హారతి ఇస్తాము – ఎందుకు?

భగవంతుని ప్రార్ధన, పూజ లేదా భజన చివర్లో లేక గౌరవనీయులైన అతిథిని లేక మహాత్ముడిని ఆహ్వానించేటప్పుడు హారతి ఇస్తాము.  ఇదెప్పుడూ ఘంటా నాదం తోను కొన్ని సమయములలో పాటలు ఇతర సంగీత వాయిద్యాలతోను, మరియు చప్పట్లతోను కలిసి ఉంటుంది. 
 
ఇది పదహారు అంచెలుగా చేసే షోడశోపచార పూజా కార్యక్రమములోని ఒక భాగము.  ఇది శుభసూచకమైన మంగళ నీరాజనముగా సూచింప బడుతుంది.  భగవంతుని రూపాన్ని ప్రకాశింప చేయడానికి మనము కుడిచేతిలో వెలుగుతున్న దీపాన్ని పట్టుకొని వలయాకార దిశలో హారతి ఇచ్చేటప్పుడు దీపపు వెలుగులో ప్రకాశించే భగవంతుని సుందర రూపాన్ని ప్రతిభాగము విడిగాను మరియు పూర్తి రూపము శ్రద్ధగా గమనిస్తూ మనసులో గానీ పైకి గట్టిగా గానీ స్తోత్రాలు చదవడము చేస్తాము.  ఆ సమయంలో మన ప్రార్ధనలో తపన మరియు భగవంతుని రూపములో ప్రత్యేకమైన సౌందర్యము మనకు అనుభవమవుతుంది.  చివరలో ఆ వెలుగు పై మన చేతులనుంచి తరువాత నెమ్మదిగా మన కళ్ళకు తల పైభాగానికి అద్దుకొంటాము.
 
మనము చిన్నప్పటి నుంచీ ఈ ప్రక్రియను చూస్తున్నాము.  అందులో పాల్గొంటున్నాము.  మనము హారతి ఎందుకు ఇస్తామో తెలుసుకుందాము.
 
ఇష్టపూర్వకముగా భగవంతుడిని పూజించినప్పుడు, అభిషేకం చేసినప్పుడు, అలంకరించినప్పుడు, ఫలములు మరియు మధుర పదార్థములతో నివేదించినప్పుడు వైభవోపేతమైన ఆయన సుందర రూపాన్ని చూడగలము.  దీపపు వెలుగుచే ప్రకాశవంతము గా కనపడుతున్న భగవంతుని ప్రతి భాగము మీద మనస్సు సంధించబడి అతని రమ్యమైన రూపముపై మనసు మెలకువతో నిశ్శబ్ద ధ్యానం చేస్తుంది.  గానం చెయ్యడం చప్పట్లు చరచడం, గంట వాయించడం మొదలైనవన్నీ భగవంతుని దర్శనముతో కల్గిన సంతోషాన్ని మరియు శుభ సూచకాన్ని తెలుపుతాయి. 
 
హారతి సాధారణంగా కర్పూరంతో ఇవ్వబడుతుంది.  కర్పూరాన్ని వెలిగించినపుడు ఏ మాత్రము చాయలు మిగల్చకుండా తనకు తాను పూర్తిగా కాలిపోతుంది.  కర్పూరం మన అంతర్గత ప్రవృత్తులకు (వాసనలు) ప్రతీక.  జ్ఞానమనే అగ్నిచేత వెలిగించ బడినప్పుడు ఏదైతే భగవంతుడిని ప్రకాశింప చేస్తుందో ఆ జ్ఞానాగ్నే మన వాసనలు పూర్తిగా దగ్దము చేసి భగవంతుడి నుంచి దూరము చేసే అహంకారాన్ని నిర్మూలిస్తుంది.  కర్పూరము వెలుగుతున్నప్పుడు భగవంతుని విభూతిని శోభను తెలుపడానికి అది తనను తాను ఆహుతి చేసుకొంటూ కూడా చక్కని సువాసనని వెలువరిస్తుంది.  మన ఆధ్యాత్మిక పురోభివృద్ధిలో మనము మన గురువునీ సంఘాన్నీ సేవించుకుంటూ అందరికి ‘ప్రేమ’ అనే ‘సుగంధాన్ని’ వ్యాపింపచేయడానికి మనస్పూర్తిగా మనలని మనము అర్పించుకోవాలి.
 
తరచూ మనము ప్రకాశింపచేసే భగవంతుణ్ణి చూడడానికి చాలాసేపు వేచి ఉంటాము.  కానీ మనలోపల చూసుకోవడానికా అన్నట్లు హారతి ఇచ్చే అసలు సమయానికి అయాచితంగా కళ్ళు మూత పడతాయి.  మన దేహము దేవుని ఆలయమనీ, లోపల దివ్యత్వాన్ని కలిగి ఉన్నామని ఈ విధంగా కళ్ళు మూయడం సూచిస్తుంది.  పూజారి హారతి వెలుగులో భగవంతుడిని స్పష్టంగా చూపించినట్లుగానే, గురువు గారు కూడా జ్ఞానమనే వెలుగు సహాయముతో ప్రతి ఒక్కరికి లోనున్న దివ్యత్వాన్ని స్పష్టంగా తెలియపరుస్తారు.  హారతి చివరిలో దానిపై చేతులుంచి తరువాత కళ్ళకి, తలపైభాగానికి అడ్డుకోవడమంటే అర్ధము – భగవంతుడిని ప్రకాశింపజేసిన ఈ వెలుగు నా దృష్టిని వెలిగించుగాక! నా దృష్టి పవిత్రమగు గాక నా ఆలోచనలు ఉన్నతముగాను మంచివి గాను ఉండుగాక! అని ప్రార్ధించడం.
 
హారతికి వేదాన్తపరమైన అర్ధము; సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు విద్యుత్ మరియు అగ్ని – ఇవి వెలుగుకి సహజమైన మూల కారణములు.  సృష్టిలోని అద్భుతమైన అపూర్వమైన వాటన్నింటికి భగవంతుడు ఆధారము.  ఆయన కారణముగానే మిగిలినవి ఏవైనా ఉండటమూ మరియు ప్రకాశించడమూ జరుగుతుంది.  హారతి వెలుగులో భగవంతుడిని ప్రకాశింప చేసినప్పుడు మన దృష్టిని అన్ని వెలుగులకు మూల కారణము మరియు జ్ఞానాన్ని జీవితాన్ని సూచించే పరమాత్మ వైపు మళ్లిస్తాము. 
 
సూర్యుడు బుద్ధికి, చంద్రుడు మనసుకి, అగ్ని వాక్కుకీ అధిదేవతలు.  భగవంతుడు వీటన్నింటిని వెలిగించే అత్యున్నతమైన చైతన్యము.  అతను లేకుండా బుద్ధి ఆలోచించలేదు.  మనసు భావింపలేదు.  నాలుక మాట్లాడ లేదు.  మనసు బుద్ధి మరియు వాక్కులకీ వెనుక ఉన్నదీ భగవంతుడే.  ఈ పరిమితమైన ఉపకరణాలు ఆ అపరిమితమైన భగవంతుడిని ఏ విధముగా ప్రకాశింపజేయగలవు.  అందుకే హారతి ఇచ్చేటప్పుడు మనము ఈ క్రింది విధముగా స్తుతిస్తాము.
 
న తత్ర సూర్యోభాతి న చంద్ర తారకం
నేమా విద్యుతో భాంతి కుతొ2 యమగ్నిః
తమేవ భాంత మనుభాతి సర్వం
తస్యభాసా సర్వమిదం విభాతి
 
సూర్యుడు ప్రకాశించని చోట, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్ ప్రకాశించని చోట, ఆయన ఉన్నాడు.  మరి ఈ చిన్ని జ్యోతి (నా చేతిలో ఉన్న) ఏమి చేయగలదు? ప్రతిదీ అతని వలననే ప్రకాశిస్తాయి.  అతని వెలుగు వలన మాత్రమె మనమంతా ప్రకాశింప బడుతున్నాము. 
%d bloggers like this:
Available for Amazon Prime