సాఫ్ట్‌వేర్ కొలువు…ఇలా సులువుగా సాధించండి !

ఐటీ కంపెనీల్లో కొలువు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌తోనే సాధ్యమని భావిస్తున్నారా?! మీ కాలేజీలో క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహించకుంటే.. ఇక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కల్లేనని ఆందోళన చెందుతున్నారా..?!
 • బీటెక్/బీఈ వంటి అర్హతలున్న వారికే ఐటీ ఉద్యోగం లభిస్తుందనే భావనలో ఉన్నారా? అయితే.. ఇప్పుడు వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేయొచ్చు! ఎందుకంటే.. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ సంస్థలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ టెస్ట్‌ల్లో సత్తాచాటితే చాలు.. ఐటీ జాబ్ సొంతమవుతుంది! టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ కంపెనీలు ఆన్‌లైన్ టెస్టుల ద్వారా యంగ్ టాలెంట్‌కు స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఐటీ కంపెనీలు నిర్వహిస్తున్న ఆఫ్-క్యాంపస్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లతో ప్రయోజనాలు, ఆయా పరీక్షల తీరుతెన్నుల గురించి తెలుసుకుందాం…‘ఐటీ కంపెనీల్లో కాలు పెట్టాలంటే క్యాంపస్ డ్రైవ్స్‌లో సత్తా చాటితేనే సాధ్యం. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు అవకాశం లేకుంటే..ఐటీ కొలువు కష్టమే’-ఇది సాధారణంగా వినిపించే అభిప్రాయం. అయితే గత కొంతకాలంగా ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలు ఆఫ్ క్యాంపస్ విధానంలో యంగ్ టాలెంట్‌ను గుర్తించి ఆఫర్లు ఇస్తున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ టెస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి ఆఫ్-క్యాంపస్ విధానంలో ఆన్‌లైన్ టెస్టుల ద్వారా కొలువులిచ్చే విధానానికి ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ శ్రీకారం చుట్టింది. అదే బాటలో విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఐబీఎం, క్యాప్ జెమినీ వంటి పేరున్న సంస్థలు సైతం ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. తద్వారా మారుమూల ప్రాంతంలోని సాధారణ కాలేజీలో చదివిన విద్యార్థులైనా ప్రతిభ ఉంటే.. ఐటీ రంగంలో అవకాశం అందుకోవచ్చు.ట్రెడిషనల్ టు టెక్నికల్:
  ఐటీ సంస్థల్లో కొలువు అంటే బీటెక్ వంటి సాంకేతిక కోర్సులు చదివిన వారికే అనే అభిప్రాయం నెలకొంది. కానీ దీనికి భిన్నంగా బీఏ/బీఎస్సీ/బీకాం వంటి సంప్రదాయ డిగ్రీ కోర్సుల అభ్యర్థులు సైతం ఐటీ కొలువులిచ్చే ఆన్‌లైన్ టెస్ట్‌లకు హాజరయ్యేందుకు సాఫ్ట్‌వేర్ కంపెనీలు అవకాశం కల్పిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం… బేసిక్ స్కిల్స్ ఉన్న గ్రాడ్యుయేట్లను నియమించుకొని.. కొంత శిక్షణనిస్తే సంబంధిత విభాగాల్లో సమర్థంగా రాణిస్తారనిఐటీ సంస్థలు భావిస్తుండటమే.

   

  కోర్ టు సర్వీసెస్ :
  ఐటీ కంపెనీలు నిర్వహిస్తున్న ఆఫ్-క్యాంపస్ ఆన్‌లైన్ టెస్ట్‌లలో విజయం సాధించి తదుపరి దశల్లోనూ సత్తా చాటితే.. అర్హతలకు అనుగుణంగా ఆయా విభాగాల్లో ఉద్యోగం లభిస్తుంది. ఉదాహరణకు టీసీఎస్, విప్రోలనే పరిగణనలోకి తీసుకుంటే.. ఇవి కేవలం ఐటీ సంబంధిత సర్వీసులే కాకుండా.. ఇతర సేవలు సైతం అందిస్తున్నాయి. దాంతో టెక్నికల్ అర్హతలుంటే కోర్ ఐటీ విభాగంలో.. సంప్రదాయ డిగ్రీ అభ్యర్థులైతే..బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్ తదితర విభాగాల్లో నియమిస్తున్నాయి.

  కోడింగ్, ప్రోగ్రామింగ్‌పై దృష్టి :
  ఆన్‌లైన్ టెస్ట్‌లు నిర్వహిస్తున్న ఐటీ సంస్థలు తొలి దశలో ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను అభ్యర్థుల కమ్యూనికేషన్ నైపుణ్యాలు, క్వాంటిటేటివ్ స్కిల్స్‌ను పరీక్షించే మార్గంగానే భావిస్తున్నాయి. ఆ తర్వాత దశలో నిర్వహించే టెక్నికల్ రౌండ్‌లో చూపిన ప్రతిభను కీలకంగా పరిగణిస్తున్నాయి. అందుకే ఈ దశలో ఆన్‌లైన్ కోడింగ్ టెస్ట్‌ను, ప్రోగ్రామింగ్ టెస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. అప్పటికప్పుడు ఏదైనా ఒక టాస్క్‌ను ఇచ్చి దానికి కోడింగ్, ప్రోగ్రామింగ్ రాయాలని అడుగుతున్నారు. కాబట్టి విద్యార్థులు కోడింగ్, ప్రోగ్రామింగ్ స్కిల్స్‌పై పట్టు సాధించి ఎంపిక ప్రక్రియకు ఉపక్రమించాలి.

  టీసీఎస్:
  నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ :

  ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ.. టీసీఎస్ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పరీక్ష.. టీసీఎస్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్(టీఎన్‌క్యూటీ). దీనికి సంప్రదాయ డిగ్రీ విద్యార్థులు హాజరుకావచ్చు. ముఖ్యంగా బీఏ/బీకాం/బీఎస్సీ కోర్సుల విద్యార్థులు సాఫ్ట్‌వేర్ కొలువు సొంతం చేసుకునేందుకు మంచి మార్గం ఇది. ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. టీఎన్‌క్యూటీలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులోనూ ప్రతిభ చూపితే కొలువు ఖాయం అవుతుంది. ఎంపికైన వారిని కాగ్నిటివ్ బిజినెస్ ఆపరేషన్‌‌స(సీబీఓ), బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్‌‌స (బీఎఫ్‌ఎస్‌ఐ), లైఫ్ సెన్సైస్ విభాగాల్లో శిక్షణ అందించి శాశ్వత ప్రాతిపదికన నియమించుకుంటారు.
               ఈ పరీక్ష మొత్తం అయిదు విభాగాల్లో 50 ప్రశ్నలతో ఉంటుంది. వెర్బల్ ఎబిలిటీ (10 ప్రశ్నలు); రీడింగ్ కాంప్రహెన్షన్ (4 ప్రశ్నలు); లాజికల్ రీజనింగ్ (12 ప్రశ్నలు); క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (12 ప్రశ్నలు); డేటాఇంటర్‌ప్రిటేషన్ (12ప్రశ్నలు) విభాగాల్లో ప్రతిభ చూపించాల్సి ఉంటుంది. అభ్యర్థుల్లోని విశ్లేషణ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షలో నిర్ణీత స్కోర్ పొందిన వారికి తదుపరి దశలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులోనూ ప్రతిభ చాటి తుది జాబితాలో నిలిస్తే.. సంస్థకు చెందిన బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్; ఫైనాన్షియల్ సర్వీసెస్; ట్రావెల్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ; ప్రీ సేల్స్; లైఫ్ సెన్సైస్ అండ్ హెల్త్‌కేర్; మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ సెన్సైస్; టెలికం తదితర విభాగాల్లో ఎంట్రీ లెవల్‌లో ఉద్యోగం సొంతమవుతుంది.
  వివరాలకు వెబ్‌సైట్: https://www.tcs.com/careers/tcsfutureforwardcareersdrive2020
  విప్రో :
  నేషనల్ లెవల్ టాలెంట్ హంట్ :

  ప్రముఖ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ సంస్థ విప్రో టెక్నాలజీస్.. ఎలైట్ ఎన్‌టీహెచ్ పేరుతో ఆన్‌లైన్ టెస్టు నిర్వహిస్తోంది. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులు. పదో తరగతి నుంచి బీటెక్ వరకు 60 శాతం మార్కులు సాధించాలి. ఈ పరీక్షలో విజయం సాధించి.. తర్వాత దశల్లో నిర్వహించే టెక్నికల్, హెచ్‌ఆర్ రౌండ్ ఇంటర్వ్యూలలో నెగ్గిన వారికి ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా రూ.3.5 లక్షల వార్షిక వేతనంతో ఆఫర్ లభిస్తుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా కంపెనీలో అడుగుపెట్టిన అభ్యర్థులు.. ఆ తర్వాత సంస్థ ‘టర్బో ఛాలెంజ్’ పేరుతో నిర్వహించే కోడింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే వేతనం రూ. 3.5 లక్షల నుంచి రూ. 6.5 లక్షలకు పెంచుతారు.
               ఇందులో ఆప్టిట్యూట్ టెస్ట్, రిటెన్ కమ్యూనికేషన్ టెస్ట్, ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్.. ఇలా మొత్తం మూడు విభాగాల్లో పరీక్ష జరుగుతుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇంగ్లిష్(వెర్బల్) ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. రిటెన్ కమ్యూనికేషన్ టెస్ట్‌లో ఎస్సే రైటింగ్ టెస్ట్ ఉంటుంది. నిర్దిష్ట అంశంపై వ్యాసం రాయాల్సి ఉంటుంది. అలాగే ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్‌లో కోడింగ్‌కు సంబంధించి రెండు ప్రోగ్రామ్‌లు రాయాలి. మొత్తం మూడు విభాగాలకు కలిపి పరీక్ష సమయం 140 నిమిషాలు.
  వివరాలకు వెబ్‌సైట్: https://careers.wipro.com

  ఐబీఎం ఆఫ్-క్యాంపస్ డ్రైవ్:
  ఐబీఎం ఫ్రెషర్స్ నియామకానికి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్‌ను నిర్వహిస్తోంది. దీనిద్వారా ఎంట్రీ లెవల్‌లో అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ పోస్టుల్లో నియామకాలు చేపడుతోంది. ఇందుకోసం ఆన్‌లైన్ టెస్ట్‌లను నిర్వహిస్తోంది. బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ కోర్సులు పూర్తి చేసుకునే విద్యార్థులు అర్హులు. అదే విధంగా 2018, 2019 సంవత్సరాల్లో ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో కాగ్నిటివ్ ఎబిలిటీ గేమ్స్, లెర్నింగ్ ఎబిలిటీ అసెస్‌మెంట్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్, కోడింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. కొలువు ఖరారు చేసుకున్న వారికి రూ. నాలుగు లక్షల వార్షిక వేతనం లభిస్తుంది.
  వివరాలకు వెబ్‌సైట్https://www.ibm.com/in-en

  ఇన్ఫోసిస్ టెస్ట్:
  ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్.. ఆఫ్-క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ పేరుతోబీటెక్ ఫ్రెషర్స్‌కు, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తోంది. బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ /ఎమ్మెస్సీ/ఎంసీఏ.. విద్యార్థులు అర్హులు. కళాశాలలను మూడు గ్రేడ్(ఏ, బీ, సీ)లుగా వర్గీకరించి.. ఏ గ్రేడ్ కాలేజ్‌లకు ఒక విధమైన ఎంపిక ప్రక్రియ;బీ,సీ గ్రేడ్ కాలేజీలకు ఇంకో విధమైన ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తోంది. ఏ-గ్రేడ్ కళాశాలల విద్యార్థులకు రాత పరీక్ష, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. బీ,సీ-గ్రేడ్ కళాశాలల విద్యార్థులకు రాత పరీక్ష, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూలు ఉంటాయి. వీటిల్లో ప్రతిభ చూపిన వారికి సంస్థలో ఎంట్రీ లెవల్ కొలువులను ఖరారు చేస్తోంది.
            రాత పరీక్షలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ (15 ప్రశ్నలు), లాజికల్ ఎబిలిటీ(10 ప్రశ్నలు), ఇంగ్లిష్ (40 ప్రశ్నలు) విభాగాలపై పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత దశలో టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూలో అభ్యర్థుల కంప్యూటర్ లాంగ్వేజ్ స్కిల్స్, కోడింగ్ నైపుణ్యాలు, జావా తదితర టెక్నికల్ అంశాలపై ప్రతిభను పరీక్షిస్తారు. హెచ్‌ఆర్ రౌండ్ ఇంటర్వ్యూలో అభ్యర్థులకు ఉద్యోగం పట్ల ఉన్న ఆసక్తి, వ్యక్తిగత నైపుణ్యాలు, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌ను పరిశీలిస్తారు.
  వివరాలకు వెబ్‌సైట్https://infytq.infosys.com

  సీటీఎస్ ఆఫ్-క్యాంపస్ టెస్ట్:కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (సీటీఎస్) ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ పేరుతో ఆన్‌లైన్ టెస్టు నిర్వహిస్తోంది. బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా అంతకుముందు రెండేళ్లలో ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారు దరఖాస్తుకు అర్హులు. సదరు కోర్సుల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. మొత్తం మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అవి.. ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ రౌండ్, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్ తదితర విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో నిర్దిష్ట స్కోర్ సాధించిన అభ్యర్థులకు తర్వాత దశలో టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూ జరుగుతుంది.ఇందులోనూ ప్రతిభ చూపిన వారికి చివరగా హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది.
  వివరాలకు వెబ్‌సైట్: https://careers.cognizant.com

  ప్రతిభను ప్రోత్సహించేందుకే :
  ఆన్‌లైన్ టెస్ట్‌లు నిర్వహించి ఆఫ్-క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ చేపట్టడానికి కారణం.. యంగ్ టాలెంట్ ఎక్కడ ఉన్నా వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశమే. చాలామంది విద్యార్థులకు తమలో ప్రతిభ ఉన్నప్పటికీ.. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ లేని కారణంగా అవకాశాలు అందుకోలేకపోతున్నారు. జాబ్ మార్కెట్‌లోకి ఉద్యో గాన్వేషణలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఆన్‌లైన్ టెస్ట్‌లు ఉపయోగపడతాయి.

   

%d bloggers like this:
Available for Amazon Prime