శంఖము ఎందుకు ఊదుతాము?

దేవాలయాలలో గానీ ఇళ్ళలో గానీ శాస్త్రోక్త పూజారంభ సమయములో ఒక్కసారి లేక అనేక సార్లు శంఖము పూరించ బడుతుంది. హారతి ఇచ్చేటప్పుడు గానీ లేక సుభసూచకమైన సందర్భాన్ని గుర్తించడానికి గానీ శంఖము ఊదబడుతుంది.  యుద్ధం ఆరంభించడానికి ముందర లేక సైన్యపు విజయాన్ని ప్రకటించడానికి గానీ శంఖారావము చేయబడుతుంది.  శంఖము దైవ పీఠము వద్ద కూడా పెట్టి పూజించ బడుతుంది.
శంఖము ఎందుకు ఊదుతాము.  
ఎప్పుడైతే శంఖము ఊదబడుతుందో, అప్పుడు అందుండి సృష్టికి మూలభూతమైన ప్రణవ నాదము వెలువడుతుంది.  ఓంకారము సృష్టికి పూర్వము భగవంతునిచే చేయబడిన మంగళకరమైన నాదము.  అది ప్రపంచానికి, దానికి ఆధారమైన సత్యానికి ప్రతినిధి. 
ఒక కథనం ప్రకారం శంఖాసురుడనే రాక్షసుడు దేవతలను ఓడించి వేదాలను అపహరించి సముద్రపు అడుగు భాగములోకి వెళ్ళాడు.  దేవతలు సహాయము కొరకు విష్ణుమూర్తికి విన్నవించుకొన్నారు.   శ్రీ మహావిష్ణు ‘మత్స్యావతారము’ ధరించి శంఖాసురుణ్ణి సంహరించాడు.  భగవానుడు శంఖాకారములో ఉన్న అతని చెవి మరియు తల ఎముకను ఊదగా అందుండి వేదాలను ఉద్భవిమ్పచేసినట్టి నాదము వెలువడింది.  వేదాలలో ఉన్న జ్ఞానమంతా ఓంకారము యొక్క వివరణయే.  శంఖము ‘శంఖాసురుని’ మరణానంతరము ‘శంఖము’ గా పిలవబడుచున్నది.  భగవానునిచే పూరించబడిన శంఖము ‘పాంచ జన్యము’ గా పిలువ బడుచున్నది.  ఆయన నాలుగు చేతులలోని ఒక చేతిలో ఎల్లవేళలలో శంఖము పట్టుకొని ఉంటాడు.  అది జీవితపు చతుర్విధ పురుషార్ధాలలో ఒకటయిన ‘ధర్మము’ లేక ధర్మశీలతకుప్రతీక .  అందువల్లనే శంఖారావము అధర్మముపై ధర్మము యొక్క విజయానికి సంకేతము.  శంఖాన్ని మన చెవులకి దగ్గరగా పెట్టుకొంటే సముద్రపు అలల హోరు వినబడుతుంది. 
భక్తుల మనసులను వాతావరణమును కలవరపెట్టే వ్యతిరేక వ్యాఖ్యానాలను మోతలను పూర్తిగా తరిమెయ్యడానికి గాను శంఖము మరియు ఇతర వాయిద్యాలను మ్రోగించి మంగళకరమైన ధ్వనులను ఉత్పన్నము చేయడము అనేది మరియొక ముఖ్య ఉద్దేశ్యము. 
పురాతన భారత దేశము గ్రామాలలో నివసిస్తూ ఉండేది.  ప్రతి గ్రామము ఒక ప్రధాన దేవాలయము మరియు అనేక చిన్న దేవాలయాల అధ్యక్షతలో ఉండేది.  ప్రతి ముఖ్యమైన పూజ ముగింపులోను మరియు పుణ్య దినాలలోనూ హారతి తో పాటు శంఖారావము చేయబడుతుంది.  సాధారణంగా గ్రామము చిన్నదిగా ఉండడం వలన ఆ శంఖనాదం ఊరంతటికీ వినిపించేది.  దేవాలయానికి వెళ్ళడానికి వీలుకాని ప్రజలంతా వారు ఏ పని చేస్తున్నా ఆ పని ఆపి కొన్ని క్షణాల పాటైనా మానసికంగా భగవంతుడికి ప్రణమిల్లాలని గుర్తు చేయబడేది.  ఈ శంఖ నాదం తీరిక లేని నిత్య కృత్యాల మధ్య నున్న ప్రజల మనసులని కూడా భక్తి భావాలతో నింపుతూ సేవను అందించేది. 
నాద బ్రహ్మము, సత్యము, వేదాలు, ఓంకారము, ధర్మమూ, విజయము మరియు శుభసూచకాలకి ప్రతీకగా దేవాలయాల లోను, ఇళ్ళలోనూ, దైవ పీఠము వద్ద, భగవంతునికి ప్రక్కగా శంఖము ఉంచ బడుతుంది.  భక్తుల మనసులు ఉన్నతమై సత్యం వైపు ఎదగడానికి ఇచ్చే తీర్ధమునకు కూడా శంఖము వాడ బడుతుంది. 
ఈ క్రింది శ్లోకముతో శంఖము పూజింపబడుతుంది. 
త్వం పురా సాగరోత్పన్నః విష్ణునా విద్రుతః కరే
దేవైశ్చ పూజితః సర్వైః పాంచజన్యం నమోస్తుతే
సముద్రములో పుట్టిన, విష్ణుమూర్తి చేత బట్టిన మరియు దేవతలందరిచే పూజింపబడిన పాంచజన్యమను శంఖమునకు వందనము. 
%d bloggers like this: