‘స్టార్టప్’ ఔత్సాహికులకు ఉపయోగపడే..ప్రభుత్వ ప్రథకాలు ఇవే

ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ వరకు.. బీఏ నుంచి ఎంబీఏ దాకా.. ఏ కోర్సు పూర్తవుతున్నా.. కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అడిగే కామన్ ప్రశ్న.. తర్వాత ఏంటి..? అని!! ఇంజనీరింగ్, ఎంబీఏ విద్యార్థుల్లో చాలా మంది ఇప్పుడీ ప్రశ్నకు ‘స్టార్టప్ పెడతా’ అంటూ.. సమాధానం ఇస్తున్నారు.
Current Affairsఈ నేపథ్యంలో.. స్టార్టప్ ఔత్సాహికులకు ఉపయోగపడేలా.. ప్రస్తుతం దేశంలో స్టార్టప్ వాతావరణం..స్టార్టప్‌లకు చేయూతనిస్తున్న ప్రభుత్వ పథకాలు.. అనుకూలమైన రంగాలపై ప్రత్యేక కథనం..

కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం- స్థాపించి/నమోదుచేసుకొని పదేళ్లలోపు ఉన్న, ఏ ఆర్థిక సంవత్సరంలోనూ రూ.100 కోట్ల టర్నోవర్ దాటని ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ లేదా పార్టనర్‌షిప్ కంపెనీ లేదా లిమిటెడ్ లయబిలిటీ కంపెనీలను స్టార్టప్‌లుగా వ్యవహరిస్తారు. కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంతగా ప్రముఖ రంగాలు నేల చూపు చూస్తుండటంతో.. ప్రస్తుతం స్టార్టప్ భవిష్యత్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది.

భారత్ భేష్ !
స్టార్టప్‌లకు భారత్ అనుకూలమైన దేశంగా నిలుస్తోంది. నాస్కామ్ నివేదిక ప్రకారం-స్టార్టప్‌లకు అనుకూల వాతావరణం విషయంలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2014-2019 మధ్యకాలంలో దేశంలో 8,900-9,300 స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయి. ఇందులో ఒక్క 2019లో ఏర్పాటైనవి 1300. అదేవిధంగా గతేడాది జనవరి-సెప్టెంబర్ మధ్యకాలంలో స్టార్టప్‌లు 60,000 ఉద్యోగాలు కల్పించాయి. దీంతోపాటు మరో 1.3-1.8 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు అందించాయి. ఇదే కాలానికి స్టార్టప్‌లు అందుకున్న ఫండింగ్ 4.4 బిలియన్లు కావడం గమనార్హం.

బడ్జెట్ భరోసా..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-2021 బడ్జెట్‌లో స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఇందులో స్టార్టప్‌లకు కొత్త స్లాబ్ రేటు, ఎంప్లాయి స్టాక్ ఆప్షన్ ప్లాన్ (ఈఎస్‌వోపీ)పై ట్యాక్స్ చెల్లింపు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రద్దు, సావరిన్ వెల్త్ ఫండ్(ఎస్‌డబ్ల్యూఫ్)పై 100 శాతం ట్యాక్స్ మినహాయింపు, రూ.100 కోట్ల టర్నోవర్ కలిగిన స్టార్టప్ కంపెనీలకు 100 శాతం ట్యాక్స్ తగ్గింపు, ఎంఎస్‌ఎంఈ కంపెనీల ఆడిట్‌ను రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంపు, డిపాజిట్ ఇన్సూరెన్స్‌ను రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు, క్వాంటమ్ టెక్నాలజీతోపాటు ఇతర కంపెనీలకు సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పై రూ.100కోట్ల కేటాయింపు తదితరాలు కీలకంగా నిలుస్తున్నాయి. దీంతోపాటు ఆర్థిక మంత్రి నూతనంగా ఏర్పాటైన స్టార్టప్ కంపెనీలకు సీడ్ ఫండ్‌ను ప్రకటించారు. తద్వారా భారత్‌లో స్టార్టప్‌ల ఏర్పాటుకు మరింత సానుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

పీఎంఈజీపీ
స్టార్టప్‌లను ప్రారంభించాలనుకొనే వారికి ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉన్న ప్రధాన రుణ సదుపాయ పథకం…ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్(పీఎంఈజీపీ). ఈ పథకం కింద తయారీ రంగ స్టార్టప్‌లకు రూ.25లక్షలు, సేవల రంగ స్టార్టప్‌లకు రూ.10లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తారు. మొత్తం రుణంలో 25-30 శాతం మేర సబ్సిడీ సదుపాయం కూడా ఉంటుంది. అంటే.. రుణం పొందిన వారు ఆ మొత్తం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈ రుణం పొందేందుకు ప్రాజెక్టు డాక్యుమెంట్..
1. ఉద్యోగాల కల్పన
2. మార్కెట్ రీసెర్చ్
3. ఆధార్‌కార్డు నంబర్
4. ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నంబర్(టాన్ నంబర్)
5. కంపెనీ పాన్ నంబర్
6. కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (సీఐఎన్ నంబర్)
7. బ్యాంకు వివరాలు అందించాల్సి ఉంటుంది.
రుణానికి దరఖాస్తు చేసుకోవాలనుకొనేవారు మొదట ప్రాజెక్టు డాక్యుమెంట్‌ను రూపొందించుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్ వివరాలతోపాటు కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలను అందులో పేర్కొనాలి. అలాగే మార్కెట్ రీసెర్చ్ ద్వారా రాబోయే మూడేళ్ల నుంచి ఐదేళ్లలో బిజినెస్‌పై పరికరాలు, ఎక్విప్‌మెంట్, సేవలపై చేసే ఖర్చులు… తిరిగి పొందే రాబడి వివరాలతో ప్రాజెక్టు రిపోర్టును రూపొందించుకోవాలి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.kviconline.gov.in

స్టాండప్ ఇండియా:పత్యేకించి వెనుకబడిన వర్గాలను ప్రోత్సహించే ఉద్దేశంతో స్టాండప్ ఇండియా పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనికింద ఎస్సీ, ఎస్టీ వర్గాలతోపాటు మహిళలకు రుణ సదుపాయం కల్పిస్తారు. ఇతర జనరల్ కేటగిరీలకు చెందిన వారు ఎస్సీ, ఎస్టీ, మహిళా భాగస్వాములతో కలిసి స్టాండప్ ఇండియా పథకంలో రుణం పొందవచ్చు. సదరు భాగస్వామికి కంపెనీలో 51శాతం వాటా ఉండాలి. ఈ పథకం కింద రూ.90 పైసల నుంచి రూ.1 వడ్డీతో రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రుణం మంజూరు చేస్తారు. కొత్తగా స్టార్టప్‌ను ప్రారంభించిన వారంతా స్టాండప్ ఇండియా లోన్‌కు వెళ్లొచ్చు. కొత్తలో వెళితే లోన్ మొత్తం తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీ పెట్టిన ఏడాదికి కంపెనీ విస్తరణకు లోన్‌కు వెళితే అధిక మొత్తం చేతికందుతుంది. స్టాండప్ ఇండియా పథకం కింద రుణం పొందేందకు కంపెనీ రిజిస్ట్రేషన్ వివరాలు, కంపెనీ పాన్, ట్యాన్, సీఐఎన్ వివరాలు, ప్రాజెక్టు రిపోర్టు తదితరాలను అందించాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ ప్రకటించిన 27 షెడ్యూల్ బ్యాంకుల నుంచి స్టాండప్ ఇండియా రుణాలు పొందవచ్చు. స్టాండప్ ఇండియా హెల్ప్ సెంటర్‌తోపాటు చార్టెడ్ అకౌంటెంట్‌లను సంప్రదించి కంపెనీ డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేసుకోవచ్చు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.standupmitra.in

ముద్ర యోజన:
2015లో ప్రధానమంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా వ్యక్తులు, సంస్థలు మూడు రకాల రుణాలను పొందవచ్చు. కమర్షియల్ బ్యాంకులు, ఆర్‌ఆర్‌బీలు, ఎన్‌బీఎఫ్‌సీలు ఈ రుణాలను అందిస్తాయి. వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ కంపెనీలు, మొబైల్ షాప్‌లు, బ్రిక్ తయారీలకు సంబంధించి వ్యక్తులకు ముద్ర రుణాలను అందిస్తారు. ఇతర చిన్నతరహా పరిశ్రమలు ముద్ర రుణాలు పొందవచ్చు. ఈ రుణాల మంజూరు పూర్తిగా బ్యాంకుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముద్ర రుణాలు పొందాలనుకొనే వారు వ్యాపారానికి సంబంధించి పూర్తి వివరాలతో బ్యాంకులను సంప్రదించాలి. పొందిన రుణం మొత్తం ఆధారంగా రుణ చెల్లింపు వ్యవధిని నిర్ణయిస్తారు.

ముద్ర స్టార్టప్ లోన్ రకాలు:
శిశు: రూ. 50,000
కిశోర్: రూ.50,000 నుంచి రూ.5 లక్షలు
తరుణ్: రూ.5 లక్షలు-రూ.10 లక్షలు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.mudra.org.in

ప్రయివేటు ఫండింగ్:
ఏంజెల్ ఫండ్ :

స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టే వ్యక్తులు లేదా కంపెనీలను ఏంజెల్ ఇన్వెస్టర్లుగా పిలుస్తారు. సెబి.. ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్‌ను వెంచర్ క్యాపిటల్ ఉప వర్గంగా పేర్కొంది. ఈ విధానంలో యూనిట్ల(ఈక్విటీ) జారీ ద్వారా మాత్రమే నిధులు సేకరించే వీలుంది. దీంతోపాటు పది కోట్ల రూపాయల కార్పస్ తప్పనిసరి. ఏంజెల్ ఫండ్‌‌స మూడు సంవత్సరాల వ్యవధిలోనే పొందే అవకాశం ఉంటుంది.

  • ప్రారంభించి 3ఏళ్లు దాటని కంపెనీలు మాత్రమే ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్ పొందగలవు.
  • టర్నోవర్ రూ. 25 కోట్లకు మించరాదు.
  • ఏంజెల్ ఇన్వెస్టర్లు అసోసియేట్స్‌లో పెట్టుబడి పెట్టలేరు. మొత్తం పెట్టుబడులలో 25 శాతానికి మించి వారు అన్ని పథకాల కింద ఒక వెంచర్ క్యాపిటల్ అండర్ టేకింగ్‌లో పెట్టుబడి పెట్టలేరు. ఇంకా, ఏంజెల్ ఫండ్ ద్వారా పెట్టుబడిదారుడి సంస్థలో పెట్టుబడి రూ. 50 లక్షలు, రూ.5కోట్లు, కనీసం 3 ఏళ్ల కాలానికి నిర్వహించాల్సిన అవసరం ఉంది.

క్రౌడ్‌ ఫండింగ్ :
ఒక ప్రాజెక్ట్ లేదా వెంచర్‌కు ఇంటర్నెట్, ఇతర నెట్‌వర్కింగ్ వేదికలను ఉపయోగించి పెద్ద సంఖ్యలో ప్రజల నుంచి డబ్బును సేకరించడాన్ని క్రౌడ్ ఫండింగ్ అంటారు. ఈ విధానంలో చిన్న చిన్న మొత్తాలను కూడా పెట్టుబడిగా స్వీకరిస్తారు. లాభదాయక, కళాత్మక, సృజనాత్మక ప్రాజెక్టులు, సమాజ-ఆధారిత సామాజిక వ్యవస్థాపిత ప్రాజెక్టులకు క్రౌడ్ ఫండింగ్ విధానం చక్కగా సరితూగుతుంది.

అనుకూల రంగాలు :
భారత్‌లో పలు రంగాల్లో స్టార్టప్‌లకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అవి..

  • హెల్త్‌కేర్ సెక్టార్
  • పేమెంట్స్(ఆన్‌లైన్ /ఈకామర్స్/ఆఫ్‌లైన్ ఇంటిగ్రేషన్)
  • రిటైల్(షాపర్ స్టార్టప్స్/కస్టమర్ ఎక్స్‌పీరియెన్సెస్‌కు సంబంధించిన ఆడిట్ సంస్థలు).

మంచి టీమ్ ఉండాలి..

స్టార్టప్ ప్రారంభించాలనుకొనే వారు ముందు టీమ్‌పై దృష్టిసారించాలి. మంచి టీమ్, బిజినెస్ అవకాశం ఉన్నప్పుడే ఫండింగ్ సులభంగా లభిస్తుంది. స్టార్టప్ కంపెనీ పెట్టిన వారు మొదట్లో పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలి. కంపెనీ ఏర్పాటుకు సంబంధించి భవనాలు, ఇతర సౌకర్యాలపై ఎక్కువగా వెచ్చించడం సరికాదు. అలాగే పెద్ద మొత్తంలో జీతాలు కోరుకునే వారికంటే.. తక్కువ వేతనంతో బాగా పనిచేయగలిగేవారిని ఎంపికచేసుకోవాలి. కంపెనీతో దీర్ఘకాలం ప్రయాణించేవారిని ఉద్యోగులుగా నియమించుకోవడం లాభిస్తుంది. ఖర్చులు, పెట్టుబడి విషయంలో తెలివిగా వ్యవహరించాలి. స్టార్టప్‌లు సాధ్యమైనంత పొదుపు పాటించి… రెండేళ్లలో నిలదొక్కుకొనేలా ప్రయత్నించాలి.
%d bloggers like this:
Available for Amazon Prime