Posted in GENERAL_FOODS

నేతి బీరకాయ కూరలు

Nethi Luffa Is Very Good For Health - Sakshi

ఏ రకమైన ఔషధ విలువలు లేని ద్రవ్యం (పదార్థం) ఈ జగత్తులో లేదని ఆయుర్వేదశాస్త్రం చెబుతుంది. అదే విషయాన్ని పరిశోధనాత్మకంగా నిర్ధారించింది. అందుకు ఉదాహరణ నేతి బీరకాయ. శాకాహారంలో మనం నిత్యం తినే బీరకాయ అందరికీ తెలిసిందే. దీనినే రాజకోశాతకీ ( (luffa accutangula, లప్ఫా ఎక్యూటాంగిలా) అని భావమిశ్రుడు అభివర్ణించాడు. అంతేకాకుండా మహాకోశాతకీ అని ఇంకొక రకం కూడా చెప్పాడు. ఇదే నేతి బీర (లప్ఫాసిలిండ్రికా/ఎజిప్టియాకా). దీనినే చరకుడు ఘృతకోశాతకీ అని వివరించాడు. ‘హస్తి ఘోషా, హస్తి పర్ణ, హస్తి కోశాతకీ, మహాఫలా అని నేతిబీరకు పర్యాయపదాలు ఉన్నాయి.

గుణాలు:
‘మహాకోశాతకీ స్నిగ్థా రక్తపిత్తానిలాపహా’ ఇది మెత్తగా, జిగురు కలిగి మృదువుగా ఉంటుంది (స్నిగ్ధ). అంటే నెయ్యి వలె చిక్కగా ఉంటుంది. అందుకే దీనికి నేతిబీర అని పేరు వచ్చింది. ఇది రక్తదోషాలను, పిత్తవికారాలనూ, వాత వ్యాధులనూ పోగొడుతుంది. అంటే అనేక చర్మరోగాలలోనూ, అధిక రక్త పీడనం (హై బీపీ), హృద్రోగాలలోనూ, నరాలకు సంబంధించిన వ్యాధులలోనూ గుణకారి.
ఔషధ రూపాలు: పచ్చి దాని నుండి తీసిన రసం (స్వరసం), గుజ్జు (కల్కం), చూర్ణం (ఎండబెట్టి చేసిన పొడి). కాయ మాత్రమే కాకుండా, పండు (లేతదైనా, బాగా పక్వమైనదైనా) కూడా ఉపయుక్తమే. కషాయం చేసి కూడా వాడుకోవచ్చు. దీనికి గల ఇతర విలువలలో విషహరం, కృమిహరం ముఖ్యమైనవి. కొవ్వును కరిగించి శరీరపు బరువుని తగ్గిస్తుంది. పైల్స్‌ (మూలశంక) సమస్యను తొలగిస్తుంది. మధుమేహ నియంత్రణకు దోహదకారి.
ఆధునిక శాస్త్ర విశ్లేషణ…
నూరు గ్రాములకి 660 మి.గ్రా. మాంసకృత్తులు, 13. 38 కేలరీలు ఉంటాయి. శాకాహారంగా వాడుకోవచ్చు. పచ్చిగా కాని, వండుకొని కాని, పానీయంగా గాని సేవించవచ్చు. మరీ లేత కాయగా ఉన్నప్పుడు తొక్క తీయనవసరం లేదు. ముదిరితే మాత్రం తొక్క చేదుగా ఉంటుంది. అప్పుడే పండుగా మార్పు చెందిన దానిని తింటే జలుబు, ముక్కుదిబ్బడ, సైనస్‌ సమస్యలు తొలగిపోతాయి. తాజాఫలంలో లెవొనాయిడ్స్, ఓలియాలోనిక్‌ యాసిడ్, ఎస్కార్బిక్‌ యాసిడ్, కెరోటినాయిడ్సు, క్లోరోఫిల్స్‌ మొదలైనవి ఉంటాయి. వ్యాధినిరోధకశక్తిని అభివృద్ధి చేస్తుంది. ఎలర్జీలను, వాపులను, నొప్పుల్ని దూరం చేస్తుంది. ప్రసవ సమయంలో గర్భాశయ సంకోచానికి దోహదకారిౖయె సుఖ ప్రసవానికి సహకరిస్తుంది. కంతుల్ని, సూక్ష్మ క్రిముల్ని హరిస్తుంది.

కూరలు

నేతి బీరకాయ గుత్తి కూర
కావలసినవి: నేతి బీరకాయలు – అర కేజీ; ఉల్లి పేస్ట్‌ – పావు కప్పు; టొమాటో పేస్ట్‌ – పావు కప్పు; వేయించిన పల్లీల పొడి – 2 టేబుల్‌ స్పూన్లు; వేయించిన నువ్వుల పొడి – 2 టేబుల్‌ స్పూన్లు; కొబ్బరి తురుము – పావు కప్పు; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 6; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర – ఒక టేబుల్‌ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టేబుల్‌ స్పూను; నూనె – తగినంత.

తయారీ:
►నేతి బీరకాయలను శుభ్రంగా కడిగి తొక్కు తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా, మధ్యలో గుత్తిగా వచ్చేలా తర గాలి
►ఒక పాత్రలో ఉల్లి పేస్ట్, టొమాటో పేస్ట్, పల్లీ పొడి, నువ్వుల పొడి, కొబ్బరి తురుము, మిరప కారం, ఉప్పు వేసి ముద్దలా కలపాలి
►స్టౌ మీద పాన్‌లో నూనె  వేసి కాచాలి
►ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, మినప్పప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి దోరగా వేయించాక, పసుపు జత చేసి దింపేయాలి
►గుత్తులుగా తరిగిన బీరకాయలోకి మసాలా మిశ్రమం స్టఫ్‌ చేసి, కాగుతున్న నూనెలో వేయాలి
►బాగా ఉడికిన తరవాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి
►వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది.
నేతి బీరకాయ కొత్తిమీర పచ్చడి
కావలసినవి: నేతి బీరకాయ – 1; కొత్తిమీర – అర కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 3; పచ్చి మిర్చి – 4; జీలకర్ర – ఒక టీ స్పూను; చింతపండు గుజ్జు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – తగినంత.
పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; పసుపు – చిటికెడు; ఎండు మిర్చి – 8; కరివేపాకు – రెండురెమ్మలు.

తయారీ:
►నేతి బీరకాయను శుభ్రంగా కడిగి, పల్చగా తొక్క తీసేయాలి (లేతగా ఉంటే తొక్క తీయక్కర్లేదు)
►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పచ్చి మిర్చి తరుగు, నేతి బీరకాయ ముక్కలు, వెల్లులి రేకలు వేసి సుమారు ఐదు నిమిషాలు పాటు ఉడికించాలి
►కొత్తిమీర, చింతపండు గుజ్జు జత చేసి, మిశ్రమం బాగా మెత్తగా అయ్యేవరకు కలుపుతూ ఉడికించాలి
►జీలకర్ర జత చేసి వేయించి దింపి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
►స్టౌ మీద చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, సెనగ పప్పు, పసుపు, కరివేపాకు వేసి దోరగా వేయించి దింపి, సిద్ధంగా ఉన్న పచ్చడికి జత చేయాలి
►వేడివేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది.
నేతి బీరకాయ బజ్జీ
బజ్జీకావలసినవి: నేతి బీర కాయ – 1; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; చాట్‌ మసాలా – 3 టీ స్పూన్లు
పిండి కోసం: సెనగ పిండి – ఒక కప్పు; బియ్యప్పిండి – 4 టీ స్పూన్లు; అల్లంవెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – అర టీ స్పూను; నీళ్లు – తగినన్ని; తినే సోడా – పావు టీ స్పూను.

తయారీ:
►బీరకాయలను శుభ్రంగా కడిగి, సన్నగా చక్రాలుగా తరిగి పక్కన ఉంచాలి
►ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉప్పు, మిరప కారం, తినే సోడా, నీళ్లు పోసి బజ్జీల పిండి మాదిరిగా కలపాలి
►స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక, తరిగి ఉంచుకున్న నేతి బీరకాయ చక్రాలను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి
►చాట్‌ మసాలా చల్లి వేడివేడిగా అందించాలి.
నేతి బీరకాయ వడల కూర
కావలసినవి: నేతిబీర కాయలు – అర కేజీ; మసాలా వడలు – 5; నూనె – అర కప్పు; తాలింపు గింజలు – రెండు టీ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు – 6; కరివేపాకు – రెండు రెమ్మలు; తరిగిన పచ్చి మిర్చి – 5; ఉల్లి తరుగు – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను.

తయారీ:
►నేతిబీరకాయలను శుభ్రంగా కడిగి, తొక్కు తీసి, ముక్కలుగా కట్‌ చేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక తాలింపు గింజలు వేసి బాగా వేయించాలి
►వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు జత చేసి మరోమారు కలపాలి
►పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలియబెట్టాలి
►నేతి బీరకాయ ముక్కలు జత చేసి బాగా కలిపి మూత ఉంచి, మెత్తబడేవరకు ఉడికించాలి
►కొన్ని వడలను చిన్న చిన్న ముక్కలుగా చేసి, ఉడుతుకుతున్న కూరకు జత చేయాలి
►మరి కొన్ని వడలను మెత్తగా చేసి ఆ పొడిని కూర కు జత చేయాలి
మిరప కారం వేసి బాగా కలిపి మూత ఉంచి ఉడికించి దింపేయాలి
►అన్నంలోకి రుచిగా ఉంటుంది.
నేతి బీరకాయ టొమాటో కర్రీ
కావలసినవి: నేతి బీర కాయ ముక్కలు – రెండు కప్పులు; టొమాటో తరుగు – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చిమిర్చి – 4; కరివేపాకు – రెండు రెమ్మలు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4; ఇంగువ – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; నూనె – తగినంత.

తయారీ:
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, పసుపు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి
►ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►టొమాటో తరుగు వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి
►నేతి బీర కాయ ముక్కలు జత చేసి బాగా కలిపి మూత ఉంచాలి
►ఉప్పు వేసి మరోమారు కలిపి, తడి అంతా ఇంకిపోయే వరకు ఉడికించి దింపేయాలి
►అన్నంలోకి, రోటీలలోకి రుచిగా ఉంటుంది.
నేతి బీరకాయ నువ్వుల మసాలా కూర
కావలసినవి: నేతి బీర కాయలు – పావు కేజీ; ఉల్లి తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 2
నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత;
నువ్వుల మసాలా కోసం: వేయించిన నువ్వులు – 2 టేబుల్‌ స్పూన్లు; బియ్యం – ఒక టేబుల్‌ స్పూను; ఎండు మిర్చి – 2; పాలు – ఒక టేబుల్‌ స్పూను

తయారీ:
►నేతి బీరకాయలను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి
►మిక్సీలో నువ్వులు, బియ్యం, ఎండు మిర్చి వేసి, పాలు జత చేసి మెత్తగా ముద్దలా చేసి పక్కన ఉంచాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి
►ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►నేతి బీర కాయ ముక్కలు వేసి బాగా కలిపి, తగినంత ఉప్పు జత చేసి మూత పెట్టి ఉడికించాలి
►బాగా మెత్త పడిన తరవాత నువ్వుల మసాలా మిశ్రమం వేసి మరోమారు కలియబెట్టి, రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి.

Leave a Reply