల్‌ స్పూన్లు.
తయారీ: ∙చేప ముక్కలకు ఉప్పు, పసుపు, నిమ్మరసం, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి– అల్లం తరుగు వేసి కలిపి పైన మూత పెట్టి 20 నిమిషాలు అలాగే ఉంచాలి ∙స్టౌ మీద బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి ∙ఒక గిన్నెలో పిండి, దాంతో పాటు మిగతా దినుసులన్నీ వేసి బాగా కలపాలి ∙సిద్ధంగా ఉంచుకున్న చేప ముక్కలకు పిండికి పట్టేలా కలపాలి ∙కావాలనుకుంటే పిండి మృదువుగా అవడానికి మరికాస్త యోగర్ట్‌ని వాడుకోవచ్చు ∙పిండి కోటింగ్‌ ఉన్న చేప ముక్కలను కాగుతున్న నూనెలో వేసి అన్నివైపులా వేయించాలి ∙అన్నీ బంగారు రంగు వచ్చేలా వేయించుకొని, ప్లేట్‌లోకి తీసుకోవాలి ∙వీటిని ఏదైనా సాస్, పుదీనా–కొత్తిమీర చట్నీతో సర్వ్‌ చేయాలి.
చికెన్‌ పకోడీ

కావలసినవి: చికెన్‌ (బోన్‌లెస్‌) – పావు కేజీ (250 గ్రా.లు); ఉల్లిపాయ – 1 (సన్నని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి); పచ్చి మిర్చి – 2 (సన్నగా తరగాలి); అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ – టీ స్పూన్‌; కారం – టీ స్పూన్‌ (తగినంత వేసుకోవచ్చు); గరం మసాలా– అర టీ స్పూన్‌; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; కరివేపాకు – 2 రెమ్మలు; సెనగ పిండి – పావు కప్పు (విడిగా మరో 2 టేబుల్‌ స్పూన్లు); బియ్యప్పిండి లేదా కార్న్‌ ఫ్లోర్‌ – 3 టేబుల్‌ స్పూన్లు; గుడ్డు – 1 (తెల్లసొన మాత్రమే); నీళ్లు – తగినన్ని; నూనె – వేయించడానికి
తగినంత.
తయారీ: ∙ఒక వెడల్పాటి గిన్నెలో సెనగ పిండి, బియ్యప్పిండి, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి కలపాలి ∙అన్నీ సరిపడా ఉన్నాయా లేదా చెక్‌చేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, తరిగిన కరివేపాకు పచ్చిమిర్చి వేసి కలపాలి ∙చిన్న చిన్న క్యూబ్స్‌లా కట్‌ చేసుకున్న చికెన్‌ ముక్కలను వేసి బాగా కలపాలి ∙కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు ∙పిండి లూజ్‌గా కాకుండా, గట్టి ముద్దలా తయారుచేసుకోవాలి.
ఇలా వేయించాలి: ∙స్టౌ య్యి మీద బాణలి పెట్టి తగినంత నూనె పోసి వేడి చేయాలి ∙చేత్తో కొద్ది కొద్దిగా పిండి ముద్ద తీసుకొని కాగిన నూనెలో వేసి, వేయించాలి ∙నూనె వేడిని బట్టి మంటను సరిచూసుకోవాలి ∙చికెన్‌ ముక్కలు అన్ని వైపులా బాగా వేగాక ప్లేట్‌లోకి తీసుకోవాలి ∙ఈ చికెన్‌ పకోడీని పుదీనా చట్నీ లేదా సాస్‌తో వడ్డించాలి.
ప్రాన్‌ పకోడీ

కావలసినవి: రొయ్యలు – పావు కేజీ; పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు; ఉల్లిపాయలు – 6 (సన్నగా తరగాలి); అల్లం ముక్క – చిన్నది (సన్నగా తరగాలి); వెల్లుల్లి – 5 రెబ్బలు (క్రష్‌ చేయాలి); పచ్చి మిర్చి – 2 (సన్నగా తరగాలి); కారం – టీ స్పూన్‌; ఉప్పు – తగినంత.
మరి కొన్ని… ఉల్లిపాయ – 1 ; సోంపు – టీ స్పూన్‌; కొత్తిమీర తరుగు – పావు కప్పు ; బియ్యప్పిండి – 2 టేబుల్‌ స్పూన్లు; నూనె – వేయించడానికి తగినంత; కరివేపాకు, ఉల్లికాడలు – తగినన్ని.
తయారీ: ∙రొయ్యలను శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉంచాలి ∙రొయ్యలు, కొబ్బరి పొడి కలిపి గ్రైండ్‌ చేసుకోవాలి ∙వెడల్పాటి గిన్నెలో బియ్యప్పిండి, రొయ్యలు కొబ్బరి ముద్ద, ఉల్లితరుగు, కొత్తిమీర, సోంపు, ఉప్పు, కారం.. ఇతర దినుసులన్నీ వేసి ముద్దలా కలుపుకోవాలి ∙పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని, గుండ్రంగా చేసి, చేత్తో అదిమి పక్కన పెట్టాలి ∙స్టౌ మీద బాణలి పెట్టి, నూనె పోసి వేడిచేయాలి ∙కాగుతున్న నూనెలో 5–6 చొప్పున సిద్ధంగా ఉంచుకున్న బాల్స్‌ వేసి, రెండువైపులా బంగారు రంగు వచ్చేలా వేయించుకోవాలి ∙కొత్తిమీర చట్నీ లేదా సాస్‌తో సర్వ్‌ చేయాలి.
ఖీమా పకోడీ

కావలసినవి: మటన్‌ ఖీమా – 250 గ్రా.లు; గుడ్డు – 1; ఉల్లిపాయ – 1 (తరగాలి); పచ్చి మిర్చి – 4 (సన్నని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి); సెనగ పిండి – అర కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; కొత్తిమీర తరుగు – 3 టేబుల్‌ స్పూన్లు; అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – టీ స్పూన్‌; కారం – టీ స్పూన్‌; గరం మసాలా – కొద్దిగా; వంట సొడా – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె –వేయించడానికి
తగినంత
తయారీ: ∙ఒక గిన్నెలో పై పదార్ధాలన్నీ వేసి బాగా కలపాలి ∙చిన్న ముద్దలు తీసుకొని, బాల్స్‌ చేసి చేత్తో అదిమి, పక్కనుంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, అదిమి ఉంచుకున్న బాల్స్‌ను ఉల్లి పకోడీల్లా కొద్ది కొద్దిగా పిండి చేత్తో తీసుకుంటూ కాగుతున్న నూనెలో వేసి, అన్నివైపులా బంగారు రంగు వచ్చేలా వేయించుకొని, తీయాలి ∙టొమాటో సాస్‌ లేదా కొత్తిమీర చట్నీతో వడ్డించాలి.
%d bloggers like this:
Available for Amazon Prime